ఆంధ్రప్రదేశ్ పీఆర్‌సీ వివాదం: సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఉద్యోగ సంఘాలు

ఫొటో సోర్స్, I&PR AP
- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఏపీలో సమ్మెకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు సఫలమయ్యాయి.
దీంతో ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి చేపట్టతలచిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసేందుకు అంగీకరిస్తూ ఉద్యోగ సంఘాలు శనివారం రాత్రి ప్రకటించాయి.
అంతకుముందు జరిగిన చర్చల్లో ఉద్యోగుల ఫిట్మెంట్ ముందు చెప్పినట్లుగా 23 శాతమే ఇస్తారని మంత్రుల కమిటీ నిర్ణయించినప్పటికీ హెచ్ఆర్ఏ స్లాబ్‌లు పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
అనంతరం శనివారం ( ఫిబ్రవరి 5) రాత్రి 11 గంటల ప్రాంతంలో మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదిక ఇస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
ఇప్పటి వరకూ ఏం జరిగింది?
11వ పీఆర్సీ సమస్యపై జనవరి 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సీఎం జగన్ చర్చించారు. చివరకు ఫిట్‌మెంట్ 23.29 శాతం చొప్పున పెంచేందుకు అంగీకారం కుదిరింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రకటన చేశారు.
2020 ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలు చేస్తూ 2022 జనవరి వేతనాల్లో వాటిని చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. వాటిని ఉద్యోగ సంఘాల నేతలు ఆహ్వానించారు. సీఎంకి కృతజ్ఙతలు కూడా చెప్పారు. దాంతో సమస్య పరిష్కారమయ్యిందని అంతా అనుకున్నారు.
సీఎం చేసిన ప్రకటనను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. ఆతర్వాత జనవరి 16న పీఆర్సీ అమలు చేస్తూ జీవోలు విడుదలయ్యాయి. వాటిపై ఉద్యోగుల్లో అలజడి రేగింది. పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
హెచ్ఆర్‌ఏ తగ్గిస్తూ కొత్త శ్లాబులు నిర్ణయించడం, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తున్న 27 శాతం ఐఆర్‌ని రికవరీ చేస్తామని చెప్పడం, ఇకపై రాష్ట్రంలో పీఆర్సీ ఉండదని, కేంద్రం ప్రతీ పదేళ్లకు చేసే వేతన సవరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామని జీవోలో పేర్కోనడం వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తమయ్యింది.
వాటితో పాటుగా 70 ఏళ్ల పైబడిన పెన్షన్ దారులకు చెల్లించే అదనపు పెన్షన్, నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చే సీసీఏ వంటి అంశాల్లో మార్పులు కూడా ఉద్యోగుల్లో అసంతృప్తిని రాజేశాయి.
జనవరి 18న ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్లు ముట్టడించడంతో ఉద్యమం వేడి రాజుకుంది. ఆ తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీలు సమావేశమయ్యి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాయి. జిల్లా కేంద్రాల్లో రిలేదీక్షలకు దిగాయి.
ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ వర్గాల చర్చలు...
ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ, 5 నుంచి పెన్ డౌన్, 7 నుంచి సమ్మెలోకి వెళతామని ప్రకటించాయి. దానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఛలో విజయవాడకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ కాలంలో పలుమార్లు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ వర్గాలకు చర్చలు జరిగాయి.
ప్రభుత్వం తరఫున సంప్రదింపుల కమిటీ పేరుతో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నానిలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సహా పలువురు అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
అయితే ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించడం లేదంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళనలు కొనసాగించాయి. చివరకు ఛలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతినివ్వకపోయినా ఉద్యోగులు తరలిరావడంతో నేరుగా సీఎం జోక్యం చేసుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రితో మంత్రుల బృందం భేటీ అయ్యింది. ఆ తర్వాత రాత్రి సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది.

చర్చల తర్వాత ఆందోళన తగ్గుతుంది: సజ్జల
‘‘ఐఆర్ రికవరీ గురించి ఉద్యోగులు మాట్లాడుతున్నారు. సర్దుబాటు చేయాలని ప్రతిపాదించాము. ఉద్యోగుల డిమాండ్ మేరకు అది కూడా నిలిపివేస్తామని చెప్పాము. చాలా వరకూ సానుకూలంగా చర్చలు జరిగాయి’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
‘‘ఐదేళ్లకొకసారి పీఆర్సీ కూడా కొనసాగించాలని అడిగారు. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. చర్చలన్నీ సామరస్యంగా జరిగాయి. కాబట్టి శనివారం తుది చర్చల తర్వాత ఆందోళన తగ్గుతుంది. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరాము. శనివారం ప్రకటన వస్తుంది’’ అని చెప్పారాయన.
ఇక సమ్మె అవసరం ఉండదు: బొత్స
‘‘ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి ఎవరూ అడగకపోయినా ఐఆర్ ఇచ్చారు. ఆర్థిక పరిస్థితుల రీత్యా తీసుకున్న నిర్ణయాలు అందరూ అంగీకరించాలని కోరాము. హెచ్‌ఆర్‌ఏ విషయంలో మార్పులకు ప్రతిపాదనలు పంపించాము. దానికి సంఘాలు అంగీకరించాయి. దాంతో ఇక సమ్మె అవసరం ఉండదు’’ అని మంత్రి బొత్స సత్యన్నారాయణ చెప్పారు.
‘‘సీఎంని కలిసిన తర్వాత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుంది’’ అని తెలిపారు.
సీఎం ఏం చెప్తారనేదాన్ని బట్టి కార్యాచరణ: ఏపీ జేఏసీ
‘‘అనేక దఫాలుగా చర్చించినా ప్రభుత్వం మా నిర్ణయాలు తోసిపుచ్చింది. కానీ శుక్రవారం రాత్రి జరిగిన చర్చల్లో కొన్ని సానుకూల ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా సామాన్య ఉద్యోగి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరాము. హెచ్‌ఆర్‌ఏలో కొంత మార్పు చేస్తామన్నారు. పీఆర్సీ ఐదేళ్లకొకసారి కొనసాగించేందుకు సిద్ధమని తెలిపారు’’ అని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు వివరించారు.
‘‘ఇంకా అనేక సమస్యలున్నాయి. జేఏసీ 60 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచింది. కీలక సమస్యలపై సరైన ప్రతిపాదనలు చేస్తే అంగీకరిస్తాము. ముఖ్యమంత్రి చర్చల్లో ఏం చెబుతారన్న దానిని బట్టి మా కార్యాచరణ ఉంటుంది. ప్రస్తుతం పెన్ డౌన్ నిర్ణయం అమలవుతుంది. సోమవారం నుంచి సమ్మె చేసేందుకు సిద్ధంగానే ఉన్నాం’’ అని ఆయన స్పష్టంచేశారు.
హెచ్‌ఆర్ఏలో చేసిన మార్పులను ఆయన బీబీసీకి వివరించారు. ప్రభుత్వం తాజా ప్రతిపాదన ప్రకారం రెండు లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో 8 శాతం, రెండు నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 12 శాతం, 15 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో 16 శాతం, 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో 24 శాతం హెచ్ ఆర్ ఏ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. గతంలో ఉన్న హెచ్ ఆర్ ఏ శ్లాబులను కొనసాగించాలని జేఏసీ డిమాండ్ చేస్తోందన్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నాం: పీడీఎఫ్ ఎమ్మెల్సీ
‘‘ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలు చేయాలి. కానీ హెచ్ఆర్ఏ విషయంలో కూడా 25 ఏళ్లుగా అమలవుతున్న శ్లాబులు ఉంచాలి. విభజన చట్టం ప్రకారం ఇప్పటికే ఉన్న రాయితీలు తొలగించడానికి వీలు లేదు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఉద్యోగుల హక్కులను కాలరాయలని చూస్తోంది ఇలాంటి ప్రతిపాదనలు ఉద్యోగులకు మేలు చేయవు’’ అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
‘‘ముఖ్యమంత్రి సమగ్రంగా ఆలోచించాలి. ప్రభుత్వ సిబ్బంది ఆందోళనలను గమనంలో ఉంచుకోవాలి. తగిన మేరకు సానుకూల నిర్ణయాలతో పాత హెచ్ఆర్ఏతో పాటుగా సీసీఏ, అదనపు పెన్షన్ వంటి అంశాల్లో నిర్ణయం తీసుకోవాలి’’ అని కోరారు.
ఉద్యోగ సంఘాల జేఏసీ ముందు ప్రభుత్వం ఓ మెట్టు దిగి ప్రతిపాదనలు చేయడం ఆహ్వానించదగ్గ విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల శ్రేయస్సు దృష్ట్యా గతంలో ఉన్న సదుపాయాలు తొలగించే ఆలోచన విరమించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఒక్క రోజులో రూ.17 లక్షల కోట్ల సంపద ఆవిరి, ఫేస్‌బుక్ మార్కెట్ విలువ అంతగా ఎలా పడిపోయింది?
- గుంటూరు జిన్నా టవర్: ఆకుపచ్చగా ఉన్న ఈ టవర్‌కి భారత్ జెండా రంగులు ఎవరు., ఎందుకు వేశారు?
- రాష్ట్రపతికి బహుమానంగా జింబాబ్వే ఇచ్చిన ఏనుగును తిరిగి పంపించేయమంటూ కోర్టులో పిటిషన్
- సముద్రంలో కూలిన అమెరికా యుద్ధ విమానం, చైనాకు ఆ రహస్యాలు దొరకకుండా ఆపసోపాలు
- గల్వాన్ డీకోడెడ్: 'గల్వాన్ లోయలో జరిగిన భారీ నష్టాన్ని చైనా దాచిపెడుతోంది'.. క్లాక్సన్ నివేదిక వెల్లడి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












