జుకర్‌బర్గ్: ఫేస్‌బుక్ మార్కెట్ విలువ ఎందుకు పడిపోయింది.. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది

కన్ను

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

17 లక్షల కోట్ల రూపాయలు.. ఇందులో ఎన్ని సున్నాలుంటాయని అడిగితే మనలో చాలా మందికి వెంటనే చెప్పడం కూడా కష్టమే. మనకు బాగా తెలిసిన ఫేస్‌బుక్ ఒక్క రోజులో పోగొట్టుకున్న సంపద ఇది.

న్యూజీలాండ్, శ్రీలంక, గ్రీస్ వంటి అనేక ఆసియా, యూరప్, కొన్ని ఆఫ్రికన్ దేశాల జీడీపీ పరిమాణం కూడా 17 లక్షల కోట్ల కంటే తక్కువే.

మరి ఎందుకు ఈ సంస్థ మార్కెట్ విలువ అంతగా పడిపోయింది? రాత్రికి రాత్రే గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ.. మార్క్ జుకర్‌బర్గ్‌ను మించిన శ్రీమంతులుగా ఎలా మారారు?

వీడియో క్యాప్షన్, ఫేస్‌బుక్‌లో మీ సమాచారం ఏమవుతుంది?

జుకర్‌బర్గ్‌ను మించిన శ్రీమంతుడు గౌతమ్ అదానీ

2022 ఫిబ్రవరి 3న ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా షేర్ విలువ భారీగా పడిపోయింది. 323 డాలర్లుగా ఉన్న షేర్ ధర ఒక్క రోజులో 26 శాతం నష్ట పోయింది. దాంతో, దాని మార్కెట్ విలువలో 230 బిలియన్ డాలర్లు... రూపాయల్లో చెప్పాలంటే సుమారు 17 లక్షల కోట్లు నష్టపోయింది.

ఫేస్‌బుక్ షేర్ ధర తగ్గడం వల్ల జుకర్‌బర్గ్ సంపద కూడా సుమారు 26 శాతం తగ్గి 6 లక్షల 30 వేల కోట్లకు పడిపోయింది. దాంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానానికి ఆయన పడిపోయారు.

ఫలితంగా, 6 లక్షల 75 వేల కోట్లతో గౌతమ్ అదానీ, 6 లక్షల 70 వేల కోట్లతో ముకేశ్ అంబానీ 10, 11 స్థానాలకు చేరుకున్నారు.

ఈ లెక్కలన్నీ ఫిబ్రవరి 3న మెటా షేర్ క్లోజింగ్ ధర 237 డాలర్ల ఆధారంగా చెబుతున్నవే.

ఆ తరువాత, ట్రేడింగ్‌లో షేర్ ధర మారుతుంది కాబట్టి ఫేస్‌బుక్ మార్కెట్ వాల్యూతోపాటు జుకర్‌బర్గ్ సంపద కూడా మారిపోతుంది.

మరి ఒకనాడు ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న మార్క్ జుకర్‌బర్గ్ ఇలా అకస్మాత్తుగా పడిపోవడానికి కారణమేంటి?

టీనేజర్

ఫొటో సోర్స్, Getty Images

తొలిసారి తగ్గిన ఫేస్‌బుక్ ‘యూజర్ల’ సంఖ్య

ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా షేర్ పడిపోవడానికి, దాని ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ సంపద కరిగి పోవడానికి కారణం ఫిబ్రవరి 2న విడుదల చేసిన ఆర్థిక ఫలితాలే.

2021 ఏడాది మొత్తానికి, అలాగే 2021 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన మెటా ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేక పోయాయి.

పైగా ఫేస్‌బుక్‌ను డైలీ వాడే యాక్టివ్ యూజర్ల సంఖ్య ఆ సంస్థ చరిత్రలోనే తొలిసారి తగ్గిపోయింది. 2021 అక్టోబరు-డిసెంబరు మధ్య 5 లక్షల మంది డైలీ యూజర్లను కోల్పోయింది ఫేస్‌బుక్.

యూజర్లను కోల్పోవడమంటే యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవడమే. చివరకు అది కంపెనీ లాభాల మీద దాని భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఇన్వెస్టర్లు ఆందోళనతో ఫేస్‌బుక్ షేర్లను భారీ స్థాయిలో అమ్మేశారు.

అయితే, 2021 ఏడాది మొత్తం మీద చూస్తే.. డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 5 శాతం పెరిగి 193 కోట్లకు చేరింది. ఇక, నెలవారీ యూజర్ల సంఖ్య 4 శాతం పెరిగి 291 కోట్లకు చేరింది.

మరి, ఒక్కసారి యూజర్లు తగ్గినందుకే మదుపర్లు ఇంతగా కంగారు పడాలా? ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా?

ఫేస్‌బుక్

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌బుక్‌ వర్సెస్ టిక్‌టాక్

కొంతకాలంగా మార్కెట్‌లోని ఇతర సంస్థల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది ఫేస్‌బుక్.

కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఇదే మాట అన్నారు. యువతలో టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌కు పెరుగుతున్న క్రేజ్‌తో తమకు తీవ్రమైన పోటీ ఎదురవుతోందని చెప్పుకొచ్చారు జుకర్‌బర్గ్.

ఫేస్‌బుక్‌కు గట్టి పోటీ ఇస్తున్న మరొక ప్లాట్‌ఫాం యూట్యూబ్. తక్కువ డ్యూరేషన్ ఉండే షార్ట్ వీడియోలకు ఆదరణ పెరుగుతుండటం టిక్‌టాక్, యూట్యూబ్‌లకు కలిసి వస్తోంది.

2016లో మార్కెట్‌లోకి వచ్చిన టిక్‌టాక్ తక్కువ కాలంలోనే యూత్‌లో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. చైనాతో సరిహద్దు గొడవల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయక ముందు ఇండియాలోనూ టిక్‌టాక్‌కున్న క్రేజ్ ఎక్కువే.

టిక్‌టాక్ యూజర్లలో సుమారు 70 శాతం మంది 13 నుంచి 24 ఏళ్ల వయసు వారే. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ అయిన యాప్టోపియా గణాంకాల ప్రకారం 2021లో ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌గా నిలిచింది టిక్‌టాక్.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఆ తరువాతి స్థానంలో ఉన్నాయి. అలాగే టిక్‌టాక్ మీద ఖర్చు చేసే సమయం కూడా 90 శాతం పెరిగినట్లు App Annie డేటా చెబుతోంది. ఫేస్‌బుక్‌కు టిక్‌టాక్ ఎంత కాంపిటీషన్ ఇస్తోందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.

2021లో మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ యూజర్లలో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. అందుకు కారణం కూడా మార్కెట్‌లో ఫేస్‌బుక్ ఎదుర్కొంటున్న పోటీగా మనం అర్థం చేసుకోవచ్చు.

చేతిలో మొబైల్ ‌ఫోన్‌తో టీనేజర్

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌బుక్‌కు టీనేజ్ దూరం అవుతోందా?

గత కొన్ని సంవత్సరాలుగా యూత్‌ విషయంలో ఫేస్‌బుక్ ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. 2012 నుంచి 30 ఏళ్లలోపు వారిని ఆకర్షించడంలో అది విఫలమవుతున్నట్లు 'ది వెర్జ్' వెబ్‌సైట్ చెబుతోంది.

2019 నుంచి అమెరికాలో టీనేజ్ యూజర్ల సంఖ్య 13శాతం తగ్గినట్లుగా ఫేస్‌బుక్ ఇంటర్నల్ రీసెర్చ్‌ను కోట్ చేస్తూ తెలిపింది ది వెర్జ్. రాబోయే రెండేళ్లలో 45 శాతం తగ్గొచ్చని దాని ఇంటర్నల్ రీసెర్చ్ నివేదిక చెబుతోంది.

మొత్తం మీద ఫేస్‌బుక్‌తో యూత్ తక్కువగా ఎంగేజ్ అవుతున్నారనేది ఆ రిపోర్ట్ సారాంశం. అంటే ఫేస్‌బుక్‌ని కాదని వేరే సోషల్ మీడియా యాప్స్‌కు యూత్ అట్రాక్ట్ అవుతున్నారు.

యూట్యూబ్, టిక్‌టాక్ వంటి పోటీదారులు యువతను బాగా ఆకర్షిస్తున్నారని, అందువల్ల అడ్వటైజర్స్ తమ ప్లాట్‌ఫాం మీద తక్కువ ఖర్చు చేస్తున్నారన్నది మార్క్ జుకర్‌బర్గ్ మాట.

2021 అక్టోబరు-డిసెంబరులో ఫేస్‌బుక్ యాడ్ రెవిన్యూ స్వల్పంగా తగ్గితే ఇదే సమయంలో యూట్యూబ్ యాడ్ రెవిన్యూ సుమారు 25 శాతం పెరిగింది.

ఇక, గత ఏడాది యాపిల్ తీసుకొచ్చిన యాప్ ట్రాకింగ్ ట్రాన్స్‌పరెన్సీ పాలసీ కూడా ఫేస్‌బుక్‌కు ఇబ్బందికరంగా మారింది. ఆ యాప్ ప్రకారం యూజర్ అనుమతి లేనిదే వారి డేటాను ట్రాక్ చేయడం సోషల్ మీడియా యాప్స్‌కు సాధ్యం కాదు.

యూజర్ల డేటాను అడ్వటైజింగ్ కంపెనీలకు అమ్ముకోవడం ద్వారానే ఫేస్‌బుక్ వంటి కంపెనీలు డబ్బులు సంపాదిస్తాయి. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే అది కంపెనీ మనుగడ మీదనే ప్రభావం చూపుతుంది.

ఇప్పుడు ఫేస్‌బుక్ ఇన్వెస్టర్లు ఆందోళన చెందడానికి, షేర్లు అమ్మివేయడానికి వెనుక ఇలాంటి చాలా కారణాలున్నాయి.

కంపెనీ కొత్త లోగోతో మార్క్ జుకర్‌బర్గ్

ఫొటో సోర్స్, Reuters/AFP via GETTY IMAGES

ఫేస్‌బుక్ ఈ సమస్యను ఎలా డీల్ చేస్తోంది?

యూట్యూబ్, టిక్‌టాక్ వంటి పోటీదారులను తట్టుకునేందుకు రీల్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామని మెటా చెబుతోంది.

ఇంటర్నెట్ ప్రపంచంలో మరొక విప్లవంగా చెబుతున్న మెటావర్స్ మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంది ఫేస్‌బుక్.

వర్చువల్‌గా పని చేసుకోవడం, జీవించడం, ఆడుకునే ప్రపంచాన్నే మెటావర్స్ అంటున్నారు. వర్చువల్ ఎక్స్‌పీరియెన్స్, వర్చువల్ గూడ్స్ అమ్మడంతోపాటు యాడ్స్ ద్వారా ఆదాయం సంపాదించాలనేది మార్క్ జుకర్‌బర్గ్ ఆలోచన.

డిజిటల్ అవతార్స్, డిజిటల్ క్లాత్స్ వంటి వాటిని వర్చువల్ గూడ్స్ అంటారు. కానీ ఇప్పుడే ఈ విభాగం నుంచి లాభాలు వస్తాయని నిపుణులు భావించడం లేదు.

మొత్తానికి మెటావర్స్‌ను ఫేస్‌బుక్ ఫ్యూచర్‌గా చూస్తున్నారు మార్క్ జుకర్‌బర్గ్.

వీడియో క్యాప్షన్, ఫేస్‌బుక్ మోడరేటర్: చూడలేని ఎన్నో దారుణాలను అక్కడ చూడాల్సి ఉంటుంది!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)