PRC: 1986లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, 1986లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు ఏం జరిగింది?

వరికూటి రామకృష్ణ, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్‌సీ చుట్టూ కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ప్రభుత్వం అమలు చేసిన కొత్త పీఆర్‌సీని వ్యతిరేకిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. వేతనాలు తగ్గుతాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉద్యోగ సంఘాలు వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టాయి. అయితే చరిత్రలోకి ఒకసారి చూస్తే గతంలో కూడా ప్రభుత్వాలు, ఉద్యోగుల మధ్య ఇలాగే వివాదాలు చెలరేగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు, తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నప్పుడు జీతాల సమస్యపై ఉద్యోగులు భారీ స్థాయిలో సమ్మెలకు దిగారు.

1986: ఎన్టీఆర్ ప్రభుత్వంలో పీఆర్‌సీ వివాదం

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇప్పటిలాగే పీఆర్‌సీ విషయంలో నిరసనకు దిగారు ఉద్యోగులు. ఎంతో కాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తూ వచ్చిన పీఆర్‌సీ నివేదికను 1986 జులై 14న విడుదల చేసింది ఆనాటి ఏపీ ప్రభుత్వం. పీఆర్‌సీ కమిషన్ చేసిన సిఫార్సులను యథాతథంగా ఆమోదించింది ఎన్టీఆర్ ప్రభుత్వం. కానీ ప్రధానంగా మూడు అంశాలపై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్టీఆర్ ప్రభుత్వం ముందు ప్రధానంగా మూడు డిమాండ్లు ఉంచారు ఉద్యోగులు. కొత్త పీఆర్‌సీని 1986 జులై నుంచి కాకుండా జనవరి నుంచి అమలు చేయాలనేది ఒక డిమాండ్. రెండోది మినిమం బేసిక్ పేను పెంచాలనేది. ఇక అప్పటి వరకూ ఇచ్చిన ఇంటెరిమ్ రిలీఫ్‌ను బేసిక్ పేలో కలపాలన్నది మూడో డిమాండ్. అయితే ఉద్యోగుల డిమాండ్లకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఆనాటి రాష్ట్ర ఆదాయంలో 48శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతున్నాయని, ఇక పెంచే అవకాశమే లేదని స్పష్టం చేశారు ఎన్టీఆర్.

1986, నవంబరు 5న మొదలైన సమ్మె

ఎన్టీఆర్ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో 1986 నవంబరు 5న సమ్మెకు దిగారు ఉద్యోగులు. దీంతో పాలన స్తంభించింది పోయింది. సమ్మె ప్రారంభమైన కొద్ది రోజులకు చర్చల కోసం ఒక కేబినెట్ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమించింది. కానీ కేబినెట్ ఉపసంఘంతో చర్చలు జరిపేందుకు అంగీకరించలేదు ఉద్యోగులు. ఆ తరువాత జాతీయ భద్రతా చట్టం కింద ఉద్యమ నేతలను అరెస్టు చేసింది ఎన్టీఆర్ ప్రభుత్వం. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు రాస్తా రోకోలు, రాష్ట్ర బంద్‌లు చేపట్టారు. దాంతో సమ్మెలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ డిస్మిస్ చేస్తానని ఎన్టీఆర్ హెచ్చరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినా కూడా ఉద్యోగులు దిగి రాలేదు.

53 రోజుల తరువాత ముగిసిన సమ్మె

ఎన్టీఆర్ ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య వివాదం ముదరుతున్న దశలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ జోక్యం చేసుకుంది. నాడు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు జనరల్ సెక్రటరీగా ఉన్న సుకోమల్ సేన్... ఎన్టీఆర్‌ ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య మధ్యవర్తిత్వం వహించారు. దాంతో రెండు వర్గాల మధ్య రాజీ కుదిరింది. కానీ ఉద్యోగుల డిమాండ్లు మాత్రం నెరవేరలేదు. నో వర్క్ నో పే విధానానికి కట్టుబడి ఉద్యోగులు మళ్లీ విధుల్లో చేరారు. దాంతో 53 రోజుల సుదీర్ఘ సమ్మెకు తెర పడింది.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేసిన చివరి సమ్మె కూడా ఇదే.

1983: పదవీ విరమణ వయసును తగ్గించిన ఎన్టీఆర్

ఎన్టీఆర్ 1983లో అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే జనవరిలో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగా ఫిబ్రవరిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు తగ్గించారు. ఫిబ్రవరి 8న దానిపై జీవో తీసుకు రాగా ఫిబ్రవరి 28 నాటికి 55 ఏళ్లు పూర్తి చేస్తుకున్న సుమారు 28వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును తగ్గించడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పుకొచ్చింది నాటి ప్రభుత్వం.

ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు ఉద్యోగులు. సమస్య పరిష్కారం కోసం రెండు వర్గాల మధ్య నడిచిన చర్చలు విఫలం కావడంతో 1983 జులైలో సమ్మెకు దిగారు ఉద్యోగులు. రిటైర్మెంట్ వయసును తగ్గించడం వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయనే దానిలో వాస్తవం లేదన్నది ఉద్యోగుల వాదన. నాటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జీవీ రామకృష్ణ జోక్యంతో ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య రాజీ కుదిరింది. దాంతో సుమారు 19 రోజుల పాటు జరిగిన సమ్మె 1983 అగస్ట్‌లో ముగిసింది.

లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించిన జయలలిత

2003లో కూడా తమిళనాడు ప్రభుత్వానికి ఉద్యోగుల పెద్ద ఘర్షణే తలెత్తింది. డీఏ తొలగించడం, కొన్ని పెన్షన్ ప్రయోజనాలను రద్దు చేయడంతో నాటి జయలలిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే ఏడాది జులై 1న సమ్మెకు దిగారు సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు. ఉద్యోగుల సహాయనిరాకరణతో తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. సమ్మె ప్రారంభమైన నాలుగైదు రోజులకే ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించారు జయలలిత. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్‌ - అంటే అత్యవసర సేవల చట్టాన్ని ఎస్మా అంటారు. ఎస్మా కింద వేల మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. లక్ష మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ వద్ద నమోదు చేసుకున్న యువతను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకుంది జయలలిత ప్రభుత్వం.

ఎస్మాకు వ్యతిరేకంగా ఉద్యోగులు కోర్టుకు వెళ్లినా జయలలిత ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పును ఇచ్చింది సుప్రీం కోర్టు. సమ్మెకు దిగి ప్రజలకు ఇబ్బంది కలిగించే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. అయితే తొలగించిన ఉద్యోగులను మానవతా దృక్పథంతో తిరిగి చేర్చుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. దాంతో విధుల నుంచి తొలగించిన సుమారు లక్షా 70 వేల మంది ఉద్యోగులను మళ్లీ సమ్మె చేయకూడదనే నిబంధనతో తిరిగి తీసుకునేందుకు అంగీకరించింది జయలలిత ప్రభుత్వం. కానీ హింసకు పాల్పడ్డారంటూ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన సుమారు రెండు వేల మంది ఉద్యోగులను మాత్రం విధుల్లోకి తీసుకునేందుకు ఆమె నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)