Salary Slip: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాల జమ. అసలు సమస్య అక్కడే ఉందా?

పీఆర్సీ కోసం ఉద్యమించిన ఉద్యోగ సంఘాలు
ఫొటో క్యాప్షన్, పీఆర్సీ కోసం ఉద్యమించిన ఉద్యోగ సంఘాలు
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం...

ఆంధ్రప్రదేశ్ లో 11వ వేతన సవరణ సంఘం చుట్టూ ఏర్పడిన వివాదం కొనసాగుతోంది. కొత్త పీఆర్సీ అమలు వాయిదా వేసి పాత పీఆర్సీ ప్రకారం తమకు జీతాలివ్వాలని ఉద్యోగులు కోరారు.

కానీ, ప్రభుత్వం మాత్రం దానికి భిన్నంగా జనవరి నుంచి కొత్త పీఆర్సీ అమలు ప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో జమయ్యే వేతనాలు, పెన్షన్లకు కొత్త లెక్కలను అనుసరిస్తోంది.

ట్రెజరీ ఉద్యోగులు తొలుత బిల్లులు చేసేందుకు ససేమీరా అన్నప్పటికీ చివరకు ప్రభుత్వం ఒత్తిడితో దిగి వచ్చారు. చాలావరకూ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేశారు. ఫిబ్రవరి ఒకటి నుంచి సిబ్బంది ఖాతాల్లో సవరించిన వేతనాల జమ మొదలైంది.

ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం తప్పుబడుతోంది. ఎవరికీ వేతనాలు తగ్గవంటోంది. కానీ ఉద్యోగుల కొత్త పే స్లిప్పులు చూసుకుని కంగారు పడుతున్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది?

కొత్త పీఆర్సీ ప్రకారం జీతం పెరగాల్సి ఉండగా, కొంత తగ్గుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త పీఆర్సీ ప్రకారం జీతం పెరగాల్సి ఉండగా, కొంత తగ్గుతోంది

ఓ సాధారణ ఉపాధ్యాయుడి అనుభవం ఏంటి?

వీఎస్ఎన్ రెడ్డి ఓ సెకండరీ గ్రేడ్ టీచర్. డీఎస్సీ 2000లో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన చాలాకాలంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణానికి సమీపంలోని స్కూల్లో పని చేస్తున్నారు.

ఆయనకు ఇప్పటి వరకూ 14.5 శాతం ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ) అమలైంది. ఇప్పుడది 8 శాతానికి తగ్గించారు. ఒక్కసారిగా మధ్యంతర భృతి కన్నా ఫిట్‌మెంట్ లో 4శాతం, హెచ్‌ఆర్‌ఏ లో 6.5 శాతం చొప్పున ఆయన నష్టపోయారు. ఆయనకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనం ఇంకా రావాల్సి ఉంది.

కానీ పే స్లిప్ ఆధారంగా ఆయనకు జనవరి నెల జీతంతో పోలిస్తే రూ.39 మాత్రమే తగ్గింది. మరి వేతనంలో ఇంత తక్కువ తేడా ఎందుకు చూపిస్తుందనేది చాలామంది సామాన్యులకు అర్థం కాని విషయం.

''నాకు బేసిక్ జీతంలో చాలా తగ్గుదల ఉంది. కానీ దానిని కనిపించకుండా ప్రభుత్వం ఒకేసారిగా కరువు భత్యం (డీఏ)లు విడుదల చేస్తోంది. 20.02 శాతం పెండింగు డీఏల ద్వారా నాకు ఒకేసారి లబ్ది కల్పించారు. డీఏల ద్వారా భారీగా ప్రయోజనం వచ్చిందని మాకు అనిపిస్తోంది. ఫిట్‌మెంట్ కొంత తగ్గినా వీటి ద్వారా కవర్ అవుతుందని చాలామంది భావించారు. కానీ తీరా చూస్తే హెచ్‌ఆర్‌ఏ లో కూడా ఒక్కసారిగా ఆరున్నర శాతం కోత పడటం అసలుకే ఎసరు తెచ్చింది. దానివల్ల నా మూల వేతనం స్వల్పంగా తగ్గుతోంది. అదే ఇప్పటి వరకూ 12 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉన్న వాళ్లకి జీతం తగ్గలేదు. కానీ 20 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందుతూ నగరాల్లో పనిచేస్తున్న వారికి, అమరావతిలో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందుతున్న వారికి భారీ నష్టం జరుగుతోంది. జీతాలు కూడా తగ్గుతున్నాయి. దానిని పెండింగు డీఏలతో సరిపెట్టుకోవాలనడమే తీవ్రంగా నిరాశపరిచింది'' అని ఆయన తన అనుభవాన్ని బీబీసీకి వివరించారు.

ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు

అసలు సమస్య ఎక్కడంటే...

కొత్త పీఆర్సీని 2018 జూలై నుంచి అమలుచేయాల్సి ఉంది. కానీ 2019 జూలై నుంచి మధ్యంతర భృతి (ఐఆర్) అందుకుంటున్నారు. పీఆర్సీ అమలు ఆలస్యమయ్యే కాలానికి ఐఆర్ అమలు చేస్తారు. దానిని జగన్ అధికారంలోకి రాగానే 27 శాతంగా ప్రకటించి అమలు చేస్తున్నారు.

కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 23 శాతం ఫిట్‌మెంట్ గా అమలులోకి రావడంతో ఇంతకాలం తీసుకున్న మధ్యంతర భృతి కన్నా అది తగ్గుతోంది.

పైగా, 2019 జూలై నుంచి 21 నెలల పాటు ఐఆర్ తీసుకున్న కాలంలో వాస్తవ వేతనంలో అంటే ఫిట్‌మెంట్ ద్వారా పెరుగుదల కన్నా ఎక్కువగా ఉద్యోగులకు దక్కినందున దానిని తిరిగి ప్రభుత్వం జమ చేసుకునే ప్రయత్నం ప్రారంభించింది.

వీడియో క్యాప్షన్, రూ.6 లక్షలకు కొన్న ఎద్దు.. పోటీల్లో రూ.35 లక్షలు గెలిచింది

ఏపీలో ఉద్యోగులకు 5 డీఏలు పెండింగులో ఉన్నాయి. అందులో 2018 నాటి డీఏ ని పీఆర్సీలో జమ చేస్తారు. ఇక మిగిలిన 2019, 2020 నాటి మొత్తం నాలుగు డీఏలు ఇప్పుడు కలిపి లెక్కిస్తున్నారు. దాని కారణంగా 20.02 శాతం చొప్పున ఉద్యోగుల మూల వేతనానికి జమ చేస్తున్నారు.

అదే సమయంలో పీఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో అప్పటి నుంచి మాత్రమే ఐఆర్ సర్దుబాటుని పరిగణలోకి తీసుకునేవారు.

కానీ ప్రస్తుతం ఏపీలో మొట్టమొదటిసారిగా నోషనల్ పీరియడ్ గా చెబుతున్న జులై 1, 2018 నుంచి మార్చి 31, 2020 మధ్య కాలానికి కూడా ప్రభుత్వం సర్దుబాటుకి శ్రీకారం చుట్టింది. దాని కారణంగా 21 నెలల కాలంలో తీసుకున్న ఐఆర్ ని ఉద్యోగుల నుంచి రికవరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జీతం ఎలా తగ్గుతుందన్న దానిపై ఒక నమూనా పే స్లిప్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, జీతం ఎలా తగ్గుతుందన్న దానిపై ఒక నమూనా పే స్లిప్

ఒకవైపు మధ్యంతర భృతి కన్నా ఫిట్‌మెంట్ అంటే పెంచిన వేతనం తగ్గడం, హెచ్‌ఆర్‌ఏ భారీగా కోతపడడం అన్నింటికీ మించి నోషనల్ పీరియడ్ లో కూడా ఇచ్చిన ఐఆర్ ని సర్దుబాటు చేయాలని చెప్పడం ఉద్యోగులకు నష్టదాయకంగా మారింది. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు.

ఈ కారణంగానే ఐఆర్ 27శాతం చొప్పున అందుకున్న ఉద్యోగుల నుంచి 2019 జూలై నుంచి 2020 మార్చి వరకూ మొత్తం వెనక్కి తీసుకునే దిశలో అధికారులు చర్యలు ప్రారంభించారు.

ఇక 2020 మార్చి నుంచి కొత్త పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అప్పటి నుంచి 2021 డిసెంబర్ వరకూ నెలకు 4 శాతం చొప్పున సర్దుబాటుకి శ్రీకారం చుడుతున్నారు.

మొత్తం 21 నెలల కాలంలో ఉద్యోగులు పొందిన ప్రయోజనాలను తిరిగి ప్రభుత్వం రికవరీ చేసేందుకు పూనుకోవడం పెద్ద సమస్యగా మారింది.

కొత్త పీఆర్సీ తో జీతం తగ్గడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఫొటో సోర్స్, UGC

పెన్షనర్లది కూడా అదే పరిస్థితి..

కె. త్రిమూర్తులు విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓ రిటైర్డ్ ఉద్యోగి. 14 ఏళ్ల క్రితం రిటైర్ అయినకు నెలకు రూ.40వేల వరకూ పెన్షన్ వస్తోంది. కొత్త పీఆర్సీ ప్రకారం పెన్షన్ పెరుగుతుందని ఆయన లాంటి వారంతా ఆశాభావంతో ఉన్నారు.

తీరా చూస్తే ఈ పెన్షన్ లో క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తొలగించిన కారణంగా ఆయనకు పెన్షన్ లో పెరుగుదల లేకుండా పోయింది.

70 ఏళ్ల వయసు పైబడిన పెన్షన్ దారులకు అదనపు ప్రయోజనం కలిగించేందుకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంటుంది. ప్రస్తుతం దానిని 80 ఏళ్లకు పొడిగించారు. ఈ మధ్య వయసు ఉండి, ఇన్నాళ్లుగా లబ్ది పొందుతున్న వారికి ఇప్పుడు ఆ అవకాశం రద్దయ్యింది.

''నాకు పెన్షన్ ద్వారా దక్కే ప్రయోజనం పోయింది. గత ప్రభుత్వాలు కూడా ఐఆర్ ఇచ్చాయి. కానీ ఎన్నడూ ఫిట్‌మెంట్ తగ్గించలేదు. పీఆర్సీ రిపోర్టు కూడా బైటపెట్టకుండా అంతా పూర్తి చేశారు. అన్నింటా కోత పెట్టేసి పెన్షనర్లను ఇబ్బంది పెడుతున్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కూడా లబ్ది లేకుండా పోయింది'' అని త్రిమూర్తులు బీబీసీతో అన్నారు.

ఉద్యోగులకు 1997 నాటి హెచ్‌ఆర్‌ఏ కన్నా కొత్త పీఆర్సీలో తగ్గించడం విస్మయకరం. అన్ని చోట్లా ఇంటి అద్దెలు పెరుగుతుండగా సుమారు 25 ఏళ్ల తర్వాత హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

అదే సమయంలో నగరాల పరిధిలో ఉద్యోగులకు అదనంగా లబ్ది చేకూరుస్తూ సీసీఏ వంటి సదుపాయాలుండేవి. ఇప్పుడు వాటిని పూర్తిగా తొలగించారు. ఫలితంగా ఉద్యోగులకు ఆర్థికపరమైన ప్రయోజనం బదులుగా నష్టాలు తప్పడం లేదు.

ఫిబ్రవరి 1 మంత్రుల కమిటీతో పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ సమావేశమైంది
ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరి 1 మంత్రుల కమిటీతో పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ సమావేశమైంది

వేతనాల ప్రక్రియ షురూ

''కొత్త పీఆర్సీ కారణంగా తీవ్ర నష్టాలుండడం వల్లనే పాత పీఆర్సీ అమలు చేయాలని కోరాము. ప్రభుత్వం వేసిన కమిటీతో చర్చిస్తామని చెప్పాము. చర్చల తర్వాత నిర్ణయాల ఆధారంగా కొత్త పీఆర్సీ అమలు చేయాలని కోరాం. అప్పటి వరకూ జీవోలు అబయెన్స్‌లో ఉంచాలని ఆశించాం. కానీ ప్రభుత్వం తమ పని తాము చేస్తామంటోంది'' అని ఏపీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేశ్ నాయుడు అన్నారు.

''తనకు నచ్చిన రీతిలో చేసుకుంటూ మాకు నచ్చజెప్పుతామని ప్రభుత్వం అంటోంది. వాస్తవాలను పక్కదారి పట్టించి సామాన్యులను రెచ్చగొడుతోంది. ఉద్యోగులకు ఇచ్చిన ఏ సదుపాయాన్ని వెనక్కి తీసుకోకూడదని గతంలో సుప్రీం కోర్టు కూడా చెప్పింది'' అని ఆయన అన్నారు.

ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుందని రమేశ్ నాయుడు బీబీసీతో అన్నారు.

మరోవైపు ప్రభుత్వం వేతనాలు చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసింది. తొలుత ట్రెజరీ ఉద్యోగులు మొండికేయడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.

చివరకు ఆదివారాలు కూడా ఆఫీసులకు పిలిచి బిల్లులు చేయించారు. ఫలితంగా ఫిబ్రవరి 1న చాలా కొద్దిమందికి మాత్రమే వేతనాలు, పెన్షన్‌లు అందాయి.

వీడియో క్యాప్షన్, నాలుగేళ్లలో 60 లక్షల మందిని చంపేశారు

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా ప్రతీనెలా వేతనాలు ఆలస్యమవుతున్నాయి. ఈసారి మరింత జాప్యం జరగడం అనివార్యంగా కనిపిస్తోంది.

ఇక వృధ్యాప్య, వితంతు పెన్షన్లు సహా ఇతర అన్ని రకాల సామాన్యులకు ఇచ్చే పెన్షన్లు కూడా ఈసారి అనేక చోట్ల ఆలస్యమయ్యాయి. ట్రెజరీలలో జరిగిన జాప్యం సామాన్యులను సైతం తాకింది.

'ఆర్థిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలి'

''ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. ఉద్యోగులకు కూడా అది అర్థం కావాలి. జగన్ అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చారంటే ఆనాటి పరిస్థితిని తెలుసుకోవాలి. కోవిడ్ తర్వాత మారిన పరిస్థితులతో అందరూ సతమతమవుతున్నాం. ప్రజాసంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. ప్రభుత్వ సిబ్బంది సమస్యలన్నీ పరిగణలోకి తీసుకుని ఫిట్‌మెంట్, పెండింగ్ డీఏల విడుదల వంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఎవరికీ వేతనాలు తగ్గించే అవకాశం లేదు'' అని ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్

రికవరీ వద్దంటూ కోర్టు ఆదేశం

ఉద్యోగుల వేతనాల నుంచి రికవరీ చేయడానికి వీలులేదంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ప్రభుత్వమిచ్చిన జీవోలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 23కి వాయిదా పడింది.

అయితే, ప్రభుత్వంతో చర్చల ప్రసక్తే లేదని, సమ్మెకు వెళతామన్న ఉద్యోగ సంఘాలు చివరకు మెత్తబడి ప్రభుత్వం నియమించిన కమిటీతో మంగళవారం నాడు సచివాలయంలో చర్చలు జరిపాయి. పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ సభ్యులు విజ్ఞాపలను మంత్రులకు అందజేశారు.

ఉద్యోగులకు సీఎం ఏం చేయాలో అన్నీ చేస్తారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. ఐఆర్ ఉన్నా లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుందని, ఆ విషయం అందరికీ జీతాలు వచ్చాక తెలుస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్ ఉద్యోగ సంఘాలను కోరారు.

ఉద్యోగుల ఆందోళన మూలంగా సామాన్యుల పెన్షన్ల పంపిణీలో జాప్యం మాత్రమే కాకుండా ఇతర అనేక సమస్యలు మొదలవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు కూడా సమ్మె బాట పడతామని హెచ్చరిస్తుండగా, ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి తాము సమ్మెలోకి వెళతామంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ఆర్టీసీ ఎండీకి మెమోరాండం ఇచ్చింది.

ఈ తరుణంలో పరిస్థితులు ఎటు దారితీస్తాయోననే చర్చ సాగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)