Startup Seed fund: మీ దగ్గర స్టార్టప్ పెట్టే టాలెంట్ ఉంటే 50 లక్షల వరకూ నిధులు.. రూ. 5 కోట్ల వరకూ గ్రాంటు పొందండి ఇలా..

స్టార్టప్ ఇండియా

ఫొటో సోర్స్, facebook/StartupIndia

    • రచయిత, నాగ సుందరి
    • హోదా, బీబీసీ కోసం

ఔత్సాహిక పారిశ్రామికవేత్త కావాలని కలలు కనే వాళ్లు చాలామందే ఉంటారు. స్టార్టప్‌లు పెట్టాలనుకుంటారు. అందుకోసం ఏ చిన్న అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. పెట్టుబడి పెట్టి సహాయం చేసే వారు లేకపోవడం ఇందుకు కారణం. మరి ప్రభుత్వమే అలాంటి వాళ్ల కోసం సిద్ధమైతే ఇక కావలసింది ఏముంటుంది?

స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ సరిగ్గా అలాంటిదే. కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ఇది. ప్రతిభ, అనుభవం, నైపుణ్యం, మార్కెట్ రంగం, అధ్యయనం వంటి వాటిలో సత్తా ఉంటే చాలు ఈ స్కీము కింద లక్షల్లో నిధులు అందుతాయి.

ఒక స్టార్టప్‌కి గరిష్టంగా 50 లక్షల రూపాయలు సహాయక గ్రాంటును ప్రభుత్వం ఈ పథకం కింద అందిస్తుంది.

వీడియో క్యాప్షన్, స్టార్టప్‌ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి?

స్కీమేంటి?

పటిష్టమైన స్టార్టప్ ఎకోసిస్టంను నిర్మించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకాన్ని ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) శాఖ ప్రారంభించింది. ఈ స్కీము కింద అర్హమైన స్టార్టప్‌కు ఇంక్యుబేటర్లు నిధులు అందజేస్తాయి. ఒక్కో స్టార్టప్‌కు 50 లక్షల రూపాయల వరకూ గరిష్టంగా ఆర్థిక సహాయం అందిస్తాయి.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో డిపిఐఐటి ఏర్పాటుచేసిన ఎక్స్‌పర్ట్ అడ్వైజరీ కమిటీ సూచనతో దశల వారీగా ఐదు కోట్ల రూపాయల వరకూ ఇంక్యుబేటర్లు గ్రాంటును పొందుతున్నాయి. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అమలు, నిర్వహణ, మానిటరింగ్ బాధ్యతలు ఎక్స్‌పర్ట్ అడ్వైజరీ కమిటీ (ఇఎసి) చూసుకుంటుంది.

ఈ స్కీము కింద రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో 300 ఇంక్యుబేటర్ల ద్వారా 3,600 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లబ్ధిపొందుతారు. ఇంక్యుబేటర్లంటే ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను పెంపొందించే సంస్థలు. నిధులతోపాటు తమ మౌలికసదుపాయాలను స్టార్టప్‌లకు అందిస్తూ వాటి బిజినెస్ కార్యకలాపాలు కొనసాగేలా సహాయపడతాయి.

ఈ పథకం ప్రయోజనాలు

ఈ పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంతగానో ప్రోత్సహిస్తుంది. మంచి బిజినెస్ అవకాశాలను కల్పిస్తుంది. ఇందుకుగాను 945 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది.

కాన్సెప్ట్, ప్రొటోటైప్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ ట్రయల్, మార్కెట్ ఎంట్రీలకు, కమర్షియలైజేషనుకు నిధులు ఉపయోగించవచ్చు.

ప్రభుత్వం ఇంక్యుబేటర్లకు నిధులు అందిస్తే ఆ నిధులను ఇంక్యుబేటర్లు స్టార్టప్‌లకు అందిస్తాయి.

నిధుల లెక్కలను ఇంక్యుబేటర్లు ఎప్పటికప్పుడు రికార్డు చేస్తాయి. ఫండింగ్‌ను ప్రభుత్వం దశల వారీగా ఇంక్యుబేటర్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది.

లబ్ డబ్బు

అర్హులు ఎవరు?

ఈ పథకం కింద నిధులు పొందటానికి స్టార్టప్లకు కొన్ని తప్పనిసరి అర్హతలు ఉండాలి. వాటిలో ఒకటి స్టార్టప్ డిపిఐఐటి గుర్తించినదై ఉండాలి. దరఖాస్తు చేసుకునే నాటికి స్టార్టప్ ప్రారంభించి రెండు సంవత్సరాలు అయిండాలి. మార్కెట్‌కు తగిన ఉత్పత్తి లేదా సేవలను పెంపొందించే బిజినెస్ ఆలోచనలు స్టార్టప్‌కు ఉండాలి.

కేంద్రం లేదా ఏ ప్రభుత్వ పథకం నుంచి కూడా సదరు స్టార్టప్ పది లక్షల రూపాయల పైబడి ఆర్థిక సహాయం పొంది ఉండకూడదు.

వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, విద్య, రక్షణ, ఆరోగ్యం, బయోటెక్నాలజీ, రైల్వేస్, వస్త్రపరిశ్రమ, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వాటిపై పనిచేస్తున్న స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఉంటుంది.

ఇంక్యుబేటర్ల విషయానికి వస్తే, ఇంక్యుబేటర్ చట్టబద్ధమైనదై ఉండాలి. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ సహాయం అది పొందుతుండాలి. దరఖాస్తు చేసేనాటికి రెండేళ్లుపైగా ఇంక్యుబేటరుగా పనిచేసిన అనుభవం ఉండాలి.

అలాగే దరఖాస్తు చేసేనాటికి దాని కింద కనీసం ఐదు స్టార్టప్‌లు ఉండాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ రంగాలలో మంచి అనుభవం ఉన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండాలి. స్టార్టప్‌లను పర్యవేక్షించగలిగే మంచి బృందం వాటికి ఉండాలి.

స్టార్టప్‌లకు ఉపయోగపడే విధంగా మౌలిక సదుపాయాలు, టెస్టింగ్ ల్యాబ్స్ ఉండాలి. మూడేళ్లుగా ఇంక్యుబేషన్ సపోర్టు అందిస్తుండాలి. మూడేళ్లుగా స్టార్టప్‌లకు నిధుల సహాయం చేస్తుండాలి. మూడేళ్లుగా స్టార్టప్‌లకు మెంటరింగ్ చేస్తుండాలి. స్టార్టప్‌లకు ఇతరత్రా మద్దతును అందిస్తుండాలి. ఎన్ని స్టార్టప్‌లకు సపోర్టు ఇవ్వాలనుకుంటున్నది ఇంక్యుబేటర్ పేర్కొనాలి.

అలాగే నిధుల మొత్తం, డెప్లాయిమెంట్ ప్లాన్, టైమ్ లైన్స్ పాటిస్తున్న వివరాల ఆధారంగా స్కీములో ఇంక్యుబేటర్ల ఎంపిక ఉంటుంది. ఇంక్యుబేటర్ల ఎంపిక చేసుకునేటప్పుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తారు.

ఇంక్యుబేటర్ల ద్వారా...

ఇంక్యుబేటర్ల ద్వారా అర్హులైన స్టార్టప్‌లకు సీడ్ ఫండింగ్‌ అందజేస్తారు. ఈ సీడ్ ఫండింగ్ స్కీమును 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నారు. ఈ స్కీము కింద 1,446 స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులు వచ్చాయి.

కాన్సెప్ట్, ప్రొటోటైప్ డెవలప్‌మెంట్, ప్రొడెక్ట్ ట్రయల్స్, మార్కెట్ ఎంట్రీ, కమర్షియలైజేషన్ వాటి ఆధారంగా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీము (ఎస్ఐఎస్ఎఫ్ఎస్) స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇంక్యుబేటర్లకు ఫండింగ్ ఐదు కోట్లు వరకూ ఇచ్చే అవకాశం ఉంది. సీడ్ ఫండ్ కేటాయింపులకు అర్హులైన ఇంక్యుబేటర్లను ఎక్స్‌పర్ట్ అడ్వైజరీ కమిటీ (ఇఎసి) అంచనా కడుతుంది.

ఇంక్యుబేటర్లను ఎంపిక చేసి సీడ్ ఫండింగ్ కేటాయిస్తుంది. అవసరమైన చర్యలను చేపడుతుంది. నిధులు అర్థవంతంగా వినియోగమయ్యేలా చూస్తుంది. ఎంపికైన ఇంక్యుబేటరుకు ఎంత మేర నిధుల సహాయం అందించాలి ఇఎసినే అంచనా వేస్తుంది.

ఈ స్కీము కింద దరఖాస్తు చేసుకోవడానికి ఇంక్యుబేటర్లకు, స్టార్టప్లకు విడివిడిగా ప్రొసీజర్ ఉంటుంది. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీము అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంక్యుబేటర్ సీడ్ మేనేజ్మెంట్ కమిటీ (ఐఎస్ఎంసి) ఉంటుంది. సీడ్ ఫండ్ కోసం ఇది స్టార్టప్‌లను ఎంపిక చేస్తుంది. దీని సభ్యులను ఎక్స్‌పర్ట్ అడ్వైజరీ కమిటీ ఎంపిక చేస్తుంది.

స్టార్టప్ ఇండియా

ఫొటో సోర్స్, facebook/StartupIndia

దరఖాస్తు చేయడం ఎలా?

ఎంటర్‌ప్రెన్యూర్లు సీడ్ ఫండింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముగ్గురు ఇంక్యుబేటర్లను సీడ్ ఫండింగ్ కోసం పేర్కొనాలి.

టీమ్ ప్రొఫైల్, ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్, ప్రాడెక్ట్ ఓవర్ వ్యూ, బిజినెస్ మోడల్, కస్టమర్ ప్రొఫైల్, మార్కెట్ సైజు, ప్రాజక్టు యుటిలైజేషన్ ప్లాన్, ఎంత మొత్తం నిధులు అవసరపడతాయి? వంటివన్నీ దరఖాస్తుదారు రాయాలి.

అర్హులైన వారి దరఖాస్తులను ‘ఇంక్యుబేటర్ సీడ్ మేనేజ్ మెంట్ కమిటీ’ పరిశీలిస్తుంది. నిధులు అందివ్వాలనుకుంటున్న స్టార్టప్‌లను ఈ కమిటీలోని నిపుణులు ఎంపిక చేస్తారు.

స్టార్టప్‌లు ప్రస్తావించిన ఐడియా, దాని సాధ్యాసాధ్యాలు, ప్రభావం, కొత్తదనం, బృందం, ఫండ్ యుటిలైజేషన్ ప్లాన్ ఆధారంగా అర్హులను గుర్తిస్తారు.

కావలసిన డాక్యుమెంట్లు...

ఆధార్ కార్డు, జీఎస్‌టీ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, లీజ్ అగ్రిమెంట్ కాగితాలు, ప్రాజెక్ట్ రిపోర్టు వివరాలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, మొబైల్ నంబరు డాక్యుమెంట్లు కావాలి.

అప్లికేషన్ ఫీజులేమీ ఉండవు. అంతా ఆన్‌లైన్ లోనే.

అర్హులైన స్టార్టప్‌లకు ఇంక్యుబేటర్ల ద్వారా గ్రాంటు నాలుగు అంచల్లో అంటే డిపిఐఐటి, తర్వాత ఎక్స్‌పర్ట్స్ అడ్వయిజరీ కమిటీ, ఆ తర్వాత ఇంక్యుబేటర్లకు, ఆపైన స్టార్టప్‌లకు చేరుతుంది.

స్టార్టప్‌లు చివరిగా తమ కంపెనీ బ్యాంకు అకౌంట్ల ద్వారా నిధులు అందుకుంటాయి.

వివరాలకు కస్టమర్ కేర్ నంబరు: 1800 115 565

వీడియో క్యాప్షన్, 'చెత్త సమస్య'కు ఈ చిన్నారి వద్ద పరిష్కారం ఉందా?

రకరకాల మోడల్స్...

స్టార్టప్‌లకు ఫండింగ్ అందించడంలో రకరకాల మోడల్స్ ఉన్నాయి. మొదటి మోడల్‌లో డిఎస్‌టి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ఇంక్యుబేటర్స్ సెంటర్సుకు ఫండిగ్ ఇస్తుంది. ఇంక్యుబేటర్స్ సెలక్షన్ కమిటీ ఏర్పాటుచేసి స్టార్టప్స్‌ను ఎంపిక చేయడం, నిధులను అందజేయడం ఉంటుంది.

నిధులు ఇవ్వడంలో అన్ని మంత్రిత్వశాఖలూ రెండు మూడు రకాల మోడల్స్‌ను అనుసరిస్తాయి. మరో మోడల్లో నిధులను ఇంక్యుబేషన్ సెంటర్‌కు ఇస్తారు. ఇంక్యుబేషన్ సెంటర్ ప్రపోజల్స్ పిలుస్తుంది. ఈ క్రమంలో స్టార్టప్స్‌ను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

మూడవది ఇంక్యుబేషన్ సెంటర్ రిఫర్ చేసిన స్టార్టప్.. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దరఖాస్తును పెట్టుకుంటుంది. సెంట్రలైజ్డ్ ప్రెజెంటేషన్, సమీక్ష తర్వాత స్టార్టప్‌లను షార్ట్ లిస్ట్ చేయడం ఉంటుంది.

ఎంపిక చేసిన స్టార్టప్‌లకు నిధులను ఇంక్యుబేటర్లు అందజేయడం ఉంటుంది. ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) శాఖది ఇంకొక మోడల్. ఇందులో 5 కోట్ల మేర గ్రాంటు ఇంక్యుబేటర్ సెంటర్లకు కేటాయిస్తారు.

దేశంలోని స్టార్టప్‌లు దీనికి దరఖాస్తు చేసుకుంటాయి. ఇందులో తాము ప్రిఫర్ చేస్తున్న రెండు మూడు ఇంక్యుబేటర్ సెంటర్లను స్టార్టప్‌లు పేర్కొనవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసిన ఇంక్యుబేటర్ సెంటర్ ఎంపిక అయితే నిధులు దానికి వస్తాయి. అది కాకపోతే రెండవ ప్రిఫరెన్స్ అప్రోచ్ అవుతారు.

బయోటెక్నాలజీలో రెండు మోడల్స్ అనుసరిస్తారు. నేరుగా దరఖాస్తు పెట్టుకోవడం ఉంటుంది. అందులోంచి స్టార్టప్‌లను ఎంపిక చేసుకోవడం ఉంటుంది. గ్రాంటును 50 లక్షల రూపాయల వరకూ ఇస్తారు.

రెండవ మోడల్‌లో నిధులను ఇంక్యుబేషన్ సెంటర్‌కు విడుదల చేస్తారు. అప్పుడు ఇంక్యుబేషన్ సెంటర్ కమిటీని ఏర్పాటు చేసి ఎంపిక చేసిన స్టార్టప్‌కు నిధులు మంజూరు చేస్తుంది.

మొత్తానికి రెండు మోడల్స్ ఏమిటంటే.. ఒకటి ఇంక్యుబేటర్ సెంటర్స్‌కు నిధులు మంజూరు చేయడం, రెండు అప్లికేషన్లు తీసుకుని అర్హులైన స్టార్టప్‌కు నేరుగా ఫండ్స్ అందజేయడం లేదా ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అందజేయడం.

‘‘అన్ని మినిస్ట్రీలు స్టార్టప్‌లకు నిధులు ఇవ్వడం ద్వారా వాటిని ప్రోత్సహిస్తాయి. ఇన్నోవేటివ్ కాంపొనెంట్స్ ఉంటే ప్రాజక్టు అవకాశాలు, నిధులు బాగా రావడానికి అవకాశం ఉంది’’ అని ఇంక్యుబేషన్ అసోసియేషన్ ప్రతినిధి సురేష్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, మహిళ దళిత వ్యాపార వేత్త విజయగాథ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)