Disha Case: అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టుకు ఎంక్వైరీ కమిషన్ నివేదిక

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జస్టిస్ సిర్పుర్కర్ కమిటీ సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది.

ఈ ఘటనపై తమ దర్యాప్తు పూర్తి చేసిన ఎంక్వైరీ కమిషన్ జనవరి 28న సుప్రీంకోర్టుకు తన నివేదికను సమర్పించినట్లు ఎంక్వైరీ కమిషన్ సెక్రటరీ చెప్పారు.

ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఎంక్వైరీ కమిషన్ వివిధ డాక్యుమెంటరీ రికార్డులు సేకరించింది.

వీటిలో దర్యాప్తు రికార్డులతోపాటూ, ఫోరెన్సిక్ నివేదికలు, పోస్టుమార్టం నివేదికలు, ఘటనాస్థలంలో తీసిన ఫొటోలు, వీడియోలు లాంటివి ఉన్నాయని ఎంక్వైరీ కమిషన్ సెక్రటరీ వివరించారు.

ఎంక్వైరీ కమిషన్ తమ దర్యాప్తులో భాగంగా 2021 ఆగస్టు 21 నుంచి 2021 నవంబర్ 15 వరకూ 47 రోజులపాటు విచారణ చేపట్టింది. ఆ సమయంలో మొత్తం 57 మంది సాక్ష్యులను విచారించి, వారి వాంగ్మూలం రికార్డు చేసింది. కోవిడ్-19 ఆంక్షలకు లోబడి ఈ విచారణ బహిరంగంగా నిర్వహించారు.

దిశ నిందితులు(ఫైల్)

2021 నవంబర్ 16 నుంచి నవంబర్ 26 వరకూ ఎక్వైరీ కమిషన్ విచారణకు హాజరైన తెలంగాణ రాష్ట్రం తరఫు న్యాయవాదులు, పోలీస్ అధికారులు, ఇతరులు తమ వాదనలు వినిపించారు.

2019 డిసెంబర్ 06న జరిగిన ఘటనకు సంబంధించిన ఎంక్వైరీ కమిషన్ వివిధ ప్రాంతాలలో తనిఖీలు జరిపింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీ.ఎస్.సిర్పుర్కర్ అధ్యక్షతన ఒక విచారణ కమిషన్ నియమిస్తూ సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న ఆదేశాలు జారీ చేసింది.

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులైన మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ల ఎన్‌కౌంటర్‌ ఘటనపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన ఈ ఎంక్వైరీ కమిషన్‌ మిగతా సభ్యుల్లో బాంబే హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్పీ సొందూర్ బల్దోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీ.ఆర్.కార్తికేయన్ కూడా ఉన్నారు.

2019 డిసెంబర్లో పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)