కరీంనగర్ కారు టెర్రర్: యాక్సిడెంట్‌కు కారణం మైనర్.. కారు నడుపుతోంది 9వ తరగతి విద్యార్థి

తెలంగాణలోని కరీంనగర్ కమాన్ చౌరస్తాలో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో అతివేగంతో పేవ్‌మెంట్‌ను ఢీకొని అదుపుతప్పిన కారు రోడ్డుపక్కనే పనిచేసుకుంటున్న వారిపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా కమ్మరి పనిలో భాగంగా గృహ అవసరాలకు వాడే కత్తులు, గొడ్డళ్లు, కొడవళ్లు తయారు చేసే వృత్తిలో ఉన్నారు.
తీవ్రంగా గాయపడ్డ మరో నలుగురిని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం.... ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే వారు కారు వదిలి పరారయ్యారు.
మృతులను సునీత(28), లలిత(25), జ్యోతి(13), ఫరియాద్(27)లుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిలో రాణి, పద్మ, అవంతికతో పాటు మరో మహిళ ఉన్నారు.
ప్రమాదానికి కారణమైన కారు నంబర్ కరీంనగర్ జిల్లా వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. ఈ కారుపై (TS02EY 2121) గతంలో 9 సార్లు ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్ కేసులు నమోదై ఉన్నాయి.
మైనర్ డ్రైవింగ్
నలుగురు ప్రాణాలు తీసిన కారును నడిపింది ఒక మైనర్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. కారు ప్రమాదం జరిగినప్పుడు 9వ తరగతి విద్యార్థి డ్రైవింగ్ చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని, బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు.

కత్తులు, గొడ్డళ్లు తయారు చేసే వృత్తిలో ఉన్నవారు కరీంనగర్ కమాన్ సర్కిల్‌లో ప్రతి ఆదివారం మేక తలకాయలను కాల్చి ముక్కలుగా కొట్టే పని కూడా చేస్తారు.
ఈ రోజు అదే తరహాలో రేకుర్తి గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలకు చెందిన వారు అక్కడ పనిలో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు.
‘మేం పొద్దునే 6 గంటలకు ఇక్కడికి వచ్చాం. తలకాయలు వస్తాయని మంట పెట్టి కూర్చున్నాం. అప్పుడే కార్లో వచ్చి ఢీకొట్టారు. కారులో నలుగురు ఉన్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత పారిపోయారు’ అని ఘటన జరిగిన తీరును వివరించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
‘ఈరోజు సుమారు 7 గంటలకు కరీంనగర్ –హైదరాబాద్ రోడ్‌లో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వారిపైకి దూసుకెళ్లింది. డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి ముందుకు దూసుకుపోవడం వల్ల అక్కడ పనిచేసుకుంటున్న వారిపైకి దూసుకెళ్లింది. నలుగురు చనిపోయారు. మరికొంతమంది ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పై ఇంకాపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కాలేదు. అయితే వారు ఎవరు అన్న వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం” అని కరీంనగర్ టౌన్ ఏసిపి తుల శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘మా అక్కపై అత్యాచారం చేసి, మొహానికి నల్ల సిరా రాసి, మెడలో చెప్పులదండతో ఊరేగించారు’
- టీఆర్ఎస్ రూ. 301 కోట్లు, టీడీపీ రూ. 188 కోట్లు, వైసీపీ రూ. 143 కోట్లు
- పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే నాలుగు తప్పులు
- వీధుల్లో అడుక్కుంటున్న డాక్టర్లు.. ఆకలేస్తోంది, ఆహారం లేదు.. 8 నెలలుగా జీతాలు అందట్లేదు..
- లాక్డౌన్లో యూట్యూబ్ చానల్‌తో లక్షల ఫాలోవర్లు .. 22 దేశాలు చుట్టేసిన యువకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












