తెలంగాణ: నియంత్రిత సాగుపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట మార్చారు? ప్రభుత్వం పంటలను కొనకపోతే వచ్చే సమస్యలేంటి?

ఫొటో సోర్స్, kcr
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆ రెండు నిర్ణయాలూ ఒకప్పుడు కేసీఆర్ బల్లగుద్ది మరీ చెప్పిన మాటలకు విరుద్ధంగా ఉన్నాయి. ఒకటి ఇప్పటి వరకూ కేసీఆర్ గట్టిగా చెబుతూ వస్తోన్న 'నియంత్రిత సాగు' విధానాన్ని విరమించడం, రెండోది ప్రభుత్వమే పంట కొనుగోలు చేసే విధానాన్ని ఆపేయడం.
ఈ రెండూ రైతులపై ప్రత్యక్షంగా తీవ్రంగా ప్రభావం చూపడం ఒక ఎత్తు అయితే, రాజకీయంగా కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉండడం మరో ఎత్తు.

నియంత్రిత సాగు:
రైతులు ఒకే పంటను పదే పదే వేయడం, లేదా ఎక్కువ మంది ఒకే పంటను వేయడం ద్వారా భూసారానికి సంబంధించిన సమస్యలు, మార్కెట్లో రేట్ల పెరుగుదల, తగ్గుదల సమస్యలు వస్తుంటాయి. దానికి పరిష్కారంగా ప్రణాళికాబద్ధంగా పంటలు వేయాలని నిపుణులు చెబుతారు. వివిధ అంశాలను అధ్యయనం చేసి ఆ ప్రణాళిక సిద్ధం చేస్తారు. కానీ అధ్యయనం ఎంత వరకు జరిగిందో తెలీదు కానీ, తక్షణం నియంత్రింత సాగు చేయాలంటూ కొంత కాలం క్రితం కేసీఆర్ ఆదేశించారు. తాము చెప్పిన పంట వేయకపోతే ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు సాయం కూడా అందదన్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
''రైతులు తమ స్థానిక పరిస్థితులు, మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా ఏ పంటలు వేయాలనే విషయంలో అక్కడే నిర్ణయాలు తీసుకోవాలి. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదు. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలి. పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలి. ఈ విధానం ఉత్తమం'' అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి ఈ నియంత్రిత సాగు విషయంలో ముందు నుంచీ రకరకాల చర్చలు జరిగాయి.
కేసీఆర్ అప్పటి నిర్ణయాన్నీ, ఇప్పటి నిర్ణయాన్నీ కూడా అతివృష్టి - అనావృష్టిగా వర్ణిస్తున్నారు వ్యవసాయ నిపుణులు. నియంత్రణ సాగు కాదు కానీ, ప్రణాళికబద్ధమైన సాగు కావాలని వారు చెబుతున్నారు. పూర్తిగా కఠినంగా నియంత్రించడం లేదా అసలు ఏమీ లేకుండా వదిలేయడం రెండూ సరికాదని వారి భావన.
''పంటల విషయంలో కొంత ప్రణాళిక ఉండాలి. కానీ ఆ ప్రణాళిక సీఎం కార్యాలయం తయారు చేయకూడదు. జిల్లాల వారీగా, మండలాల వారీగా, రైతులూ, నిపుణులూ కలసి కూర్చొని తయారు చేసుకోవాలి. రైతుల పాత్ర ఉండాలి. విస్తృత భాగస్వామ్యం ఉండాలి. హేతుబద్ధంగా ఉండాలి. అటువంటి ప్రణాళిక మంచింది. కానీ నిర్బంధం మంచిది కాదు. నిపుణుల మాట వినకుండా, ముఖ్యమంత్రి కార్యాలయమే ఏం పంటలు వేయాలో చెప్పడం సరికాదు'' అన్నారు రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ విస్సా కిరణ్.
''అలాగని దీన్నించి ప్రభుత్వం పూర్తిగా తప్పుకోవడం కూడా మంచిది కాదు. నియంత్రణ కాదు కానీ, మరింత మెరుగైన ప్రణాళిక కావాలి. వనరులు, మార్కెట్, వాతావరణం, అవసరాల ఆధారంగా ఏ పంట మంచిదనే నిర్ణయం చేసి రైతులకు చెప్పాలి. వరి, పత్తి సాగు పెరుగుతోంది. నీరు, ఎరువులు ఎక్కువ ఖర్చయ్యే పంటల నుంచి రైతులను మళ్లించాలి. వాటి స్థానంలో పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు విస్తీర్ణం పెంచాలి. కానీ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదు. అది ప్రభుత్వ బాధ్యత. దాన్నుంచి పూర్తిగా తప్పుకోవడం మంచిది కాదు'' అని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎగ్రికల్చర్ కన్వీనర్ రామాంజనేయులు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం పంట కొనడం మానేస్తే ఏమవుతుంది?
తెలంగాణ ప్రభుత్వం చెప్పిన మరో ముఖ్యమైన విషయం, కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం రైతులు దేశంలో ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చు కాబట్టి, ఇకపై రాష్ట్ర ప్రభుత్వం పంటలను కొనబోదు అని చెప్పడం.
''ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతిసారి అలాగే చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. అయితే, వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా, పద్ధతి ప్రకారం నిర్వహించాలి. రైతులంతా ఒకేసారి తమ పంటను మార్కెట్‌కు తీసుకురాకుండా వంతుల ప్రకారం తీసుకురావాలి. రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ విస్తరణాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏ గ్రామం రైతులు ఎప్పుడు మార్కెట్‌కు సరుకులు తీసుకురావాలో నిర్ణయించాలి. దాని ప్రకారం రైతులకు టోకెన్లు ఇవ్వాలి. చెప్పిన రోజు మాత్రమే సరుకును మార్కెట్‌కు తీసుకరావడం వల్ల రైతులకు సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలి'' అని ప్రకటనలో ఉంది.
''పంటల కొనుగోళ్ల వల్ల ప్రభుత్వానికి చాలా నష్టం వచ్చిందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చింది. రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది'' అంటూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
పంటలను కొనడం వల్ల వచ్చిన నష్టంగా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న లెక్క:
- వరి (ధాన్యం) - రూ. 3,935 కోట్లు
- మొక్కజొన్న (మక్క) - రూ. 1,547.59 కోట్లు
- జొన్న- రూ. 52.78 కోట్లు
- కందులు- రూ. 413.48 కోట్లు
- ఎర్రజొన్న- రూ. 52.47 కోట్లు
- మినుములు - రూ. 9.23 కోట్లు
- శనగలు - రూ. 108.07 కోట్లు
- పొద్దుతిరుగుడు- రూ. 14.25 కోట్లు
(హమాలీ, ఇతర నిర్వహణ ఖర్చులు కలపి మొత్తం సుమారు రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు చెబుతున్నారు)

ఫొటో సోర్స్, Getty Images
తప్పుడు నిర్ణయాలు
''ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలూ తప్పు నిర్ణయాలే అవుతాయి. ఇవి మొదటి నుంచీ తప్పే. ఆ తప్పును వారు గుర్తించి సవరించుకుంటున్నారనుకుంటే, దాని బదులు మరో తప్పు చేస్తున్నారు'' అని రామాంజనేయులు అన్నారు.
''కేసీఆర్ మాటలు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నట్టు ఉన్నాయి. ఇది ఆందోళనకరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కొంత బాధ్యత తీసుకోవాలి. కరోనా సమయంలో గ్రామాల్లో కొనుగోలు వల్ల కొంత మేలు జరిగింది. దీన్ని మేం స్వాగతించాం. దీన్నుంచి వెనక్కు వెళ్లడం సరికాదు. దానివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. కేంద్ర చట్టాల ప్రకారం రైతులు ఎక్కడైనా పంట అమ్మొచ్చు. మేం కొనక్కర్లేదు అంటున్నారు. అసలు కేంద్రం చెప్పే లాజిక్కే సమర్థనీయం కాదు. రెండు వారాల ముందు ఇవే చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేసి, అప్పుడు ఈ చట్టాల వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి, ఇప్పుడు ఇలా అంటున్నారు. ఆ రకంగా కేసీఆర్ యూటర్న్ తీసుకున్నట్టే. అసలు కేంద్ర వ్యవసాయ బిల్లులపై వారి వైఖరి స్పష్టం చేయాలి. పంట కొనుగోళ్లు, మద్దతు ధరల విషయంలో ప్రభుత్వాలు గట్టిగా ఉండాలి. అలా లేకపోతేగా రైతులకు మంచి ధరలు రావు. ప్రైవేటు వాడు మంచి ధర ఇస్తాడు అనుకుంటే అది తప్పే అవుతుంది'' అని విస్సా కిరణ్ అభిప్రాయపడ్డారు.
నిజానికి దేశంలో వ్యవసాయానికి ఎక్కువ ఖర్చయ్యే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. పోనీ రైతు బంధు ఏమైనా ఉపశమనం ఇస్తోందా అంటే, కౌలు రైతులకు ఆ సాయం అందడం లేదు.
''దేశంలో ఎక్కడలేనంత ఎక్కువ ఉత్పత్తి ఖర్చు మన రాష్ట్రంలో ఉంది. ఇక్కడ వంద కేజీలు (క్వింటాలు) వరి ఉత్పత్తికి 2,719 రూపాయల ఖర్చు అవుతుంది. ఇంత ఎక్కువ ఖర్చు పెట్టే మనం ఇతర రాష్ట్రాలతో మార్కెట్లో పోటీ పడలేం. కాబట్టి ముందు ఖర్చులు తగ్గించే పని చూడాలి. గతేడాది కేంద్రం ఎక్కువ కంటే ప్రతీ ఏటా ఎక్కువే కొంటుంది అనుకోవడం తప్పు. తెలంగాణ నుంచి కేంద్రం కోటి లక్షల టన్నుల పంట కొంటుంది అనుకున్నారు. కానీ వాస్తవంగా కొన్నది 23 లక్షల టన్నులు మాత్రమే. చాలా మిగిలిపోయింది. ఎందుకంటే మన ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కాబట్టి, ఈ రేటుకు బయట మార్కెట్లో కొనేవారు లేరు. దానికితోడు ఎఫ్‌సీఐ వారు బియ్యాన్ని కేవలం 2200 రూపాయలకు క్వింటాలు రేటున మార్కెట్లో అమ్ముతున్నారు. వారు అంత తక్కువ ధరకు అమ్ముతుంటే మన రైతుల దగ్గర ఎవరు కొంటారు? బయట మార్కెట్లో ధర పూర్తిగా పడిపోయింది. అది గమనించడకుండా ప్లానింగ్ చేయకపోవడం పొరబాటు. కేంద్రం స్వయంగా మార్కెట్లోకి విడుదల చేస్తోన్న ఉత్పత్తి ప్రభావం తట్టుకునేలా సిద్ధమవకుండా, మేం అమ్మేయగలం అనుకోవడం తప్పు. అలాగే సన్నబియ్యం వేయండి అని మార్కెట్లోకి వదలడం కూడా తప్పు'' అన్నారు రామాంజనేయులు.

''ఇక కొనుగోళ్లకు సంబంధించిన మన దగ్గర మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక పరపతి సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు ఉన్నాయి. ఎంతో వ్యవస్థీకృతంగా ఉన్న వాటిని పక్కన పెట్టి, కొత్తగా తెచ్చిన సమన్వయ సమితులనే రాజకీయ సంస్థలతో సమస్యలు పరిష్కారం కాదు. వాస్తవానికి తెలంగాణ పెట్టిన 7500 కోట్లలో సగం సరిగా ఖర్చు పెట్టినా ఇవాళ రైతుల పరిస్థితి మరోలా ఉండేది. ఇక రైతు బంధు నిజమైన సాగు దారుకు అందితే, వారికి క్వింటాలుకు 400 రూపాయల లాభం వస్తుంది. కానీ ఆ సాయం నిజమైన రైతుకు అందడం లేదు. దీంతో కూడా రైతుకు ఖర్చు తగ్గడం లేదు. స్థానిక అవసరాల కోసం మార్కెట్ ను బలో పేతం చేయడం లేదు.'' అన్నారాయన.
నిజానికి తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు నుంచి తప్పించుకోవడానికి కేంద్ర చట్టాలను ఒక సాకుగా చూపుతోంది అని వారి అభిప్రాయం.
దీనిపై తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








