మోదీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే దేశంలోని రైతులందరికీ మేలు జరుగుతుందా?

ఫొటో సోర్స్, @BJP4India
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో ఆహార సంక్షోభం చరిత్రలో కలిసి పోయింది. 1960కి ముందు పరిస్థితులు ఇప్పటిలా లేవు. ఆనాటి దేశపు ఆహార కొరత తీర్చింది తామేనని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న హరియాణా, పంజాబ్ రైతులు అంటున్నారు. అది నిజం కూడా.
గతంలో గోధుమ, వరి ఉత్పత్తిని పెంచడానికి ఈ రెండు రాష్ట్రాలను ప్రభుత్వం ప్రోత్సహించింది. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)కు హామీ ఇచ్చింది. దీనివల్ల రైతులు తాము ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు.
ఇప్పటికీ హరియాణా, పంజాబ్ రైతులు ఈ ఎంఎస్‌పి నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు.
ఇప్పుడు భారతదేశంలో ఆహార సంక్షోభం లేదు. బియ్యం, గోధుమల ఉత్పత్తికి తగినట్లుగా వాటిని దాచుకోడానికి స్థలం లేదు. ఎంఎస్‌పి భారంగా మారిందని ప్రభుత్వం భావిస్తోంది.
దీనికి పరిష్కారంగా రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా కొనుక్కోడానికి అమ్ముకోడానికి ఉన్న అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నాలను ఈ మూడు చట్టాల ద్వారా చేసింది.
ఎంఎస్‌పి లేకపోతే తాము కూడా మిగతా రాష్ట్రాల రైతుల మాదిరాగానే మారిపోతామని పంజాబ్, హరియాణా రైతులు భావిస్తున్నారు. అందుకే మద్దతు ధర ఇవ్వాలీ, మార్కెట్‌లను కొనసాగించాలంటూ ఆందోళనకు దిగారు.

ఫొటో సోర్స్, EUROPEAN PRESSPHOTO AGENCY
కనీస మద్దతు ధర- చరిత్ర
భారతదేశం ఆహార భద్రతలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా చేసే ప్రయత్నాలు 1964 నుంచి మొదలుపెట్టింది. ఆ ఏడాది ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి తన కార్యదర్శి లక్ష్మీకాంత్ ఝా నాయకత్వంలో ఆహారధాన్యాల ధరల కమిటీని ఏర్పాటు చేశారు. రైతులు నష్టపోకుండా వారికి కనీస ధర పొందేలా చూడాలని లాల్‌బహదూర్ శాస్త్రి అన్నారు.
ఈ కమిటీ తన నివేదికను 1964 సెప్టెంబర్ 24న ప్రభుత్వానికి సమర్పించింది
కనీస మద్దతు ధర ఎంఎస్‌పిని నిర్ణయించడం కోసం ఆహార ధాన్యాల ఖర్చులు, ధరల సమాఖ్య ( కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్-CACP)ను ఏర్పాటు చేశారు. 1966లో మొదటిసారి గోధుమ, బియ్యం కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను నిర్ణయించారు.
అలా మొదలైన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. సీఏసీపీ సూచనల మేరకు ప్రతియేటా 23 పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తారు.
రైతులు తమ పంటలను పొలాల నుండి రాష్ట్రాల ధాన్యం మార్కెట్లకు రవాణా చేస్తారు. ఈ పంటలలో, గోధుమలు, బియ్యాన్ని కనీస మద్దతు ధరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కొనుగోలు చేస్తుంది.
రైతుల నుండి కొనుగోలు చేసిన ఈ ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అంటే రేషన్ షాపుల ద్వారా పేదలకు తక్కువ ధరకు అందిస్తారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ వద్ద పెద్ద ఎత్తున ఆహారా ధాన్యాల నిల్వలున్నాయి.
ప్రజా పంపిణీ (పీడీఎస్) అనేది భారత దేశపు ఆహర భద్రతా వ్యవస్థ. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహార భద్రతా వ్యవస్థగా చెబుతారు. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు సబ్సిడీతో కూడిన ఆహారం, ఆహారేతర వస్తువులను పంపిణీ చేస్తాయి.
కనీస మద్దతు ధరను ప్రభుత్వమే నిర్ణయించడం వల్ల రైతులకు వారు పండించిన పంటకు కచ్చితమైన ధర లభించే అవకాశం ఉంది.
కొత్త వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వం స్థానంలో ప్రైవేటు వ్యక్తులు వస్తారని, మార్కెట్ వ్యవస్థ లేకుండా పోతుందని రైతులు భయపడుతున్నారు. అదే జరిగితే ఎంఎస్‌పి అనేది ఉండదని అంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ప్రభుత్వం 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తున్నా అందులో ప్రధానంగా వరి, గోధుమ, పత్తిలాంటి రెండు మూడు పంటలను మాత్రమే మార్కెట్లు ఎంఎస్‌పికి కొనుగోలు చేస్తాయి.

ఫొటో సోర్స్, EPA
ఎంఎస్‌పితో ఎవరికి ప్రయోజనం?
“పంటల ధరలను మార్కెట్ ప్రకారం నిర్ణయించాలి తప్ప ప్రభుత్వం నిర్ణయించకూడదు. అటు ప్రభుత్వం, ఇటు రైతులు వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవాలి. ఎంఎస్‌పి మాత్రమే రైతులను బాగు చేస్తుందనుకోవడం తప్పు” అంటారు వ్యవసాయ ఆర్ధికవేత్త విజయ్ సర్దానా.
ఎఫ్‌సీఐ పునర్నిర్మాణంపై సూచనలు ఇవ్వడానికి 2015లో శాంతకుమార్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 6% మంది రైతులకు మాత్రమే ఎంఎస్‌పి ప్రయోజనం లభిస్తోందని కమిటీ తన నివేదికలో తెలిపింది. అంటే 94% మంది రైతులకు ఎమ్‌ఎస్‌పి ద్వారా ప్రయోజనం ఎప్పుడూ కలగలేదు.
అటువంటి పరిస్థితిలో 94% రైతులకు ప్రయోజనకరంగా లేని వ్యవస్థ, దేశంలోని రైతులను శాశ్వత సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాల్సిన విషయం అంటున్నారు వ్యవసాయ ఆర్ధికవేత్తలు.
మార్కెట్ వ్యవస్థ
ప్రభుత్వం రూపొందించిన మూడు చట్టాలలో ఒకటి రైతు ఉత్పత్తుల వర్తకం, వాణిజ్యం (ప్రమోషన్ అండ్ సింప్లిఫికేషన్) చట్టం 2020. దీని కింద రైతులకు, వ్యాపారులకు మార్కెట్ వెలుపల అమ్ముకునే స్వేచ్ఛ కల్పించారు.
అయితే దీనివల్ల మండీలు(మార్కెట్‌లు) మూత పడతాయని రైతులు భయపడుతున్నారు.
మండీలను మూసేయడం లేదని, రైతుల కోసం కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, దీన వల్ల రైతులు మంచి ధరలకు తమ పంటను అమ్ముకోవచ్చని ప్రభుత్వం అంటోంది. కానీ రైతులు ఈ విషయంలో సంతృప్తి చెందడం లేదు.
దేశవ్యాప్తంగా 6000కి పైగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 33శాతం ఒక్క పంజాబ్‌లోనే ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఎఫ్‌సీఐ ఎక్కువగా గోధుమలను పంజాబ్‌లోనే కొనుగోలు చేస్తుంది.
ఈ మండీలలో ఎంఎస్‌పిపై గోధుమలను కొన్నప్పుడు ప్రభుత్వం దాన్నుంచి మండీ టాక్స్, బ్రోకర్ టాక్స్‌తోపాటు గ్రామాభివృద్ధి పన్నును కూడా వసూలు చేస్తుంది. రాష్ట్ర ఖజానాకు ఇది భారీ ఆదాయం.
పంజాబ్‌లో ప్రభుత్వానికి ఈ మూడు పన్నుల నుంచి ఆదాయం 8.5 శాతంకాగా, హరియాణాలో 6.5శాతం. మిగిలిన రాష్ట్రాల్లో ఇది 1 నుంచి 5శాతం మధ్య ఉంటుంది.

ఫొటో సోర్స్, EPA
అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ పంటలకు పోటీ
“ప్రభుత్వం రైతులకు సబ్సీడీ ఇస్తుంది, పంటల కొనుగోలులో మద్దతు ధరను కూడా ఇస్తుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్ ధరకన్నా ఎక్కువ. ప్రపంచంలో మరే ఇతర ఆర్ధిక వ్యవస్థలో కూడా ఇలా జరగదు’’ అన్నారు వ్యవసాయ ఆర్ధికవేత్త విజయ్ సర్దానా.
ఇందుకు ఆయన సీఏసీపీ నివేదికను ఉదహరించారు. ఈ నివేదిక ప్రకారం గోధుమలు, బియ్యం కలిపి ఎఫ్‌సీఐ గోదాములలో సుమారు 74.3 మిలియన్ టన్నులు నిల్వ ఉన్నాయి. భారతదేశానికి అవసరమైన దానికంటే ఇది 33.1మిలియన్ టన్నులు అదనం.
అంతర్జాతీయ మార్కెట్లో, భారతదేశపు గోధుమలు ఆస్ట్రేలియా, ఉక్రెయిన్ గోధుమల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. భారతదేశ గోధుమల ధర చాలా ఎక్కువని నివేదికలో ఉంది. ఇది ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది.
భారతదేశపు బాస్మతి బియ్యం విషయంలో కూడా ఇలాగే జరుగుతోందని సర్దానా అన్నారు.

ఫొటో సోర్స్, AFP
ధాన్యం కొనుగోళ్లతో పెరుగుతున్న భారం
“మార్కెట్ నుండి గోధుమలను కొనడానికి ఎఫ్‌సిఐ ఎంఎస్‌పిపై 14% సేకరణ వ్యయం (మండి టాక్స్, జాబ్ టాక్స్, గ్రామీణాభివృద్ధి సెస్, ప్యాకేజింగ్, లేబర్, స్టోరేజ్) ఖర్చు చేయాలి, తరువాత పంపిణీ చేయడానికి 12% ఖర్చు చేయాలి (శ్రమ, లోడింగ్ అన్‌లోడ్ అవుతోంది). 8% హోల్డింగ్ ఖర్చు. అంటే ఎంఎస్‌పికంటే గోధుమలను కొనడానికి, పంపిణీ చేయడానికి ఎఫ్‌సీఐ 34% అదనంగా ఖర్చు చేస్తుంది’’ అన్నారు అలోక్ సిన్హా. ఆయన 2006 నుండి 2008 వరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా పని చేశారు.
గోధుమ ఎంఎస్‌పి క్వింటాల్‌కు 2000 రూపాయలు ఉంటే, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయడానికి ప్రభుత్వం క్వింటాల్‌కు సుమారు రూ. 2680 ఖర్చు చేయాల్సి ఉంది.
ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. నిబంధనల ప్రకారం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం కొనుగోలులో 8% వరకు చెడిపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం గోధుమలు కొనడానికి ఇచ్చే 8శాతం డబ్బు తిరిగి రాదు.
వీటన్నింటినీ గమనిస్తే రైతులకు ఎంఎస్‌పి మేలు చేస్తున్నా, భారతదేశ వ్యవసాయ సంక్షోభాన్ని నివారించలేదని ఎవరైనా ఊహిస్తారు. ఎందుకంటే ఇది 94%మంది రైతులు ఈ వ్యవస్థకు దూరంగా ఉన్నారు.
గోధుమ ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.2000 అయితే, ఎఫ్‌సీఐ కొనుగోలు చేసినప్పుడు అది క్వింటాల్‌కు రూ.3000 అవుతుంది.
చాలాసార్లు ఈ ధాన్యాలు రెండు-మూడు సంవత్సరాలకు పైగా గిడ్డంగిలో ఉంటాయి. కాబట్టి దాని నాణ్యత, బరువు రెండూ ప్రభావితమవుతాయి.
పంటను మార్కెట్ నుండి కొనుగోలు చేసిన తర్వాత దానిని రాష్ట్రాలకు రవాణా చేయడానికి కనీసం మూడుసార్లు లోడ్ చేసి అన్‌లోడ్ చేయాల్సి ఉంటుందని అలోక్ సిన్హా చెప్పారు.
ఒక ప్రైవేటు వ్యాపారి పంటను కొనుగోలు చేస్తే ఖచ్చితంగా అతను ఈ ఖర్చులను భరించలేడని విజయ్ సర్దానా అన్నారు.
కనీస మద్దతు ధర వ్యవసాయరంగానికి మంచిదికాదని, దాన్ని తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని సర్దానా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
కనీస మద్దతు ధరతో ప్రభుత్వానికి 15లక్షల కోట్ల నష్టం
రైతులు ఇలాగే ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే అప్పుడు ప్రభుత్వం ఎంఎస్‌పికంటే తక్కువగా పంటలను కొనడం నేరం అని చట్టంలో చేరుస్తుంది. అప్పుడు ఏ ప్రైవేట్ వ్యాపారి రైతుల దగ్గర కొనడానికి ముందుకు రాడు. అలాంటి పరిస్థితుల్లో పంటను కొనాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. చట్టం ఉంది కాబట్టి మళ్లీ ప్రభుత్వమే 23 పంటలను ఎంఎస్‌పితో కొనాల్సి వస్తుంది
23 పంటల ఎంఎస్‌పి ఖర్చు, ఎఫ్‌సీఐ పంపిణీ వ్యవస్థ న చేసిన ఖర్చులు కలిపితే మొత్తంగా ప్రభుత్వంపై రూ.15లక్షల కోట్ల భారం అవుతుంది.
అదొక్కటే కాదు మొత్తం 23 పంటలకు ఎంఎస్‌పి చట్టబద్ధమైన హక్కుగా మారుతుందన్న గ్యారంటీ లేదు. అప్పుడు మిగిలిన పంటలను ఉత్పత్తి చేసే రైతులు ప్రభుత్వాన్ని నిలదీయలేరు. కోర్టుకు వెళ్లలేరు.
ఎంఎస్‌పిపై చట్టం చేయడం ద్వారా దేశం 60%మంది రైతులకు మాత్రమే ప్రయోజనం లభిస్తుందని వ్యవసాయ నిపుణుడు దేవిందర్ శర్మ కూడా అభిప్రాయపడ్డారు. 40% మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి వంటి ఇతర రకాల ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి.
2015-16లో నిర్వహించిన వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 86%మంది రైతులు చిన్న కమతాలు కలిగి ఉన్నారు.
ఎంఎస్‌పి చట్టం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో సమస్యలు
ఎంఎస్‌పి చట్టం వ్యవసాయ రంగ అభివృద్ధికి శాశ్వత పరిష్కారం కాదని దక్షిణాసియా పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మాజీ డైరక్టర్ ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్ జోషి బీబీసీతో అన్నారు.
“టెక్నాలజీని వాడుకోవాలి, నాణ్యమైన పంటను తీయాలి, పంట ఖర్చులను తగ్గించి, కొత్త వంగడాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. అప్పుడే అవి మార్కెట్లో మంచి ధరను పొందుతాయి. వ్యవసాయరంగం అభివృద్ధి బాటన నడుస్తుంది’’ అన్నారు ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్ జోషి.
రైతులకు మద్దతు ధర కల్పించిన తర్వాత ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థతో చర్చలు జరపలేదు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఒక దేశం వ్యవసాయ జీడీపీలో 10 శాతం వరకు రైతులకు సబ్సిడీ ఇవ్వగలదు. అంతర్జాతీయ మార్కెట్లో కనీస మద్దతు ధరను కూడా సబ్సిడీగానే పరిగణిస్తారు.
10శాతానికి పైగా సబ్సిడీ ఇచ్చే దేశం అంతర్జాతీయ మార్కెట్లో ధరలను ప్రభావితం చేస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటుంది. భారత్‌పై కెనడా ఇలాంటి ఆరోపణలే చేసింది. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి మార్గాల్లో సహాయం చేయడాన్ని సబ్సిడీగా లెక్కించరు.
మరి పరిష్కారం ఏంటి?
కనీస మద్దతు ధర పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చును నేరుగా రైతులకు ఇవ్వడం మంచిదంటారు విజయ్ సర్దానా. ఎందుకంటే మద్దతు ధర పూర్తిగా రైతులకు చేరడం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ప్రతిచోటా పీడీఎస్‌లో గోధుమలు, బియ్యం అందించాల్సిన అవసరం లేదు. ఏ ప్రాంతంలో ఏ పంట ఎక్కువ పండుతుందో అక్కడ అదే పంటను సరఫరా చేయడం మంచిదన్నారు సర్దానా.
కేరళలోని రైతులు వారి ఖర్చుకు పూర్తి విలువను పొందుతున్నారని, ధరలు తగ్గినప్పుడు జోక్యం చేసుకునే హక్కు జిల్లా యంత్రాంగానికి ఉందని, ఈ విధానం చాలా మంచిదని సర్దానా అన్నారు.
1960లలో కనీస మద్దతు ధర తీసుకువచ్చినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు బాగా మారిపోయాయని, ఆహార కొరత లేదు కాబట్టి ఆ విధానం పాటించాల్సిన అవసరం ఇప్పుడు లేదంటున్నారు విజయ్ సర్దానా.
ఇవి కూడా చదవండి:
- ఎవరెస్టు శిఖరం ఎత్తు సుమారు ఒక మీటరు పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- రైతుల నిరసనలు: మోదీ మంచి వక్త... కానీ, రైతులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?
- చైనా ఆహార సంక్షోభం ఎదుర్కొంటోందా? వృథా చేయవద్దని జిన్‌పింగ్ ఎందుకంటున్నారు?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- Cyclone Nivar: తుపాన్లకు పేరెందుకు పెడతారు, ఎవరు నిర్ణయిస్తారు?
- లవ్ జిహాద్: హిందు-ముస్లింల మధ్య పెళ్లిళ్లు అడ్డుకొనేందుకు చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు?
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








