రైతుల డిమాండ్: 'పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి' - Newsreel

రైతుల ఆందోళన

ఫొటో సోర్స్, Ani

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చెయ్యాలని క్రాంతికారీ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ డిమాండ్ చేశారు.

మోదీ ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా డిసెంబర్ 5న దేశమంతటా దిష్టిబొమ్మలను దగ్ధం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.

"భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు టికైట్‌తో కూడా మేము మాట్లాడాం. ఈ పోరాటంలో వారు మాకు మద్దతిస్తామని చెప్పారు. మేమంతా చేయి చేయి కలిపి పోరాడుతాం" అని దర్శన్ పాల్ తెలిపారు.

"మహరాష్ట్రలోని ప్రతీ జిల్లాలోనూ రేపటినుంచే దిష్టిబొమ్మలను దహనం చెయ్యడం ప్రారంభిస్తాం. డిసెంబర్ 5వ తేదీన గుజరాత్‌లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను తగులబెడతాం. కేంద్ర ప్రభుత్వానికి ఇది చివరి అవకాశం. వ్యవసాయ బిల్లులను రద్దు చెయ్యాల్సిందే లేదా ఈ పోరాటాన్ని మరింత జటిలం చేస్తాం. ప్రభుత్వాన్ని కూలగొడతాం" అని లోక్ సంఘర్ష్ మోర్చా నాయకులు ప్రతిభా షిండే తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

"మేము రోడ్ల మీద కావాలని కూర్చోలేదు. ప్రభుత్వం మమ్మల్ని వెళ్లనివ్వకుండా అడ్డుకుంది. మా దారికి అడ్డంగా పోలీసు బలగాలను మోహరించారు. మేము దీన్ని తాత్కాలిక జైలుగా భావిస్తున్నాం. మేము తప్పక విడుదల అవుతాం. దిల్లీకి వెళతాం" అని భారతీయ కిసాన్ యూనియన్ (లోక్ శక్తి) అధ్యక్షుడు స్వరాజ్ సింగ్ పేర్కొన్నారు.

ఈ కొత్త చట్టాలు రైతులకు లాభం చేకూరుస్తాయని, సుదీర్ఘకాలం తరువాత ఈ చట్టాలను ఆమోదించామని, అయినా సరే రైతులకు దీనివలన సమస్యలు వస్తాయనుకుంటే చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.

line

మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్‌ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్‌

ఫొటో సోర్స్, Getty Images

మద్రాస్, కలకత్తా హైకోర్టులలో న్యాయమూర్తిగా పనిచేసిన మాజీ జడ్జి సీఎస్ కర్ణన్‌ను బుధవారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు.

లీగల్ న్యూస్ వెబ్సైట్ 'లైవ్ లా' ప్రకారం.. మాజీ న్యాయాధిపతి కర్ణన్, ఇతర జడ్జ్‌లను దూషిస్తూ, వారి భార్యలను బలాత్కారం చేస్తానంటూ బెదిరిస్తున్న వీడియోలు బయటపడడంతో పోలీసులు కర్ణన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అక్టోబర్ 27వ తేదీన ఒక మద్రాస్ హైకోర్టు న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసుల సైబర్ సెల్ విభాగం సీఎస్ కర్ణన్‌పై కేసు నమోదు చేసింది.

గతంలో కూడా మాజీ జడ్జి కర్ణన్‌పై వివాదాలు నెలకొన్నాయి. 2017లో ఆయన కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌తో సహా ఏడుగురు సుప్రీం కోర్టు జడ్జ్‌లకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలివ్వడం వివాదాస్పదమైంది.

line

కోడిని కోయకుండా లాబ్‌లో తయారుచేసిన కోడి మాంసం.. షాపుల్లో అమ్మకానికి సింగపూర్ సిద్ధం

ఈట్ జస్ట్ చికెన్ నగ్గెట్స్

ఫొటో సోర్స్, EAT JUST

ఫొటో క్యాప్షన్, ఈట్ జస్ట్ చికెన్ నగ్గెట్స్

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జంతువులను వధించకుండా తయారుచేసిన "శుభ్రమైన మాంసం" ఉత్పత్తికి సింగపూర్ ఆమోదం తెలిపింది.

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ 'ఈట్ జస్ట్' కంపెనీ.. కోడిని కోసే అవసరం లేకుండా, ప్రయోగశాలలో తయారైన మాంసాన్ని విక్రయించేందుకు ముందుకు వస్తోంది.

ఈ మాంసాన్ని మొదటగా చికెన్ నగ్గెట్స్ తయారీలో మాత్రమే ఉపయోగిస్తారు. అయితే, ఇవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న విషయాన్ని ఆ కంపెనీ స్పష్టం చెయ్యలేదు.

ఆరోగ్యం, జంతు సంక్షేమం, పర్యావరణం దృష్ట్యా సాధారణ మాంసానికి ప్రత్యామ్నాయాలను అన్వేషించేందుకు డిమాండ్ పెరిగింది.

''వచ్చే దశాబ్దం కల్లా ప్రత్యామ్నాయ మాంసాలకు పది లక్షల కోట్ల రూపాయల మార్కెట్ ఉండొచ్చు'' అని బార్క్లేస్ అంచనా వేసింది. అంటే ప్రపంచ మాంసం పరిశ్రమలో 10 శాతం కన్నా ఎక్కువే మార్కెట్ ఉండొచ్చు.

'బియాండ్ మీట్', 'ఇంపాజిబుల్ ఫుడ్స్‌' లాంటి మొక్కల ఆధారంగా తయారైన మాంసానికి ఇప్పటికే సూపర్‌ మార్కెట్లలోనూ, రెస్టారెంట్లలోనూ డిమాండ్ పెరిగింది.

అయితే, ఈట్ జస్ట్ ఉత్పత్తి చేస్తున్న మాంసం మొక్కల నుంచి కాకుండా.. జంతువుల కండరాల కణాలతో ప్రయోగశాలల్లో తయారవుతుంది.

''ఇది ప్రపంచ ఆహార పరిశ్రమ సాధించిన పురోగతి''గా ఈట్ జస్ట్ పేర్కొంది. మిగతా దేశాలు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

నైతికంగా మెరుగైన మాంసాన్ని వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో గత దశాబ్ద కాలంగా అనేక స్టార్టప్‌లు సాధారణ మాంసానికి ప్రత్యామ్నాయాలను కనుగొనే దిశలో కృషి చేస్తున్నాయి.

ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన 'ఫ్యూచర్ మీట్ టెక్నాలజీస్', బిల్ గేట్స్ పెట్టుబడి పెట్టిన 'మెంఫిస్ మీట్స్' కూడా ప్రయోగశాలలో తయారైన మాంసాన్ని ఉత్పత్తి చేసే దిశలో ప్రయోగాలు చేస్తున్నాయి.

అయితే, దీనివల్ల పర్యావరణానికి మేలు జరగొచ్చని అనేకమంది భావిస్తున్నప్పటికీ, కొన్ని పరిస్థితుల్లో వాతావరణ మార్పులకు హాని కలగొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అంతే కాకుండా, మొక్కల నుంచి మాంసం ఉత్పత్తి చెయ్యడం కన్నా ప్రయోగశాలలో మాంసం ఉత్పత్తి చెయ్యడం ఖర్చుతో కూడిన వ్యవహారం. వినియోగదారులు కూడా దీన్ని ఎంతవరకూ ఆమోదిస్తారన్నది సందేహమే.

అయితే, ఈట్ జస్ట్ తయారుచేస్తున్న మాంసం ఒక నిర్దిష్ట స్థాయిలో పూర్తిగా సురక్షితమని, నగ్గెట్స్ రూపంలో సింగపూర్‌లో మార్కెట్లోకి తీసుకురావడానికి అనువైనదని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ నిపుణుల బృందం ధృవీకరించింది.

line

ట్రంప్ హింసను ప్రేరేపిస్తున్నారు: జార్జియా ఎన్నికల అధికారి హెచ్చరిక

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి ఆధారాలు లేకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ డోనల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలతో హింస చెలరేగితే దానికి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని జార్జియా ఎన్నికల ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు.

''పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. వీటిని అడ్డుకోవాలి'' అని గాబ్రియేల్ స్టెర్లింగ్ హెచ్చరించారు.

కొంతమంది ఎన్నికల అధికారులను చంపేస్తామని బెదిరిస్తున్నారని, మరికొందరిని భయపెడుతున్నారని ఆయన చెప్పారు.

ట్రంప్ అభ్యర్థనపై జార్జియాలో రెండోసారి రీకౌంటింగ్ జరుపుతున్నారు. కీలకమైన ఈ రాష్ట్రంలో స్వల్ప ఆధిక్యంతో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిచినట్లు ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''సక్రమమైన ఓట్లన్నీ లెక్కించాలి. అక్రమమైన ఓట్లన్నీ పక్కన పెట్టేయాలి. అదే మేం కోరుకునేది. ఎవరూ బెదిరింపులకు పాల్పడకూడదు. ఒకవేళ అలాంటివి జరిగుంటే మేం ఖండిస్తున్నాం''అని ట్రంప్ ప్రచార బృందం అధికార ప్రతినిధి టిమ్ ముర్టా తెలిపారు.

line

చైనాలో 160 ఏళ్ల కిందట చోరీకి గురైన గుర్రం తల మళ్లీ వచ్చింది.. ఎలాగంటే...

గుర్రం బొమ్మ తల

ఫొటో సోర్స్, CHINA NEWS SERVICE

ఇప్పటికి 160 ఏళ్ల కిందట చైనాలోని ఒక రాజభవనం నుంచి అపహరణకు గురైన వివిధ జంతువుల ఇత్తడి తలల బొమ్మల్లో ఒకటైన గుర్రం తల బొమ్మ మళ్లీ బీజింగ్‌లోని తన స్వస్థలానికి చేరుకుంది. ఇలా ఇక్కడికి తిరిగి వచ్చిన బొమ్మల్లో ఇదే మొదటిది.

చైనాలో ఇత్తడితో చేసిన 12 రాశులు జంతువుల తలల పురాతన బొమ్మలు ఓల్డ్ సమ్మర్‌ ప్యాలెస్‌ నుంచి అపహరణకు గురయ్యాయి. ఇందులో సగం బొమ్మలు వివిధ మార్గాలలో తిరిగి చైనాకు చేరుకున్నాయి. మరో ఐదు బొమ్మల ఆచూకీ ఇంకా దొరకలేదు.

దొరికిన బొమ్మలను వివిధ మ్యూజియాలలో భద్రపరచగా, గుర్రం బొమ్మను మాత్రం 160 ఏళ్ల కిందట అది అపహరణకు గురైన ఓల్డ్‌ సమ్మర్‌ ప్యాలెస్‌లోనే భద్రపరచలాని ప్రభుత్వం నిర్ణయించింది.

ఓల్డ్ సమ్మర్ ప్యాలెస్ నుంచి అపహరణకు గురైన బొమ్మను అక్కడే మ్యూజియం కట్టి అందులో ప్రతిష్టించారు.

ఫొటో సోర్స్, China News Service

ఫొటో క్యాప్షన్, ఓల్డ్ సమ్మర్ ప్యాలెస్ నుంచి అపహరణకు గురైన బొమ్మను అక్కడే మ్యూజియం కట్టి అందులో ప్రతిష్టించారు.

2007లో హాంకాంగ్‌కు చెందిన ఓ బడా వ్యాపారి దీనిని సుమారు 89 లక్షల అమెరికన్ డాలర్లకు (సుమారు రూ. 6 కోట్లు) వేలంలో కొన్నారు. 2019లో ఆ బొమ్మను చైనా ప్రభుత్వానికి గిఫ్ట్‌గా ఇచ్చారు.

బీజింగ్‌లోని ఓల్డ్‌ సమ్మర్‌ ప్యాలెస్‌లో ఓ గుడి కట్టి అక్కడే చిన్న మ్యూజియం నిర్మించి అందులో ఈ గుర్రం తల బొమ్మను ప్రతిష్టించారు. ఇప్పుడిది సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

గత కొన్నేళ్లుగా కొందరు ఔత్సాహికులు ఈ బొమ్మలు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని వేలంలో కొని చైనా ప్రభుత్వానికి అప్పజెప్పారు. మిగిలిన ఐదు బొమ్మల కోసం కూడా అన్వేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)