నరేంద్ర మోదీ: ‘కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు కొత్త హక్కులు, అవకాశాలు వచ్చాయి’

ఫొటో సోర్స్, MANKIBAAT @TWITTER
కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు కొత్త హక్కులు లభించాయని, వాటితో రైతుల సమస్యలను తొలగిపోవడం మొదలైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఆయన ఆదివారం తన 'మన్ కీ బాత్'లో కొత్త వ్యవసాయ చట్టాల గురించి, కొందరు రైతుల గురించి మాట్లాడారు.
వ్యవసాయ చట్టాలకు చేసిన సవరణల వల్ల రైతులకు ఉన్న ఎన్నో అడ్డంకులు తొలగుతాయని కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు.
మహారాష్ట్ర ధులే జిల్లాలో జితేంద్ర భోయిజీ అనే రైతు తన మొక్కజొన్న పంటకు తగిన ధర పొందడానికి వ్యవసాయ చట్టాలను ఎలా ఉపయోగించుకున్నారో ప్రధాని ఒక ఉదాహరణగా చెప్పారు.
జితేంద్ర తన మొత్తం పంటను అమ్మడానికి సుమారు రూ. 3.32 లక్షల ధర నిర్ణయించుకున్నారు, 25 వేలు అడ్వాన్స్ కూడా తీసుకున్న ఆయన, మిగతా డబ్బులు కూడా 15 రోజుల్లో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.
"ఆ తర్వాత పరిస్థితులు మారాయి. జితేంద్రకు మిగతా డబ్బు అందలేదు. నాలుగు నెలలు వేచిచూసిన ఆయన తర్వాత చట్టాల సాయం తీసుకున్నారు. ఈ చట్టం కింద పంట కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతులు పేమెంట్ ఇవ్వకపోతే, సదరు రైతు ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఎస్డీఎం ఒక నెల లోపు రైతు ఫిర్యాదును పరిష్కరించాలని ఈ చట్టంలో నిబంధనలు కూడా ఉన్నాయి" అని ప్రధాని తెలిపారు.
ఇలాంటి చట్టాలతో సమస్య కచ్చితంగా పరిష్కారం అవుతుందని.. కొన్ని రోజుల్లోనే రైతుకు రావాల్సిన బకాయిలు చెల్లించారని మోదీ చెప్పారు.
‘‘గడ్డి బేళ్ల వ్యాపారంతో రెండేళ్లలో కోటిన్నర సంపాదించారు’’
ప్రధాని రైతులకు గడ్డి వల్ల ఎదురవుతున్న సమస్యను కూడా ప్రస్తావించారు. రైతులు తెలివితో దీనికి పరిష్కారం వెతకవచ్చన్నారు.
హరియాణాలోని వీరేంద్ర యాదవ్ గురించి చెప్పిన మోదీ, ఆయన ఒకప్పుడు ఆస్ట్రేలియాలో ఉండేవారని, రెండేళ్ల క్రితం కైథల్‌లో స్థిరపడ్డారని అన్నారు.
"ఆయనకు పొలంలో పంట కోత తర్వాత గడ్డితో సమస్య వచ్చి పడింది. దాంతో, ఆయన ఆ గడ్డిని బేళ్లలా మార్చేందుకు స్ట్రా బేలర్ మెషిన్ కొనుగోలు చేశారు. దానికి ఆయనకు వ్యవసాయ శాఖ నుంచి ఆర్థికసాయం లభించింది. ఆ గడ్డి బేళ్లను వీరేంద్ర యాదవ్ అగ్రో ఎనర్జీ ప్లాంట్, పేపర్ మిల్లులకు అమ్మేవార"ని చెప్పారు.
వీరేంద్ర తన గడ్డి బేళ్ల వ్యాపారంతో రెండేళ్లలో కోటిన్నరకు పైగానే సంపాదించారు. రూ. 50 లక్షల లాభాలు కూడా అందుకున్నారని మోదీ తెలిపారు.
గడ్డి సమస్యను పరిష్కరించి, డబ్బు సంపాదించడానికి మోదీ దీనిని ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పారు.
యువకులు గ్రామాలకు వెళ్లి ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి, ఇటీవలి వ్యవసాయ సంస్కరణల గురించి రైతులకు వివరించాలని కోరారు. వాటి గురించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
కరోనాతో పోరాటం కొనసాగించాలని ప్రధానమంత్రి సూచించారు. కానీ కోవిడ్ మహమ్మారిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, అది ప్రాణాంతకం కావచ్చని హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Hindustan Times
'ఇక్కడి నుంచి కదిలేది లేదు, రహదారి మీదే ఆందోళన కొనసాగిస్తాం'- రైతులు
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. దిల్లీ- హరియాణా సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకోవడంతో వందల మంది రైతులు అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఛలో దిల్లీ పేరుతో ఈ నెల 26న దిల్లీకి బయలుదేరిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. రైతులపై వాటర్ క్యానన్లను, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పెద్దఎత్తున బ్యారికేడ్లు, బండరాళ్లను రోడ్లపై అడ్డంగా పెట్టి రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా, రైతులు వెనకడుగు వేయలేదు, పోలీసులు అడ్డుకున్న చోటే ఆందోళన కొనసాగిస్తున్నారు. అక్కడే వంటా వార్పు చేపట్టారు. రోజూ సమావేశమవుతూ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తున్నారు.

ఫొటో సోర్స్, REUTERS/Danish Siddiqui
ఇప్పటి వరకు ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాల రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొనగా, వారికి సంఘీభావం తెలిపేందుకు ఉత్తర్ ప్రదేశ్ రైతులు కూడా శనివారం మధ్యాహ్నం దిల్లీ శివారు ప్రాంతాలకు చేరుకున్నారు.
అయితే, రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం చెప్పారు. డిసెంబర్ ౩న వారితో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దిల్లీలోని బురారీలో ఉన్న మైదానానికి వెళ్లాలని రైతు సంఘాలను కోరారు.
కానీ, అమిత్ షా ప్రతిపాదనకు చాలా రైతు సంఘాలు అంగీకరించడంలేదు.
హోంమంత్రి ప్రతిపాదనపై భారతీయ కిసాన్ యూనియన్ (పంజాబ్) అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ముందస్తు చర్చలకోసం అమిత్ షా షరతులు పెడుతున్నారు. ఇది సబబు కాదు. ఆయన షరతులు ఏమీ పెట్టకుండా, మనస్ఫూర్తిగా చర్చలకు అంగీకరిస్తే బావుండేది. మేము దీని గురించి మీటింగ్‌లో చర్చించి, ఒక నిర్ణయానికొస్తాం" అని జగ్జీత్ సింగ్, వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రైతు సంఘం నాయకుడిపై కేసు నమోదు
రైతుల నిరసనల్లో పాల్గొంటున్న కారణంగా హరియాణా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడూనీపై కేసు నమోదు చేశారు.
ఆందోళనలు చేపడుతున్న రైతులపై రెండు కేసులు నమోదుచేసినట్లు కర్నాల్ డిప్యూటీ సూపరింటెండెంట్ రాజీవ్ కుమార్ వెల్లడించినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
"గుర్నామ్ సింగ్‌తో సహా పలువురు రైతు నాయకులపై కేసు నమోదు అయ్యింది. కొంతమంది అజ్ఞాత రైతులపై కూడా కేసు నమోదయ్యింది" అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అమూల్ పాల కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యం ఇస్తోంది?
- న్యూరోఫైనాన్స్ అంటే ఏమిటి? కొందరు కష్టపడకుండా సులభంగా డబ్బు ఎలా సంపాదిస్తారు?
- ‘‘నెలలో పదిహేను రోజులు దేవతలా వుంటుంది... మిగిలిన సగం మాత్రం రాక్షసిలా చేస్తుంది...’’: పీఎంఎస్ అంటే ఏమిటి?
- 19 ఏళ్ల కిందట సర్జరీతో విడిపోయిన ఈ అవిభక్త కవలలు... ఇప్పుడు ఎలా ఉన్నారంటే...
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- BBC SPECIAL: ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పిల్లలకు తల్లి ఒడి లాంటి బడి 'శాంతివన్'
- రైతు దినోత్సవం: కౌలు రైతుల కడగండ్లు తీరేదెన్నడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








