సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.. తప్పించుకోవడం ఎలా - డిజిహబ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
“మేం పంపించిన క్విజ్ ప్రశ్నలకి అన్నీ కరెక్ట్ సమాధానాలు ఇచ్చి మీరు మొదటి బహుమతి గెల్చుకున్నారు, సార్!” అని అవతలి వైపు నుంచి ఉత్సాహంగా ఓ అమ్మాయి అభినందించింది.
కాల్ రిసీవ్ చేసుకున్న సుబ్బారావు గారు అయోమయంగా చూస్తూ స్పీకర్ ఆన్ చేశారు. వారి భార్య కూడా దగ్గరకొచ్చి ఆలకించారు.
“మీకేదైనా బాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ ఉందా సార్?” అందా అమ్మాయి. ఆయన వెంటనే “ఉంది కదా, ఎస్.బి.ఐ!” అని జవాబిచ్చారు.
“అయితే, మీ కార్డ్ నెంబర్ ఇస్తే నేను వెంటనే మీ గిఫ్ట్ మనీ, అక్షరాలా యాభై వేల రూపాయలు - ఆక్టివేట్ చేస్తాను.” అని అంది. భార్యాభర్తలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. కాల్ అలానే ఉంచి క్రెడిట్ కార్డ్ పట్టుకొచ్చి దాని మీద నెంబర్ చదివి వినిపించారు.
“ఇప్పుడు కార్డ్ వెనుక సి.వి.వి నెంబర్ అని ఒకటుంటుంది, సార్! మీ కార్డ్ మీద మూడంకెల నెంబర్ ఉందని మా రికార్డ్స్ చెబుతున్నాయి.” అనగానే ఇద్దరికీ ఆశ్చర్యం. (ఏ కార్డ్ మీదనైనా సివివి మూడే అంకెలు ఉంటుంది.)
“నెంబర్ ఎంతో చెప్పండి, సార్!” అందా అమ్మాయి.

ఫొటో సోర్స్, PA Media
“మా అబ్బాయి ఇలా సివివి, ఓటిపి నెంబర్లు ఎవరికీ చెప్పొద్దు అన్నాడమ్మా! స్కాములూ అవీ చేస్తున్నారట.” నసిగారు సుబ్బారావు గారు.
“అయ్యో! మీకలా అనుమానం వస్తుందనే మా రికార్డ్స్ లో ఉన్న ఇన్ఫో మీతో షేర్ చేశాను.” భార్యాభర్తలిద్దరికీ అయోమయం.
“ఒకసారి మా వాడికి కాల్ చేసి చెప్తానమ్మా?”
“అయ్యో సార్! నేను ప్రొసీజర్ ఆక్టివేట్ చేసేశాను. ఇంకో నలభై నాలుగు సెకన్లలో మీరు నాకు నెంబర్ చెప్పకపోతే ఈ గిఫ్ట్ మనీ పోయినట్టే!”
“అది కాదమ్మా, మళ్ళీ తేడాలొస్తే కష్టం. కాస్త టైమ్ ఇవ్వు.”
“మీరు వయసులో పెద్దవారని, మీకు ఇబ్బంది కలగకూడదని, ఫాస్ట్ ప్రొసీజర్‌లో గిఫ్ట్ ఆక్టివేట్ చేశా సార్ మీకోసం. ఇంత చేశాక మీరు వెనక్కి తగ్గుతున్నారు. మీరు చెప్పకపోతే మీ క్రెడిట్ కార్డ్ మీద పెనాల్టీ కూడా పడుతుంది!”
“తోచనివ్వదేంటి పిల్ల! పోతే పోయింది పాడు డబ్బు, పెట్టేయండి ఫోన్! లేనిపోనిది ఏమన్నా జరిగితే… వచ్చే డబ్బేమో కానీ, ఉన్న సొమ్ము పోతుంది!” అన్నారు మిసెస్ సుబ్బారావు విసుగ్గా.

ఫొటో సోర్స్, Getty Images
ఏం చేయాలో తోచక అవతల అమ్మాయి మాట్లాడుతుండగానే కాల్ కట్ చేశారు. రోజంతా మంచి అవకాశం పోయినందుకు చింతించారు.
సాయంకాలం వాళ్ళ కోడలు ఫోన్ చేసినప్పుడు విషయం చెప్తే తెలిసింది, వాళ్ళు స్కామ్లో ఇరుక్కుబోయి ఆఖరి నిముషాన తప్పించుకున్నారని, ఆ సివివి నెంబరేదో ఇస్తే అకౌంట్ నుంచి డబ్బులు మాయమైపోయేవని.
ఇది కల్పిత ఘటనే కానీ ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్ ఎరలకి అధికంగా చిక్కేది వయసులో పెద్దవారు.
రోజు రోజుకీ మెరుపు వేగంతో మారిపోతున్న టెక్ పరిణామాలని పట్టుకోలేక, అలా అని దాన్ని పూర్తిగా దూరం పెట్టలేక, ఒంటరితనం, అనారోగ్య సమస్యలు పీడిస్తున్న వేళ ఆన్‌లైన్‌లో కాస్త మంచిగా మాట్లాడి, సాయం చేస్తున్నట్టు నటిస్తే చాలు, వాళ్ళ మోసాల వలలో పడిపోతున్నారు.
అవగాహనా లోపం వల్లే ఇవి జరుగుతున్నాయి. అందుకని మనం కాస్త శ్రద్ధ తీసుకుని పెద్దవారికి డిజిటల్ లిటరసీ (టెక్నాలజీని ఎలా వాడుకోవాలి? ఆన్‌లైన్‌లో ఎలా వ్యవహరించాలి? అనేవి) నేర్పిస్తే ఈ నేరాలు చాలా వరకూ తగ్గుతాయి.

ఫొటో సోర్స్, Thinkstock
పెద్దవాళ్ళ డిజిటల్ లిటరసీకి మార్గాలు
1. సమయం కేటాయించి నేర్పించడం: రోజుకో, వారానికో ఇంత సమయమంటూ వెచ్చించి పక్కన కూర్చునో, వీడియో కాల్స్‌లోనో వారికి డిజిటల్ పరికరాలు, టెక్నాలజీ గురించి వివరించడం మంచి అలవాటు.
వారికి ఇవన్నీ కొత్త కాబట్టి, అర్థం చేసుకోడానికి, తగిన విధంగా వాడడానికి సమయం పడుతుంది. అయినా ఓపిగ్గా వివరించడం మంచిది. ముఖ్యంగా కొత్త ఫోన్, గాడ్జెట్ కొని ఇచ్చినప్పుడో, లేదా కొత్త ఆప్ గురించో సమయం తీసుకుని చెప్పాలి.
అలానే, పెద్దవాళ్లని కూడా రోజుకి కొంత సమయం కొత్త విషయాలు నేర్చుకోడానికి కేటాయించేలా ప్రోత్సహించాలి. ఉదాహరణకి, గూగుల్ పే, పేటీఎం లాంటి ఆప్స్ వాడదల్చుకున్నపుడు.. ఒక వారం పాటు, ఆప్ తెరిచి, డబ్బులు వేయాలనుకున్నవారి నెంబర్ వెతికి, వారికి డబ్బులు వేసేలా ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయించాలి.
ఇంట్లో వాళ్ల అకౌంట్లకే పది, పది రూపాయలు డబ్బులు వేసేలా ప్రాక్టీస్ చేస్తే, బయట అవసరం పడినప్పుడు తికమకపడిపోయి అపరిచితులకి పాస్వర్డ్, ఓటీపీ చెప్పకుండా తమంతట తామే చేసుకోగలుగుతారు.
2. నేర్పించడానికి రిసోర్సెస్: టెక్నాలజీకి సంబంధించిన వ్యాసాలు, యూట్యూబ్ వీడియోలు ఏవి మంచివో ముందు వెతికి పట్టుకుని అవి పంపిస్తూ ఉండడం వల్ల వాటిని చూసి నేర్చుకుంటారు.
3. సైబర్ సెక్యూరిటీ ప్రప్రథమం: టెక్నాలజీ ఎంత గొప్పదో, ఎంత బాగా పనిచేస్తుందోనని మురిసిపోతుంటాం గానీ, దానిలోనూ అన్నే లోటుపాట్లు ఉంటాయని మనం గుర్తించం. పెద్దవాళ్ళకి వివరించేవాటిలో సైబర్ సెక్యూరిటీ అంశాలను ఎప్పుడూ ప్రపథమంగా ఉంచాలి.
ఎలా వాడాలితో పాటుగా ఎలా వాడకూడదు, ఎలా వాడితే ఇబ్బందులో పడతాం అన్నది విడమర్చి చెప్పాలి. ఫోన్లు, ఆప్స్‌లో వీలైనంతగా సెక్యూరిటీ ఫీచర్స్ సెట్ చేసి ఇస్తే మంచిది. ఒకవేళ ఏదన్నా అటూ ఇటూ అయినా, వెంటనే చేయాల్సిన పనులేమిటి లాంటివి వీలైతే ఒక చోట రాసి పెట్టచ్చు కూడా.

ఫొటో సోర్స్, Getty Images
4. మీడియా లిటరసీ: వయసు మళ్ళినవారు ఆన్‌లైన్ స్కాములకి, ఫేక్ న్యూస్లకి త్వరగా స్పందిస్తారని ఒక స్టడీ వెల్లడించింది. ఇంటర్నెట్లో ఉన్నదంతా మంచిదే, నమ్మదగినదే అని అనుకునేవాళ్ళల్లో 60 ఏళ్ళు పైబడినవారు ఎక్కువగా ఉంటున్నారు.
అమెరికాలో వృద్ధులు misinformation బారిన పడకుండా ఉండేలా శిక్షణనిచ్చే వెబ్‌సైట్లు ఉన్నాయి. మన దగ్గర కూడా అలాంటివి చాలా అవసరం. స్కాములని, ఫేక్ న్యూస్‌లని ఎలా కనిపెట్టచ్చో చిన్నచిన్న చిట్కాలు నేర్పించచ్చు.
మొబైల్ SMS స్కాముల గురించి ఇంతకుముందో వ్యాసం వచ్చింది డిజిహబ్‌లో. అలానే ఏదన్నా లింక్ క్లిక్ చేసే ముందు, ఎవరికన్నా స్పందించే ముందు ఈ కింది ప్రశ్నలకి సమాధానాలు చూసుకోమని చెప్పాలి:
- నేను ఆవేశంలోనూ, కోపంలోనూ ఈ విషయానికి స్పందిస్తున్నానా?
- ఉచితంగా ఇస్తున్నామని ఎర వేస్తున్నారా? అవతలివారు బెదరకొట్టే, కంగారుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుందా?
- నేను వెంటనే స్పందించేకన్నా తెలిసినవాళ్ళని అడిగి స్పందిస్తే మేలా? ఎవరినీ సంప్రదించకుండా స్పందించేంత అవసరముందా దీనికి?
- ఒకవేళ ఇక్కడ నేను పొరపాటున సమాచారాన్ని అందించేస్తే వాటిల్లే ప్రమాదమెంత? (ఉదా: ఫేస్‌బుక్ లాగిన్ ఇచ్చేస్తే అకౌంట్ హాక్ అయ్యి ఇబ్బందుల పాలవుతాం. అదే బాంక్ ఓటిపి ఇస్తే డబ్బు కూడా పోతుంది.)

ఫొటో సోర్స్, Getty Images
ఫేక్ న్యూస్ విషయంలో ఈ ప్రశ్నలు తప్పనిసరి:
- ఈ వార్తలో అతిశయం పాలు ఎక్కువగా ఉందా? ఉదా: “రేపు అర్థరాత్రి నుంచి బ్యాంకులన్నీ మూసేస్తున్నారు, వీలైనంత త్వరగా మీ డబ్బు విత్‌డ్రా చేసుకోకపోతే ఆపై డబ్బు ఇవ్వరు. అన్ని బ్యాంకులకీ ఇది వర్తిస్తుంది.” అన్న వార్తలో ఎన్ని అతిశయాలు ఉన్నాయో గమనించండి.
- ఇదే వార్తను ఇంకెవరెవరు అందిస్తున్నారు? నమ్మదగిన వార్తాపత్రికలూ ఈ వార్తను ప్రసారం చేస్తున్నాయా? ఉదా: ఉన్నపళాన బ్యాంకుల్లో డబ్బు ఉండదంటే అది దేశమంతటా పెద్ద వార్త అవ్వాలి. అన్ని చానల్స్ దాని గురించే మాట్లాడాలి. అలా జరుగుతోందా?
- ఈ వార్తను గూగుల్ చేస్తే ప్రముఖ పత్రికల నుంచి సెర్చ్ రిజల్ట్స్ వస్తున్నాయా?
- ఈ వార్త నిజమే అనుకున్నా నేను వెంటనే వెళ్ళి డబ్బులన్నీ తీయడం సబబా? కుటుంబ సభ్యులనో, నమ్మదగినవారితోనో నా భయాందోళనలు పంచుకోవడం మేలా?
స్కామర్లు ఎక్కువగా మనలో అత్యాశలకి, భయాందోళనలకి ఎర వేస్తారు. అందుకని ఈ ప్రశ్నలు వేసుకోవడం వల్ల మనం కాస్త నిమ్మదించి నిర్ణయాలు తీసుకోగలం.

ఫొటో సోర్స్, Getty Images
5. టెక్నికల్ పదజాలానికి దూరంగా ఉండండి: పెద్దవారికి టెక్ అంశాలు వివరించేటప్పుడు ఎక్కువగా టెక్ భాష మాట్లాడితే వారికి అర్థం కాకపోవచ్చు, విసుగు పుట్టచ్చు. USB, night mode light, swipe లాంటి పదాలు మన జీవితంలో భాగమైపోయాయి, ప్రతినిత్యం వాడుతుంటాం కాబట్టి. పెద్దవారికి ఇవన్నీ కొత్తని గుర్తించుకోవాలి. అందుకనే అలాంటి భారీ పదాలు వాడకుండా సరళమైన భాషలో వివరిస్తే వారికి ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశాలుంటాయి. పైగా పదాలని గుర్తుపెట్టుకోవడంలో శ్రమపడకుండా అసలు విషయాన్ని గుర్తుపెట్టుకోవడంపై వారి ధ్యాస నిలుస్తుంది.
6. ఓపిగ్గా వ్యవహరించండి: అనునిత్యం వాటితోనే సహవాసం అయినా వెల్లువలా పచ్చి పడుతున్న టెక్నాలజీ పరికరాలకి, యాప్‌లకి మనమే ఉబ్బితబ్బిబైపోతున్నాం. అలాంటిది పెద్దవారికి, తమ జీవితంలో అత్యధిక శాతం ఇలాంటివేవీ వాడే అవసరం పడనివారికి ఇవన్నీ చకచకా వచ్చేయాలనుకోవడం అమాయకత్వమే. వారికి కొద్దికొద్దిగా అలవాటు చేస్తే మంచిది. చెప్పిందే ఒకటి రెండు సార్లు చెప్పి వాళ్ళు గుర్తుంచుకునేలా చేయగలగాలి.
అలానే, రోజూవారి మాటల్లో, వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, వాటి గురించి ఏమనుకుంటున్నారు అని కనుక్కుంటూ ఉంటే వాళ్ళు ఫేక్ న్యూస్, స్కాముల బారిన పడే అవకాశముందా అన్నది అంచనా వేయచ్చు. ఉందనిపిస్తే వారిని వారించచ్చు. లేదనిపిస్తే, అలర్ట్‌గా ఉంటున్నందుకు అభినందించచ్చు.
వార్తల్లో వచ్చే సైబర్ క్రైముల గురించి అప్పుడప్పుడూ చెప్తూ ఉంటే వారికీ అవగాహన పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండడం అలవడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
7. ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోవడం: మనం పిల్లలు, టీనేజర్ల విషయంలో ఫోన్‌లకి, గేమింగ్‌లకి ఎడిక్ట్ అవుతారని కంగారు పడుతూ ఉంటాం. ఆ విషయంలో పెద్దవాళ్ళనీ గమనిస్తూ ఉండాలి.
టెక్నాలజీ రూపొందించే విధానంలోనే మళ్ళీ మళ్ళీ వాడేలాంటి టెక్నిక్కులు పెడుతుంటారు కాబట్టి ఎవరన్నా వాటికి ఎడిక్ట్ కావచ్చు. పెద్దవాళ్ళకి కాస్త ఖాళీ సమయం ఎక్కువ ఉండడం, ఒంటరిగా ఉండడం లాంటి అనేకకారణాల వల్ల ఎక్కువసేపు ఆన్‌లైన్‌లో గడపచ్చు. ఇది ఆరోగ్యకరం కాదు.
గంటలు గంటలు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వీడియోలు, రీల్స్ చూడడం వల్ల చెవులకి, కళ్ళకి సమస్యలు రావచ్చు. ఎక్కువ సేపు ఫోన్ చూసేటప్పుడు పోస్చర్ సరిగ్గా లేకపోతే కండరాలు, కీళ్ళు పట్టేసి కొత్త సమస్యలు వస్తాయి. వీటిని గురించి కూడా పెద్దవాళ్ళని అలెర్ట్ చేస్తూ ఉండాలి.
మన చేతులు పట్టుకుని అక్షరాలు దిద్దించిన పెద్దవారికి ఇప్పుడు మనం చేతులు పట్టుకుని టెక్నాలజీలో ఓనమాలు దిద్దించడం మన తరానికి లభించిన అరుదైన అవకాశం. కోవిడ్ లాంటి విషమ పరిస్థితుల్లో కూడా దూరాలని అధిగమించి ఒకరికి ఒకరం ఉన్నామన్న భరోసా ఇవ్వడానికి పనికొచ్చింది టెక్నాలజీయే!
అయితే అది రెండు వైపులా ఉన్న పదునైన కత్తి కాబట్టి మన పెద్దవారు దాని దుష్ప్రభావాల బారిన పడకుండా, మోసపోకుండా, అవమానాలకి ఆందోళనలకి గురి కాకుండా వారి టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది.
(పాత్రలు కల్పితం)
ఇవి కూడా చదవండి:
- ‘మా అక్కపై అత్యాచారం చేసి, మొహానికి నల్ల సిరా రాసి, మెడలో చెప్పులదండతో ఊరేగించారు’
- విజయనగర సామ్రాజ్యం: దక్షిణ భారతంలో చిట్టచివరి హిందూ సామ్రాజ్యం ఎలా పతనమైంది? తళ్లికోట యుద్ధంలో నలుగురు సుల్తానులు ఏకమై ఎలా ఓడించారు
- బుల్లీబాయి, సుల్లీ డీల్స్: సోషల్ మీడియాలో ముస్లిం మహిళల వేలం గురించి మనం అర్ధం చేసుకోవాల్సిందేంటి?
- సోషల్ మీడియా నుంచి మీ పర్సనల్ డేటాను వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా...
- పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న డిమాండే మహాత్మా గాంధీ హత్యకు కారణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












