తెలంగాణ: కోవిడ్19 లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేయకుండానే కరోనా కిట్లు, మందులు పంచడం కరెక్టేనా?

కరోనా కిట్లు పంచుతున్న హరీష్ రావు

ఫొటో సోర్స్, FB/Harish Rao Thanneeru

    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో రోజూ అధికారికంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య సుమారు 3000 నుంచి 4,500 వేల మధ్యలో ఉంటోంది. అదే సమయంలో ఫీవర్ సర్వే పేరిట ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్న కరోనా కిట్ల సంఖ్య లక్షల్లో ఉంటోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి నిర్వహించిన ఫీవర్ సర్వే మొదటి రౌండ్‌లో తెలంగాణలో 3,45,951 మందికి కోవిడ్-19 లాంటి లక్షణాలు ఉన్నట్వు గుర్తించామని వైద్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వీరికి 77,33,427 ఐసొలేషన్ కిట్స్ అందించినట్లు వివరించారు.

అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు వేలల్లో నమోదవుతుంటే... లక్షల్లో కిట్లు పంపిణీ చేయడమేంటి? ఇంకా ముఖ్యంగా అసలు కరోనా పరీక్షలు నిర్వహించకుండానే కోవిడ్ కిట్లు పంపిణీ చేసి, ఆ మందులు వాడమని సాక్షాత్తూ ప్రభుత్వమే ప్రజలకు సూచించడం ఏంటి?

కేసుల లెక్కకు, పంపిణీ చేసే కరోనా కిట్ల సంఖ్యలో తేడా ఎక్కడ వస్తోంది. తెలుసుకుందాం.తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అందించిన వివరాల ప్రకారం జనవరి 21 నుంచి 23 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 12,412 కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం జనవరి 23 నాటికి చికిత్స పొందుతున్నవారు లేదా, ఇళ్లలో ఐసొలేషన్లో ఉన్న వారి సంఖ్య 32,094.

ఒక్క జనవరి 24న 3,980 మందికి కోవిడ్ సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంటే, వీరితోపాటూ మొత్తం కోవిడ్ బారిన పడి, చికిత్స పొందుతూ లేదా ఐసోలేషన్లో ఉంటున్న వారి సంఖ్య సుమారు 36 వేలకు అటూ ఇటూగా ఉంటుంది.

ఫీవర్ సర్వేలో పంచే మందులు

ఫొటో సోర్స్, FB/Harish Rao Thanneeru

అదే సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జనవరి 21 నుంచి 23 వరకు నిర్వహిచిన ఇంటింటి సర్వేలో ఏకంగా 1,78,912 మందికి లక్షణాలు ఉన్నట్టు తేలింది. అందుకే 1,78,179 కోవిడ్ కిట్లను పంపిణీ చేశామని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.అంటే, లక్షమందికి పైగా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు ? వీరందరికీ కోవిడ్ ఉన్నట్టా లేనట్టా ?తెలంగాణలో రోజువారీ విడుదల చేస్తున్న కోవిడ్ కేసుల గణాంకాల గురించి సరిగ్గా ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వం ఒకవైపు, సుమారు 36వేల మందికి మాత్రమే కోవిడ్ సోకిందని చెబుతూ, మరోవైపు 1,78,179 మందికి కోవిడ్ కిట్లను పంపిణీ చెయ్యడమేంటి?

అంటే, ప్రభుత్వం కావాలనే రోజువారీ కోవిడ్ కేసులను తగ్గించి చూపిస్తోందా.. పోనీ ఆ లెక్కలే వాస్తవమైతే... లక్షణాలు ఉన్నాయనే పేరుతో కోవిడ్ కిట్లను రేషన్ షాపులో బియ్యం పంచినట్టు పంచేస్తోందా..?

సెకెండ్ వేవ్ సమయంలో కూడా ఇలా సర్వే చేయడం వల్ల చాలా వరకు ఉపయోగపడిందని ప్రస్తుత తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, చలికాలం మామిడి, జనవరిలో దిగుబడి

ప్రభుత్వం కోవిడ్ కిట్లను పంపిణీ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. అయితే, లక్షణాలున్న వారికి పరీక్షలు చేయించి కోవిడ్ ఉందని తేలిన తర్వాత ఈ కిట్లను పంపిణీ చేసుంటే, బాగుండేదని వైద్య నిపుణుల భావిస్తున్నారు."ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ ఆలోచన బాగానే ఉన్నా, వారు చేపడుతున్న చర్యల పై సందేహాలు ఉన్నాయి . ఇలా రేషన్ సరుకుల్లా మందులు పంచడం తప్పు . ఒక వేళ ప్రభుత్వం ప్రజలకు మంచి చెయ్యాలనుకుంటే, ఆ మందులను ఒక మెడికల్ ప్రాక్టీషనర్‌కి ఇచ్చి, ఆయన పర్యవేక్షణలో రోగి వివరాలు రిజిస్టర్ చేసుకొని, పరీక్షలు నిర్వహించి, వారికి కరోనా పాజిటివ్ వస్తే, తర్వాత మందులు కోవిడ్ కిట్లు ఇస్తే సరిపోయేది. అంతే కానీ పరీక్షలేవీ చేయకుండా, ఎలాంటి రిపోర్ట్ లేకుండా కోవిడ్ మందులు వాడాలని ఎలా సూచిస్తారు?" అని ప్రముఖ శ్వాస కోశవ్యాధి నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ బీబీసీతో అన్నారు.

కిట్లలో పంపిణీ చేస్తున్న మందులు ఏవి, కోవిడ్ లేని వారు ఈ మందులు వేసుకుంటే ఆరోగ్య సమస్యలేమైనా తలెత్తుతాయా?ఇప్పుడు ప్రభుత్వం పంపిణీ చేసే కిట్ల విషయానికి వద్దాం. కోవిడ్ చికిత్సలో భాగంగా ఈ కిట్లలో అజిత్రోమైసిన్(యాంటీబయోటిక్), పారాసెటిమోల్, లెవోసిత్రీజిన్ (జలుబుకి ), రానీటిడిన్ (ఆమ్లత్వం/ఎసిడిటీ ) విటమిన్ 'సి', మల్టీవిటమిన్ , రోగ నిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ 'డి' కి సంబంధించిన మందులతో పాటు, వాటిని ఎలా వాడాలి, కోవిడ్ జాగ్రత్తలతో కూడిన వివరాలు కూడా ఉంటాయి.

హరీష్ రావు

ఫొటో సోర్స్, FB/Harish Rao Thanneeru

ఇక్కడ సమస్య ఏంటంటే... జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, దగ్గు అనేవి కోవిడ్ లక్షణాలు మాత్రమే కాదు, కొన్ని సార్లు సాధారణ ఫ్లూ వచ్చినా ఇవే లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఈ లక్షణాలు 3-4 రోజుల, కన్నా ఎక్కువ రోజులు కొనసాగినప్పుడు వెంటనే కోవిడ్ పరీక్ష చేసుకుని, పరీక్ష ఫలితాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి.

కానీ ప్రభుత్వం తమ సర్వేలో భాగంగా ఇలాంటి లక్షణాలు ఉన్న వారందరికీ ఎలాంటి కోవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించకుండానే కోవిడ్ కిట్లను ఇచ్చి ఆ మందుల్ని వాడమని చెబుతోంది. దీనిపై కూడా వైద్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి."ప్రిస్క్రిప్షన్ లేనిదే మందులు ఇవ్వకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెబుతోంది, ఇవే లక్షణాలు మలేరియా, లేదా డెంగీ ఉన్న వారిలో కూడా కనిపిస్తుంటాయి. అలాంటి వారికి కరోనా మందులు ఇస్తే ఎలా? వారికి ఈ మందులు వల్ల ఎక్కువ నష్టం జరగకపోయినా, చికిత్స సరైన సమయానికి అందదు కదా ?" అంటారు డాక్టర్ నాగేశ్వర్ రావు.ఈ విషయాన్ని పక్కనబెడితే... కరోనా కిట్లను ఇంటింటికీ ఇవ్వడంతోపాటూ, జనం వాటిని పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటున్నారు కూడా. ఇలా పొరుగు వారి సలహాలతో కోవిడ్ మందులు వాడడం వల్ల, వ్యాధి తగ్గడం మాట అటుంచి.. మరింత ముదిరే పరిస్థితి కూడా ఎదురవుతుంది.

పేరు చెప్పడానికి ఇష్టబడని హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళా న్యాయవాది ఇలాంటి అనుభవాన్నే బీబీసీతో పంచుకున్నారు.

"మా అబ్బాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్. గత మంగళవారం తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయితే మాకు తెలిసిన వాళ్లు, ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్ మేం వాడలేదంటూ మా అబ్బాయికి ఇవ్వమని ఇచ్చారు. దాంతో వేరే ఆలోచన లేకుండా వాటిని వాడాం. వారం తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. మళ్లీ పరీక్ష చేయించుకుంటే వ్యాధి తీవ్రత పెరిగినట్టు తేలింది. ఇప్పుడు మేం ఈ రిపోర్టులు నమ్మాలో, లేదా ప్రభుత్వం ఇచ్చిన కిట్లను నమ్మాలో అర్థం కావడం లేదు" అన్నారు.

వీడియో క్యాప్షన్, కోవిడ్ శరీరంలోని కొవ్వులో తిష్ఠ వేస్తుందా? స్థూలకాయులకు ఇది ప్రాణాంతకమా

కరోనా జాగ్రత్తల పట్ల తెలంగాణ ప్రభుత్వం అలసత్వం చూపిస్తోంది అంటూ 2020లోనే కొంత మంది న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 25న తాజాగా ప్రభుత్వం చేసిన కరోనా కిట్ల పంపణీ విషయంలో, అలాగే రోజూ వారీ వెల్లడిస్తున్న కేసుల సంఖ్య విషయంలో కూడా పిటిషనర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

అంతేకాదు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కిట్లలో పిల్లలకు అవసరమైన మందులు లేవని, అలాగే బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వడం లేదని ఆరోపించారు.

కోవిడ్ కట్టడి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వివరించే ప్రయత్నం చేసినా, కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే కోవిడ్ కిట్ల పంపణీ విషయంలో వస్తున్న ఆరోపణలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు.

"చాలా మందికి కరోనా లక్షణాలు కనిపించడం లేదు, మరి కొంత మందికి లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. అందుకే ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం" అనారు.

అయితే, సర్వే నిర్వహించడంలో తప్పు లేదంటున్న వైద్య నిపుణులు, రోగులకు కోవిడ్ పరీక్షల అవసరాన్ని సర్వేలో అర్థమయ్యేలా వివరించి, పరీక్ష అనంతరం పాజిటివ్ అని తేలిన తర్వాత కిట్ల ద్వారా అందించే చికిత్స పొందేలా చూడాలని కోరుతున్నారు

ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ పాజిటివిటీ రేటు 3.16 శాతానికి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకూ 77 లక్షల ఇండ్లలో జ్వరం సర్వే చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)