మహాత్మ గాంధీ: అమెరికాలో పరమహంస యోగానంద ఆశ్రమంలో గాంధీ అస్థికలు.. వారసులకు దీనిపై అభ్యంతరం ఎందుకు

ఫొటో సోర్స్, Getty Images
భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు మహాత్మా గాంధీ మరణించి ఈ రోజుతో 74ఏళ్లు పూర్తయ్యాయి. భారత్‌కు వెలుపల గాంధీ అస్థికలు భద్రపరిచినట్లు చెబుతున్న కాలిఫోర్నియాలోని లేక్ షైన్ విశేషాలపై సవిత పటేల్ అందిస్తున్న కథనమిదీ.
హాలీవుడ్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో గాంధీ ప్రపంచ శాంతి స్మారకం ఉంది. దీన్ని 1950లో పరమహంస యోగానంద నిర్మించారు. పచ్చని తోటలు, వాటర్‌ఫాల్స్ నడుమ సాగర తీరంలో ఇది ఉంటుంది. ఇక్కడ చైనా నుంచి తెప్పించిన రాతి శవపేటికలో ఇత్తడి, వెండి లోహాలతో తయారుచేసిన ఓ చిన్న పెట్టిలో గాంధీ అస్థికలు ఉన్నట్లు చెబుతున్నారు.
1948లో గాంధీ హత్య అనంతరం ఆయన అస్థికలను 20కిపైగా భాగాలుగా వేరుచేసి భారత్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో స్మారకాల్లో ఉంచారు. కొన్ని అస్థికలను విదేశాలకు కూడా పంపించారు.
‘‘బాపూ అస్థికలకు చాలా డిమాండ్ ఉండేది’’అని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ వివరించారు. 1947లో బ్రిటన్ నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందిన కొన్ని నెలలకే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు.
లేక్ షైన్‌లో గాంధీ అస్థికలను భద్రపరిచారని 20ఏళ్ల క్రితం తుషార్‌కు తెలిసింది. ఈ విషయంపై లేక్ షైన్ యాజమాన్యాన్ని తుషార్ సంప్రదించారు. కానీ ఆయనకు ఎలాంటి స్పందనా రాలేదు.
‘‘తాను మరణించిన తర్వాత తన అస్థికలను ఎక్కడా భద్రపరచొద్దని బాపూ ముందే చెప్పారు. అలా ఆయన అస్థికలను భద్రపరచడం ఆయన అభీష్టానికి వ్యతిరేకం’’అని తుషార్ వివరించారు.

ఫొటో సోర్స్, Lake Shrine
అయితే, తమ గురువు ఏర్పాటుచేసిన ఈ స్మారకం నుంచి గాంధీ అస్థికలను వెనక్కి ఇచ్చే ఆలోచనలేదని లేక్‌షైన్ స్వామీజీల్లో ఒకరైన రీతానంద చెప్పారు. ‘‘ఆ అస్థికలను యోగానందకు బహుమతిగా ఇచ్చారు. వాటిని వెనక్కి ఇస్తే, ప్రజలు బాధపడతారు’’అని ఆయన అన్నారు.
గాంధీ అస్థికలను వెనక్కి ఇవ్వాలని అభ్యర్థనలు వచ్చిన విషయం తమకు తెలుసని ఆయన వివరించారు.
తను ఎప్పుడూ గాంధీ అస్థికలుండే డబ్బాను చూడలేదని ఆయన చెప్పారు. అయితే, అస్థికల పెట్టిని శవపేటికలో యోగానంద పెడుతున్న వీడియోను తాను చూశానని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడకు ఎలా వచ్చాయి?
యోగానందకు మిత్రుడైన పుణెకు చెందిన జర్నలిస్టు వీఎం నవ్లే నుంచి ఆ అస్థికలు ఇక్కడికి వచ్చినట్లు చెబుతున్నారు.
పరమహంస యోగానంద ఉత్తర్ ప్రదేశ్‌లో ముకుంద లాల్ ఘోష్‌గా జన్మించారు. ఆ తర్వాత ఆయన అమెరికా వచ్చేసి లేక్ షైన్‌ను స్థాపించారు.
తన ఆత్మకథలో 1935లో ఆయన మహారాష్ట్రలోని వార్ధాలో గాంధీ ఆశ్రమాన్ని సందర్శించినట్లు రాసి ఉంది. ఆయన గాంధీజీని కలిశారని, అక్కడి వారితో యోగా చేయించారని కూడా పేర్కొన్నారు.
గాంధీజీని సంపూర్ణ శారీరక, మానసక, ఆధ్యాత్మిక ఆరోగ్యంతో జీవించే సాధువుగా పరమహంస అభివర్ణించారు. వేలకొద్దీ సామాజిక, రాజకీయ, న్యాయ పోరాటాల వీరుడిగా కూడా పేర్కొన్నారు. ఆయన మరణానంతరం స్మారకం కూడా నిర్మిస్తానని వివరించారు.
అయితే, నవ్లే చేతికి గాంధీ అస్థికలు ఎలా వచ్చాయో మాత్రం ఈ పుస్తకంలో పేర్కొనలేదు. అయితే, నవ్లే.. యోగానందకు రాసిన కొన్ని లేఖలు ఈ పుస్తకంలో ప్రచురించారు. ‘‘గాంధీజీ అస్థికలను దాదాపు అన్ని ప్రధాన నదుల్లోనూ కలపాలని నిర్ణయించారు. నేను మీకు పంపుతున్న అస్థికలు మినహా ఏ విదేశాలకూ ఆయన అస్థికలను ఇవ్వలేదు’’అని వాటిలో పేర్కొన్నారు.
అయితే, అందులో ఉన్నవి గాంధీజీ అస్థికలు అయ్యుండకపోవచ్చు కూడా అని తుషార్ గాంధీ వివరించారు. ఆయన ‘లెట్స్ కిల్ గాంధీ’ అనే పుస్తకాన్ని రచించారు. గాంధీ హత్య ఎలా జరిగింది? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? లాంటి అంశాలను ఈ పుస్తకంలో వివరించారు.

ఫొటో సోర్స్, Lake Shrine
‘‘బాపూ అస్థికలలో కొన్ని దక్షిణాఫ్రికా పంపించారు. అయితే, 1948లో వాటిని నీటిలో కలిపారు. అవి అక్కడకు ఎలా వెళ్లాయో మాకు స్పష్టంగా తెలియలేదు’’అని తుషార్ వివరించారు.
‘‘పరమహంస యోగానందకు పంపిన అస్థికలను ఎవరు సేకరించారు? ఆయనకు ఎవరు పంపించారు? అనేవి కూడా తెలియదు. గాంధీ అస్థికల పంపిణీకి అప్పట్లో ఓ క్యాబినెట్ సభ్యుల కమిటీ ఏర్పాటైంది. దీనిలో ప్రముఖ గాంధేయవాదులు కూడా ఉన్నారు’’అని ఆయన చెప్పారు.
గాంధీజీ అంత్యక్రియల అనంతరం చాలా అస్థికలను అలహాబాద్‌లోని త్రివేణి సంగమంలో కలిపారు. చాలామంది తమ కుటుంబ సభ్యుల అస్థికలను కలిపేందుకు ఇక్కడికి వస్తుంటారు.
హిందూ భక్తుడైన గాంధీజీ కూడా తన అస్థికలను ఇలానే కలపాలని కోరుకున్నారు.
అయితే, అస్థికలన్నీ ఇలా గంగలో కలపలేదు. కొన్నింటిని భాగాలుగా చేసి దేశంలోని భిన్న ప్రాంతాలకు పంపించారు.
2019లో మధ్యప్రదేశ్‌లోని గాంధీ స్మారకంలో కొన్ని గాంధీజీ అస్థికలను దొంగిలించారు కూడా. దక్షిణాఫ్రికాలోనూ గాంధీ అస్థికలున్నట్లు దశాబ్దం క్రితం కూడా వార్తలు వచ్చాయి. ‘‘మా కుటుంబ సభ్యులు డర్బన్ తీరంలో ఆ అస్థికలను సముద్రంలో కలిపారు’’అని తుషార్ చెప్పారు.
ఓ మ్యూజియం నుంచి తమకు అస్థికలు అందాయని, గాంధీజీకి సన్నిహితుడైన ఓ వ్యాపారి తండ్రి ఆ మ్యూజియంకు అస్థికలు పంపారని తుషార్ వివరించారు. ఆ అస్థికలను ముంబయి తీరంలో 2008లో సముద్రంలో కలిపేశామని చెప్పారు.
మరోవైపు ఒడిశాలోని ఓ బ్యాంకు లాకర్‌లోనూ గాంధీ అస్థికలు ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, వీటిని 1997లో త్రివేణి సంగమంలో కలిపేశామని ఆయన చెప్పారు.
చివరగా పుణెలోని ఆగా ఖాన్ ప్యాలెస్‌లోనూ గాంధీ అస్థికలున్నట్లు వార్తలు వచ్చాయి. అవి ఓ పాలరాతి నిర్మాణంలో ఉన్నాయి. ఈ స్మారకాన్ని గాంధీ సతీమణి కస్తూర్బా కోసం ఏర్పాటుచేశారు.
గాంధీజీని అమితంగా ఇష్టపడేవారు ఆ అస్థికలను అలానే ఉంచాలని కోరినట్లు తుషార్ చెప్పారు. ‘‘1997లో త్రివేణి సంగమంలో గాంధీజీ అస్థికలను కలిపేటప్పుడు.. ఆ అస్థికలను ఉంచిన ఇత్తడి పాత్ర జాగ్రత్తగా ఉంచాలని భావించాం. అందుకే దాన్ని దిల్లీలోని గాంధీజీ మ్యూజియానికి అప్పగించాం’’అని ఆయన చెప్పారు.
గాంధీజీని ఇష్టపడే, ఆరాదించే హక్కు అందరికీ ఉంటుంది. అయితే, ఆయన అభీష్టం మేరకు లేక్ షైన్‌లోని అస్థికలను కూడా వీలైనంత త్వరగా నదిలో కలపాలని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘మా అక్కపై అత్యాచారం చేసి, మొహానికి నల్ల సిరా రాసి, మెడలో చెప్పులదండతో ఊరేగించారు’
- టీఆర్ఎస్ రూ. 301 కోట్లు, టీడీపీ రూ. 188 కోట్లు, వైసీపీ రూ. 143 కోట్లు
- పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే నాలుగు తప్పులు
- వీధుల్లో అడుక్కుంటున్న డాక్టర్లు.. ఆకలేస్తోంది, ఆహారం లేదు.. 8 నెలలుగా జీతాలు అందట్లేదు..
- లాక్డౌన్లో యూట్యూబ్ చానల్‌తో లక్షల ఫాలోవర్లు .. 22 దేశాలు చుట్టేసిన యువకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












