Economic Survey 2022: కోవిడ్ సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థను బాధించలేదు - ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా ఆర్థిక సర్వే అంచనా

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 9.2 శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే 2022 నివేదిక అంచనా వేసింది.
2022 ఏప్రిల్ నుంచి మొదలై 2023 మార్చితో ముగిసే రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నుంచి 8.5 శాతం వరకూ ఉండవచ్చునని ఈ సర్వే చెప్తోంది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు సోమవారం నాడు.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను లోక్‌సభకు సమర్పించారు.
ఆమె మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మహమ్మారి ముందు ఉన్న స్థాయికి కోలుకున్నాయని ఆర్థిక సర్వే చెప్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలో కల్లోలం సృష్టించిన కోవిడ్ 'సెకండ్ వేవ్'.. ఆర్థిక రంగం మీద ఊహించినంత తీవ్ర ప్రభావం చూపలేదని దాదాపు అన్ని సూచీలూ చెప్తున్నాయి.
కోవిడ్ సెకండ్ వేవ్.. 2020-21 లాక్‌డౌన్లతో పోలిస్తే ఆరోగ్యపరంగా పెను ప్రభావం చూపినప్పటికీ.. ఆర్థిక రంగం మీద చూపిన ప్రభావం చాలా తక్కువగానే ఉందని సూచిస్తున్నాయి.
''వ్యాక్సినేషన్ కార్యక్రమం జనాభాలో అత్యధికులను చేరటంతో.. ఆర్థిక రంగం తిరిగి మునుపటి స్థాయికి పుంజుకుంటోంది. సరఫరా వైపు చేపట్టిన సంస్కరణల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు రాబోతున్నట్లు కనిపిస్తోంది. 2022-23లో భారత ఆర్థికవ్యవస్థ 8.0 శాతం నుంచి 8.5 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించే మంచి పరిస్థితిలో ఉంది'' అని ఆ సర్వే పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
వ్యవసాయం, అనుబంధ రంగాల మీద మహమ్మారి ప్రభావం అతి తక్కువగా ఉందని, 2020-21లో 3.6 శాతం వృద్ధి సాధించిన ఈ రంగం 2021-22లో 3.9 శాతం వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
ఈ సర్వే ప్రకారం.. మహమ్మారి వల్ల అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నది సేవా రంగం. ముఖ్యంగా మనుషుల కలయిక ఉండే సేవా రంగాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి.
గత ఏడాది 8.4 శాతం వృద్ధి చెందిన సేవా రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం వృద్ధి చెందుతుంది.
ప్రభుత్వ వ్యయం గణనీయంగా తోడ్పాటునివ్వటంతో.. 2021-22లో మొత్తం వినియోగం 7 శాతం పెరిగినట్లు ఆర్థిక సర్వే అంచనా వేసింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6 శాతం నుంచి 6.5 శాతం వృద్ధి చెందుతుందని అంతకుముందు అంచనా వేయగా.. 2020 చివర్లో కరోనా మహమ్మారి పంజా విసరటంతో లాక్‌డౌన్ల కారణంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఫలితంగా ఆ ఏడాది వృద్ధి చెందటం కాదుకదా.. 7.3 శాతం మేర కుచించుకుపోయింది.
ఇవి కూడా చదవండి:
- RRB: ఇరుకు గదులు.. ఖాళీ జేబులు.. కళ్లల్లో కొలువుల కలలు
- పద్మశ్రీ గ్రహీత మొగిలయ్యకు కేసీఆర్ రూ. కోటి నజరానా
- బడ్జెట్ వివరాలు ఎలా లీక్ అయ్యాయి? 1950 నాటి ఈ ఘటన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు
- 'దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు' అంటూ శ్వేత తివారి వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆంధ్రప్రదేశ్: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు తమ అభ్యంతరాలను ఎవరికి చెప్పాలి? ఎలా చెప్పాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









