విజయవాడ: లైంగిక వేధింపులతో బాలిక ఆత్మహత్య, ఎవరీ వినోద్ జైన్? టీడీపీ, వైసీపీ వాదనలేంటి? సూసైడ్ లెటర్‌లో ఏముంది?

అమ్మాయి ఆత్మహత్య

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

విజయవాడ నగరంలోని భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అపార్ట్‌మెంట్‌లో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.

జనవరి 29వ తేదీ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆమె ఐదో అంతస్తు నుంచి కిందకి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

ఆ మరునాడు ఆమె రాసిన సూసైడ్ నోట్ లభించింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అదే అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో ఉండే వినోద్ జైన్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆ లేఖలో మృతురాలు పేర్కొంది.

దాంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. 55 ఏళ్ల వినోద్ జైన్‌పై కేసు నమోదయ్యింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బాలిక సూసైడ్ లెటర్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, బాలిక రాసిన లెటర్

ఆ లేఖలో ఏముంది?

సాధారణ వ్యాపారిగా ప్రస్థానం ప్రారంభించి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎదిగిన వినోద్ జైన్ బాధితురాలిని లైంగికంగా వేధించినట్టు లేఖలో ఉంది.

''అమ్మా, ఈ విషయం మీకు చెప్పాలనుకున్నా గానీ భయపడ్డాను. ఇంకేమీ చేయలేకపోయాను. దీనంతటికీ వినోద్ జైన్ కారణం. రెండు నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను పదే పదే టచ్ చేస్తున్నాడు. బుగ్గలు గిల్లుతూ, ఛాతీ, తొడల మీద చేతులు వేసేవాడు.

నువ్వు అందంగా ఉన్నావంటూ వేధించేవాడు. జీన్స్ వేసుకుంటే చాలా బాగుంటావంటూ పదే పదే వెంటపడేవాడు. ఫ్లాట్‌లోకి రావడానికి ఉన్న మెట్లు, లిఫ్ట్ దగ్గర ఆపి నన్ను వేధించాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. మిమ్మల్ని వదలాలని లేకపోయినా నాకు తప్పడం లేదు. తమ్ముడు, మీరూ అంతా జాగ్రత్త'' అంటూ ఆ లేఖలో మృతురాలు పేర్కొంది.

వివాదాలకు దూరంగా ఉండే కుటుంబంలో బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మూడు పేజీల లేఖలో కొంత భాగం బయటకు వచ్చింది. దాని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి ఇంటిని సీజ్ చేశారు.

అతని కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు దశలో ఉందని సిటీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా బీబీసీకి తెలిపారు.

ఈ కేసుని ఎఫ్‌ఐ‌ఆర్ నెంబర్ 50/2022గా విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం పీఎస్‌లో నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 306,354తో పాటుగా పోక్సో చట్టం- 2012 ప్రకారం సెక్షన్ 8 కింద కేసు నమోదయ్యింది.

అమ్మాయి సిల్లావుట్

ఫొటో సోర్స్, Getty Images

ఏం జరిగిందో తెలియదు

''మా మనుమరాలు చాలాకాలంగా బాధపడుతున్నట్టు మాకు తెలియలేదు. రెండు నెలలుగా వేధింపులు ఎక్కువయినట్టు ఇప్పుడు మాకు తెలిసింది. బిల్డింగ్‌పై నుంచి దూకి చనిపోక ముందు రోజంతా చాలా సైలెంట్‌గా ఉంది. ఎవరితోనూ సరిగా మాట్లాడలేదు.

ఎవరో దూకి చనిపోయారని తెలిసి వెళ్లి చూస్తే అక్కడ మా పిల్ల ఉంది. ఆ తర్వాత తన రూమ్‌లోకి వెళ్లి చూస్తే నోట్ బుక్‌లో ఇదంతా రాసి ఉంది. వెంటనే దానిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం.

నిందితుడిని కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నాం. కానీ మా ఇంటి వెలుగు మాత్రం మాకు దూరమయిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న మనుమరాలు ఇలా కావడం జీర్ణించుకోలేకపోతున్నాం'' అంటూ మృతురాలి తాత మాంచాల రావు బీబీసీతో అన్నారు.

30వ తేదీన మృతదేహానికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన సమయంలో అపార్ట్‌మెంట్ వద్ద స్థానికులు ఆందోళన నిర్వహించారు. నిందితుడిని ఉరితీయాలంటూ నినాదాలు చేశారు.

బాబుతో నిందితుడు వినోద్ జైన్ (పాత ఫొటో)

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, చంద్రబాబుతో నిందితుడు వినోద్ జైన్ (పాత ఫొటో)

పరామర్శలు, రాజకీయ వివాదాలు

మృతురాలి కుటుంబాన్ని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పరామర్శించారు.

తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఐద్వా నేతలు, జనసేనకు చెందిన పలువురు నాయకులు కూడా బాధితులను పరామర్శించారు.

ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నామని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత బీబీసీకి తెలిపారు.

''ఈ ఘటన కలచివేసింది. 14 సంవత్సరాల అమ్మాయి భవనం మీద నుంచి దూకేసి చనిపోవడం అత్యంత బాధాకరం. వినోద్ జైన్ ఎంత దారుణమైన లైంగిక వేధింపులకు గురిచేసాడో, మానసిక వేదనకు గురిచేసాడో ఈ బలవన్మరణం చాటుతోంది.

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాలిక ఆత్మహత్యకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. ఆధారాలు లభించాయి. ఇలాంటి ఘటన అమానుషం. మనుమరాలి వయసున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని ఉపేక్షించేది లేదు'' అని అన్నారు.

అమిత్ షాతో నిందితుడు వినోద్ జైన్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, అమిత్ షాతో నిందితుడు వినోద్ జైన్ (పాత ఫొటో)

అదే సమయంలో వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి.

గత ఏడాది మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 37వ డిజవిన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ జైన్ వ్యవహారం రాజకీయ రంగు పలుముకుంది.

టీడీపీ నాయకుడు వినోద్ జైన్‌ని కఠినంగా శిక్షించాలని రాష్ట్రంలోని పలు చోట్ల అధికార పార్టీ నేతలు ఆందోళనకు పూనుకున్నారు.

నారీ దీక్ష

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, టీడీపీ చేసిన నారీ సంకల్ప దీక్ష

నారీ సంకల్ప దీక్షకు దిగిన టీడీపీ

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందంటూ సోమవారం తెలుగు మహిళా నేతలు నారీ సంకల్ప దీక్షకు పూనుకున్నారు.

ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకుడే లైంగిక వేధింపులకు పాల్పడి, ఓ విద్యార్థిని ఆత్మహత్యకు కారకుడయ్యారనే కేసులో నిందితుడిగా మారడం టీడీపీని ఇరకాటంలోకి నెట్టింది.

అయితే వైసీపీ తీరుని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ పరిణామాలను నీచ రాజకీయం అంటూ పేర్కొన్నారు.

''ఈ ఘటన గురించి తెలియగానే వినోద్ జైన్‌ని పార్టీ నుంచి బహిష్కరించాం. కానీ వైసీపీ మాత్రం నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. అమ్మాయిలకు రక్షణ కల్పించడం చేతగాని ప్రభుత్వం ఇది. ఆడబిడ్డలకు న్యాయం చేయలేక అడ్డగోలుగా రాజకీయాలకు పాల్పడుతున్నారు.

చిత్తశుధ్ది ఉంటే కేసు సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం చేయాలి. నిందితులను శిక్షించాలి. కానీ వైసీపీ నాయకులు అది మానేసి టీడీపీ మీద బురజల్లే పని చేస్తున్నారు. నిందితుడు మునిసిపల్ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. అంతకుముందు నుంచి మంత్రి వెల్లంపల్లికి అనుచరుడిగా ఉన్నారు'' అంటూ ప్రత్యారోపణలు చేశారు.

వినోద్ జైన్ (పాత ఫొటో)

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, వినోద్ జైన్ (పాత ఫొటో)

ఎవరీ నిందితుడు?

విజయవాడ నగర రాజకీయాల్లో వినోద్ జైన్‌కి గుర్తింపు ఉంది. ఆయన సుదీర్ఘకాలం పాటు బీజేపీలో కీలక పదవులు నిర్వహించారు.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ నాయకుడిగా ఉన్న సమయంలో విజయవాడ పాతబస్తీలో వినోద్ జైన్ కీలక అనుచరుడిగా వ్యవహరించారు.

2016లో వెల్లంపల్లి బీజేపీని వీడి వైసీపీలో చేరగా 2019 వరకూ బీజేపీలోనే ఉన్న వినోద్ జైన్ మునిసిపల్ ఎన్నికలకు కొంతకాలం ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఎంపీ కేశినేని నాని అనుచరుడిగా ముద్రపడ్డారు. మునిసిపల్ ఎన్నికల్లో 37వ డివిజన్ నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు.

ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వెంట వినోద్ జైన్ ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. పోటీగా మంత్రి వెల్లంపల్లి వెంట వినోద్ జైన్ సన్నిహితంగా మెలిగినప్పటి పాత ఫోటోలు టీడీపీ కార్యకర్తలు ప్రచారంలో పెడుతున్నారు.

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వినోద్ జైన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గుర్తింపు పొందారు. పలు అపార్ట్‌మెంట్లు నిర్మించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుని, రాజకీయ అండ కోసం ప్రయత్నించినట్టు భావిస్తున్నారు.

లయన్స్ క్లబ్ వ్యవహారాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. ఆ క్లబ్ విజయవాడ మెగాసిటీ యూనిట్‌కి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.

''నిందితుడు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించాడు. 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన వాడిని శిక్షించాలని కోరుతున్నాం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న తీరు అత్యంత హేయం. అధికార, విపక్షాల తీరు సామాన్యులను కలవరపరుస్తోంది.

జరిగింది దారుణం, ఆధారాలున్నాయి. నిందితుడికి కఠిన శిక్షలు వేయాలని అంతా కోరుకుంటాం. కానీ మీ పార్టీ అంటే, మీ పార్టీనే అంటూ పోటీపోటీగా చేస్తున్న ప్రచారం చూస్తుంటే బాధేస్తోంది. నిందితుడి పార్టీలతో సంబంధం లేకుండా కేసు విచారణ జరగాలి. కఠినంగా శిక్షించాలి. ఇందులో రాజకీయాలెందుకు.

ప్రభుత్వం సక్రమంగా స్పందించకుంటే మహిళా సంఘాలు ఆందోళనకు దిగుతాం'' అంటూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) నాయకురాలు వై శ్రీదేవి బీబీసీతో అన్నారు.

బాలిక ఆత్మహత్య

ఫొటో సోర్స్, Getty Images

న్యాయం జరిగితే చాలు

''రాజకీయ వివాదాల గురించి మాకు తెలియదు. మా బిడ్డను కోల్పోయాం. చాలా బాధల్లో ఉన్నాం. కనీసం ఒక్కసారి మాలో ఎవరికి చెప్పినా కాపాడుకోగలిగేవాళ్లం. ఎందుకిలా చేసిందో తెలియడం లేదు.

అంత నీచంగా వ్యవహరించిన వాడిని వదలకూడదు. ఈ రాజకీయ నేతల హడావిడి చూస్తుంటే మాకు అనుమానం వస్తోంది. ఊరిలో పెద్దమనిషినని చెప్పుకుంటూ ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వాడెవడైనా సరే వదలకుండా చట్టాలుండాలి.

సీసీ ఫుటేజ్‌లో కూడా ఆధారాలున్నాయి. కాబట్టి శిక్షిస్తే చాలు అనుకుంటున్నాం'' అంటూ మృతురాలి సమీప బంధువు పి మహేష్ బీబీసీతో అన్నారు.

నిందితుడి పార్టీ గురించి చర్చ కాకుండా అతడు పాల్పడిన ఘోరమైన నేరం గురించి చర్చించి, న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు.

వీడియో క్యాప్షన్, ప్రొబేషనరీ లేడీ ఎస్‌ఐపై మరో ఎస్ఐ లైంగిక వేధింపులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)