రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టెస్సా వాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
యుక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా చైనా కూడా అందులో తలదూరుస్తోంది.
కాస్త రష్యా స్వరంలోనే మాట్లాడుతున్న చైనా.. ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని తగ్గించుకోవాలని అమెరికా, రష్యాలకు సూచిస్తోంది. అంతేకాదు, తాను రష్యా పక్షం అన్న పరోక్ష సంకేతాలను కూడా ఇస్తోంది.
ఒకప్పటి కమ్యూనిస్టు రాజ్యమైన రష్యాతో చైనాకు చాలా ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో ఈ బంధాలు గతంకన్నా మరింత బలపడుతున్నాయి.

ఫొటో సోర్స్, EPA
'ప్రపంచాన్ని రక్షించేది చైనా, రష్యాలే'
దేశ భద్రత విషయంలో రష్యా ఆందోళనలు అర్ధం చేసుకోదగినవేనని చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ ఇటీవల వ్యాఖ్యానించారు. అవి సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాల్సిన అంశాలని అన్నారు.
మరో అడుగు ముందుకేసి, రష్యా ప్రపంచానికి ప్రమాదకారి అన్న అమెరికా వాదనలో పసలేదని ఐక్య రాజ్యసమితిలో చైనా రాయబారి ఝాంగ్ జున్ ఇటీవల వ్యాఖ్యానించారు.
భద్రతా మండలిలో అమెరికా ఒక సమావేశం నిర్వహించడాన్ని కూడా ఝాంగ్ తప్పుబట్టారు. దీనిని ఆయన 'మెగాఫోన్ రాయబారం'గా అభివర్ణించారు. సమస్యను చర్చించే విధానం ఇది కాదన్నారు.
యుక్రెయిన్ సంక్షోభం విషయంలో చైనా వ్యవహారశైలి చాలా సున్నితంగా, ప్రభావవంతంగా కనిపిస్తోంది. చైనా రంగ ప్రవేశం చేయడంతోనే, రష్యా పై బలప్రయోగం అనే అంశం వెనకబడింది.
చైనాలోని కొన్ని అధికార మీడియా సంస్థలు ఈ వ్యవహారాన్ని తమ ప్రభుత్వానికి అనువైన రీతిలో రిపోర్ట్ చేయడం మొదలు పెట్టాయి. చైనాలో స్వదేశీ సెంటిమెంట్ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితులలో యుక్రెయిన్ సంక్షోభం అమెరికాతోపాటు ఇతర పాశ్చాత్య దేశాలకు మరో ఘోర వైఫల్యంగా మీడియాలో కథనాలు రావడం ప్రారంభించాయి.
చైనా, రష్యాలాంటి దేశాలు తమ భూభాగాలను రక్షించుకోవడానికి చూస్తుంటే, నాటో వారిపై రౌడీయిజం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆ మీడియా కథనాల సారాంశం.
ప్రపంచాన్ని రక్షించడానికి ఉన్న ఆఖరి ఆయుధం చైనా, రష్యాల మధ్య సంబంధాలే అంటూ చైనా అధికార పత్రిక 'ది గ్లోబల్ టైమ్స్' రాసుకొచ్చింది.
మరో అధికార మీడియా సంస్థ జిన్హువా ''స్వదేశీ ప్రజలను మభ్యపెట్టడానికి, యూరప్ మీద పెత్తనం కోసం అమెరికా ప్రయత్నిస్తోంది'' అని రాసింది.
అయితే, ఇలాంటి కనికట్టు మాటలు ట్విటర్‌లో అనేక భాషలలో ప్రచారమవుతున్నాయని, అమెరికా, నాటోలను మిగతా ప్రపంచం ఎలా చూడాలో ఒక అభిప్రాయం కలిగేలా ఈ ప్రచారం సాగుతోందని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ పాలసీ డైరెక్టర్ జెస్సికా బ్రాండిట్ అన్నారు.
''అమెరికా శక్తిని తక్కువ చేయడం, నాటోలాంటి సంస్థల ప్రతిష్టను దెబ్బతీయడం, స్వేచ్ఛగా వ్యవహరించే మీడియాను కించపరచడం ఈ కథనాల లక్ష్యాలని నేను అనుకుంటున్నాను'' అని బీబీసీతో అన్నారామె.
''చైనా వ్యవహారశైలి ఎలా ఉందంటే, తనకు ప్రయోజనం ఉంటుందనుకుంటే యుక్రెయిన్ విషయంలో రష్యా లేవనెత్తే అంశాలకు మద్ధతిస్తోంది'' అన్నారు బ్రాండిట్.

ఫొటో సోర్స్, Getty Images
కామన్ శత్రువు, కామన్ లక్ష్యం
మావో, స్టాలిన్‌ల నాటికంటే రష్యా, చైనాలు ఇప్పుడు మరింత దగ్గరయ్యాయని నిపుణులు అంటున్నారు. 2014 నాటి క్రిమియా ఆక్రమణ ఘటన, రష్యాను చైనాకు మరింత చేరువ చేసింది. అంతర్జాతీయంగా ఆంక్షలు ఎదురైనా, రష్యాకు ఆర్ధిక, విదేశాంగ సహకారాన్ని కొనసాగించింది చైనా.
రానురాను ఆ బంధం మరింత బలపడింది. ఆర్ధిక రంగంలో చైనా రష్యాకు అతిపెద్ద భాగస్వామిగా మారింది. గత ఏడాది రెండు దేశాల మధ్య వాణిజ్యం గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి (147 బిలియన్ డాలర్లు) చేరుకుంది.
రెండు దేశాలు మిలిటరీ రంగంలోకి పరస్పర సహకారానికి, సంయుక్త సైనిక విన్యాసాలకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
షి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు శుక్రవారం నాడు వింటర్ ఒలిపింక్స్ ఆరంభ వేడుకలలో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా చేరుకున్నారు.
వీరిద్దరి మధ్య జరిగిన సమావేశానికి మరో ప్రాధాన్యత కూడా ఉంది. గత రెండేళ్లుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కొవిడ్ కారణంగా ఏ ఇతర ప్రపంచ దేశాల అధినేతతో కూడా సమావేశం కాలేదు.
పైగా ఈ రెండు దేశాలకు పాశ్చాత్య దేశాలతో వైరం ఉంది.
''అమెరికా, యూరప్ దేశాలను వెనక్కి నెట్టి, ప్రపంచ రాజకీయాలలో కీలకంగా మారాలన్న ఆకాంక్ష ఇరుదేశాలకు ఉంది'' అని టఫ్ట్స్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ హిస్టరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న క్రిస్ మిల్లర్ అభిప్రాయపడ్డారు.
రష్యా యుక్రెయిన్ ను ఆక్రమించుకున్న పక్షంలో, అంతర్జాతీయంగా రష్యాకు ఆర్ధిక ఆంక్షలు ఎదురైతే, ఇంతకు ముందులాగే సాయం చేయడానికి చైనా సిద్ధంగా ఉంది.
''వ్యూహాత్మకంగా చూస్తే, ఇలా సాయం చేయడం చైనాకు పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారమేమీ కాదు'' అన్నారు మిల్లర్.
యుక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తే అది అమెరికాకు ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పరుస్తుందని, కానీ, చైనాకు మాత్రం లాభదాయకమైన వ్యవహారమని మిల్లర్ అన్నారు.
అయితే, యుద్ధం రావాలని చైనా కోరుకోవడం లేదని చాలామంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికాతో సంబంధాలు మెరుగుపడాలని చైనా కోరుకుంటోందని, ఒకవేళ ఘర్షణ అంటూ జరిగితే, అది ప్రజాస్వామిక దేశాలకు, నియంతృత్వ దేశాలకు మధ్య యుద్ధంలా మారే అవకాశం ఉందని బోనీ గ్లేసర్ అన్నారు. ఆమె, జర్మన్ మార్షల్ ఫండ్ ఏషియా ప్రోగ్రామ్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
''రష్యా ఉద్దేశాలు తెలుసు కాబట్టి, తాను కూడా మరీ పంతానికి పోకుండా వ్యవహరించాలని చైనాకు కూడా తెలుసు'' అని రాజకీయ విశ్లేషకులు మిన్‌క్సిన్ పెయీ ఇటీవల రాసిన ఓ వ్యాసంలో పేర్కొన్నారు.
రష్యాకు మరీ ఎక్కువ చనువుగా ఉండటం వల్ల, ఐరోపా వ్యాపార సంబంధాలలో చైనాకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పెయీ అన్నారు. చైనాకు యూరోపియన్ యూనియన్ రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి.
ఒకవేళ చైనా ఇలాగే రష్యాకు మద్ధతిస్తూపోతే, యూరోపియన్ యూనియన్ నుంచి తైవాన్‌కు మద్ధతు రూపంలో ఎదురుతన్నే అవకాశం కూడా ఉండొచ్చని పెయీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'తైవాన్, యుక్రెయిన్ ఒకటి కాదు'
యుక్రెయిన్ వ్యవహారంలో అమెరికాకు దాని మిత్రపక్షాలు ఎంత వరకు సహకరిస్తాయి అన్న విషయాన్ని అమెరికాలోనూ, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చైనీయులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఒకవేళ రష్యా యుక్రెయిన్‌ను ఆక్రమించుకుటే, దానిపై మిలిటరీ చర్యలకు దిగినట్లుగానే, భవిష్యత్తులో తైవాన్‌ను ఆక్రమించుకుంటే చైనా పై కూడా అమెరికా మిలిటరీ చర్యలకు దిగుతుందా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఇటీవలి కాలంలో అమెరికా చైనాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. తన ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి చైనా తరచూ యుద్ధ విమానాలను పంపుతోందని తైవాన్ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏదైనా తేడా వస్తే చైనాతో అమెరికా యుద్ధానికి దిగుతుందా అన్న ఆసియావాసుల ఆందోళనను అర్ధం చేసుకోవచ్చు.
ఒకవేళ చైనా తైవాన్‌పై దాడికి దిగితే, తాను ఏం చేయాలన్నదానిపై అమెరికా దగ్గర స్పష్టత లేదు. కాకపోతే, తైవాన్‌ను రక్షించే క్రమంలో చైనాపై చర్యలు తీసుకునేందుకు సహకరించే ఓ చట్టం అమెరికా చేతిలో ఉంది. కానీ, దౌత్యపరంగా వన్ చైనా పాలసీని అమెరికా ఆమోదిస్తోంది.
అయితే, ఈ రెండు వాదనలను నిపుణులు అంగీకరించడం లేదు. ఈ రెండూ పూర్తిగా భిన్నమైన భౌగోళిక, రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్నాయని వారు వాదిస్తున్నారు. అమెరికాకు, తైవాన్‌తో చాలా పటిష్టమైన చారిత్రాత్మక సంబంధాలున్నాయని, ఆసియాలో సైద్ధాంతిక, దౌత్య, సైనిక వ్యూహాల విషయంలో అమెరికాకు తైవాన్ చాలా కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు.
"చైనా రష్యా కాదు, తైవాన్ ఉక్రెయిన్ కాదు. యుక్రెయిన్ కంటే తైవాన్‌తో అమెరికాకు ఎక్కువ సంబంధాలున్నాయి" అని గ్లేసర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఒక్క రోజులో రూ.17 లక్షల కోట్ల సంపద ఆవిరి, ఫేస్‌బుక్ మార్కెట్ విలువ అంతగా ఎలా పడిపోయింది?
- రష్యాతో గొంతు కలిపిన చైనా, రెండు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహం
- ధర్మ సంసద్: రెండు సభలు, ఒకే రకమైన తీవ్రమైన ఆరోపణలు, రెండు రాష్ట్రాల చర్యల్లో తేడా ఎందుకు?
- గల్వాన్ డీకోడెడ్: 'గల్వాన్ లోయలో జరిగిన భారీ నష్టాన్ని చైనా దాచిపెడుతోంది'.. క్లాక్సన్ నివేదిక వెల్లడి
- సముద్రంలో కూలిన అమెరికా యుద్ధ విమానం, చైనాకు ఆ రహస్యాలు దొరకకుండా ఆపసోపాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












