పాకిస్తాన్: బలూచిస్తాన్‌లో సాయుధ మిలిటెంట్ల దాడి, ఏడుగురు పాకిస్తానీ సైనికులు మృతి

దాడులు

బలూచిస్తాన్‌లో రెండు వేర్వేరు ప్రాంతాలపై సాయుధ మిలిటెంట్లు దాడులు చేశారు.

నోష్కీ, పంజ్‌గూర్‌లోని ఎఫ్‌సీ (ఫ్రాంటియర్ కార్ప్స్) ప్రధాన కార్యాలయంపై జరిగిన సాయుధ మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటివరకు ఒక అధికారితో సహా ఏడుగురు సైనికులు మరణించినట్లు పాకిస్తాన్ హోం మంత్రి షేక్ రషీద్ ధృవీకరించారు.

పంజ్‌గూర్‌లో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, కొంతమంది సాయుధ మిలిటెంట్లను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, బలూచిస్తాన్‌లో వందలాది మంది పురుషులు అదృశ్యం.. వారంతా ఏమైపోతున్నారు?

బుధవారం అర్ధరాత్రి నోష్కీ, పంజ్‌గూర్‌లలో సాయుధ మిలిటెంట్లు భారీ దాడులకు పాల్పడ్డారని, అయితే భద్రతా దళాలు వాటిని తిప్పికొట్టాయని హోం మంత్రి ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.

"నోష్కీలో తొమ్మిది మంది తీవ్రవాదులు మరణించగా, నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పంజ్‌గూర్‌లో ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. రెండు ప్రాంతాల్లోనూ తీవ్రవాదులను సైన్యం తరిమికొట్టింది. పంజ్‌గూర్‌లో భద్రతా దళాలు కనీసం నలుగురు లేదా ఐదుగురు తీవ్రవాదులను చుట్టుముట్టాయి" అని ఆయన పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: పాకిస్తాన్‌లో తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. అల్లాడుతున్న ప్రజలు

పంజ్‌గూర్, నోష్కీలలోని సైనిక స్థావరాలపై దాడులను ఖండిస్తున్నామని, "దాడులను తిప్పికొట్టిన వీర జవాన్లకు సలాం చేస్తున్నామని" పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

"మన భద్రత, రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తున్న సైన్యం వెనుక దేశం మొత్తం ఒక్కటిగా నిలబడుతుంది" అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

'తీవ్రవాదులు పంజ్‌గూర్‌లోని రెండు ప్రదేశాల నుంచి ఎఫ్‌సీ కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, అయితే సకాలంలో సైనికులు చర్యలు తీసుకోవడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని' బుధవారం రాత్రి పాకిస్తాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ దాడులకు బాధ్యత వహిస్తూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది.

పంజ్‌గూర్ నోష్కీలలో తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, ఈ దాడుల్లో తమ సభ్యులు ఇద్దరు మరణించారని ఆ సంస్థ మజీద్ బ్రిగేడ్ తెలిపారు.

వీడియో క్యాప్షన్, భారత్ వ్యాపారాన్ని ఆపేయడంతో ఇబ్బందుల్లో పాకిస్తాన్ ఖర్జూరం రైతులు

పాకిస్తాన్‌కు కునుకు లేకుండా చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎలా పుట్టింది

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉనికి మొదటిసారి 1970వ దశకం ప్రారంభంలో కనిపించింది.

పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మొదట అధికారంలోకి వచ్చినపుడు పాకిస్తాన్ పాలనకు వ్యతిరేకంగా బలూచిస్తాన్‌లో సాయుధ తిరుగుబాటు మొదలైంది.

అయితే సైనిక నియంత జియావుల్ హక్ అధికారం చేజిక్కించుకున్న తర్వాత బలూచ్ రాజకీయ నేతలతో చర్చలు జరిగాయి. ఫలితంగా సాయుధ తిరుగుబాటు ముగిసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయింది.

తర్వాత మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాలనలో బలూచిస్తాన్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ నవాజ్ మిరీ హత్య ఆరోపణలపై స్థానిక నేత నవాబ్ ఖైర్ బక్ష్‌ను అరెస్టు చేసినప్పుడు, 2000 సంవత్సరంలో బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలు, భద్రతాదళాలపై వరుస దాడులు మొదలయ్యాయి.

విస్తృతమైన ప్రభావం

మెల్లమెల్లగా ఈ దాడులు విస్తరించడంతోపాటు అవి బెలూచిస్తాన్‌లోని మిగతా ప్రాంతాలకూ వ్యాపించాయి. వీటిలో ఎక్కువ దాడులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత తీసుకుంది.

2006లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అప్పుడు నవాబ్ ఖైర్ మిరీ కొడుకు నవాబ్‌జాదా బాలాచ్ మిరీని దీనికి నాయకుడుగా ఉన్నారని పాకిస్తాన్ అధికారులు చెప్పారు.

2007 నవంబర్‌లో బాలాచ్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో భద్రతాదళాలతో జరిగిన ఘర్షణలో అతడు మృతిచెందాడని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అప్పుడు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)