ఒమిక్రాన్ BA.2: ఈ వేరియంట్ గురించి మనం ఆందోళన చెందాలా, లేదా

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచంలోని సగం కరోనా కేసులకు కారణం అవుతోంది.
కానీ, ఒమిక్రాన్ అనేది SARS-C0V-2 కరోనావైరస్ వంశానికి సంబంధించిన ఒక పదం. వీటిలో అత్యంత సాధారణమైనది BA.1 వంశక్రమం.
ఇప్పుడు చాలా దేశాల్లో, ముఖ్యంగా ఆసియా, యూరప్‌లో BA.2 వేరియంట్ వల్ల నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
అంతకు ముందు వేరియంట్ల కంటే BA.2 మరింత వేగంగా వ్యాపిస్తున్నా, ఇది మరింత తీవ్రమైనదని చెప్పడానికి ఇప్పటివరకూ ఎలాంటి డేటా అందుబాటులో లేదు.
అయితే, ఈ వేరియంట్ గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా, లేదా? ఇప్పటివరకూ మనకు ఈ వేరియంట్ గురించి ఎంత తెలుసు.. చూద్దాం..
BA.2 వేరియంట్ ఏంటి
వైరస్ కొత్త వేరియంట్‌గా మ్యూటేట్ అయినప్పుడు అవి కొన్నిసార్లు విడిపోవడం లేదా ఉప వంశక్రమాలుగా విడిపోవడం జరుగుతుంది.
ఉదాహరణకు డెల్టా వేరియంట్‌కు 200 రకాల సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ఒమిక్రాన్ విషయంలో కూడా అదే జరిగింది. ఇందులో BA.1, BA.2, BA.3, B.1.1.529 వంశక్రమాలు ఉన్నాయి.
ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులకు BA.1 వేరియంట్ కారణం అయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం జనవరి 25 నాటికి గ్లోబల్ GISAIDకు సబ్మిట్ అయిన వైరల్ డీఎన్ఏలో దాదాపు 99 శాతం ఈ సబ్ వేరియంటే ఉన్నట్లు గుర్తించారు.
ఇక BA.1, BA.2 వేరియంట్లు ఒకేలా ఉన్నప్పటికీ, వాటిలో మరో 20 మ్యుటేషన్లు ఉన్నాయి. BA.2 వేరియంట్ ఎక్కడ పుట్టిందనేది స్పష్టంగా తెలీడం లేదు. కానీ దీనిని మొదట నవంబర్లో ఫిలిప్పీన్స్‌లో గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
BA.2 ఎక్కడ వ్యాపిస్తోంది
ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను 57 దేశాల్లో గుర్తించారని ఇప్పుడు డబ్ల్యుహెచ్ఓ చెప్పింది. కొన్ని దేశాల్లో సీక్వెన్స్ అయిన సగం ఒమిక్రాన్ కేసులకు BA.2 వేరియంటే కారణం అని వివరించింది.
కొన్ని దేశాల్లో నమోదవుతున్న ఈ సబ్ వేరియంట్‌కు సంబంధించిన కేసులు చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి.
డెన్మార్క్‌కు చెందిన స్టేటెన్స్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్(ఎస్ఎస్ఐ) వివరాల ప్రకారం ఆ దేశంలో జనవరిలో నమోదైన కేసుల్లో దాదాపు సగం ఇన్ఫెక్షన్లకు BA.2 వ్యాప్తి పెరగడమే కారణం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
డెల్టా, ఒమిక్రాన్ BA.1 వేరియంట్ల స్థానాన్ని BA.2 వేగంగా ఆక్రమిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని మాలిక్యులర్ బయాలజిస్ట్ బిజయ ధకల్ చెబుతున్నారు.
ఇది ప్రస్తం చాలా రాష్ట్రాల్లో ప్రబలంగా వ్యాపించిన వేరియంట్‌గా ఉంది. దేశంలో ఇటీవలి మూడో వేవ్ ఇన్ఫెక్షన్లకు కూడా ఇదే కారణం.
జనవరి చివర్లో సేకరించిన శాంపిళ్ల ద్వారా తమ దేశంలో BA.2 వేరియంట్ ఇప్పటికే తీవ్రంగా వ్యాపించినట్లు తేలిందని ది ఫిలిప్పీన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్(డీఓహెచ్) చెప్పింది.
ఇక యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వివరాల ప్రకారం ఇంగ్లండ్‌లో ధ్రువీకరించిన వెయ్యికి పైగా BA.2 కేసులు గుర్తించారు.
దీనికి 'పరిశీలనలో ఉన్న వేరియంట్' అని బ్రిటిష్ ఆరోగ్య శాఖ అధికారులు పేరు పెట్టారు. అంటే వీరు దీనిని నిశితంగా గమనిస్తున్నారు. కానీ దీనిపై పెద్దగా ఆందోళనలు వ్యక్తం కావడం లేదు.
జర్మనీలో కూడా BA.2 ఇన్ఫెక్షన్లు BA.1, డెల్టా కంటే వేగంగా పెరుగుతున్నట్లు యూకేహెచ్ఎస్ఏ కోవిడ్-19 డైరెక్టర్ డాక్టర్ మీరా చంద్ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
BA.2 మరింత వ్యాపిస్తుందా
డెన్మార్క్ ఎస్ఎస్ఐ 8500 ఇళ్లలోని 18 వేల మందితో నిర్వహించిన ఒక అధ్యయనంసో BA.2 వేరియంట్ వ్యాప్తి BA.1 కంటే మరింత తీవ్రంగా ఉందని తేలింది.
ఈ సర్వేలో BA.2 వేరియంట్ టీకాల నుంచి కూడా సమర్థంగా తప్పించుకోగలదనే ఆధారాలు కూడా లభించాయి.
అయితే, టీకా వేసుకోనివారితో పోలిస్తే వ్యాక్సీన్ వేసుకున్నవారు ఈ వేరియంట్‌కు ఇప్పటికీ తక్కువగా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. వాళ్ల నుంచి ఇది ఇతరులకు వ్యాపించడం కూడా తక్కువగానే ఉంది.
బ్రిటన్‌లో జరిగిన మరో అధ్యయనంలో కూడా BA.2 వేరియంట్ BA.1 కంటే తీవ్రంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.
కానీ, ఈ సబ్ వేరియంట్లపై టీకా ప్రభావం తక్కువగా ఉందనడానికి కూడా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లభించలేదని ప్రాథమిక అంచనాలో గుర్తించారు.
BA.2 వేరియంట్ ప్రమాదకరమా
BA.2 అంతకు ముందు ఒమిక్రాన్ వేరియంట్ల కంటే మరింత తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుందని సూచించే ఎలాంటి డేటా అందుబాటులో లేదు.
"BA.2 ఇప్పుడు ఎక్కువగా వ్యాపిస్తున్న మిగతా దేశాలను చూస్తుంటే, మేం ఊహించిన దానికంటే ఎక్కువగా ఆస్పత్రుల్లో చేరుతుండడం లాంటివేవీ మాకు కనిపించడం లేదు" అని డబ్ల్యుహెచ్ఓ డాక్టర్ బోరిస్ పవ్లిన్ చెప్పారు.
BA.1, BA.2 రెండు వేరియంట్లనూ ఒకేలా ఉండే ఒమిక్రాన్ ఉప వంశాలుగా భావించవచ్చని యూసీఎల్ జెనెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లాక్స్ తెలిపారు.
ఇంతకు ముందు వేరియంట్ల లాగానే, వీటి వల్ల తీవ్ర అనారోగ్యం, ఆస్పత్రిలో చేరడం, మరణం లాంటివి సంభవించకుండా టీకాలు అత్యంత సమర్థంగా పనిచేయడం కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
"BA.2 వేరియంట్ BA.1 కంటే తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందా, లేదా అనేది నిర్ధరించడానికి ఇప్పటివరకూ తగిన అధారాలేవీ లభించలేదు" అని డాక్టర్ మీరా చంద్ చెబుతున్నారు.
"మనం అప్రమత్తంగా ఉంటూ, టీకాలు తీసుకోవాలి. ఎల్ఎఫ్‌డీ(లేటరల్ ఫ్లో డివైసెస్)లతో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు కనిపిస్తే పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి" అని సూచించారు.

ఈ దశలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
హెల్త్ కరస్పాండెంట్ నిక్ ట్రిగిల్ విశ్లేషణ
బ్రిటన్, ఇతర దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన BA.2న నిశితంగా పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతానికి దీని గురించి చాలా విషయాల్లో స్పష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఒమిక్రాన్ BA.1 వేరియంట్‌తో పోలిస్తే ఇది మరింత తీవ్రంగా వ్యాపించేలా కనిపిస్తోంది.
ఈ వేరియంట్ మీద టీకా ప్రభావంలో ఏవైనా తేడాలు కనిపించినట్లు యూకేహెచ్ఎస్ఏ ప్రాథమిక పరిశోధనల్లో తేలలేదు. అయితే, దీని తీవ్రత గురించి ఇంకా ఎలాంటి డేటా అందుబాటులో లేదని అది చెప్పింది.
కానీ, డెన్మార్క్‌లో కూడా ఆస్పత్రిలో చేరడం, ఐసీయూల్లో భర్తీ చేయడం లాంటివి బ్రిటన్‌లో ఉన్నట్లే కనిపిస్తోంది. BA.2 వేరియంట్ వల్ల తీవ్ర అనారోగ్యం లాంటి మార్పులేవీ లేవని సూచించింది.
BA.1 ఒమిక్రాన్‌లో ఆధిపత్యం చూపించే వేరియంట్ అయినప్పటికీ, దానివల్ల భారీ వేవ్ కనిపించిన దేశాల్లో BA.2 వేరియంట్ మహమ్మారి వ్యాప్తిని మరింత తీవ్రం చేయకపోవచ్చు. BA.1 ఇన్ఫెక్షన్లతో వచ్చిన క్రాస్ ఇమ్యూనిటీనే దీనికి కారణం. ఇది BA.2 వేరియంట్ నుంచి కూడా కాస్త రక్షణను అందించవచ్చు.
జనం అప్రమత్తంగా ఉండడానికి బదులు, శాస్త్రవేత్తలు ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉన్న వేరియంట్‌గా దీనిని మనం చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
- క్రిప్టో కరెన్సీ ఆదాయంపై 30శాతం పన్ను.. బిట్‌కాయిన్ లీగల్ అయినట్లేనా?
- రష్యాకు యుక్రెయిన్ ఎందుకంత కీలకం.. మీరు తెలుసుకోవలసిన మూడు ప్రధాన కారణాలు..
- ఉదయాన్నే నడవాలని ఎందుకు చెబుతారు? సాయంత్రం, రాత్రి వేళల్లో నడవకూడదా?
- మద్యం తాగితే నిజంగానే బాధలు మర్చిపోయి హాయిగా అనిపిస్తుందా?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












