ఒమిక్రాన్‌తో ప్రపంచమంతా కంగారు పడుతుంటే, అరబ్ ఎమిరేట్స్ ఎందుకంత కూల్‌గా ఉంది?

కరోనా కట్టడిలో అరబ్ ఎమిరేట్స్ ముందుంది

ఫొటో సోర్స్, Hugh Sitton/Getty Images)

ఫొటో క్యాప్షన్, కరోనా కట్టడిలో అరబ్ ఎమిరేట్స్ ముందుంది
    • రచయిత, లిండ్సే గెలోవే
    • హోదా, బీబీసీ ట్రావెల్

డెల్టా వేరియంట్ దెబ్బ నుంచి కోలుకుంటున్న ప్రపంచాన్ని ఒమిక్రాన్ రూపంలో మరో కరోనా వైరస్ వేరియంట్ భయపెడుతోంది. యూరప్‌లోని అనేక దేశాలలో మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు పెట్టక తప్పని పరిస్థితిని కల్పిస్తోంది ఒమిక్రాన్.

కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మాత్రం దాని ప్రభావం నుంచి పూర్తి దూరంగా ఉండగలిగింది. వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని దేశాలు పర్యాటకులు రావద్దంటూ తలుపులు మూసేస్తుంటే, యూఏఈ మాత్రం టూరిస్టులను రారమ్మని పిలుస్తోంది.

వేగంగా వ్యాక్సినేషన్, ఉత్తమమైన టెస్టింగ్‌ విధానాలతో కరోనా వైరస్‌పై ఇతర దేశాలకంటే మెరుగ్గా పోరాడుతోంది యూఏఈ.

బ్లూమ్‌బెర్గ్ కరోనా రెసిలియెన్స్ ర్యాంకింగ్‌లో యూఏఈ అగ్రదేశాల సరసన నిల్చుంది.

53 దేశాలలో నిర్వహించిన ఈ సర్వేలో, ఆరోగ్య సౌకర్యాలు, ప్రమాణాలు, ఇన్‌ఫెక్షన్ కారణంగా మరణాలు, ట్రావెల్ రీఓపెనింగ్ లాంటి 12 అంశాలను పరిశీలించారు.

వీడియో క్యాప్షన్, దుబాయ్: కరోనా కష్టాలు ముగిసినట్టేనా?

అందుకే ఐరోపాలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ, యూఏఈ వ్యాధి సంక్రమణను నియంత్రించగలుగుతోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

అరబ్ ఎమిరేట్స్‌లో అత్యధిక జనాభా ఉన్న నగరం దుబాయి కరోనా మహమ్మారి నుంచి సురక్షితమైన ప్రాంతంగా మారింది.

''మేమంతా ఒకరినొకరు రక్షించుకోవడానికి కలిసి పని చేశాం. ప్రభుత్వ విధానాలకు స్థానిక ప్రజల నుంచి మద్ధతు లభిస్తోంది. రెండేళ్ల కిందటితో పోలిస్తే దుబాయ్ నగరం చాలా మారిపోయింది. మరో గ్రహం మీద అడుగు పెట్టినట్లుంది'' అని కేథీ జాన్‌స్టన్‌ అన్నారు. ఆమె మిర్జామ్ చాక్లెట్ కంపెనీలో పని చేస్తున్నారు.

భారీ సోలార్ చెట్లు నీడతోపాటు విద్యుత్‌ ను అందిస్తాయి

ఫొటో సోర్స్, Francois Nel/Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ సోలార్ చెట్లు నీడతోపాటు విద్యుత్‌ ను అందిస్తాయి

యూఏఈ కి ఎందుకు వెళ్లాలి?

ఈ సమయంలో యూఏఈలో వాతావరణం బాగుంటుందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ''అక్టోబరు నుండి మే వరకు దుబాయ్ సందర్శించడానికి మంచి సమయం. సముద్ర తీరంలో హాయిగా ఉంటుంది'' అని దుబాయ్ నివాసి తాలా మహమ్మద్ చెప్పారు.

అందుకే ఈ సీజన్‌లో ఓపెన్ ఎయిర్ ఈవెంట్‌లు, సాయంత్రం పూట సందళ్లు జోరుగా సాగుతుంటాయి. గల్ఫ్ తీరంలోని దాదాపు ప్రతి నగరంలో ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది.

ఆరు నెలల పాటు జరిగే 'ఎక్స్‌పో 2020'ని కూడా దుబాయ్ నగరమే నిర్వహిస్తోంది. ఇది మార్చి 2022 వరకు కొనసాగుతుంది. ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

ఇందులో పాల్గొన్న కంపెనీలు తమ ప్రత్యేకమైన, విభిన్నమైన ఉత్పత్తులను, వాటి భవిష్యత్ ప్రణాళికలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి.

''ఈ ఎక్స్‌పోకి వెళ్లడం మాత్రం మర్చిపోవద్దు. దీని కోసం ఒకవారం మొత్తం కేటాయించండి. జపనీస్ సుషీ కోసం మీరు మూడు గంటలు లైన్‌లో నిలబడాల్సి వచ్చినా ఫర్వాలేదు. ఎక్స్‌పోలో రెస్టారెంట్ 'బారన్' సెంటర్‌లో ఖర్జూరాలను, ఆస్ట్రేలియన్ స్టాల్‌లో ఖీర్‌ను ఆనందించండి'' అని కేథీ జాన్‌స్టన్ అన్నారు.

ఎమిరేట్స్ బయో ఫామ్ దేశంలోనే అతి పెద్ద ఆర్గానిక్ ఫామ్

ఫొటో సోర్స్, Francois Nel/Getty Images

ఫొటో క్యాప్షన్, ఎమిరేట్స్ బయో ఫామ్ దేశంలోనే అతి పెద్ద ఆర్గానిక్ ఫామ్

బిజినెస్ డెస్టినేషన్

సౌరశక్తి, నీటి సంరక్షణ, గ్రీన్ బిల్డింగ్, మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడులతో మరింత స్థిరమైన వ్యవస్థను నిర్మించడానికి దుబాయ్ గత దశాబ్దంలో చాలా కృషి చేసింది.

ఈ ఎక్స్‌పో 2020లో సస్టైనబిలిటీ పెవిలియన్‌ను విడిగా నిర్మించారు. విద్యుత్ శక్తిని, నీడను ఇచ్చే ఒక సోలార్ ట్రీని ఇక్కడ మనకు కనిపిస్తుంది.

పెవిలియన్‌లో మరో ఆకర్షణ 9,000 మొక్కలు, వన మూలికలతో నిండిన తోట. ''గత రెండేళ్లలో చాలా రెస్టారెంట్‌లు తెరిచారు. స్థానిక పదార్ధాల తయారీలో నైపుణ్యం కలిగిన చెఫ్‌లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఈ మహమ్మారి కారణంగా ఊహించని అవకాశం లభించింది'' అన్నారు కేథీ.

స్థానిక వంటలతోపాటు జపనీస్ వంటకాల రుచి కోసం ఈడెన్ హౌస్‌లో రూఫ్‌టాప్ రెస్టారెంట్ మూన్‌రైజ్‌కు వెళ్లవచ్చని తాలా మొహమ్మద్ అన్నారు.

''దుబాయ్ నుండి100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రస్ అల్ ఖైమాలో తేనెను ఉపయోగించి చేసే స్పానిష్ వంటకం చుటోరో ఉంది. ఈ ఎనిమిది సీట్ల రెస్టారెంట్‌ను ముందుగానే బుక్ చేసుకోవాలి'' అని ఆయన వివరించారు.

స్థానిక నివాసి విభా ధావన్ ఒక ట్రావెల్ కంపెనీకి ట్రావెల్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. 'బోకా' అనే రెస్టారెంట్‌కి వెళ్లాలని ఆమె సిఫార్సు చేశారు. ఈ రెస్టారెంట్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని స్పెషల్‌గా పెంచిన సాల్మన్ చేపలు, ఒంటె పాలను ఉపయోగిస్తారు.

దుబాయ్‌లో అవకాడో గింజలతో తయారు చేసిన స్ట్రాలను ఉపయోగించే కొన్ని కేఫ్‌లలో 'ది సమ్ ఆఫ్ అజ్' రెస్టారెంట్ ఒకటి. ఈ రెస్టారెంట్‌కి వచ్చే కస్టమర్లు ఇంటి నుంచి రీయుజబుల్ కప్పులు తీసుకొస్తే వారికి 10% తగ్గింపు ఇస్తారు.

నగరాన్ని పర్యావరణంతో అనుసంధానించడానికి చేసే ప్రయత్నాలను తెలుసుకోవాలంటే ఎమిరేట్స్ బయోఫార్మ్‌ను సందర్శించాలని విభా ధావన్ అన్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రం.

వీడియో క్యాప్షన్, స్విమ్మింగ్‌పూల్‌లో చేపల పెంపకం.. ‘రూ.5 లక్షల పెట్టుబడి, రూ.15 లక్షల ఆదాయం’

'' సాయంత్రాలు అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏడాది పొడవును అక్కడ రుచికరమైన ఆహారం కూడా దొరుకుతుంది'' అన్నారు విభా.

యూఏఈలో ఎడారిని ఆస్వాదించాలంటే అల్ మహా రిసార్ట్ అండ్ స్పా బెస్ట్ ప్లేస్‌ అని చెప్పారు విభా.

ఇది దుబాయ్‌లోని మొదటి నేషనల్ పార్క్‌, ఫైవ్ స్టార్ డజర్ట్ రిసార్ట్ మాత్రమే కాదు, అరుదైన అరేబియన్ జింకలను కూడా ఇక్కడ సంరక్షిస్తారు.

దాదాపు 300 జింకలు ఇక్కడ ఉన్నాయి. ఇవి సందర్శకులను చూసి ఏ మాత్రం బెదరకుడా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి.

ఈ రిసార్ట్‌ నిర్మాణం కోసం దశాబ్దాల సమయం పట్టింది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు కాలినడకతో పాటు, జీప్‌లు, ఒంటెలు, గుర్రాలపై ఈ ప్రాంతంలో తిరగవచ్చు.

నగరం నడిబొడ్డున ఇటీవల నిర్మించిన '25 అవర్స్ వన్ సెంట్రల్' హోటల్ సరికొత్త అనుభూతిని అందిస్తుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడ అరబిక్ శైలిలో దీనిని నిర్మించారు.

హోటల్ లాబీ 5,000 పుస్తకాలతో వృత్తాకార 'ఫౌంటెన్ ఆఫ్ టేల్స్' లైబ్రరీతో ప్రారంభమవుతుంది.

ఈ లైబ్రరీలో స్థానిక కళాకారుల చిత్రాలతోపాటు, పురాతన, ఆధునిక సంచార అరబ్ తెగల జీవితాల అందమైన సమ్మేళనాన్ని ప్రదర్శించే కళాఖండాలను ఈ హోటల్ అంతటా చూడవచ్చు.

పర్యాటక రంగంలో యూఏఈ దూసుకుపోతోంది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పర్యాటక రంగంలో యూఏఈ దూసుకుపోతోంది

అక్కడికి వెళ్లేముందు ఏం తెలుసుకోవాలి?

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ట్రావెల్ లిమిట్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజా నిబంధనల కోసం ఎప్పటికప్పుడు ట్రావెల్ టు దుబాయ్ వెబ్‌సైట్‌ను తప్పకుండా సందర్శించాలి.

ప్రస్తుతం, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సీన్‌ను తీసుకున్న పర్యాటకులకు దుబాయ్ ‌నగరం తెరిచి ఉంది. అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత పర్యాటకులు కరోనా పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది.

కోవిడ్ టెస్ట్ ఫలితాలను, వ్యాక్సినేషన్ స్టేటస్‌ను సూచించడానికి రంగుల్లో ఉండే ఓ కోడ్ సిస్టమ్‌ను ఉపయోగించే యూఏఈ అధికారిక యాప్ 'అల్ హసన్' ను ప్రయాణికులు డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)