సినీ నటి భావనపై లైంగిక దాడి కేసు: ఆ రోజు రాత్రి ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Bhanava Menon
సినీ నటి భావన గ్యాంగ్ రేప్ ఘటన జరిగి అయిదేళ్లు కావస్తోంది. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో మళయాళీ సినిమాలో టాప్ యాక్టర్‌గా పేరున్న దిలీప్ కూడా ఒకరు.
గత అయిదేళ్లుగా ఈ కేసు ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ వచ్చింది.
ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులను చంపుతానంటూ బెదిరించారనే ఆరోపణలతో తాజాగా దిలీప్‌పై మరొక కేసును నమోదు చేశారు కేరళ పోలీసులు.
ఇందుకు సంబంధించిన దిలీప్ ఆడియో క్లిప్పులు బయటకు వచ్చాయి.
అయిదేళ్ల కిందట ఏం జరిగింది?
కేరళకు చెందిన సినీ నటి భావనపై అయిదేళ్ల కిందట సామూహిక లైంగిక దాడి జరిగింది. 2017 ఫిబ్రవరి 17న ఆమెను కిడ్నాప్ చేసి కారులో రేప్ చేశారు.
భావన త్రిసూర్ నుంచి కొచ్చికి ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి పూట ఆమె ప్రయాణిస్తున్న కారును వ్యాన్‌తో ఢీ కొట్టిన దుండగులు... డ్రైవర్‌ను లాగేసి బలవంతంగా కారులోకి చొరబడ్డారు.
ఆ తరువాత కారులో తిప్పుతూ సుమారు మూడు గంటలపాటు భావనపై వారు లైంగిక దాడి చేశారు. ఆ సమయంలో వీడియోలు, ఫొటోలు తీశారు.
చివరకు కొచ్చిలోని ఒక ప్రాంతంలో ఆమెను వదిలేసి దుండగులు పారిపోయారు. మళయాళం, కన్నడ చిత్రాల్లో ఎక్కువగా నటించిన భావన గతంలో ఒంటరి, హీరో, మహాత్మ, నిప్పు వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించారు.

ఫొటో సోర్స్, Dileep/face book
నిందితులు ఎవరు? ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డారు?
కేరళ పోలీసుల ప్రకారం భావనపై ఒక పథకం ప్రకారం లైంగిక దాడి జరిగింది. సునీల్ కుమార్ సురేంద్రన్ అలియాస్ పల్సర్ సునీతోపాటు ఏడుగురు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు.
భావన మీద పగ తీర్చుకునేందుకు పల్సర్ సునీతో కేరళ నటుడు దిలీప్ డీల్ కుదుర్చుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ డీల్‌లో భాగంగానే భావనను పల్సర్ సునీ గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్లు చార్జ్ షీట్‌లో కేరళ పోలీసులు పేర్కొన్నారు.
ఈ డీల్ విలువ రూ.1.5 కోట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి 2017 జులైలో దిలీప్‌ను అరెస్ట్ చేయగా అదే సంవత్సరం అక్టోబరులో బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు.
అలాగే దాడి జరిగిన రోజు భావన కారు నడిపిన డ్రైవర్ మార్టిన్ మీద కూడా ఆరోపణలున్నాయి. దాడి గురించి ముందుగానే మార్టిన్‌కు సమాచారం ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
భావనకు, దిలీప్‌కు మధ్య ఉన్న గొడవలు ఏంటి?
దిలీప్‌కు కేరళ నటి మంజూ వారియర్‌తో 1998లో పెళ్లి అయింది. ఆ తరువాత మరొక నటి కావ్య మాధవన్‌తో ఆయన సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
అసలు గొడవ అక్కడే మొదలైంది. పోలీసుల ప్రకారం... దిలీప్, కావ్య మాధవన్‌ల బంధాన్ని నిరూపించే సాక్ష్యాలను దిలీప్ భార్య మంజూ వారియర్‌కు భావన ఇచ్చారు. దీంతో భావనపై దిలీప్ పగ పెంచుకున్నారు.

ఫొటో సోర్స్, Bhavana/instagram
ఆ తరువాత దిలీప్, మంజూ వారియర్ విడాకులు తీసుకున్నారు. 2016లో కావ్య మాధవన్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. కానీ భావన మీద పగను మాత్రం దిలీప్ మర్చిపోలేదని, ఆమె సినీ కెరియర్‌ను నాశనం చేసేందుకు కూడా ప్రయత్నించాడంటూ చార్జ్ షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే భావన మీద దాడికి పల్సర్ సునీతో దిలీప్ డీల్ కుదుర్చుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులను చంపుతానని బెదిరించారనే ఆరోపణలతో తాజాగా దిలీప్‌పై మరొక కేసు నమోదు చేశారు.
అయితే తాను ఏ తప్పూ చేయలేదని, తన ఇమేజ్‌ను దెబ్బతీయడం కోసం కావాలనే ఈ కేసుల్లో ఇరికిస్తున్నట్లు దిలీప్ అంటున్నారు. పల్సర్ సునీతో తనకు ఎటువంటి సంబంధాలు లేవంటూ ఆయన చెబుతూ వస్తున్నారు.
దిలీప్ ఎవరు?
54 ఏళ్ల దిలీప్ అసలు పేరు గోపాల కృష్ణన్ పద్మనాభన్ పిళ్లై. మళయాళీ చిత్ర పరిశ్రమలో నటుడు, నిర్మాతగా ఉన్న దిలీప్ వ్యాపారవేత్త కూడా. ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించారు.
మాలీవుడ్‌లోని టాప్ యాక్టర్స్‌లో దిలీప్‌ని ఒకరిగా చూస్తుంటారు. సామాన్య కుటుంబంలో పుట్టిన దిలీప్, కేరళ సినీ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు.
మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మొదలైన ఆయన ప్రయాణం టాప్ హీరో స్థాయికి చేరింది. థియేటర్లు, రియల్ ఎస్టేట్, హోటళ్లు... ఇలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని దిలీప్ బాగా విస్తరించుకున్నారు.
మళయాళ సినిమాలోని అత్యంత బలవంతుల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన దిలీప్ ఇమేజ్, భావన రేప్ కేసుతో మసకబారుతూ వచ్చింది. చివరకు మళయాళం మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ ఆయనను బహిష్కరించింది.
ఇప్పుడు కేసు విచారిస్తున్న పోలీసులను బెదిరించారనే ఆరోపణలతో మరొకసారి దిలీప్ వార్తల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే న్యాయం జరిగే వరకు తాను పోరాడతానంటూ భావన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
గత అయిదేళ్లుగా తన గొంతు నొక్కేందుకు ప్రయత్నించారని, కానీ దోషులకు శిక్షపడే వరకు తాను నిలబడతానంటూ భావన చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- దళిత్ పాంథర్: ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఎందుకు ముక్కలైంది, దళితుల పోరాటాల్లో దాని పాత్ర ఏంటి?
- ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన యూపీ డిప్యూటీ సీఎం, ఏ ప్రశ్న అడిగితే ఆయనకు కోపం వచ్చిందంటే..
- రెండేళ్ల తర్వాత కూడా కోవిడ్ గురించి మనకు తెలియని 3 కీలక విషయాలు
- సుధా భరద్వాజ్: ప్రముఖ సామాజిక కార్యకర్త జైలు జీవితం ఎలా గడిచిందంటే..
- సంక్రాంతి పండుగకు తెలుగువారు చేసే స్పెషల్ వంటకాల కథ
- పవన్ కల్యాణ్: 'ఎవరి మైండ్ గేమ్‌లోనూ పావులు కావద్దు' - ప్రెస్ రివ్యూ
- రామగుండం: ఇండియాలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఎలా పనిచేస్తుందంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














