రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్: నీటిపై తేలే అతి పెద్ద విద్యుదుత్పత్తి కేంద్రం ఎలా పని చేస్తుంది.. దీనివల్ల మత్స్య సంపదకు నష్టం లేదా?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో 'నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కార్పొరేషన్'(ఎన్టీపీసీ) 'నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం'( ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్) నిర్మిస్తోంది. నిర్మాణదశలోనే ఇది దేశంలోనే 'అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్'గా రికార్డులకు ఎక్కింది.
ప్రస్తుతం ఇక్కడ ప్రతి రోజు 37.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతోంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసేలా దీన్ని మరింత పెద్దగా నిర్మిస్తున్నారు.
గతంలో ఈ రికార్డ్ విశాఖపట్నంలోని సింహాద్రి ఎన్టీపీసీ ప్రాజెక్ట్ సొంతం.
రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అవసరాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని కాలువ ద్వారా తీసుకువచ్చి నిల్వ చేసేందుకు గతంలో ఓ రిజర్వాయర్ నిర్మించారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో సుమారు వెయ్యి ఎకరాల్లో నీరు నిల్వ ఉంది.
ఈ రిజర్వాయర్‌లోనే దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. 100 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకునేటప్పటికి ఈ సోలార్ ప్లాంట్ రిజర్వాయర్ లోపల నీటి ఉపరితలంపై 450 ఎకరాల మేర విస్తరిస్తుంది.

గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యం
అణు, బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాలలో కర్బన ఉద్గారాలతో వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ లాంటి దేశాల్లో థర్మల్ విద్యుత్ వాటా ఎక్కువ.
భూతాప నివారణ లక్ష్యాలలో భాగంగా థర్మల్ విద్యుత్‌ను తగ్గించాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ 2032 నాటికి 6 వేల గిగావాట్ల 'గ్రీన్ పవర్' ( పర్యావరణహిత విద్యుత్) ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపన వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల, విద్యుత్ అవసరాలు తీరడంతో పాటుగా పర్యావరణానికి మేలు కలగనుంది.
''ఈ పునరుత్పాదక వనరుల్లో ముఖ్యంగా సౌరశక్తి తో విద్యుత్ ఉత్పత్తి పై ఎక్కువగా 'నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ట (ఎన్టీపీసి) దృష్టి సారించింది. 2005 నుంచే ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రి ఎన్టీపీసీ ప్లాంట్‌లోని రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ఉత్పత్తిపై ఎన్టీపీసీ ప్రయోగాలు చేస్తూ వస్తోంది'' అని రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ బీబీసీతో చెప్పారు..
''ప్రస్తుతం రోజూ 37.5 మెగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేసి సదరన్ గ్రిడ్‌కు అందిస్తున్నాం. మరో 30 మెగావాట్ల సోలార్ ప్యానల్స్ కేబుల్స్ కలిపే పని కొనసాగుతోంది. ఫిబ్రవరి 2022 నాటికి పూర్తి స్థాయిలో 100 మెగావాట్ల ఉత్పత్తి సాధిస్తాం'' అని ఆయన తెలిపారు.

నీటిపై తేలియాడే ప్లాంట్లో ఎన్నెన్నో ప్రత్యేకతలు
కేరళలోని కాయంకుళంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ సింహాద్రి థర్మల్ స్టేషన్‌లలో గతంలో 'ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్'లను ఎన్టీపీసీ నిర్మించింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లలో సౌరశక్తి ని గ్రహించి విద్యుత్ శక్తి గా మార్చే సోలార్ ప్యానల్స్ మాత్రమే నీటిపై తేలియాడుతూ ఉంటాయి.
అందుకు భిన్నంగా రామగుండం ఎన్టీపీసీలో తేలియాడే పవర్ స్టేషన్‌లో సోలార్ ప్యానల్స్‌తో పాటుగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కు ఉపయోగించే అన్ని రకాల యంత్రాలు, పరికరాలు నీటిపైనే తెలియాడుతూ ఉండటం ప్రత్యేకత.
''ప్రస్తుతం దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ ఇదే. రిజర్వాయర్ మధ్యలో నీటి ఉపరితలంపై విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్న యంత్రాలన్నీ నీటిపైనే తేలియాడుతూ ఉంటాయి. సోలార్ ప్యానల్స్ తోపాటు ట్రాన్స్ ఫార్మర్. ఇన్వర్టర్, స్విచ్ గేర్ ప్యానల్ అన్నీనీటిపైనే తేలియాడుతున్నాయి'' అని ఎన్టీపీసి, రామగుండం సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ విభాగం జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ ‘బీబీసీ’తో చెప్పారు.
విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్న పరికరాలను 'ఫెర్రో సిమెంట్' టెక్నాలజితో నిర్మించిన ఫ్లాట్‌ఫామ్‌లపై నిలిపారు. ఈ ఫ్లాట్‌ఫామ్‌ల నిర్మాణం లోపల వైపు బోలుగా ఉండి, నీటిపై తేలియాడేందుకు సహకరిస్తుంది. అదే సమయంలో అత్యధిక బరువును మోయగలుగుతుంది.
ఒక్కో ఫెర్రో సిమెంట్ ఫ్లాట్‌ఫామ్‌పై 96 టన్నుల బరువైన యంత్రాలు నీటిపై తేలియాడుతున్నాయి. మొత్తం 4 పూలింగ్ ప్యానల్స్ వద్ద, నాలుగు ఫెర్రో సిమెంట్ ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.
ఈ సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్‌కు హైదరాబాద్‌కు చెందిన 'భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్' (బీహెచ్ఈఎల్) అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తోంది. 430 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.

తెలంగాణలో మెరుగైన అవకాశాలు
ఫ్లోటింగ్ సోలార్ పవర్ ఉత్పత్తికి దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అధ్యయనంలో తేలింది. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు.
''తెలంగాణలో, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయి. భూ సేకరణ సమస్యలూ ఉండవు. బొగ్గు, గ్యాస్ లాంటివి వినియోగించం కాబట్టి రిజర్వాయర్ల ద్వారా సాగు, తాగు నీటి అవసరాలతో పాటు భవిష్యత్తు విద్యుత్ అవసరాలు తీరతాయి. దీంతో పర్యావరణానికి హాని ఉండదు'' అని రామగుండం ఎన్టీపీసి సీజీఎం సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు.
పలు రాష్ట్రాలకు చెందిన అధ్యయన బృందాలు ఇక్కడికి వచ్చి ప్లాంట్ పనితీరును పరిశీలించి వెళ్లాయని సునీల్ కుమార్ బీబీసీతో చెప్పారు.
కరీంనగర్ శివారులో 'లోయర్ మానేరు డ్యామ్' (ఎల్ఎండీ) లో ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల ఆధ్వర్యంలో ఇదే తరహా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణ అవకాశాలు పరిశీలన స్థాయిలో ఉన్నాయి.

తేలియాడే 100 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణంతో ..
* 450 ఎకరాల భూసేకరణ అవసరం తప్పింది.
* రిజర్వాయర్ ఉపరితలంపై సోలార్ ప్యానల్స్ కప్పడం వల్ల ఏటా 32 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సూర్యరశ్మికి ఆవిరి కాకుండా పొదుపు అవుతోంది. ఇది 45 వేల కుటుంబాలు ఒక సంవత్సరం పాటు వినియోగించే నీటికి సమానం.
* 100 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన లక్షన్నర టన్నుల బొగ్గు వాడకాన్ని తగ్గించినట్లవుతోంది. తద్వారా ఏటా లక్షా11 వేల టన్నుల కర్బన ఉద్గారాలను అడ్డుకున్నట్లే.
* 100 మెగావాట్ల ఉత్పత్తి కోసం 450 ఎకరాల విస్తీర్ణంగల నీటి ఉపరితలంపై 4.48 లక్షల సౌర ఫలకాలు (సోలార్ ప్యానల్స్) పరిచారు.
* భూమిపై నిర్మించే సౌరశక్తి కేంద్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వాటి ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. అదే నీటిపై తేలియాడే ప్లాంట్‌లో నీటి చల్లదనం కలిసి వస్తుంది. తద్వారా సామర్థ్యానికి మించి అదనంగా మరో 5 శాతం మేర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది.
ఎండ మరీ ఎక్కువగా ఉంటే సౌర విద్యుదుత్పత్తి తగ్గుతుందా?
సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు, ఎండ ఎక్కువగా ఉంటే సౌర విద్యుత్ ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చని అనుకుంటారు. కానీ, నిర్ణీత ఉష్ణోగ్రతలు దాటిన తరువాత ఉత్పత్తి తగ్గుతుందని, కానీ, నీటిపై తేలియాడే ఈ ప్లాంట్‌లో అలాంటి పరిస్థితులలో కూడా తగ్గదని రామగుండం ఎన్టీపీసీ సోలార్ ఎనర్జీ ప్లాంట్ జీఎం అనిల్ కుమార్ చెప్పారు.
‘‘సోలార్ ప్యానల్స్ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలే. సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలు 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. రామగుండం ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లో వినియోగించిన సౌర పలకలను ఇక్కడి ప్రత్యేక పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు (రామగుండం ప్రాంతంలో సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ థర్మల్ స్టేషన్ ఉండటం వల్ల టెంపరేచర్స్ బయటి ప్రాంతంతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతాయి. అందుకు తగ్గట్లుగా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువైనా తట్టుకునేలా వీటిని రూపొందించారు). సౌర విద్యుత్ అంటే సూర్యరశ్మితో విద్యుత్ ఉత్పత్తి అని అనుకుంటారు. నిజానికి ఈ పద్దతిలో విద్యుత్ ఉత్పత్తి జరిగేది సూర్యకాంతిలోని 'ఎలక్ట్రో మాగ్నేటిక్ రేడియేషన్' వల్ల. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే ఎక్కువ సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందనుకోవడం పొరపాటే. సౌర విద్యుత్ పలకలు నీటిపై తేలియాడుతూ ఉండటం వల్ల, నీరు టెంపరేచర్‌ను కంట్రోల్ చేసేందుకు తోడ్పడుతుంది. ఇలా సౌరపలకలు చల్లబడటం వల్ల మరో 5 శాతం ఉత్పత్తి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది’ అని అనిల్ కుమార్ వివరించారు.
జలచరాలకూ ఇబ్బంది లేదు
నీటి ఉపరితలంపై సోలార్ ప్యానళ్లు కప్పడం వల్ల ఆ నీటిలో ఆల్గే (నాచు) పెరుగుదలను నివారించవచ్చు. ఇది నీరు పరిశుభ్రంగా ఉండేందుకు తోడ్పడుతుంది. జలచరాలకు ఇబ్బంది ఏమీ ఉండదని ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో తేలింది. నిజానికి ఇది రామగుండం ఎన్టీపీసి ధర్మల్ పవర్ స్టేషన్ కు అవసరమయ్యే నీటి కోసం నిర్మించిన పారిశ్రామిక అవసరాలు తీర్చే రిజర్వాయర్. ఇందులో చేపల పెంపకం జరగదు అని అనిల్ కుమార్ తెలిపారు.
‘ఆక్సిజన్స్ స్థాయి తగ్గదు.. జలచరాలకు మంచిదే’
నీటి వనురుల్లో ఎక్కువగా నత్రజని సంబందిత వ్యర్థాలు చేరడంవల్ల 'ఆల్గల్ బ్లూమ్స్' ఎక్కువగా ఏర్పడతాయని కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈఎన్ మూర్తి చెప్పారు.
‘అంటే విపరీతంగా నాచు మొక్కలు పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఆక్సిజన్‌ను గ్రహించడం వల్ల, ఆ నీటిలో పెరిగే జలచరాలకు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది.
ఈ మొత్తాన్ని "యూ ట్రాఫికేషన్" అంటారు. ఇలా సౌరపలకలను కప్పిఉంచడం ద్వారా ఆల్గే పెరుగుదల నియంత్రణలో ఉంటుంది. ఇది అందులోని జలచరాలకు ఓ విధంగా మంచిచేసినట్టేనని ప్రొఫెసర్ మూర్తి చెప్పారు.
నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే జలవనరులను 'లెంటిక్ సిస్టం' అని పిలుస్తారు. వీటిలో మానవ విసర్జితాలు, యూరియా ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది.
అయితే రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో నీరు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాడుతుండటం వల్ల ఎక్కువ కాలం నిల్వఉండదు. దీన్ని 'లోటిక్ ఎకో సిస్టం' అంటే ప్రవహించే నీటి వనరుగానే భావించాలి.
లోటిక్ ఎకో సిస్టం చేపల పెంపకానికి అనువైనది. జలచరాలకు అనుకూలమైన ఆక్సిజన్ లెవల్స్ ఇందులో ఉంటాయి అని ప్రొఫెసర్ మూర్తి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కజకిస్తాన్ సంక్షోభం: భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన డజన్ల కొద్దీ నిరసనకారులు
- ప్రధాన మంత్రి భద్రత ఎలా ఉంటుంది? పంజాబ్ పర్యటనలో పొరపాటు ఎలా జరిగింది?
- హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా
- అమరావతి: క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ వ్యవహారం మళ్లీ ఎందుకు ముందుకొచ్చింది?
- కాలిఫోర్నియాలో వేర్వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలలు
- సింధుతాయి సప్కాల్: అనాథల అమ్మ ఇక లేరు... చేతిని ముంగిస కొరికేస్తున్నా ఆమె ఓ కాగితం కోసం ఎందుకంత పోరాటం చేశారు?
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











