ఒమిక్రాన్: జలుబు చేసిన తర్వాత ఏర్పడే రోగ నిరోధకత కోవిడ్ నుంచి కాపాడుతుందా

జలుబు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్మిత ముందసాద్
    • హోదా, బీబీసీ హెల్త్

జలుబు నుంచి కాపాడేందుకు శరీరంలో ఏర్పడే సహజమైన రక్షణ కణాలు కోవిడ్ 19 నుంచి కూడా కొంత రక్షణ ఇస్తాయని ఒక అధ్యయనం చెబుతోంది.

ఈ అధ్యయనం ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇందులో కోవిడ్ 19 సోకిన వారితో గడిపిన 52 మంది పాల్గొన్నారు.

జలుబు చేసిన తర్వాత కొన్నాళ్లపాటు మళ్లీ జలుబు రాకుండా కాపాడేందుకు శరీరంలో తయారైన రోగ నిరోధక కణాలు "మెమరీ బ్యాంక్ లో నిక్షిప్తమై ఉంటాయి. అలా రోగ నిరోధక కణాలున్న వారిలో కోవిడ్ సోకే అవకాశం తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

అయితే, ఈ ఒక్క విషయం ఆధారంగా ఎవరూ కోవిడ్‌ను తేలికగా తీసుకోరాదని నిపుణులు అంటున్నారు. కోవిడ్ నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సీన్లు తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.

కానీ, శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడే విధానం గురించి తెలుసుకునేందుకు ఈ అధ్యయన ఫలితాలు కొంతవరకు పనికొస్తాయని భావిస్తున్నారు.

కోవిడ్ 19 కరోనావైరస్ వల్ల వస్తుంది. ఇతర రకాల కరోనా వైరస్‌ల వల్ల కూడా మరి కొన్ని రకాలైన జలుబులు వస్తాయి. ఒక రోగానికి చేకూరిన రోగ నిరోధక శక్తి మరొక రోగం నుంచి కూడా కాపాడుతుందో లేదోనని శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు.

జలుబు చేసి తగ్గిన వారందరికీ, కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని అనుకోవడం చాలా పెద్ద తప్పు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబులన్నీ కరోనా వైరస్ వల్ల ఏర్పడేవి కావని అంటున్నారు.

వైరస్ సోకిన తర్వాత కూడా కొంత మందికి కోవిడ్ వస్తుంటే మరి కొందరికి ఎందుకు రావడం లేదనే విషయం గురించి మరింత అర్థం చేసుకోవాలని లండన్ ఇంపీరియల్ కాలేజీ నిపుణులు చెబుతున్నారు.

జలుబు

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్ కీలకం

ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు శరీరంలో కీలకమైన రోగ నిరోధక వ్యవస్థ - టి సెల్స్ పై దృష్టి పెట్టారు.

కొన్ని టి-సెల్స్ శరీరానికి ముప్పు కలిగించే ఎలాంటి వైరస్‌నైనా చంపేస్తాయి.

జలుబు తగ్గిన తర్వాత కూడా కొన్ని టి సెల్స్ శరీరంలో మెమరీ బ్యాంక్‌లో ఉండిపోతాయి. వైరస్ సోకినప్పుడు అవి దానిపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి.

సెప్టెంబరు 2020లో అధ్యయనకారులు వ్యాక్సీన్ తీసుకోకుండా కోవిడ్ 19 సోకిన వారితో కలిసి ఉన్న 52 మందితో అధ్యయనం నిర్వహించారు.

28 రోజుల పాటు సాగిన అధ్యయనంలో పాల్గొన్న సగం మందికి కోవిడ్ సోకగా, సగం మందికి సోకలేదు.

కోవిడ్ సోకని వారి శరీరంలోని రక్తంలో టి-కణాల శాతం అత్యధిక స్థాయిలో ఉన్నట్లు తేలింది.

వారికి కరోనా వైరస్‌ను పోలిన మరో వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఈ కణాలు శరీరంలో తయారై ఉండవచ్చని భావిస్తున్నారు.

దీంతో పాటు వారుండే ఇంటిలో గాలి, వెలుతురు లాంటి అంశాలను కూడా అధ్యయనకారులు పరిగణనలోకి తీసుకున్నారు.

అయితే, ఈ అధ్యయనం చాలా చిన్న స్థాయిలో జరిగిందని రీడింగ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సైమన్ క్లార్క్ అంటున్నారు.

మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ వైరస్ తో పోరాడి భవిష్యత్తులో వ్యాక్సీన్ల అభివృద్ధి ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని క్లార్క్ అన్నారు.

"అలా అని ఇటీవల జలుబు చేసిన వారందరికీ కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని అనుకోవడం కూడా పెద్ద తప్పు అవుతుంది. జలుబు సోకిన వారిలో 10-15% మందికి మాత్రమే కరోనా వైరస్ కారణమవుతుంది" అని చెప్పారు.

"కోవిడ్ నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సీన్లు కీలకం" అని ప్రొఫెసర్ అజిత్ లాల్వాని చెప్పారు. ఈ అధ్యయనంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

"ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్‌ను మాత్రమే లక్ష్యం చేసుకుంటాయి. కానీ, ఈ స్పైక్ ప్రోటీన్లు కొత్త వేరియంట్లకు అనుగుణంగా మారిపోతూ ఉంటాయి.

శరీరంలో ఉండే టి కణాలు మాత్రం అంతర్గతంగా ఉన్న వైరస్ ప్రొటీన్లపై దాడి చేస్తాయి. ఇవి వేరియంట్లకు అనుగుణంగా మారవు. అంటే టి-కణాలకు వ్యాక్లీన్లు రక్షక కవచంగా పని చేసి కోవిడ్ కు వ్యతిరేకంగా దీర్ఘకాలిక, బలమైన రక్షణను కల్పిస్తాయి" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)