భారతదేశం బొగ్గు కథ: 31,900 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్న దేశంలో సంక్షోభం ఎందుకొచ్చింది?

భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70% కంటే ఎక్కువ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70% కంటే ఎక్కువ
    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత దేశంలో బొగ్గు సంక్షోభం ఎందుకు వచ్చిందన్నది తెలుసుకునే ముందు, దానిని తవ్వడం ఎప్పుడు మొదలుపెట్టారన్నది తెలిసి ఉండాలి. భారతదేశంలో పారిశ్రామిక అవసరాలకు బొగ్గును వినియోగించే ప్రస్థానం పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్‌లో ప్రారంభమైంది.

ఈస్ట్ ఇండియా కంపెనీ 1774లో నారాయణకుడి ప్రాంతంలో మొదటిసారిగా బొగ్గు గని తవ్వింది.

అయితే, అప్పటికి పారిశ్రామిక విప్లవం భారతదేశానికి ఇంకా చేరుకోలేదు. కాబట్టి, బొగ్గుకు డిమాండ్ చాలా తక్కువగా ఉండేది. తరువాత దాదాపు ఒక శతాబ్దం వరకు దేశంలో బొగ్గు ఉత్పత్తి ఊపందుకోలేదు.

1853లో భారతదేశంలో తొలి పాసింజర్ రైలు నడవడం, ఆవిరి ద్వారా నడిచే రైలు ఇంజిన్లు అభివృద్ధి చెందడంతో బొగ్గు ఉత్పత్తి, వినియోగం రెండూ పెరిగాయి.

20వ శతాబ్దం ప్రారంభానికి దేశంలో బొగ్గు ఉత్పత్తి సంవత్సరానికి 61 లక్షల టన్నులకు చేరుకుంది. స్వతంత్రం తరువాత భారతదేశ లక్ష్యాలు పెరిగాయి. వాటిని చేరుకునేందుకు బొగ్గు ఒక ముఖ్య సాధనంగా మారింది.

భారీ వర్షాల కారణంగా బొగ్గు వెలికితీతకు అవాంతరాలు ఏర్పడ్డాయి.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారీ వర్షాల కారణంగా బొగ్గు వెలికితీతకు అవాంతరాలు ఏర్పడ్డాయి.

అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ఒకటి

ప్రపంచంవ్యాప్తంగా, బొగ్గు ఉత్పత్తి, వినియోగంలో చైనా తరువాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది. భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70% కంటే ఎక్కువ.

1973లో బొగ్గు గనులను జాతీయం చేసినప్పటి నుంచి ప్రభుత్వ సంస్థలే అధిక శాతం బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. కోల్ ఇండియా సంస్థ 90 శాతానికి పైగా బొగ్గును ఉత్పత్తి చేస్తోంది.

కొన్ని గనులను పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఇచ్చారు. వాటిని క్యాప్టివ్ మైన్స్ అంటారు. వీటిల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును ఆ సంస్థలు తమ ప్లాంట్లలో మాత్రమే వినియోగిస్తాయి.

ప్రపంచంలో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న దేశాలు అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం.

భారతదేశంలో 31,900 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది.

జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో అతి పెద్ద బొగ్గు నిల్వలు ఉన్నాయి. అందుకే దీన్ని కోల్ బెల్ట్ అని పిలుస్తారు.

ఇవే కాకుండా, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, మేఘాలయ, అస్సాం, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనులు ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నా భారతదేశంలో బొగ్గు సంక్షోభం ఎందుకు వచ్చింది?

దీని నుంచి సకాలంలో బయటపడకపోతే, భారీ విద్యుత్ కోతలు ఉండవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో బొగ్గు పరిస్థితి ఏంటి?

దేశంలో ఉన్న 135 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో మూడింట రెండు వంతులు ప్రస్తుతం బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

సాధారణంగా బొగ్గు కర్మాగారాలు ఒక నెలకు కావలసిన బొగ్గును నిల్వ చేస్తాయి. కానీ, సంక్షోభంలో పడిన ప్లాంటులలో సగటున మూడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి.

2021 జూలైలో ఈ బొగ్గు కర్మాగారాల్లో సగటున 17 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోయిందని 'ఇండియా రేటింగ్స్' తన పరిశోధనలో తెలిపింది. తగినన్ని బొగ్గు నిల్వలు లేకపోవడంతో చాలా ప్లాంటులు మూతపడ్డాయి.

"ఆగస్టు 31 నాటికి మొత్తం 3.9 GW సామర్థ్యం గల ప్లాంట్లు మూతపడ్డాయి. సెప్టెంబర్ 30 నాటికి, 13.2 GW సామర్థ్యం గల ప్లాంట్లు, అక్టోబర్ 8 నాటికి 20.3GW సామర్థ్యం గల ప్లాంట్లు మూతపడ్డాయి" అని ఇండియా రేటింగ్స్‌కు చెందిన నితిన్ బన్సల్ తెలిపారు.

2021 జూలై 31 నాటికి కేవలం రెండు ప్లాంట్లు మాత్రమే మూతపడ్డాయి. అక్టోబర్ 10 నాటికి ఆ సంఖ్య పదహారుకు పెరిగింది. అదే రోజుకు, మరో ముప్ఫై ప్లాంటుల్లో కేవలం ఒక రోజుకు సరిపడా బొగ్గు మిగిలి ఉంది.

దేశంలో విద్యుత్ సరఫరా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. రాష్ట్రాలు విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తాయి. అనంతరం వినియోగదారులకు సరఫరా చేస్తాయి.

అనేక రాష్ట్రాల్లో ప్రయివేటు కంపెనీలు కూడా విద్యుత్ పంపిణీ చేస్తాయి.

ప్రస్తుతం బొగ్గు కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. రాజస్థాన్‌లోని 12 జిల్లాల్లో రోజుకు గంట నుంచి నాలుగు గంటల పాటూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.

రాంచీలో బొగ్గు రేక్‌ను పరిశీలిస్తున్న కేంద్ర బొగ్గు మంత్రి ప్రహ్లాద్ జోషి

ఫొటో సోర్స్, PRALHAD JOSHI

ఫొటో క్యాప్షన్, రాంచీలో బొగ్గు రేక్‌ను పరిశీలిస్తున్న కేంద్ర బొగ్గు మంత్రి ప్రహ్లాద్ జోషి

అంతా బాగానే ఉందంటున్న ప్రభుత్వం

భారత ఆర్థిక రాజధాని ముంబయి కూడా విద్యుత్ కొరత ఎదుర్కొంటోంది. విద్యుత్ సరఫరా కొనసాగించాలంటే తక్షణమే 73,000 కోట్ల నిధులు అవసరమని మహారాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ చెబుతోంది.

మరో వైపు, విద్యుత్‌ను జాగ్రత్తగా వినియోగించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇటు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహకరించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని మోదీకి లేఖ రాశారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండాలంటే, యూనిట్‌కు రూ. 17 చొప్పున ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని యూపీ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి శ్రీకాంత్ సింగ్ తెలిపారు.

కాగా, పరిస్థితి చేయి దాటిపోలేదని, అంతా బాగానే ఉందని, త్వరలో బొగ్గు సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. "విద్యుత్ సరఫరా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.

బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కోల్ ఇండియా సంస్థను ప్రభుత్వం కోరింది. దానితో పాటుగా, విద్యుత్ ప్లాంట్ల కోసం క్యాప్టివ్ గనుల నుంచి కూడా బొగ్గును తీసుకుంటున్నారు.

గత కొద్ది రోజులుగా ప్రహ్లాద్ జోషి బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో పర్యటిస్తూ, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరో వైపు, బొగ్గు సరఫరా సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భారతీయ రైల్వేకు విజ్ఞప్తి చేసింది.

31,900 కోట్ల టన్నుల బొగ్గు నిల్వల మాటేంటి?

బొగ్గు మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, భారతదేశంలో 31,900 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో 73.08 కోట్ల టన్నులు, 2020-21 సంవత్సరంలో 71.60 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు.

ఇది దేశ అవసరాలకు సరిపోతుంది.

సాధారణంగా అక్టోబర్ నెలలో బొగ్గుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈసారి అక్టోబర్‌లో థర్మల్ ప్లాంట్లకు కావలసినంత బొగ్గు సరఫరా కాకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

కరోనా మహమ్మారి తరువాత భారతదేశ ఆర్థికవ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. కోవిడ్ మొదటి వేవ్ తరువాత ఆర్థికవ్యవస్థ 7.3 శాతం క్షీణించింది. పరిశ్రమలు కాస్త కోలుకుంటూ ఉండగా, 2021 ఏప్రిల్, మేలలో సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది.

2019 ఆగస్టుతో పోలిస్తే 2021 ఆగస్టులో విద్యుత్ వినియోగం 16 శాతం పెరిగింది. అయితే బొగ్గు ఉత్పత్తిలో అతి పెద్ద సంస్థ అయిన కోల్ ఇండియా, పెరిగిన ఈ డిమాండ్‌ను అంచనా వేయడంలో విఫలమైందని విశ్లేషకులు అంటున్నారు.

రుతుపవనాలు ఆలస్యంగా రావడం, భారీ వర్షాలు కారణంగా పరిస్థితి మరింత దిగజారిందని నితిన్ బన్సాల్ అన్నారు. వర్షాలకు కోల్ బెల్ట్ ప్రాంతంలో బొగ్గు గనులు నీటితో నిండిపోయాయి. దాంతో, ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నాయి
ఫొటో క్యాప్షన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నాయి

అంతర్జాతీయంగా బొగ్గు ధర ఎందుకు పెరిగింది?

ప్రపంచంలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, వినియోగం ఉన్న చైనా కూడా ప్రస్తుతం సంక్షోభంలో పడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా అక్కడి బొగ్గు గనుల్లో కూడా అధికంగా నీరు చేరింది. దాంతో, బొగ్గు ఉత్పత్తికి ఆంటంకం ఏర్పడింది.

కాగా, బొగ్గు ఎక్కడ ఏ ధరకు లభించినా, దాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తోంది చైనా. దీని కారణంగా కూడా అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర పెరిగిపోతోంది.

ఆస్ట్రేలియా న్యూకాసల్ బొగ్గు ధరలు 250 శాతం పెరిగాయి. ఇండోనేషియా నుంచి భారతదేశం అత్యధికంగా బొగ్గు కొనుగోలు చేస్తుంది. అక్కడ కూడా బొగ్గు ధరలు పెరిగిపోయాయి. టన్ను బొగ్గు ధర 60 డాలర్ల (రూ. 4500) నుంచి 200 డాలర్లకు (రూ. 15,000) పైగా పెరిగింది.

భారతదేశంలో తీర ప్రాంతాల్లో ఉన్న బొగ్గు కర్మాగారాలు అధికంగా బొగ్గును దిగుమతి చేసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో ఈ ప్లాంటులు కూడా మూతపడుతున్నాయి.

భారత్‌లో ఇతా దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే ప్లాంటుల సామార్థ్యం 16.2DW.

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్లాంట్లు వాటి సామర్థ్యంలో 54 శాతం విద్యుత్ ఉత్పత్తి చేశాయి. 2021 సెప్టెంబర్ నాటికి 15 శాతానికి పడిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు పెరిగిపోతున్న కారణంగా దిగుమతులు బాగా తగ్గిపోయాయి.

"అధిక ధరల వద్ద బొగ్గు కొనుగోలు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంటులకు కష్టం. ఎందుకంటే, విద్యుత్ ధర పెరిగిపోతుంది. అంత ఖరీదు పెట్టి కొనేందుకు కొనుగోలుదారులు దొరకరు. ప్లాంటులకు నష్టం కలుగుతుంది" అని నితిన్ బన్సాల్ అన్నారు.

గుజరాత్ తీరంలో అదానీ, టాటా సంస్థలకు చెందిన రెండు పవర్ ప్లాంట్లూ దేశ ఇంధన అవసరాలలో 5 శాతం వరకు ఉత్పత్తి చేయగలవు. కానీ, బొగ్గు ధరలు పెరగడంతో ఈ రెండు కూడా మూతపడ్డాయి.

సాధారణంగా విద్యుత్ సంస్థలు, విద్యుత్ ప్లాంట్లతో బేరం కుదుర్చుకుంటాయి. అయితే, ఇప్పుడు ఈ ప్లాంట్ల అదనపు ఖర్చుల భారాన్ని కంపెనీలపై పెట్టాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది.

"ప్రభుత్వం, ఈ ప్లాంట్ల నుంచి ఖరీదైన రేట్ల వద్ద విద్యుత్ కొనుగోలు చేయగలిగితే కరెంటు సంక్షోభాన్ని చాలా వరకు నివారించవచ్చు. కానీ ఈ నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలి" అని నితిన్ బన్సాల్ అన్నారు.

ఈ సంక్షోభంలో కోల్ ఇండియా బాధ్యత ఎంత?

భారతదేశంలో బొగ్గు సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటివరకూ దేశ అవసరాలకు తగినంత బొగ్గును ఉత్పత్తి చేసుకుంటూనే ఉన్నాం.

అయితే, పెరుగుతున్న బొగ్గు అవసరాలను అంచనా వేయడంలో కోల్ ఇండియా విఫలమైందని.. ప్రస్తుత సంక్షోభం సహజసిద్ధంగా ఏర్పడినది కాదని, నిర్లక్ష్య ఫలితమని విశ్లేషకులు భావిస్తున్నారు.

"దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. సమస్య ఉత్పత్తికి సంబంధించినది. బొగ్గు రంగంలో ప్రబలిన అవినీతి కూడా పరిస్థితిని మరింత జఠిలం చేసింది" అని ధన్‌బాద్ కోల్ బెల్ట్ కార్యకర్త విజయ్ ఝా అన్నారు.

"బొగ్గు కంపెనీలు డిమాండ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. దీనికి తోడు, దోపిడీ మరో పెద్ద సమస్య. కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించడం ద్వారా భారీ స్థాయిలో దోపిడీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ సంక్షోభానికి కోల్ ఇండియాను బాధ్యురాలు చేయడం దురదృష్టకరమని కేంద్ర ప్రభుత్వ మాజీ బొగ్గు కార్యదర్శి అనిల్ స్వరూప్ అన్నారు.

"కోల్ ఇండియా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు రూ. 20 వేల కోట్ల బాకీలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితికి కారణం, కంపెనీలు 20 రోజులకు కావలసిన నిల్వలు ఏర్పాటు చేసుకోలేకపోవడమే. కరోన కారణంగా సప్లై, డిమాండ్ మధ్య అంతరం పెరిగింది. కానీ, కోల్ ఇండియా ఉత్పత్తి స్థిరంగా ఉంది.. 2018లో 60.60 కోట్ల టన్నులు, 2019-20లో 60.20 కోట్ల టన్నులు, 2020-21లో 59.60 కోట్ల టన్నులు ఉత్పత్తి చేసింది" అని ఆయన వివరించారు.

భారీ ఎత్తున బొగ్గును ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ఒకటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ ఎత్తున బొగ్గును ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ఒకటి

బొగ్గుపై ఆధారపడడాన్ని భారత్ తగ్గించగలదా?

గత దశాబ్దంలో భారతదేశంలో బొగ్గు వినియోగం రెట్టింపు అయింది. పెద్ద మొత్తంలో నాణ్యమైన బొగ్గును దిగిమతి చేసుకుంటూనే ఉంది. అదనంగా, రాబోయే సంవత్సరాలలో డజన్ల కొద్దీ కొత్త గనులు తెరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సుమారు 137 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో రాబోయే 20 ఏళ్లల్లో ఇంధన అవసరాలు మరింత పెరుగుతాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.

వాతవరణ మార్పులు, పర్యావరణ నియమాలను దృష్టిలో పెట్టుకుని భారతదేశం పునరుత్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేస్తోంది. కానీ, ఇప్పటికీ బొగ్గే చౌకైన ఇంధనం.

బొగ్గు ఉత్పత్తి భారీ స్థాయిలో వాయు కాలుష్యాన్ని కలిగిస్తుందన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. పర్యావరణ లక్ష్యాలను చేరుకోవాలని అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా ఉంది.

అయినా సరే, బొగ్గు ఉత్పత్తికి దూరం జరగడం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"మన దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో బొగ్గు దే మొదటి స్థానం. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలి తప్పితే వెనక్కు తగ్గే మార్గం లేదు. ఎందుకంటే, ఇతర వనరుల నుంచి అవసరానికి సరిపడా ఇంధనం ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు" అని నితిన్ బన్సాల్ అన్నారు.

ఉత్పత్తిలో సవాళ్లు ఏంటి?

బొగ్గు గన్నుల్లో 1200 మీటర్ల లోతు వరకు త్రవ్వుతున్నారు. ఇవి చాలావరకు తెరచి ఉన్న గనులు (ఓపెన్ క్యాస్ట్ మైన్స్). లోతులకు తవ్వుతున్నకొద్దీ బొగ్గును వెలికితీసే ఖర్చు పెరుగుతుంటుంది.

"రాణీగంజ్‌లో చాలా వరకు కాలం చెల్లిన గనులే. ఇదే అక్కడ ప్రధాన సమస్య. గనుల్లో బొగ్గు ఉన్నప్పటికీ ఉత్పత్తి సరిగా జరగడం లేదు. ఎందుకంటే కంపెనీలు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆశ పడుతున్నాయిగానీ గనులను సంరక్షించడంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు" అని జర్నలిస్టు బిమల్ గుప్తా చెప్పారు. బొగ్గు గనుల్లో జరిగే ప్రమాదాలపై బిమల్ గుప్తా ఒక పుస్తకం రాశారు.

"గనుల్లో ప్రమాదం జరిగితే ఉత్పత్తి ఆగిపోతుంది. తిరిగి ప్రారంభించడానికి సమయం పడుతుంది. వర్షాల కారణంగా గనులు కూలిపోవడం కూడా ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)