సుధా భరద్వాజ్: ప్రముఖ సామాజిక కార్యకర్త జైలు జీవితం ఎలా గడిచిందంటే..

ఫొటో సోర్స్, KJ Mukherjee
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సామాజిక కార్యకర్తల్లో ఒకరైన సుధా భరద్వాజ్ మూడేళ్ల పాటు జైలులో గడిపిన అనంతరం, ప్రస్తుతం ఓ కొత్త నగరంలో జీవితాన్ని అలవాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బెయిలు షరతుల్లో భాగంగా ఆమె ముంబయిని విడిచి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. 2018లో భీమా కోరేగావ్‌లో కులాల పేరుతో అల్లర్లను రెచ్చగొట్టడంతోపాటు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆమెపై ఆరోపణలు మోపారు. ఆ కేసు గురించి మాట్లాడేందుకు ఆమెకు అనుమతి లేదు.
ఈ కేసులో 2018 నుంచి ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 16 మందిని అరెస్టుచేసి జైలుకు పంపించింది.
ఇలా జైలుకు వెళ్లిన వారిలో ప్రముఖ విద్యావేత్తలు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు ఉన్నారు. అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం కింద వీరిపై కేసులు మోపారు. దీంతో వీరి బెయిలు అభ్యర్థనలు పదేపదే తిరస్కరణకు గురయ్యాయి.
ఈ చట్టాన్ని అసమ్మతిని అణచివేసేందుకు మోదీ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆరోపణలు కూడా వస్తున్నాయి.
దిల్లీలోని ప్రముఖ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పేందుకు కూడా ప్రస్తుతం సుధా భరద్వాజ్‌కు అనుమతి లేదు. దిల్లీ శివార్లలో ఫరీదాబాద్‌లోని తన ఇంటికి కూడా ఆమె వెళ్లలేకపోతున్నారు. వెయ్యి కి.మీ. దూరంలో భిలాయిలో సైకాలజీ చదువుతున్న తన కుమార్తెను చూడటానికి ఆమె వెళ్లడానికి అవకాశం లేదు. డిసెంబరు 10న బెయిలుపై విడుదలైన తర్వాత, కొన్ని రోజులు మాత్రమే కూతురితో ఆమె గడపగలిగారు.
‘‘చిన్న జైలు నుంచి ఇప్పుడు పెద్ద జైలు (ముంబయి)కి మారినట్లు అనిపిస్తోంది’’ అని 60 ఏళ్ల సుధా భరద్వాజ్ అన్నారు. విడుదలైన తర్వాత ఇదే ఆమె తొలి ఇంటర్వ్యూ.
‘‘ఉద్యోగంతోపాటు ఉండటానికి ఒక ఇల్లు కూడా వెతుక్కోవాలి. అప్పటివరకు ఓ స్నేహితురాలి ఇంటిలో ఉంటున్నాను’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, AFP
మసాచుసెట్స్‌లో జన్మించిన సుధా.. తల్లిదండ్రులతో పాటు భారత్‌కు వచ్చేశారు. న్యాయవాదిగా సేవలందిస్తూ ఆమె సామాజిక కార్యకర్తగా, ఉద్యోగ సంఘాల హక్కుల ఉద్యమకారిణిగానూ మారారు. ఛత్తీస్‌గఢ్‌లో అణగారిన పేదల కోసం ఆమె పోరాడారు.
మూడు దశాబ్దాల న్యాయ పోరాటాలు ఆమెకు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టాయి. పేదల తరఫున ఆమె కీలకమైన కేసులు వాదించారు. అయితే, కరోనావైరస్ వ్యాపి సమయంలో జైలులో గడిపిన రోజులు తనకెన్నో కొత్త పాఠాలు నేర్పాయని ఆమె అంటున్నారు.
‘‘జైలు పరిస్థితులు చాలా మారాయి. కానీ, అక్కడకు వెళ్లొచ్చిన తర్వాత, మన పరువు, ప్రతిష్ఠలపై చాలా ప్రభావం పడుతుంది’’ అని ఆమె అన్నారు.
28 అక్టోబరు 2018న సుధను అరెస్టు చేశారు. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌తోపాటు కొన్ని సీడీలనూ ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. మూడుసార్లు ఆమె బెయిలును తిరస్కరించారు. ఆమెను రెండు జైళ్లు మార్చారు.

ఫొటో సోర్స్, Getty Images
జైలు జీవితంలో సగం కాలం పుణెలోని కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎరవాడ సెంట్రల్ జైలులో ఆమె గడిపారు. దోషులుగా నిరూపితమైన వారిని ఎక్కువగా అక్కడ ఉంచుతారు. మరణ శిక్ష కోసం ఎదురుచూసే వారు ఒకప్పుడు ఉండే బ్లాకులో ఆమెను ఉంచారు.
జైలు గదులకు అనుకొని ఓ పొడవైన కారిడార్ ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఆమె ఈ కారిడార్‌లో వాకింగ్ చేసేవారు. ప్రతి రోజూ 30 నిమిషాలపాటు జైలు గది వెలుప ఆరుబయట గడిపేందుకు అనుమతించేవారు. అయితే, ఇక్కడ నీటి సమస్య ఉండేది. దీంతో స్నానం చేయడానికి, తాగడానికి బకెట్లతో నీరు మోసుకెళ్లాల్సి వచ్చేది.
పప్పు, అన్నం, ఒక కూర, రెండు రోటీలు తినడానికి ఇచ్చేవారు. కావాలంటే జైలు క్యాంటీన్ నుంచి అదనంగా ఆహారం కొనుగోలు చేసుకోవచ్చు. దీని కోసం వీరి ఖాతాల్లో నెలకు రూ.4500 వరకు కుటుంబ సభ్యులు డిపాజిట్ చేయొచ్చు. జైలులో చాపల తయారీ, కూరగాయలు, వరి పండించడం ద్వారా వీరు కొంత డబ్బులు సంపాదించొచ్చు.
తర్వాత ఆమెను ముంబయిలోని బైకుల్లా జైలుకు తరలించారు. విచారణ కోసం ఎదురుచూసే ఖైదీలతో ఈ జైలు కాస్త కిక్కిరిసి ఉంటుంది. తనను ఉంచిన మహిళల విభాగంలో 35 మందిని వరకు ఉంచొచ్చు. అయితే, ఒక సమయంలో ఇక్కడ 75 మందిని ఉంచారు. వీరంతా చాపపై ఒకరి పక్కన మరొకరు పడుకునే వారు. ఒకొక్కరికి శవపేటిక పరిమాణంలో చోటు కేటాయించేవారు.
‘‘ఖైదీలను ఒకేచోట ఎక్కువగా ఉంచడం వల్ల ఒక్కోసారి కొట్లాటలు జరిగేవి. భోజనం, మరుగుదొడ్లు.. అన్నిచోట్లా లైన్లు ఉండేవి.’’

ఫొటో సోర్స్, Press Trust of India
తమ విభాగంలోని 55 మంది మహిళల్లో 13 మందికి సెకండ్ వేవ్‌లో కోవిడ్-19 సోకింది. జ్వరం, డయేరియా రావడంతో తనను కూడా జైలు ఆసుపత్రికి తీసుకెళ్లారని, ఆ తర్వాత మళ్లీ జనం ఎక్కువగా ఉండేచోట క్వారంటైన్‌కు తరలించారని ఆమె పేర్కొన్నారు.
‘‘జైలులో ఖైదీల రద్దీని తగ్గించేందుకు న్యాయ వ్యవస్థ కృషి చేయాలి. కరోనావైరస్ విజృంభణ సమయంలోనూ కుటుంబంతో గడిపేందుకు చాలా మందికి బెయిల్ దొరకలేదు.’’
భారత్‌లోని 1339 జైళ్లలో సుమారు 4,50,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 69 శాతం మంది కేసులు విచారణలో ఉన్నాయి. జైళ్ల పరిమితి కంటే 18 శాతం అధికంగా ఖైదీలున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జైళ్ల నుంచి కొందరు ఖైదీలను విడుదల చేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు కూడా సూచించింది.
బైకులా జైలులో చాలాకాలం తోటి ఖైదీల బెయిల్ అభ్యర్థనలను సిద్ధంచేస్తూ సుధ గడిపారు. తోటి ఖైదీల్లో చాలా మంది టీబీ, హెచ్ఐవీ, ఆస్థమా లాంటి జబ్బులతో బాధపడుతున్నారు. కొందరు గర్భిణులు కూడా ఉన్నారు.
‘‘వారిలో ఎవరికీ బెయిలు రావడం లేదు. ఎందుకంటే వారి తరఫున కోర్టుల్లో వాదించేవారు లేరు’’ అని ఆమె చెప్పారు.
‘‘చాలా మందిని సెక్స్ వర్క్ చేయడం, మానవులు, మత్తుమందుల అక్రమ రవాణా కింద అరెస్టు చేశారు. మరికొంత మంది ఆర్థిక నేరస్తుల, గ్యాంగ్‌స్టర్‌ల భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.’’

ఫొటో సోర్స్, Smiti Sharma
‘‘సెకండ్ వేవ్ ఖైదీలకు నిజంగా గడ్డు పరిస్థితులు తెచ్చిపెట్టింది. కోర్టులు పనిచేయడం నిలిపివేశాయి. విచారణలు ఆగిపోయాయి. కుటుంబ సభ్యుల సందర్శనలను ఆపేశారు. నిజంగా అది చాలా కష్టకాలం.’’
‘‘కొందరు వృద్ధులకు వయసు పైబడటంతో వచ్చే వ్యాధులు ఉన్నాయి. వ్యక్తిగత పూచీకత్తుపై వారికి బెయిల్ మంజూరు చేయాల్సింది. కిక్కిరిసిన జైళ్లలో క్వారంటైన్ పేరుతో ఉంచడం సరికాదు’’
జైళ్లలో పేద ఖైదీల పరిస్థితులు, వారికి ఎలాంటి న్యాయపరమైన సాయమూ అందకపోవడం చూసి బాధ పడ్డానని సుధ చెప్పారు.
‘‘కోర్టుకు వెళ్లేవరకు కూడా చాలా మందికి వారి న్యాయవాదుల పేర్లు, ఫోన్ నంబర్లు తెలియవు. తక్కువ రుసుము తీసుకునే ఆ లాయర్లు.. ఖైదీలను కలవడానికి జైలుకు కూడా వచ్చేవారు కాదు. న్యాయపరంగా తమకు ఎలాంటి సాయమూ అందదని చాలా మంది భావించేవారు. కేవలం కొద్ది మందికి మాత్రమే సొంతంగా లాయర్లు ఉన్నారు’’ అని ఆమె వివరించారు.
జైలులో జరిగిన ఓ మీటింగ్‌లో సుధ మాట్లాడారు. కనీసం మూడు నెలలకు ఒకసారైనా లాయర్లు తమ ఖైదీలను చూడటానికి రావాలని ఆమె మీటింగ్‌లో ప్రతిపాదించారు.
‘‘మీరు జైలుకు వెళ్లిచూస్తే.. అక్కడి ఖైదీలు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారో తెలుస్తుంది. అయితే, నా కూతురు నుంచి నన్ను దూరం చేయడంతో నా బాధ మరింత ఎక్కువైంది’’ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
మహిళా ఖైదీల పిల్లల కోసం పాటలు పాడుతూ, జైలులో పనిచేస్తూ, పుస్తకాలు చదువుతూ సుధ తన జైలు జీవితాన్ని గడిపారు. ఎడ్వర్డ్ స్నోడెన్, లివియమ్ డేల్రింపుల్, నయోమీ క్లెయిన్‌ల పుస్తకాలను ఆమె చదివారు. కరోనావైరస్ మహమ్మారి విజృంభణ సమయంలో జైలు లైబ్రరీలో లభించిన ఆల్బెర్ట్ కేముస్ ద ప్లేగ్ పుస్తకాన్ని ఆమె చదివారు.
మార్చి 2020లో కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ విధిస్తారని వార్తలు వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తాను ఎప్పటికీ మరచిపోనని ఆమె అన్నారు.
‘‘ఒక్కసారిగా జైలులో నిరసనలు మొదలయ్యాయి. కొందరు నిరాహార దీక్షలు చేపట్టారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనాలను తినేందుకు నిరాకరించేవారు. ‘మేం ఇక్కడ చనిపోవాలని అనుకోవట్లేదు. మమ్మల్ని ఇంటికి పంపండి. మేం అక్కడే చనిపోతాం’అని వారు అనేవారు’’ అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు.
బయటకు వెళ్లినా లేదా లోపలున్నా వైరస్‌తో ముప్పు అలానే ఉంటుందని, అందరూ ప్రశాంతంగా ఉండాలని జైలు సూపరింటెండెంట్ చెప్పడంతో కొందరు నిరసనలు ఆపేశారు.
‘‘వారి జీవితాలు ఎంత దయనీయమైనవో ఈ ఘటన అద్దం పడుతోంది. ఖైదీలు చాలా భయపడేవారు. తమను విడుదల చేయాలని ప్రాధేయపడేవారు’’ అని సుధా భరద్వాజ్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆన్లైన్ ప్రేమతో ఎడారి పాలైన పాకిస్తాన్ యువకుడు.. ప్రేయసిని కలిసేందుకు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబాటు
- హైదరాబాద్‌లోనూ ‘బుల్లీ బాయి’ బాధితులు.. 67 ఏళ్ల ముస్లిం మహిళ ఫిర్యాదు
- చైనా మహిళలు గుండ్రని, పెద్ద కళ్ల కోసం సర్జరీలు చేయించుకుంటున్నారా
- ఒమిక్రాన్: 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏమిటి? కోవాక్జిన్ టీకా మాత్రమే ఎందుకు?
- కోవిడ్ మహమ్మారి: 2021లో నేర్చుకున్న గుణపాఠాలేంటి, మున్ముందు ఏం చేయాలి ?
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












