పవన్ కల్యాణ్: 'ఎవరి మైండ్‌ గేమ్‌లోనూ పావులు కావద్దు' - ప్రెస్ రివ్యూ

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఫొటో సోర్స్, JanaSena Party/facebook

'పొత్తులపై ఎవరేం మాట్లాడినా... మైండ్‌గేమ్‌లు ఆడినా... మనం మాత్రం పావులు కావొద్దు. ఇప్పటికే భాజపాతో పొత్తులో ఉన్నాం. ఈ వ్యవహారంలో అంతా ఒకే మాట మీద ఉందాం'' అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నట్లు 'ఈనాడు' ఒక వార్తలో తెలిపింది.

మంగళవారం పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడారు.

''పలు పార్టీలు మనతో పొత్తులు కోరుతున్నా, మనం మాత్రం ముందుగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. నా ఒక్కడి నిర్ణయం మీద ముందుకు వెళ్లను. పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచననే ముందుకు తీసుకువెళ్తా. అప్పటివరకు సంయమనంతో ఉండాలి.''

"పార్టీ స్థాపించిన ఏడేళ్లకు యువత ఇప్పుడు నాయకుల స్థాయికి రాగలిగే పరిస్థితి వచ్చింది. 676 మండలాలకుగాను 403 మండలాల్లో అధ్యక్షులను నియమించుకున్నాం. ఈ ఏడాదిలో 175 నియోజకవర్గాల్లో బూత్‌ కమిటీల నిర్మాణం చేసుకుందాం."

'కొవిడ్‌ కారణంగా గత ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించలేకపోయాం. ఈసారి దాని కోసం అయిదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ సభలో 2024 ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలి అనే అంశాలపై ఓ ఆలోచనతో ముందుకెళ్దాం'' అని పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు.

''సంక్రాంతి తర్వాత జాబ్‌ క్యాలెండర్‌, ఇతర సమస్యలను ప్రజాక్షేత్రంలోకి ఎప్పటికప్పుడు ఎలా తీసుకెళ్లాలనే దానిపై సమావేశం నిర్వహించుకొని నిర్ణయిద్దాం'' అని అన్నారు.

మార్చిలో నిర్వహించే సభ్యత్వ నమోదును మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ మరో రెండేళ్లు చిత్తశుద్ధితో అంతా శ్రమిస్తే పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నట్లు'' ఈనాడు కథనంలో రాసుకొచ్చింది.

సీఎం కేసీఆర్‌, ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ

ఫొటో సోర్స్, TRS Party/facebook

బీజేపీని గద్దె దించుదాం: తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆర్జేడీ నేత తేజస్వీల భేటీ

''బీజేపీ విచ్ఛిన్నకర విధానాలను తిప్పికొట్టేందుకు దేశంలోని లౌకిక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీజేపీని గద్దె దించేందుకు పోరాటం చేయాలి. ఇందుకోసం కార్యాచరణను త్వరలో నిర్ణయించుకోవాలి'' అని రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) ముఖ్యనేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వీ ప్రసాద్‌యాదవ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''తేజస్వీ, ఆర్జేడీ నేతలు మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ చర్చల్లో మంత్రి కేటీఆర్‌, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ వర్గాల సమాచారం ప్రకారం.. లౌకికవాద ప్రజాస్వామిక శక్తుల ఐక్యసంఘటన దిశగా దేశ రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేయాలన్న అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

ఈ సమావేశం నుంచే లాలూ ప్రసాద్‌యాదవ్‌కు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌.. ఆయన ఆరోగ్య క్షేమ, సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పట్లో ఆర్జేడీ మద్దతు ఇచ్చిన సంగతినీ గుర్తు చేసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ముందుకు రావాలంటూ కేసీఆర్‌ను లాలూ ప్రసాద్‌ ఆహ్వానించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్న కేసీఆర్‌ పాలనా అనుభవం దేశానికి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దేశ సమగ్రతను కాపాడే దిశగా జాతీయ రాజకీయాలను బలోపేతం చేయాలని, అందుకోసం సాగే బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి సాగుతామని తేజస్వీ యాదవ్‌, ఆర్జేడీ నేతలు సీఎం కేసీఆర్‌కు తెలిపారు.

ఇందులో కేసీఆర్‌ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని వారన్నారు. యూపీలో మంత్రి సహా ఒక్కొక్క ఎమ్మెల్యే బీజేపీని వీడుతుండడం ఆ పార్టీ పతనానికి నాందిగా సమావేశంలో విశ్లేషణ జరిగింది.

అఖిలేశ్‌కు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ మద్దతు పలకడం గొప్ప పరిణామమన్న ప్రస్తావనా వచ్చింది. లౌకిక శక్తుల పునరేకీకరణ దిశగా కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్జేడీ నుంచి మద్దతు ఉంటుందని తేజస్వీ బృందం స్పష్టం చేసినట్లు'' ఆంధ్రజ్యోతి వార్తలో పేర్కొంది.

ప్రతిపక్ష నేత చంద్రబాబు

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.OFFICIAL

'చిరంజీవి పార్టీ లేకపోతే 2009లో టీడీపీయే అధికారంలోకి వచ్చేది'

2009లో చిరంజీవి పార్టీ పెట్టకుండా ఉంటే తానే అధికారంలోకి వచ్చేవాడినని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు 'సాక్షి' కథనం తెలిపింది.

''అప్పుడు, ఇప్పుడు ఆయన తనకు శ్రేయోభిలాషేనని తెలిపారు. చిరంజీవే కాకుండా సినీ పరిశ్రమలో అందరూ తనతో బాగానే ఉంటారని చంద్రబాబు చెప్పారు.

టీడీపీ ఈ-పేపర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

సినిమా టికెట్ల వివాదంలోకి తమను కూడా లాగుతున్నారన్నారు. సినిమా వాళ్లను తాము సమర్థిస్తున్నట్లు చెబుతున్నారని, అయితే సినీ పరిశ్రమ పూర్తిగా తనకు అండగా నిలబడలేదన్నారు. తనకు వ్యతిరేకంగా కొన్ని సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు.

టీడీపీ ఈ-పేపర్‌కి 'చైతన్య రథం' అని పేరు పెడుతున్నాం. కొంతమంది అవినీతి సొమ్ముతో పత్రికలు, టీవీలు పెట్టారు. పేపర్లు, టీవీలు పెట్టాలని నేడు ఏనాడు అనుకోలేదు.

సినిమా టికెట్ల గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నిర్మాణ రంగం గురించి మాట్లాడటం లేదు. భారతీ సిమెంట్ ధరను సోమవారం కూడా రూ. 30 పెంచారు. ఇలా రోజూ పెంచుతూనే ఉన్నారు'' అని చంద్రబాబు అన్నట్లు'' సాక్షి పేర్కొంది.

ధాన్యం

తెలంగాణలో లక్ష్యం దాటిన ధాన్యం కొనుగోళ్లు

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు... ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) పేర్కొన్నట్లు 'నమస్తే తెలంగాణ' ఒక వార్తలో రాసుకొచ్చింది.

''186 లక్షల టన్నులతో పంజాబ్‌ మొదటి స్థానంలో నిలవగా.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ (67.65 లక్షల టన్నులు) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి.

ధాన్యం ఉత్పత్తిలో అనూహ్య రికార్డులు సాధిస్తున్న నేపథ్యంలో యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్రం చెప్పడం తెలంగాణ రైతులకు అశనిపాతంలా మారింది.

వానకాలం సీజన్‌కు సంబంధించి 68.65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాటికి రైతుల నుంచి 68.70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

మరో మూడు లక్షల టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద, కల్లాల్లో ఉన్నదనే అంచనాలున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొదటి నుంచీ కొర్రీలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం మిగిలిన ధాన్యం విషయంలో ఏ నిర్ణయం తీసుకొంటుందో అర్థంకాని పరిస్థితి నెలకొన్నది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)