బాలుడితో ఓరల్ సెక్స్‌ను తీవ్రమైన లైంగిక నేరంగా పరిగణించలేమన్న అలహాబాద్ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ కరెస్పాండెంట్
బాలునితో ఓరల్ సెక్స్‌ను అలహాబాద్ హైకోర్టు ఘోరమైన నేరంగా పరిగణించలేదు. పైగా నిందితుని శిక్షను పదేళ్ల నుంచి ఏడేళ్లకు కుదించింది.
ఈ కేసులో దాఖలైన పిటీషన్‌ను విచారించిన జస్టిస్ అనిల్ కుమార్ ఓజాతో కూడిన సింగిల్ బెంచ్ ఈ మేరకు తీర్పును వెలువరించింది.
అంతకుముందు ఈకేసును విచారించిన ట్రయల్ కోర్టు ఐపీసీ సెక్షన్ 377, 506లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద నిందితున్ని దోషిగా నిర్ధారించింది.
ఈ కేసులో సెషన్స్ కోర్టు నిందితునికి పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద శిక్షను విధించింది. ఈ మేరకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5000 జరిమానాను విధించింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును నిందితుడు హైకోర్టులో సవాలు చేశాడు.
ఈ కేసులో అనుచితంగా శిక్షను తగ్గిస్తూ అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
విషయం ఏంటి?
ఈ కేసు 2016 నాటిది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఝాన్సీ జిల్లాలో నిందితునిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
సోను కుష్వాహా అనే వ్యక్తి, తన ఇంటికి వచ్చి తన పదేళ్ల కుమారుడిని గుడికి తీసుకెళ్లాడని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. అక్కడ బాలునికి రూ. 20 ఇచ్చిన సోను కుష్వాహా ఓరల్ సెక్స్ చేయాలని అడిగాడు. 20 రూపాయలతో బాలుడు ఇంటికి రాగానే, ఫిర్యాదుదారుకి చెందిన బంధువుల్లో ఒకరు బాలుని చేతిలో ఉన్న డబ్బు గురించి ఆరా తీశారు. దీంతో బాలుడు జరిగిందంతా వారికి చెప్పాడు. అలాగే ఈ సంగతి గురించి ఎవరికీ చెప్పొద్దని సోను కుష్వాహా తనను బెదిరించాడని కూడా బాలుడు వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో సోను కుష్వాహాపై ఐపీసీ సెక్షన్ 377, 506, పోక్సో చట్టంలోని మూడు, నాలుగు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. దీనిని విచారించిన దిగువ కోర్టు సోనును దోషిగా నిర్ధారిస్తూ తీర్పును ఇచ్చింది. తర్వాత ఈ కేసు అలహాబాద్ కోర్టుకు చేరింది.
పోక్సో చట్టంలోని మూడు నుంచి పది వరకు ఉన్న సెక్షన్లలో ఈ కేసు అంశం దేని పరిధిలోకి వస్తుందనేది ఇప్పుడు కోర్టు ముందున్న ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
పోక్సోలోని ఏ సెక్షన్ వర్తిస్తుంది?
పోక్సో చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం నేరం జరగలేదని, ఈ సెక్షన్ కింద నిందితున్ని తప్పుగా దోషిగా తేల్చారని సోను తరఫు న్యాయవాది వాదించారు. నిందితుడు చేసిన నేరం పోక్సోలోని సెక్షన్ 9 (ఎం) కిందకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కేసులో, బాధితుని నోటిలో పురుషాంగం పెట్టారు కాబట్టి ఇది పోక్సో చట్టంలోని సెక్షన్ 5 లేదా 6, సెక్షన్ 9 (ఎం) కిందకు రాదని హైకోర్టు అభిప్రాయపడింది.
అత్యంత హేయమైన, తీవ్రమైన లైంగిక నేరాల కేటగిరీలోకి ఈ నేరం రాదని హైకోర్టు పేర్కొంది. తక్కువ తీవ్రత కలిగిన లైంగిక నేరాల కేటగిరీలోకి ఈ కేసు వస్తుందని, దీనికి సంబంధించి పోక్సో చట్టంలోని సెక్షన్ 4 కింద శిక్ష విధించేందుకు ఒక నిబంధన ఉందని పేర్కొంది.
ఈ కేసులో న్యాయమూర్తి మాట్లాడుతూ ''పోక్సోచట్టంలోని నిబంధనలు, ఈ కేసులోని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత, నిందితునిని పోక్సో చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం శిక్ష వేయాలని కోర్టు భావిస్తోంది. ఎందుకంటే ఈ కేసు తక్కువ తీవ్రత కలిగిన లైంగిక నేరం కిందకు వస్తుంది. తీవ్రమైన, హేయమైన లైంగిక నేరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ తీవ్రత కలిగిన నేరం'' అని వ్యాఖ్యానించారు.
కోర్టు నిర్ణయంపై అసంతృప్తి
ఈ నిర్ణయంపై, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఓ విభాగం ఆందోళనను వ్యక్తం చేస్తోంది.
''ఇది ఒక తప్పుడు, అనుచితమైన నిర్ణయం'' అని సుప్రీం కోర్టు న్యాయవాది కామినీ జైస్వాల్ పేర్కొన్నారు.
''ఈ కేసు పూర్తిగా పోక్సో చట్టంలోని సెక్షన్ 9 (ఎం) పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాధితుని వయస్సు 12 ఏళ్ల కంటే తక్కువగా ఉంది. లైంగిక నేరాల్లో... హేయమైనవి, తక్కువ తీవ్రత కలిగినవి వేర్వేరుగా ఉంటాయి అని ఎలా నిర్ణయిస్తారు. ఇది పూర్తిగా ఘోరమైన నేరం. ఇది సెక్షన్ 9 (ఎం) పరిధిలోకి వస్తుంది'' అని ఆమె వివరించారు.
2012లో పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు. మైనర్లపై లైంగిక హింస నేరాలకు సంబంధించిన నిర్వచనాలు, న్యాయ ప్రక్రియలు, శిక్షలను గురించి ఈ చట్టం తెలుపుతుంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) సమాచారం ప్రకారం దేశంలో, పోక్సో చట్టం కింద మొత్తం 47,221 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2020 ఏడాదిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 6898 కేసులు నమోదు కాగా... మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
పిల్లల మానసిక స్థితి, వారి జీవితంపై ఇలాంటి సంఘటనలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిర్భయ కేసులో లాయర్‌గా వ్యవహరించిన సీమ కుష్వాహా, బీబీసీతో మాట్లాడుతూ ''ఈ తరహా తీర్పులు వస్తూ ఉంటే.. కోర్టులపై ప్రజలు నమ్మకం కోల్పోతారు. పిల్లలపై లైంగిక నేరాల కేసులు పెరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి తీర్పులు తప్పుడు సందేశాన్ని చేరవేస్తాయి'' అని చెప్పారు.
పోక్సో చట్టం గురించి కోర్టు, పూర్తిగా తప్పుడు అర్థం చేసుకుందని ఆమె అన్నారు.
''పోక్సో చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం, ఎవరైనా తమ పురుషాంగాన్ని పిల్లల నోటిలో లేదా మలద్వారం వద్ద ఏ స్థాయి వరకు చొప్పించినా లేదా ఇతర వ్యక్తితో అలా చేయించినా అది కచ్చితంగా లైంగిక నేరంగా పరిగణించబడుతుంది. దీనికి సంబంధించి ఆ సెక్షన్‌లో ఇంకా అనేక నిబంధనలు ఉన్నాయి'' అని ఆమె వివరించారు.
''2019లో పోక్సో చట్టం సెక్షన్ 6లో చేసిన సవరణ ప్రకారం, అటువంటి కేసులలో శిక్షను 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు. అలాగే సెక్షన్ 4లో శిక్షను 7 నుంచి 10 ఏళ్లకు పొడిగించారు. కాబట్టి ఈ కేసులో కనీసం 10 ఏళ్ల జైలుశిక్ష లేదా జీవిత ఖైదు విధించాలి అనే నిబంధన కూడా ఉంది'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పోక్సో చట్టంలోని సెక్షన్లలో ఉన్న చిక్కులపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టు లాయర్ ప్రణయ్ మహేశ్వరీ బీబీసీతో అన్నారు. ఈ కేసులో శిక్షను మార్చడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు.
'స్కిన్ టు స్కిన్ టచ్' అనే అంశంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ఇటీవలే కొట్టివేసింది. దీన్ని ఉదాహరణగా చూపిన లాయర్ కామినీ జైస్వాల్ '' ప్రతీ కేసుని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవడం సుప్రీం కోర్టుకు చాలా కష్టమని'' వ్యాఖ్యానించారు.
అదేసమయంలో భారత్‌లో చట్టాలకు కొదువ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ అవి సక్రమంగా అమలు చేయకపోతే, ప్రజలపై న్యాయవ్యవస్థ ఎలాంటి ప్రభావం చూపుతుందో తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అభినందన్ వర్థమాన్‌కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
- త్రిపుర: ఈ రాష్ట్రంలో మత ఘర్షణల వెనుక అసలు నిజాలేంటి - బీబీసీ పరిశోధన
- అద్భుతం: చికిత్స లేకుండానే హెచ్ఐవీ వైరస్‌ను తరిమేసిన మహిళ శరీరం
- ఆంధ్రప్రదేశ్: శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- మంటల్లో చిక్కుకున్న బస్సు, 45 మంది మృతి
- వైఎస్ జగన్: ‘అమరావతి ప్రాంతం అంటే నాకు వ్యతిరేకత లేదు.. నా ఇల్లూ ఇక్కడే ఉంది’
- 44 ఏళ్ల వయసులో ఐఐఎంలో రెండు బంగారు పతకాలు సాధించిన విశాఖ గృహిణి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











