పాకిస్తాన్: బలూచిస్తాన్‌లో ఒక క్రోకర్ చేప ధర రూ.7.80 లక్షలు పలికింది.. ఏంటి దీని స్పెషల్?

క్రోకర్ చేపతో అబ్దుల్ హక్, అతడి సహచరుడు

ఫొటో సోర్స్, AHMED ALI

ఫొటో క్యాప్షన్, క్రోకర్ చేపతో అబ్దుల్ హక్, ఆయన సహచరుడు
    • రచయిత, మొహమ్మద్ కాజిమ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ సముద్ర తీరంలో చేపలు పడుతున్న గ్వాదర్ జిల్లా మత్స్యకారులు అబ్దుల్ హక్, ఆయన సహచరులు తమ వలలో ఒక క్రోకర్ చేప కనిపించడంతో సంబరాలు చేసుకున్నారు.

బరువు, పొడవు విషయానికి వస్తే ఆ చేప అంత పెద్దదేం కాదు.

కానీ అది చాలా విలువైనది.

అందుకే వాళ్లిక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తీరానికి వచ్చి, మార్కెట్ వైపు పరుగులు తీశారు.

26 కిలోల బరువున్న ఆ క్రోకర్ చేప ధర 7 లక్షల 80 వేలు పలికిందని అబ్దుల్ హక్‌ కజిన్ రాషిద్ కరీమ్ బలోచ్ చెప్పారు.

"ఈ చేపను పట్టుకోడానికి రెండు నెలలు కష్టపడ్డాం. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఈ చేప దొరకగానే మాకు పండగలా అనిపించింది" అని రాషిద్ కరీమ్ చెప్పారు.

క్రోకర్ చేప

ఫొటో సోర్స్, PA Media

ఈ చేప ఎక్కడ పట్టారు

ఇంత విలువైన ఈ చేపను ఇంగ్లిష్‌లో 'క్రోకర్', ఉర్దూలో 'సవా', బలూచీలో 'కుర్' అంటారు.

జీవానీ తీర ప్రాంతంలోని సముద్రంలో ఈ చేప పడినట్లు వాళ్లు చెప్పారు.

ఇది గ్వాదర్ జిల్లాలో ఇరాన్ సరిహద్దులకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ చేపల వేట రెండు నెలలే ఉంటుందని, అందుకే దీనికోసం తాము చాలా కష్టపడాల్సి ఉంటుందని రాషిద్ కరీమ్ చెప్పారు.

వేలంలో ఈ చేపకు కిలోకు 30వేల చొప్పున ధర వచ్చింది.

క్రోకర్ చేపలు ఇంకా బరువుగా, చాలా పెద్దవి కూడా ఉంటాయని రాషిద్ కరీమ్ చెప్పారు.

"కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తికి ఇంకా బరువున్న ఒక క్రోకర్ చేప దొరికింది. అది రూ.17 లక్షలకు అమ్ముడైంది. కానీ అబ్దుల్ హక్, ఆయన సహచరులు పట్టుకున్న ఈ చేప బరువు 26 కిలోలే ఉంది" అన్నారు కరీమ్.

"మార్కెట్లో ఈ చేపకు వేలం నిర్వహించగా.. చివరకు ఒక వ్యక్తి కిలోకు రూ.30 వేలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అలా దీనికి 26 కిలోలకు మొత్తం 7లక్షల 80 వేలు వచ్చాయి" అని ఆయన చెప్పారు.

క్రోకర్ చేప

ఫొటో సోర్స్, Reuters

ఈ చేపకు ఇంత ధర ఎందుకు

"చేపలు చాలా వరకు వాటి మాంసం వల్ల ఎక్కువ ధర పలుకుతుంటాయి. కానీ క్రోకర్ విషయం వేరే" అని గ్వాదర్ డెవలప్‌మెంట్ అథారిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్విరాన్‌మెంట్, సీనియర్ జువాలజిస్ట్ అబ్దుల్ రహీమ్ బలోచ్ చెప్పారు.

"క్రోకర్ చేప ఎయిర్ బ్లాడర్ వల్లే అది అంత ధర పలుకుతుంది. అందులో గాలి నింపుకుని అది ఈదుతుంది. ఈ చేప ఎయిర్ బ్లాడర్ వైద్య చికిత్సల్లో ఉపయోగపడుతుండడంతో చైనా, జపాన్, యూరప్‌లో దానికి చాలా డిమాండ్ ఉంది" అన్నారు.

మనుషులకు సర్జరీ చేసినప్పుడు శరీరం లోపలే వేసే కుట్ల కోసం క్రోకర్ చేప ఎయిర్ బ్లాడర్‌తో కుట్లు వేసే దారం తయారు చేస్తారని ఆయన చెప్పారు.

ముఖ్యంగా గుండె ఆపరేషన్ సమయంలో దానితో తయారు చేసిన దారంతో కుట్లు వేస్తారని, అవి తర్వాత శరీరంలో కలిసిపోతాయని రహీమ్ బలోచ్ తెలిపారు.

క్రోకర్ చేప

ఫొటో సోర్స్, RASHID KARIM

ఈ చేపను ఎలా పట్టుకుంటారు

ఈ చేప చేసే శబ్దం వల్లే బలూచీలో ఈ చేపకు కుర్ అనే పేరు వచ్చినట్లు అనిపిస్తోంది.

ఈ చేప కుర్, కుర్ మనే శబ్దం చేస్తుందని అబ్దుల్ రహీమ్ చెప్పారు.

ఇవి మడ అడవుల్లో ఉన్న ఖాళీల్లో గుడ్లు పెట్టడానికి వస్తుంటాయని ఆయన తెలిపారు.

చేపల వేటలో మంచి అనుభవం ఉన్న వారు ఆ చేపల శబ్దాలు విని ఆ ప్రాంతాల్లో వలలు వేస్తారని, వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పారు.

"గంట, గంటన్నర తర్వాత వాటి కుర్ కుర్ శబ్దాలు ఆగిపోగానే, వల లాగి ఆ చేపలను బయటకు తీస్తారు" అన్నారు రహీమ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)