అటకామా అగాధంలో 8000 మీటర్ల లోతుకు వెళ్లొచ్చిన తొలి శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు

అగాధంలోకి దిగడానికి ముందు ఒస్వాల్డో ఉల్లోవా

ఫొటో సోర్స్, NICK VEROLA - CALADAN OCEANIC

ఫొటో క్యాప్షన్, అగాధంలోకి దిగడానికి ముందు ఒస్వాల్డో ఉల్లోవా
    • రచయిత, ఏంజెలా పొసాడా-స్వఫోర్డ్
    • హోదా, బీబీసీ ముండో

చిలీ సాగర శాస్త్ర పరిశోధకులు ఒస్వాల్డో ఉల్లోవా, రూబెన్ ఎస్కిబనో... ఎన్నో ఏళ్లుగా మిస్టరీ ప్రాంతమైన అటకామా అగాధం గురించి చర్చించుకుంటూ అసలు అది ఎలా ఉంటుందో అని ఊహించుకునేవారు.

8000 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉండే ఈ అగాధాన్ని ఇప్పటివరకు ఎవరు ప్రత్యక్షంగా చూడలేదు.

ఇది చిలీ, పెరూ దేశాల తీరాలకు దూరంగా సముద్రంలో ఉంటుంది.

చిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాన్సెప్షన్‌కు చెందిన మిలీనియం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఉల్లోవా డైరెక్టర్ కాగా, ఎస్కిబనో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసేవారు. కానీ ఈ అగాధంపై పరిశోధనలు చేసేందుకు వారిద్దరూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

ఈ ఇద్దరూ, తమ బృందంతో కలిసి మొదటిసారిగా ఆ ఆగాధంలోని కొంతభాగానికి చెందిన నైసర్గిక స్వరూపాన్ని కనుగొన్నారు.

వీడియో క్యాప్షన్, ఇవి ప్రపంచంలోనే అత్యంత పొడవైన పగడపు దిబ్బలు

2018లో అటకామెక్స్ అన్వేషణ యాత్రలో భాగంగా వీరు దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు, నీటి నమూనాలు, అక్కడి నీటి అడుగున నివసించే వింత జీవులకు సంబంధించిన డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు.

కానీ ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు, అమెరికా అన్వేషకుడు విక్టర్ వెస్కోవోతో కలిసి గత వారం ఈ అగాధం దగ్గరికి వెళ్లారు.

ఐదు మహాసముద్రాల్లోని లోతైన ప్రాంతాలను సందర్శించిన మొదటి వ్యక్తిగా విక్టర్ వెస్కోవా 2019లో ఖ్యాతి గడించారు. లోతైన ప్రాంతాలను చేరడానికే ప్రత్యేకంగా రూపొందించిన సబ్‌మెర్సిబుల్‌లో ఆయన ఈ ప్రాంతాలకు వెళ్లారు.

అటకామా అగాధంలోకి వెళ్లొచ్చిన తొలి వ్యక్తులుగా ఉల్లోవా, ఎస్కిబనో, వెస్కోవో నిలిచారు.

ఒస్వాల్డో ఉల్లోవా (కుడి), రూబెన్ ఎస్కిబనో

ఫొటో సోర్స్, ANGELA POSADA

ఫొటో క్యాప్షన్, ఒస్వాల్డో ఉల్లోవా (కుడి), రూబెన్ ఎస్కిబనో

ఇద్దరు చొప్పున ఈ పర్యటన రెండుసార్లు జరిగింది. ప్రతీ ట్రిప్పు మొత్తం 10 గంటల పాటు సాగింది. ఈ పర్యటన కోసం అక్వానాట్స్ అన్ని జాగ్రత్తలతో సిద్ధమయ్యారు. ముందురోజు రాత్రి నుంచే వారు డీహైడ్రేట్ అయ్యారు. వెచ్చగా ఉండే దుస్తులతో పాటు తమ వెంట శాండ్‌విచ్‌లను తీసుకెళ్లారు.

ఫ్లోరిడాలోని ట్రిటాన్ సబ్‌మరైన్స్ నిర్మించిన అతి చిన్నదైన 'టైటానియం స్పియర్ సబ్‌మెరైన్'లో మొదట వెస్కోవోతో కలిసి ఉల్లోవా ప్రయాణించారు. ఈ సబ్‌మెరైన్‌కు సింథటిక్ ఫోమ్‌తో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు.

6000 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్న సముద్ర ప్రాంతాలను అన్వేషించడానికి అందుబాటులోకి వచ్చిన సాంకేతిక అద్భుతాలు ఈ సబ్‌మెరైన్‌లు.

''ఇది నా జీవితంలోనే ఒక సాహస కార్యం. సముద్ర శాస్త్ర పరిశోధకునిగా నా కెరీర్‌లో ఇది అత్యున్నత ఘట్టం'' అని 60 ఏళ్ల ఉల్లోవా బీబీసీ ముండోతో చెప్పారు.

''సబ్‌మెరైన్ స్పియర్ ముదురు బూడిద రంగులో ఉంది. అందులో సౌకర్యంగా కూర్చోవడానికి రెండు కుర్చీలు ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ ట్యాంకులతో పాటు అన్ని విద్యుత్ ఉపకరణాల కోసం స్విచ్‌లు ఉన్నాయి. సముద్రాన్ని చూడటానికి కిందివైపున మూడు కిటికీలు ఉన్నాయి.

ఆ సబ్‌మెరైన్ కదలికలు, అందులోని నిశ్శబ్ధ వాతావరణం నన్ను చాలా ఆకట్టుకుంది. కేవలం ఉపరితలం నుంచి వచ్చే కమ్యూనికేషన్ మాత్రమే ఆ వాతావరణానికి అంతరాయం కలిగించగలదు'' అని ఉల్లోవా చెప్పారు.

సాహస యాత్ర

ఫొటో సోర్స్, NICK VEROLA - CALADAN OCEANIC

ముందురోజు సిద్ధం చేసుకున్న మ్యాపుల ప్రకారం, ఆ ఆగాధంలోని అత్యంత లోతైన ప్రాంతం 8,069 మీటర్ల లోతులో ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి వారికి మూడున్నర గంటల సమయం పట్టింది. ఈ ప్రయాణంలో వారు సంగీతం వినడంతో పాటు చాలా కబుర్లు చెప్పుకున్నారు.

ప్రయాణం మధ్యలో వారు శాండ్‌విచ్‌లను కూడా తిన్నారు. ట్యూనా శాండ్‌విచ్‌ను వెస్కోవో, ఎగ్ సలాడ్ శాండ్‌విచ్‌ను ఉల్లోవా తీసుకెళ్లారు.

ఆ అగాధం దిగువకు చేరుకున్న తర్వాత వెస్కోవో సబ్‌మెరైన్‌ను అక్కడి లోయలు, రాతినిర్మాణాలపై చాలా నేర్పుగా నడిపించారు.

''ఒక మైక్రో బయాలజిస్టుగా, నేను ఈ సాహసయాత్రలో కోరుకున్నది ఏదైనా ఉందంటే... అది సూక్ష్మజీవుల కాలనీలను కనుగొనడం. వాటిని నా సొంత కళ్లతో చూడటం అసాధారమైన విషయం'' అని ఉల్లోవా అన్నారు.

ఒక రకమైన సముద్రపు దోసకాయ 'హోలుటోరియస్' చిత్రం

ఫొటో సోర్స్, VICTOR VESCOVO/CALADAN OCEANIC

క్రిములే, నగరాల వాస్తుశిల్పులు

ఉల్లోవా వెళ్లొచ్చిన రెండు రోజుల తర్వాత 64 ఏళ్ల రూబెన్ ఎస్కిబనో ఈ సాహసయాత్రకు వెళ్లారు.

రూబెన్‌కు సముద్ర జంతుజాలంపై అమితాసక్తి. కాబట్టి వెస్కోవో సబ్‌మెరైన్‌ను 7,330 మీటర్ల లోతుకు తీసుకెళ్లి, అగాధంలోని తూర్పువాలులో సమృద్ధిగా ఉన్న జీవులను పరిశీలించారు.

వారు 'కోల్డ్ వాటర్ కోరల్స్', 'లోన్ స్టార్ ఫిష్' వంటి జీవులను అక్కడ చూశారు. మిగతా కందకాల్లో లేని విధంగా ఇక్కడ పెద్ద సంఖ్యలో నివసిస్తోన్న 'పాలీచెట్ క్రిములు', ఆంపిపోడ్ క్రుస్టాసియన్లను కనుగొన్నారు. ఇప్పటివరకు అధ్యయనం చేయని సరికొత్త ప్రాణులను కూడా గమనించగలిగారు.

సబ్‌మెరైన్ నుంచి బయటకొస్తూ ఓడ డెక్‌పైన దిగిన ఇస్క్రిబనో... ''ఆ ఆగాధం గురించి మమ్మల్ని అధ్యయనం చేయమన్నారు. కానీ అక్కడివరకు వెళ్లి అధ్యయనం చేయాల్సి ఉంటుందని వారెప్పుడూ నాకు చెప్పలేదు'' అంటూ జోక్ చేశారు.

''అదో మాయాలోకం. అక్కడ క్రిములు, చిన్న చిన్న పురుగులు నిర్మించిన నిర్మాణాలను చూస్తుంటే మరో గ్రహంపైకి వెళ్లినట్లు అనిపించింది. అవన్నీ ఈ జీవులు నిర్మించిన చిన్న చిన్న నగరాల్లాగా నాకు కనిపించాయి'' అని రూబెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అంతటి లోతున్న ప్రాంతాలకు వెళ్లడం అంటే... సాంకేతికంగా చంద్రుని దగ్గరకు వెళ్లడంతో సమానం.

ఫొటో సోర్స్, NICK VEROLA - CALADAN

'అటకామా హడల్ సాహసయాత్ర' ద్వారా ఆ అగాధంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హై రిజల్యూషన్‌తో కూడిన మ్యాపులను తయారు చేశారు. సముద్రపు లోతుల్లోని పొడవైన పగుళ్లలో ఒకటైన 5,900కి.మీ పొడవున్న ఒక పగులును కనుగొన్నారు. దక్షిణ అమెరికాలో నాజ్కా ప్లేట్ మునిగిపోయిన ప్రాంతంలోనే ఈ పగులు ఏర్పడింది. ఆ ప్రాంతంలో భూకంపాలకు, సునామీలకు ఈ పగులే కారణమవుతోంది.

ఈ సముద్ర ప్రాంతాల్లోని భౌతిక, రసాయన, జీవావరణ పరిస్థితులు కాలక్రమేణా ఎలా మారతాయో అధ్యయనం చేయడం వలన వాతావరణ మార్పుల ప్రభావాలను, సునామీలు, భూకంపాలకు కారణమయ్యే ప్రక్రియలను బాగా అర్థం చేసుకోవడానికి తగిన శాస్త్రీయ ఆధారాలను పొందవచ్చు.

''చిలీ సముద్రశాస్త్రంలో దూసుకుపోవడానికి మాకు ప్రత్యేకమైన సౌలభ్యం దొరికింది. ఈ విజయం భవిష్యత్ తరాలకు మరింత స్ఫూర్తినిస్తుందని నేను విశ్వసిస్తున్నా'' అని ఉల్లోవా అన్నారు.

జెబ్కో 2030 కార్యక్రమానికి మద్దతుగా నెలకు లక్షలాది చదరపు కిలోమీటర్ల మేర మ్యాపింగ్ చేసే ప్రయత్నానికి కట్టుబడి ఉన్నామని వెస్కోవో చెప్పారు. 2030 నాటికి సముద్రగర్భం మొత్తం మ్యాపింగ్ చేయడమే లక్ష్యంగా జెబ్కోను నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)