ప్రపంచ యుద్ధం: ఆ ఇంటి బేస్‌మెంట్‌లో హిట్లర్ మందిరం

మార్జిట్‌ను వివాహం చేసుకున్న తరువాతే తన తండ్రి తొలిసారిగా ఈ పోస్టర్లను చూసి ఉంటారని క్రెయిగ్ భావిస్తున్నారు

ఫొటో సోర్స్, ROSEMARY CHALONER

ఫొటో క్యాప్షన్, మార్జిట్‌ను వివాహం చేసుకున్న తరువాతే తన తండ్రి తొలిసారిగా ఈ పోస్టర్లను చూసి ఉంటారని క్రెయిగ్ భావిస్తున్నారు
    • రచయిత, నీల్ ప్రియర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఇంట్లో అటక మీద ఏముంటాయి? ఏవో పాత సామాన్లు, పండుగల డెకరేషన్‌కు సంబంధించినవి లేదా ఓ డొక్కు కంప్యూటర్. కానీ, నాజీ ప్రచార పోస్టర్లు దొరుకుతాయని ఊహించం కదా."

బారీకి చెందిన క్రెయిగ్ లాంబర్ట్‌కు అటక మీద అవే దొరికాయి. 2019లో తన తండ్రి మరణానంతరం, ఆయనకు సంబంధించిన వస్తువులు సర్దుతూ ఉంటే అటక మీద నాజీ ప్రచార పోస్టర్లు కనిపించాయి.

ఇంతకీ క్రెయిగ్ తండ్రి కాలిన్‌ లాంబర్ట్‌కు నాజీలతో ఉన్న సంబంధం ఏమిటి?

చరిత్రలోకెళ్తే

హిట్లర్ డిప్యుటీ రుడాల్ఫ్ హెస్ బెర్లిన్‌లోని స్పాండౌ జైల్లో జీవితకాల ఖైదు అనుభవిస్తున్న రోజులవి.

1951-1955 మధ్య కాలంలో రాయల్ వెల్ష్ ఫ్యూసిలియర్స్ సార్జెంట్-మేజర్ కాలిన్ లాంబర్ట్‌ను హెస్‌కు గార్డుగా ప్రత్యేక విధుల్లో నియమించారు.

జర్మనీ నుంచి తిరిగొచ్చేటప్పుడు కాలిన్ తీసుకొచ్చిన కళాఖండాలు ఆయన చనిపోయినంతవరకూ రహస్యంగానే ఉండిపోయాయి.

హిట్లర్

ఫొటో సోర్స్, Getty Images

1942 మొదలుకొని, అనేక చిత్రపటాలను ఆయన తీసుకొచ్చారు. లండన్ బ్లిట్జ్‌ను సమర్థించే దృశ్యాలు, జర్మన్ యూ-బోట్ ప్రచారంలో భాగంగా అలైడ్ షిప్పింగ్‌ను ముంచివేసిన ఘటనలను ప్రశంసిస్తున్న చిత్రాలు వాటిల్లో ఉన్నాయి.

బ్లిట్జ్ అనేది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1940, 1941లలో బ్రిటన్‌కు వ్యతిరేకంగా జర్మనీ చేపట్టిన బాంబు దాడి ప్రచారం.

కాలిన్ దాచిపెట్టిన వస్తువుల్లోంచి వెలికితీసిన.. రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన పోస్టర్లన్నింటినీ క్రెయిగ్ 'బారీ వార్ మ్యూజియం'కు విరాళంగా ఇచ్చారు.

"మా నాన్న ఎప్పుడూ తను ఆర్మీలో పనిచేసిన రోజులను తలుచుకుంటూ ఉండేవారు. రుడాల్ఫ్ హెస్‌కు గార్డుగా ఉన్న కాలంలో జరిగిన సంగతులన్నీ మాకు చెప్పేవారు. కానీ, జర్మనీ నుంచి ఆయన తీసుకొచ్చిన వస్తువుల గురించి మాకెప్పుడూ చెప్పలేదు" అని క్రెయిగ్ అన్నారు.

తండ్రి కాలిన్ లాంబర్ట్‌తో క్రెయిగ్

ఫొటో సోర్స్, CRAIG LAMBERT

ఫొటో క్యాప్షన్, తండ్రి కాలిన్ లాంబర్ట్‌తో క్రెయిగ్

'కలిసి సిగరెట్ తాగారు'

1930లలో హిట్లర్ డిప్యుటీగా వ్యవహరించిన హెస్, థర్డ్ రైక్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.

1941లో హెస్ పారాచూట్‌ సహాయంతో రహస్యంగా స్కాట్లండ్‌లోకి ప్రవేశించారు. యుద్ధాన్ని శాంతియుతంగా ముగించాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు ఆయన తెలిపారు.

యుద్ధం ముగిసేవరకు హెస్‌ను బ్రిటన్‌లోని జైల్లో బంధించి ఉంచారు. న్యూరంబర్గ్ వార్ ట్రయిల్స్‌లో ఆయనకు జీవితకాల ఖైదు విధించడంతో తిరిగి జర్మనీకి తరలించారు.

"స్పాండౌ జైల్లో ఒక వింగ్ మొత్తానికి హెస్ ఒక్కరే ఖైదీ. ఆయనకు గార్డుగా మా నాన్నను నియమించారు. మా నాన్నకు కబుర్లు చెప్పడం అంటే చాలా ఇష్టం. జైలు వింగ్‌లో ఎవరూ ఉండేవారు కాదు. దాంతో, ఆయనకు చాలా బోర్ కొట్టేది. ఒకరోజు రాత్రి రుడాల్ఫ్ హెస్‌తో సిగరెట్ పంచుకుంటూ కబుర్లు చెబుతుండగా దొరికిపోయారు" అని క్రెయిగ్ చెప్పారు.

తమాషా ఏంటంటే హెస్ స్వయంగా కాలిన్ గురించి ఫిర్యాదు చేశారు. హెస్‌తో మాట్లాడడం జైల్లో గార్డులకు నిషేధం. దాంతో కాలిన్‌కు రెండు వారాల జైలు శిక్ష విధించారు. ఆయన్ను మిలటరీ జైల్లో పెట్టారు.

కాలిన్ ఆర్మీలో ఉన్నప్పుడు

ఫొటో సోర్స్, CRAIG LAMBERT

ఫొటో క్యాప్షన్, కాలిన్ ఆర్మీలో ఉన్నప్పుడు

'నాజీరహస్య సానుభూతిపరులు'

ఇదే కాకుండా, తన తండ్రి చేసిన వ్యవహారాలు ఇంకా చాలా ఉన్నాయని క్రెయిగ్ జోక్ చేశారు.

"1950లో హుక్ ఆఫ్ హాలండ్‌లో దిగీ దిగగానే ఆయన మీద ఫిర్యాదులొచ్చాయి. అర్థరాత్రి బ్యారక్స్ నుంచి బయటికి వచ్చారని ఆయన మీద కేసు రాశారు. తాగి తిరిగినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు. సీనియర్ ఆఫీసర్‌ను తిట్టారనే ఫిర్యాదు కూడా ఉంది."

ఆ తరువాత ఒక ఏడాదికి జర్మన్ మహిళ మార్జిట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాలిన్.

ఆమె తల్లితండ్రులు నాజీ సానుభూతిపరులు. కానీ ఈ విషయం బయటకు తెలీదు. వాళ్ల ఇంటి బేస్‌మెంట్‌లో అడాల్ఫ్ హిట్లర్‌కు ఒక మందిరం కూడా ఉండేది.

ఇక్కడే తన తండ్రికి ఆ పోస్టర్లు పరిచయమై ఉంటాయని క్రెయిగ్ భావిస్తున్నారు.

అటకపై శుభ్రం చేస్తున్నప్పుడు నాజీ ప్రచార పత్రాలు క్రెయిగ్ లాంబెర్ట్‌కు లభించాయి

ఫొటో సోర్స్, ROSEMARY CHALONER

ఫొటో క్యాప్షన్, అటకపై శుభ్రం చేస్తున్నప్పుడు నాజీ ప్రచార పత్రాలు క్రెయిగ్ లాంబెర్ట్‌కు లభించాయి

"కొన్నాళ్ల తరువాత, మార్జిట్ తనను మోసం చేస్తున్నారనే సంగతి మా నాన్నకు తెలిసింది. ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. దాంతో, ఆమె తల్లిదడ్రులు దాచుకున్న నాజీ స్మారక చిహ్నాలన్నింటినీ ధ్వంసం చేశారు. కానీ, ఎందుకో ఈ పోస్టర్లను మాత్రం చింపకుండా దాచారు.

మార్జిట్‌కు, మా నాన్నకు ఒక కొడుకు ఉన్నాడు. ఎప్పుడైనా కొడుకును కలుసుకోవడానికి మార్జిట్ అనుమతించకపోతే వీటిని ఆశ చూపించవచ్చని భావించి ఉంటారు" అని క్రెయిగ్ అన్నారు.

ఆరాత్రి కలిసి సిగరెట్ తాగుతూ తన తండ్రి, హెస్ ఏం మాట్లాడుకుని ఉంటారో క్రెయిగ్ ఊహించడానికి ప్రయత్నించారు.

హెస్ మూడు సంవత్సరాల పాటు అబెర్గవెన్నీ సమీపంలోని మెయిన్‌డిఫ్ కోర్టు హాస్పిటల్‌లో నిర్బంధంలో గడిపారు. దాని గురించి మాట్లాడుకుని ఉండవచ్చు. 1942 జూన్ 26న హెస్ అక్కడకు చేరుకున్నారు.

1941లో హెస్ స్కాట్లండ్‌లో దిగిన తరువాత అధికారులకు దొరికిపోయారు. అక్కడ కొన్నాళ్ళు, ఆ తరువాత లండన్ టవర్‌లో కొన్నాళ్లు, సర్రేలో మైట్చెట్ ప్లేస్‌లో 13 నెలలు నిర్బంధంలో ఉన్న తరువాత హెస్‌ను మెయిన్‌డిఫ్ కోర్టు హాస్పిటల్‌కు తరలించారు.

మెయిన్‌డిఫ్ కోర్టులో హెస్‌కు సొంతంగా ఒక గది ఉండేది. కానీ, నిరంతరం కాపలా ఉండేది. అక్కడ ఆయనకు కొంత స్వేచ్ఛ ఉండేది. చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలకు ఆయన్ను తీసుకెళ్లేవారు. ఆ ఊర్లోని మార్కెట్, స్కిర్రిడ్ మౌంటైన్ లాంటి ప్రదేశాలకు పంపించేవారు. ఆ కొండ దగ్గర పెయింటింగ్ వేయడమంటే హెస్‌కు ఇష్టంగా ఉండేది.

నాజీ ప్రచార పత్రాలు

ఫొటో సోర్స్, ROSEMARY CHALONER

'ఎంతో శ్రమకోర్చి వీటిని భద్రపరిచారు'

కాలిన్ వారసత్వం చాలా అరుదైనదని బారీ వార్ మ్యూజియంలోని వలంటీర్ చరిత్రకారుడు రోజ్‌మేరీ చలోనర్ అన్నారు.

"స్పాండౌలో ఏమీ మిగల్లేదు. 1966 నుంచి 1987లో హెస్ మరణించే వరకు ఆయనొక్కరే అక్కడ ఖైదీగా ఉండేవారు. హెస్ చనిపోయిన తరువాత ఆ భవనం మొత్తాన్ని కూల్చివేసి, ఆ ముక్కలను ఉత్తర సముద్రంలో కలిపేశారు. అదెక్కడ నాజీ పవిత్ర స్థలంగా మారిపోతుందోననే భయంతో దాన్ని ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి స్కాటిష్ మ్యూజియంలో కొన్ని తాళాలు, ఇప్పుడు ఈ పోస్టర్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా, ఇవి ఆ జైలుకు సంబంధించినవేనని ఎప్పటికైనా మనం నిరూపించగలిగితేనే వీటిని చరిత్రలో మిగిలిన సాక్ష్యాలుగా చూడగలం" అని ఆమె అన్నారు.

క్రెయిగ్ అందించిన పోస్టర్లను భద్రపరచడానికి గ్లామోర్గాన్ ఆర్కైవ్స్ చాలా శ్రమపడ్డారని రోజ్‌మేరీ చెప్పారు.

"చీఫ్ కంజర్వేటర్ లిడియా, పోస్టర్‌లను పునరుద్ధరించిన మైక్ శ్రమ ఫలితంగా ఈ పోస్టర్లను భద్రపరచగలిగాం. వారి సహాయం లేకపోతే ఇది సాధ్యమయేది కాదు. అవి మరింత క్షీణించకుండా ఆర్కైవల్ పాలిస్టర్‌తో కప్పి, ఒక మైక్రోఛాంబర్‌లో సీలు చేశారు" అని ఆమె వివరించారు.

అయితే, కాలిన్ వ్యవహారాలు అక్కడితో ఆగిపోలేదు. 1970లో ఆర్మీ విడిచిపెట్టిన తరువాత, ఆయన కార్పెట్ల వ్యాపారంలోకి దిగారు. జాన్ లే మెసూరియర్ వ్యాపార భాగస్వామిగా అప్పటి లిబరల్ లీడర్ జెరెమీ థోర్ప్‌కు వ్యతిరేకంగా "వెరీ బ్రిటిష్ స్కాండల్"గా పేరు పొందిన ఒక వ్యవహారంలో సాక్ష్యం ఇవ్వడానికి కాలిన్‌ను పిలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)