బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ 2022: గాలిచొరబడకుండా సీల్ చేసిన బబుల్ లోపల జీవితం ఎలా ఉందంటే..

ఫొటో సోర్స్, Reuters
ఎక్కడచూసినా డ్రింక్స్, ఉష్ణోగ్రత నియంత్రించే స్లీప్ ప్యాడ్లు, క్రిమిసంహారకాలను రోబోలే అందిస్తున్నాయి.
వింటర్ ఒలింపిక్ గేమ్స్ కోసం ఒలింపిక్ అథ్లెట్లు, అధికారులు, ఈవెంట్‌ను కవర్ చేసే మీడియా మరికొన్ని వారాలు చైనా రాజధాని బీజింగ్‌లోనే ఉండబోతున్నారు. దాంతో ఇవి రోజూ కనిపించే దృశ్యాలుగా మారాయి.
2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఇప్పటి వరకు జరిగిన వాటిలో అత్యంత నియంత్రణతో నిర్వహించే అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్ కాబోతోంది.
కరోనా మహమ్మారి సమయంలో కూడా పరిమిత స్థలంలో ఒలింపిక్స్ నిర్వహించవచ్చని గత సంవత్సరం టోక్యోలో నిర్వహించిన ఒలింపిక్ గేమ్స్ నిరూపించాయి.
కానీ సంపన్న, శక్తివంతమైన దేశం చైనా వైరస్ రహిత క్రీడోత్సవాలు నిర్వహించేలా ఒక ఒక విస్తృత వ్యవస్థను రూపొందించేందుకు మరింత ముందుకెళ్లింది.
చైనా మొత్తం ప్రణాళికలో "క్లోజ్డ్ లూప్" పర్యావరణం కేంద్రంగా నిలిచింది. ఒక అంచనా ప్రకారం 60,000 మంది అథ్లెట్లకు, టీమ్ అధికారులకు, మీడియా, వాలంటీర్లు, ఇతరులకు ఇది ఆశ్రయంగా మారింది.
బీజింగ్ క్రీడా ప్రపంచం మూడు ప్రధాన గేట్లు ఉన్న 'బయో సెక్యూరిటి బబుల్స్'లో 160 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ప్రతి బబుల్ ఒక క్రీడా వేదిక చుట్టూ ఉంది. నిర్దేశిత ప్రయాణ మార్గాలను వాటికి అనుసంధానించారు. హోటళ్లు, సమావేశ కేంద్రాలు, కార్మికుల వసతి గృహాలు, మిగతా ఇతర సౌకర్యాలన్నీ దీనిలోనే ఉంటాయి.
అక్కడ రోజువారీ జీవితం ఎలా ఉంటుందో బబుల్ లోపలున్న బీబీసీ బృందాలు వివరించాయి.

ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలి. అలాగే భోజనం చేసేటప్పుడు తప్ప, ప్రతిచోటా కచ్చితంగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలి.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రోజూ 'పీసీఆర్ డీప్ థ్రోట్ స్వాబ్ టెస్ట్' చేయించుకుంటారు, పరీక్ష ఫలితాలను 'గేమ్స్ మై2022 హెల్త్' యాప్‌లో రికార్డ్ చేయాలి.
"అక్కడ మనకు పాజిటివ్ వస్తే తప్ప ఫలితాలను పొందలేమనే విషయం అర్థమైంది. పరిస్థితి చూస్తుంటే ప్రతి వార్త.., శుభవార్త కాదు అనే మాట గుర్తుకొచ్చింది" అని బీబీసీ ప్రొడ్యూసర్ ప్రతీక్ష గిల్డియాల్ చెప్పారు.
ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన వేలమందిలో 300 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు అధికారులు కనుగొన్నారు. అది క్లోజ్డ్ లూప్‌ల సంఖ్యలో సగమే.
కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్‌లోకి తీసుకువెళ్తారు. మళ్ళీ కరోనా పరీక్ష చేశాక నెగెటివ్ వస్తేనే వారిని మళ్లీ బబుల్‌లోకి పంపిస్తారు.
"మా లక్ష్యం జీరో కేసులు కాదు. అయితే కరోనా వ్యాప్తిని జీరోకు పరిమితం చేయడమే మా లక్ష్యం, దాని కోసమే ఈ పటిష్టమైన ఏర్పాట్లు" అని చైనా అధికారులు తెలిపారు.
"కోవిడ్ నియంత్రణకు చైనా అసాధారణ చర్యలు చేపట్టింది. నా గదిలో చిన్న రిపేర్ చేయమని అడగగానే, బయో హాజర్డ్ సూట్‌లో ఉన్న ఒక వ్యక్తి వాటిని చేయడానికి వచ్చాడు" అని గిల్డియల్ చెప్పారు.

ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం ముఖ్యం
సామూహిక ప్రదేశాలలో శుభ్రంచేసేవారు ఎప్పుడూ ఉంటారు. క్రిమిసంహారకాలను పిచికారీ చేస్తూ ఫ్లోర్ అంతటా కదిలే రోబోలు కూడా ఉన్నాయి.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లు జరిగే సమయంలో, ప్రశ్నలు అడిగే మధ్యలో మైక్రోఫోన్ శుభ్రం చేయడానికి వాలంటీర్ ఎలా పరుగులు తీస్తున్నాడో మా ప్రతినిధులు గమనించారు.
వేదికల చుట్టూ ఉన్న స్లీప్ పాడ్‌ల దగ్గర, ఎవరైనా చిన్న కునుకు తీసి వెళ్ళినా, అక్కడ ఉండే క్లీనర్లు క్యాబిన్‌ను చాలా నీట్‌గా శుభ్రం చేస్తున్నారు.
"అక్కడ వారు క్యూబికల్స్‌లో డిస్పోజబుల్ బెడ్‌షీట్‌లు అందిస్తున్నారు" అని మరొక బీబీసీ ప్రొడ్యూసర్ క్రిస్టీన్ హా చెప్పారు.
మనుషుల మధ్య సంబంధాలను తగ్గించే లక్ష్యంతో చైనా కొన్ని కొత్త టెక్నాలజీలను కూడా సృష్టించింది.
బీజింగ్ క్రీడా ప్రాంగణాల్లో వంట చేయడానికి, బార్‌లలో స్పెషల్ డ్రింక్స్ తయారు చేసే ప్రాంతాల్లో కూడా కూడా రోబోలు ఉన్నాయి.
పింక్, వైట్ రోబోలు మనుషుల కంటే మరింత సమర్థవంతంగా కనిపిస్తున్నాయని గిల్డియాల్ పేర్కోన్నారు.
"నేను వెయిటర్‌కు ఫుడ్ ఆర్డర్ చేశాను నాతో ఉన్న సహచరులు రోబోకు పుడ్ ఆర్డర్ చేశారు. గమ్మతైన విషయం ఏంటంటే, వెయిటర్ కంటే రోబోలు ఫుడ్ చాలా త్వరగా తీసుకొచ్చాయి. అయితే వాటి వాసన, రుచి ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
విశాలమైన మీడియా సెంటర్, పొడవాటి హాల్, వరుసగా ఒలింపిక్ ఉత్పత్తుల దుకాణాలు ఉన్నాయి. ఆకాశమంత ఎత్తులో ఎస్కలేటర్‌లు, పైనుంచి వేలాడుతున్న ఒలింపిక్స్ మస్కట్స్ కనిపిస్తున్నాయి.
ఒలింపిక్ క్రీడోత్సవాలకు వారం ముందు ఈసారీ చైనా లూనార్ న్యూ ఇయర్ రావడంతో గోడలపైన ఎర్ర రంగులో కొన్ని సాంప్రదాయ అలంకరణలు ఉన్నాయి.
వాటితో పాటు అక్కడ మనం సాంస్కృతిక అంశాలతో కూడిన కాలీగ్రఫీ పట్టిక, శతాబ్దాల నాటి పురాతన శైలిసో చైనీస్ అక్షరాలు కూడా చూడవచ్చు.
ఇక్కడికి వచ్చిన వారికి మార్గనిర్దేశం, సాయం చేయడానికి స్థానిక వలంటీర్లు చుట్టూ కనిపిస్తున్నారు. వారు మాతోపాటూ బబుల్‌లో ఉన్న విలాసవంతమైన హోటళ్లలో ఉండరు. డార్మిటరీ లాంటి సౌకర్యాలు కలిగిన వసతి కేంద్రాల్లో ఉంటారు.
బబుల్‌లో ఉద్యోగం సంపాదించడం కోసం, కుటుంబంతో చైనీస్ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోడానికి కూడా వెళ్లకుండా చాలా మంది యువకులు మూడు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండిపోయారు.
"శాటిలైట్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన భవనం పక్కనే తాత్కాలికంగా నిర్మించిన ఇళ్లలో ఉండే కార్మికులు ప్రతిరోజూ ఉదయం సూపర్‌వైజర్ విజిల్ ఊదగానే, ఎలా మేలుకుంటారో మాకు కళ్ళకు కట్టినట్టు చెప్పారు. తర్వాత సూపర్‌వైజర్ గ్రూప్ సభ్యుల్లో ఎవరెవరున్నారో తనిఖీ చేస్తారు. ఆ సమయంలో వారందరూ గదుల నుంచి బయటకు వచ్చి, ఒక వరుసలోనిలబడుతారు" అని హ చెప్పారు.

ఒలింపిక్ క్రీడల కోసం స్థానికులు ప్రదర్శించిన అంకితభావం అభినందనీయం. కోవిడ్ వల్ల అథ్లెట్లు ప్రేక్షకులు, స్థానికులతో సన్నిహితంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ.
గాలిచొరబడకుండా సీల్ అయిన బబుల్ లోపలి జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ మొత్తంగా చూస్తే, అక్కడ చాలా కఠిన నియంత్రణ ఉంటుంది. అందుకే, అక్కడ చాలా శుభ్రమైన వాతావరణాన్ని అందిస్తున్నారు.
టోక్యో ఒలంపిక్స్‌లో కూడా తప్పనిసరి కరోనా పరీక్ష, మాస్క్ ధరించడం ఉండేదని, అయితే ఈ పరిస్థితులు బీజింగ్ క్రీడలతో అంతం అవుతాయని ఆశిస్తున్నట్లు ఒలింపిక్స్‌కు తొమ్మిదోసారి వచ్చిన రిపోర్టర్ అలెక్స్ క్యాప్‌స్టిక్ చెప్పారు.
"టోక్యోలో మేం ఉండే హోటల్ నుంచి స్థానిక 7-ఎలెవెన్‌కి నడిచే అవకాశం ఉండేది. అంతేకాదు 14 రోజుల తర్వాత కూడా మేం కోరుకున్న చోట తినడానికి, తాగడానికి మమ్మల్ని అనుమతించేవారు కాదు" అన్నారు.
"కానీ బీజింగ్‌లో అలాంటివేం లేవు.. కేవలం హోటల్, బస్సు, క్రీడా వేదిక అంతే. అందుకే దీన్ని 'క్లోజ్డ్ లూప్' అంటారు. నాకు వేరే దారి లేదు కాబట్టి, నేను ఈ వాతావరణానికి అలవాటు పడ్డానికి ప్రయత్నిస్తున్నాను. కనీసం బస్సులు సమయనికి నడుస్తున్నాయి. అలాగే, ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా కనిపిస్తున్నారు" అని చెప్పారు.

ఇలాంటి నియంత్రణలతో కూడిన ఇండోర్ వాతావరణం వల్ల అథ్లెట్లకు, ముఖ్యంగా తమ ఈవెంట్ సన్నాహాల కోసం వీలైనంత ఎక్కువగా దృష్టి పెట్టాలనుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కొందరు చెప్పారు.
కానీ, ఇలాంటి పరిస్థితుల వల్ల ఒలింపిక్ క్రీడావేడుకల ప్రత్యేకత చాటేలా నిర్వహించే పార్టీలు, ఉత్సవాలకు మిగతావారు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
అయితే, బీజింగ్‌లో వణికించే చలికాలం ఇంట్లో నుంచి బయటకు రాకుండా ప్రజలను లోపలే ఉంచేస్తోంది.
కరోనా మహమ్మారి మొదలైన తర్వాత చైనా దేశంలోకి విదేశీ యాత్రికులను ఎవరినీ అనుమతించలేదు. చైనా సందర్శనకు వచ్చిన విదేశీ సందర్శకులు కూడా ఎవరూ లేరు. దేశంలో ప్రస్తుతం ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన వారు మాత్రమే ఉన్నారు.
కానీ, క్రీడలకు హాజరైనవారు మాత్రమే నిజమైన చైనాను చూడగలరు. ఎందుకంటే వారంతా ప్రతిరోజూ తమ హోటల్ నుంచి, క్రీడా వేదికల వరకు వెళ్లి వస్తుంటారు.
"గత దశాబ్ద కాలం నుండి చైనా ఎదుగుదల గురించి చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు, అయితే, ఇక్కడి ఎత్తైన భవనాలు, వాటిలో నివసించేవారు, అక్కడ పని చేసేవారు, ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని కొన్ని క్షణాల పాటు చూసే అవకాశం లభించడంతో చైనా నన్ను ఆకట్టుకుంది" అని గిల్డియల్ చెప్పారు.
"నేను ప్రతిరోజూ ఆ 20 నిమిషాల ప్రయాణం కోసం ఎదురుచూస్తుంటా. ఎందుకంటే ఆ కొన్ని నిమిషాలే నాకు బబుల్ లోపల నుంచి అసలైన బీజింగ్‌ను చూసే అవకాశాన్ని అందిస్తోంది" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్ఆర్బీ గ్రూప్-డి పరీక్ష ఒకే దశలో నిర్వహించడానికి సిద్ధమన్న రైల్వే మంత్రి
- మియన్మార్: సాయుధ సైనికులను అడ్డుకునేందుకు ఒక నన్ మోకాళ్ల మీద కూర్చున్నపుడు ఏం జరిగింది?
- 768 కిలోమీటర్ల పొడవైన మెరుపు.. సరికొత్త ప్రపంచ రికార్డు
- గుంటూరు జిన్నా టవర్: ఆకుపచ్చగా ఉన్న ఈ టవర్‌కి భారత్ జెండా రంగులు ఎవరు., ఎందుకు వేశారు?
- స్టాలిన్గ్రాడ్ యుద్ధం: హిట్లర్ ఆత్మహత్యకు కారణమైన ఈ యుద్ధంలో ఏం జరిగింది? ఎలా ముగిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












