చైనా: గల్వాన్ లోయలో దూకుడు అంతా షీ జిన్‌పింగ్ మూడోసారి ఎన్నికల్లో గెలిచేందుకేనా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండేళ్ల క్రితం కరోనావైరస్ మొదటి వేవ్ నుంచి బయటపడుతున్న సమయంలో భారత, చైనాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.
2020 మేలో ప్రారంభమైన ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. వీటిని తగ్గించడానికి అనేక రౌండ్ల చర్చలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల, చైనా పాంగోంగ్ త్సో సరస్సుపై వంతెన నిర్మించిందని, గల్వాన్ లోయలో తమ జెండా ఎగురవేసిందని వచ్చిన వార్తలు చూస్తుంటే, ఆ దేశం మరోసారి భారత్‌తో ఉన్న అప్రకటిత సరిహద్దుపై ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది.
ఈ మేరకు దౌత్య, రాజకీయ వర్గాల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. చైనా కావాలనే ఇదంతా చేస్తోందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ ఘటనల పట్ల భారత వైఖరిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సంయమనంతో కూడిన స్పందనలే వచ్చాయి.
ఈ ఏడాది చైనాలో 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్' జరగనుంది. దానికి సమయం దగ్గర పడుతున్నకొద్దీ చైనా నుంచి ఇలాంటి రెచ్చగొట్టే సంఘటనలు పెరుగుతున్నాయని విదేశీ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
షీ జిన్‌పింగ్ చారిత్రాత్మకంగా 'మూడోసారి' పోటీ చేయనున్నారు
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు 2022 చాలా ముఖ్యమైనదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన చారిత్రాత్మకంగా 'మూడవసారి' ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
కాగా, గత ఏడాది నవంబర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంలోనే ప్రభుత్వాన్ని నడిపేందుకు విధించిన రెండు పదవీ కాలాల పరిమితిని ముగించింది. దీంతో పాటు 'సెంట్రల్ మిలటరీ కమిషన్' అంటే దేశ సైన్యం పగ్గాలను జిన్‌పింగ్‌కు అప్పగించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో షీ జిన్‌పింగ్‌కు మూడోసారి గెలిచేందుకు మార్గం సులభమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మూడోసారి అధ్యక్ష పదవిని చేపట్టడం జిన్‌పింగ్‌కు కూడా ఇష్టమేనని లండన్ కింగ్స్ కాలేజీలోని ఇంటర్నేషనల్ అఫైర్స్ విభాగం అధిపతి హర్ష్ వి పంత్ బీబీసీతో అన్నారు.
"అయితే, అది అంత సులువు కాదు. షీ జిన్‌పింగ్ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీలోనూ, దేశంలోనూ ఒత్తిడి ఉంది. తన విమర్శకులను శాంతింపజేయడంతో పాటు, జాతీయవాద నాయకుడిగా దేశ ప్రజల్లో తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకోవాలి. ఇవి, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రారంభం కావడానికి ముందే ఆయన ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు" అని పంత్ అన్నారు.
స్వదేశంలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో మిత్రదేశాల మధ్య తన హవా కొనసాగించడం లేదా బలోపేతం చేయడం కూడా జిన్‌పింగ్ ముందున్న సవాలని నిపుణులు అంటున్నారు.
స్వదేశంలో పరిస్థితి దిగజారుతోందా?
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఇప్పటికే "అంతర్జాతీయ చట్టాలను అదుపులో ఉంచుతోంది" అని విదేశీ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లాని ఒక ట్వీట్ చేశారు.
"షీ జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా బలహీన దేశాల సార్వభౌమాధికారాన్నీ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించింది. లిథువేనియా వంటి దేశాలు కూడా చైనాలోని తమ రాయబార కార్యాలయాలను మూసివేయాల్సిన పరిస్థితి కల్పించింది" అని ఆయన రాశారు.
వాణిజ్యాన్ని 'ఆయుధీకరించిన' ఏకైక దేశం చైనా. అంటే ఒక విధంగా వాణిజ్యాన్ని 'సైనికీకరణ' చేసిందని, తైవాన్‌తో మెరుగైన సంబంధాలు లేదా వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న దేశాలను కూడా చైనా లక్ష్యంగా చేసుకుందని చెల్లానీ అన్నారు.
దేశం నుంచి సమాచారం బయటకు వెళ్లకుండా చైనా నిషేధించింది. అయినప్పటికీ, అక్కడ పరిస్థితులు బాగోలేవనే వార్తలు వస్తూనే ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
కరోనా మొదటి వేవ్‌లో చైనా తన పౌరులపై ఆంక్షలు విధించడమే కాకుండా, మూడవ వేవ్‌లో రెండు పెద్ద నగరాల్లో కఠినమైన లాక్-డౌన్ విధించింది. ఇవి, ప్రజల్లో ప్రభుత్వానికి ఆదరణ తగ్గిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, @SHEN_SHIWEI
భారత్ వైఖరి
ప్రస్తుతం భారతదేశం అవలంబిస్తున్న వైఖరి వ్యూహాత్మకంగా సరైనదేనని పంత్ అభిప్రాయపడ్డారు. అయితే, గల్వాన్, పాంగోంగ్ త్సో ఘటనలపై భారత్ బలంగా స్పందించాలన్నది ఆయన వ్యక్తిగత విశ్వాసం.
కాగా, అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు నిర్ణయాలు తీసుకుని తమ అధికార పార్టీకి ఇబ్బందులు సృష్టించకూడదని కూడా భావిస్తూ ఉండవచ్చని ఆయన అన్నారు.
సరిహద్దుకు సమీపంలో చైనా తమ భూభాగంలోనే బ్రిడ్జి లేదా హెలిప్యాడ్ నిర్మిస్తుంటే దానికి భారత్ ఏం చేయగలదని పంత్ అన్నారు.
"ఇప్పటివరకు, భారతదేశం తన సైనిక సామర్థ్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది, ఇది మంచిదే ఎందుకంటే, దీనివల్ల సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉంటాయి. ఈలోగా ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది."
కాగా, ఈ అంశంలో భారతదేశంలోని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. చైనా తీసుకుంటున్న దూకుడు చర్యలపై భారత ప్రభుత్వం కూడా అదే విధంగా స్పందించాలని వారు కోరుతున్నారు.
భారత్ ఇప్పటివరకూ అవలంబిస్తున్న వైఖరికే కట్టుబడి ఉండాలని, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌కు ముందు షీ జిన్‌పింగ్‌కు లాభం చేకూర్చగలిగే తొందరపాటు చర్యలు తీసుకోకూడదని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ అగ్ని 5: అణ్వాయుధాలను మోసుకెళ్లే ఈ క్షిపణిని చైనా లక్ష్యంగా తయారు చేసిందా?
- తన చిన్ననాటి జ్ఞాపకాలతో గ్రామం మ్యాప్ గీశాడు.. కిడ్నాప్ అయిన 30 ఏళ్ల తర్వాత కన్నతల్లిని కలిశాడు
- చైనా, భూటాన్ ఒప్పందంతో భారత్‌కు టెన్షన్ తప్పదా... 'చికెన్స్ నెక్' మీద డ్రాగన్ కన్ను పడిందా?
- చైనాలో ఏం జరుగుతోంది? షియాన్ నగరంలో ప్రజలను అర్థరాత్రి క్వారంటైన్‌కు ఎందుకు తరలిస్తున్నారు?
- భారత్ – చైనా: గల్వాన్ లోయ ఘర్షణలకు ఏడాది.. సరిహద్దుల్లో పరిస్థితి ఇప్పుడెలా ఉంది
- మరోసారి రష్యా నమ్మకం గెలుచుకున్న భారత్... అమెరికాను దూరం పెడుతోందా?
- టీ20 ప్రపంచకప్: పాకిస్తాన్ జర్నలిస్ట్ ‘ఘోరమైన ప్రశ్న’.. సమాధానం ఇవ్వడానికి నిరాకరించిన అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మొహమ్మద్ నబీ
- పాశ్చాత్య దేశాలతో యుద్ధానికి రష్యా, చైనా రిహార్సల్స్ .. భవిష్యత్ యుద్ధాలు, ఆయుధాలు ఎలా ఉంటాయి?
- లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఇప్పుడు ఎలా ఉంది?
- భారత్-చైనా సరిహద్దు వివాదం: గల్వాన్ లోయలో ఘర్షణ వీడియోను విడుదల చేసిన చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












