భవిష్యత్ యుద్ధాల్లో ఏం జరుగుతుంది? యుద్ధానికి దిగిన దేశం మొదటి టార్గెట్ ఏంటి?

వీడియో క్యాప్షన్, భవిష్యత్ యుద్ధాల్లో పశ్చిమ దేశాలు రష్యా, చైనాలను ఎదుర్కోగలవా?

యుద్ధం అంటే మరో రూపంలో రాజకీయాల కొనసాగింపే అన్నారు ప్రష్యన్ సైనిక సిద్ధాంతవేత్త క్లాస్‌విట్జ్. యుద్ధం అంటే రక్తపాతంతో కూడుకున్న రాజకీయాలని అన్నారు చైనా కమ్యూనిస్ట్ నేత మావో.

యుద్ధానికి, రాజకీయాలకూ మధ్య సంబంధం గురించి ఇలాంటి నిర్వచనాలు చాలానే ఉన్నాయి. కానీ, భవిష్యత్ యుద్ధాలను డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫీషల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలే శాసించనున్నాయా అంటే... ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది.

అసలేం జరుగుతోంది?

బ్రిటిష్ డిఫెన్స్ పాలసీల్లో 2021లో కొన్ని మౌలిక మార్పులు జరిగాయి. డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, సైబర్ రంగాలకు బడ్జెట్‌ను భారీగా పెంచారు. అదే సమయంలో, సంప్రదాయ యుద్ధసామగ్రి కోసం, సైనికుల సంఖ్యపైన చేసే ఖర్చుల్ని గణనీయంగా తగ్గించారు.

ఓ వైపు రష్యా తన బలగాలను యుక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా మోహరిస్తోంది. నాటో తన సభ్య దేశాల్లోంచి వెనక్కి తగ్గాలని అది డిమాండ్ చేస్తోంది. తైవాన్‌ను మళ్లీ స్వాధీనం చేసుకుంటామని, దాని కోసం అవసరమైతే బలప్రయోగం చేయడానికైనా వెనక్కి తగ్గబోమని చైనా వార్నింగ్స్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో పై మార్పులు చోటుచేసుకోవడం విశేషం.

ప్రపంచంలో ఇప్పటికీ చిన్నా, పెద్దా ప్రాంతీయ ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇథియోపియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. యుక్రెయిన్‌లో వేర్పాటువాద హింసలో 2014 నుంచి నేటి వరకూ 14 వేల మందికి పైగా మరణించారు. సిరియాలో తిరుగుబాటు ఇంకా చల్లారలేదు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

భవిష్యత్తు యుద్ధాలు ఎలా ఉండొచ్చు?

మరి భవిష్యత్తు యుద్ధాలు ఎలా ఉండొచ్చు? దీనికి Answer చెప్పడానికి ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే...'ఫ్యూచర్ వార్‌ఫేర్' లేదా 'భవిష్యత్ యుద్ధతంత్రానికి' సంబంధించిన ఆనవాళ్లు అక్షరాలా మన కళ్లెదుటే ఉన్నాయి. దాని రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయంటారు బీబీసీ సెక్యూరిటీ కరెస్పాండెంట్ ఫ్రాంక్ గార్డనర్. అంతేకాదు, భవిష్యత్తు యుద్ధాల కోసం మోహరింపు కూడా అప్పుడే జరిగిపోయిందని ఆయన తన తాజా వ్యాసంలో రాశారు.

గత నవంబర్ 16న రష్యా ఒక మిసైల్ పరీక్ష జరిపింది. స్పేస్‌లో జరిపిన ఈ testలో అది తన సొంత శాటిలైట్‌లలో ఒక దాన్ని ధ్వంసం చేసింది. అంతకు ముందు, వేసవిలో చైనా తన అధునాతన హైపర్‌సోనిక్ మిసైల్స్‌ను పరీక్షించింది. అవన్నీ ధ్వని వేగానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వేగంగా ప్రయాణిస్తాయి. సైబర్ దాడులైతే ఇక చెప్పనక్కర్లేదు.. దాదాపు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. దీన్నే'సబ్-థ్రెషోల్డ్ వార్‌ఫేర్' అని కూడా పిలుస్తున్నారు.

పశ్చిమ దేశాలు దీనికి సన్నద్ధంగా ఉన్నాయా?

గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ దేశాలన్నీ మిడిల్ ఈస్ట్ దేశాలపైనే ప్రధానంగా ఎంగేజ్ అయి ఉన్న కాలంలో వాటి శత్రు దేశాలన్నీ సైనికపరంగా ఎన్నో మెట్లు పైకెక్కాయంటారు మిషెల్ ఫ్లోర్నాయ్. ఆమె గతంలో పెంటగన్‌లో అమెరికా స్ట్రాటజీకి పాలసీ చీఫ్‌గా పని చేశారు.

అమెరికా, బ్రిటన్, వాటి మిత్రదేశాలన్నీ గత 20 ఏళ్లుగా కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ ఇన్‌సర్జెన్సీ, ఇరాక్, అఫ్గాన్ యుద్ధాలపైనే ఫోకస్ చేస్తూ వచ్చాయి. దాంతో గ్రేట్ పవర్స్ మధ్య ఒక తీవ్రమైన పోటీ దశలోకి చేరుకున్నామని అర్థం చేసుకోవడంలో ఆలస్యం అయ్యిందంటారు మిషెల్.

పశ్చిమ దేశాలు మిడిల్ ఈస్ట్ యుద్ధాల్లో బిజీగా ఉన్న సమయంలో రష్యా, చైనాలు తమ సమయాన్ని ఎక్కువగా సైబర్ యాక్టివిటీ కోసం కేటాయించాయి. పాశ్యాత్య సమాజాలను దెబ్బతీయడం, ఎన్నికలను ప్రభావితం చేయడం, సున్నితమైన డేటాను చోరీ చేయడం వంటి లక్ష్యాలతో పాల్పడే విచ్ఛిన్నకర దాడులు కూడా ఇందులో భాగమే.

ఇప్పుడు రష్యా లేదా చైనాతో యుద్ధం జరిగితే?

యుక్రెయిన్ అంశంపై రష్యాకు, పశ్చిమ దేశాలకు మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు లేదా తైవాన్ విషయంలో అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సంఘర్షణగా పరిణమిస్తే ఏం జరగొచ్చు? అది ఎలా ఉండొచ్చు?

Strategic Support Forceగా పిలిచే ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసుకుంది చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. అది స్పేస్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, సైబర్ సామర్థ్యాల్లో పని చేస్తుంది.

దీనర్థం ఏంటంటే... ఇకపై జరిగే ఏ సంఘర్షణలోనైనా మొట్టమొదట రెండు వైపులా జరిగేది పరస్పర సైబర్ దాడులే. అంటే, కమ్యూనికేషన్స్, శాటిలైట్స్ వ్యవస్థల్ని దెబ్బతీయడం ద్వారా ప్రత్యర్థికి కళ్లు కనిపించకుండా చేయడం. అంతేకాదు, సముద్రం లోపలి నుంచి డేటాను మోసుకెళ్లే కీలకమైన cables కత్తిరించడం కూడా ఇందులో భాగమే.

మరి దీని వల్ల మనలాంటి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు ఎలా ఉండొచ్చు? సడెన్‌గా మన ఫోన్లు పని చేయకుండా పోతాయా? పెట్రోల్ పంపుల్లో నిల్వలు నిండుకుంటాయా? ఆహార పంపిణీ వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోతుందా?

బహుశా ఇవన్నీ కూడా జరగొచ్చనేదే దీనికి జవాబు. ఎందుకంటే బలమైన దేశాలు కేవలం అఫెన్సివ్ సైబర్ సామర్థ్యాలపై మాత్రమే కాకుండా, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాల్లో కూడా భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నాయి. అవి శాటిలైట్లను జామ్ చేయగలుగుతాయి. కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేస్తాయి. కాబట్టి భవిష్యత్తు యుద్ధాల్లో టార్గెట్ ఒక్క సైన్యం మాత్రమే కాదు... సమాజాలే టార్గెట్‌ అవుతాయి.

కృత్రిమ మేధలో ఆమెరికా ఆధిపత్యం

ఇక భవిష్యత్తు యుద్ధాల్లో ప్రధాన పాత్ర పోషించగల మరో అంశం - ఆర్టిఫీషల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ. ఇది కమాండర్ల డెసిషన్ మేకింగ్, రెస్పాన్స్ వేగాన్ని భారీ స్థాయిలో పెంచుతుందని ఫ్రాంక్ గార్డనర్ రాశారు. దీని ద్వారా వారు సమాచారాన్ని చాలా వేగంగా ప్రాసెస్ చేసుకోగలుగుతారు.

అయితే, సరిగ్గా ఇక్కడే అమెరికాకు తన ప్రత్యర్థులందరికన్నా గుణాత్మకమైన అడ్వాంటేజ్ ఉంది. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సంఖ్యతో పోలిస్తే పశ్చిమ దేశాల సైన్యాలు సంఖ్యలో తక్కువే అయినా, ఏఐ సాయంతో అవి ఆ లోపాన్ని అధిగమించగలుగుతాయంటారు మిషెల్.

మనుషులను మెషీన్లతో అనుసంధానించడం ద్వారా శత్రు సైన్యాలు సంఖ్యలో ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి డిఫెన్స్ లేదా అటాక్ ప్లానింగ్‌ను దెబ్బతీయొచ్చని ఆమె అంటారు.

హైపర్‌సోనిక్ మిసైల్స్ రంగంలో రష్యా, చైనా ముందంజ

రష్యా, చైనాలతో పోలిస్తేపశ్చిమ దేశాలు దారుణంగా వెనుకబడి ఉన్న రంగం- హైపర్‌సోనిక్ మిసైల్స్ రంగం. ధ్వని వేగానికన్నా 5 నుంచి 27 రెట్ల వేగంతో ప్రయాణించగల ఈ సూపర్ చార్జ్‌డ్ మిసైల్స్... సంప్రదాయ లేదా అణు క్షిపణులను మోసుకెళ్లగలుగుతాయి.

ఇటీవలే తమ జిర్కోన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశామని రష్యా వెల్లడించింది. దీని ద్వారా ప్రపంచంలో ఏ మూలలోనైనా సరే, ఎలాంటి రక్షణ వ్యవస్థనైనా ఓడించగలమని కూడా ప్రకటించింది రష్యా.

ఇక చైనాకు చెందిన డోంగ్ ఫెంగ్ 17ను తొలిసారి 2019లో ప్రదర్శించారు. ఇది Hypersonic Glide vehicleను మోసుకెళ్తుంది. ఈ వెహికిల్ ఊహకందని ఎత్తులో భూవాతావరణం గుండా ప్రయాణిస్తుంది. అలా దీన్ని intercept చేయడం దాదాపు అసాధ్యం.

మరోవైపు, అమెరికా కూడా ఈ మధ్య ఇలాంటి పరీక్షలే జరిపింది కానీ అవేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. చైనా అమ్ములపొదిలో ఇప్పుడు ఈ కొత్త అస్త్రాలు చేరిన నేపథ్యంలో,చైనా గనక తైవాన్‌ను ఆక్రమించుకోవాలని నిర్ణయించుకుంటే, దాన్ని కాపాడేందుకు యుద్ధంలోకి దిగే విషయంలో అమెరికా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. మరి.

ఇక భారత్ విషయానికొస్తే... కొన్నేళ్లుగా భారత్ హైపర్ సోనిక్ మిసైల్స్ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తోంది. 2020 సెప్టెంబర్‌లో Hypersonic Technology Demonstrated Vehicle (HSTDV) ను విజయవంతంగా పరీక్షించింది DRDO. అయితే, ఈ రంగంలో భారత్ రష్యా, చైనా, అమెరికాలతో పోలిస్తే వెనకే ఉందని చెప్పాలి.

ఇక తాజాగా, 2022 జనవరి 6న ఉత్తర కొరియా మరో hypersonic missileను పరీక్షించింది. దాదాపు 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించామని ప్రకటించింది ప్యోంగ్యాంగ్.

రాబోయే పదేళ్లు కీలకం

బ్రిటన్ కొత్త టెక్నాలజీలో ఖర్చును పెంచుతూ, సంప్రదాయ బలగాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటోంది. ఇది 20 ఏళ్లలో ఫలితాలిస్తుంది కానీ ఈలోగా ఆందోళనకరమైన గ్యాప్ ఒకటి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

'వచ్చే ఐదు లేదా పదేళ్ల కాలంలో సైనికుల సంఖ్యను బ్రిటన్ బాగా తగ్గిస్తుంది. అయితే, అదే సమయంలో, కొత్తగా ముందుకు వస్తున్న సాంకేతిక సామర్థ్యాలు సైనికచర్యల్లో ప్రభావం చూపగల స్థాయికి ఇంకా చేరుకోవు. కానీ, మిత్రదేశాలతో సన్నిహిత సహకారం, ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ సవాలును అధిగమించవచ్చని నిపుణుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)