'ముస్లింను కావడం వల్లే నన్ను మంత్రి పదవి నుంచి తొలగించారు' - బ్రిటన్ మాజీ మంత్రి నుస్రత్ ఘనీ

నుస్రత్ ఘనీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నుస్రత్ ఘనీ

తన మత విశ్వాసాల కారణంగానే 2020లో తనను మంత్రి పదని నుంచి తొలగించినట్లు ఒక ప్రభుత్వ విప్ చెప్పారని బ్రిటన్‌కు చెందిన ఒక ముస్లిం ఎంపీ అంటున్నారు.

సండే టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకారం, తనను పదవి నుంచి ఎందుకు తొలగించారో తెలుపవలసిందిగా అధికార పార్టీకి చెందిన నుస్రత్ ఘనీ వివరణ కోరారు.

తన "ముస్లిం మత విశ్వాసాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం కావడంతో" తొలగించాల్సి వచ్చినట్లు ఒక చీఫ్ విప్ చెప్పారని ఆమె వెల్లడించారు.

నుస్రత్ ఘనీ తనను ఉద్దేశించే మాట్లాడుతున్నారని, ఆమె వాదనలు పూర్తిగా అసంబద్ధమని, ఆమె వ్యాఖ్యలు తనకు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని కన్జర్వేటివ్ చీఫ్ విప్ మార్క్ స్పెన్సర్ అన్నారు.

నుస్రత్ ఘనీ ఆందోళనలపై చర్చించేందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇంతకుముందే ఆమెతో సమావేశమైనట్లు ప్రధాని కార్యాలయం (నంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్) తెలిపింది.

ఈ విషయంపై బోరిస్ జాన్సన్ "తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారికంగా ఫిర్యాదు ప్రక్రియను ప్రారంభించమని ఆమెకు లేఖ రాశారు. కానీ, ఆమె ఆ పని చేయలేదు. కన్జర్వేటివ్ పార్టీ ఏ విధమైన పక్షపాతాన్ని లేదా వివక్షను సహించదు" అని ఒక ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.

నుస్రత్ ఘనీ 2018లో రవాణా శాఖలో మంత్రిగా నియమితులయ్యారు. దాంతో, హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టిన తొలి ముస్లిం మహిళా మంత్రి అయ్యారామె.

మైక్ స్పెన్సర్

ఫొటో సోర్స్, PA MEDIA

ఫొటో క్యాప్షన్, మైక్ స్పెన్సర్

2020 ఫిబ్రవరిలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం చేపట్టిన చిన్నపాటి పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఘనీ తన పదవిని కోల్పోయారు.

అందుకు ఆమె వివరణ కోరినప్పుడు, పునర్వ్యవస్థీకరణ గురించి చర్చల సమయంలో ఆమె "ముస్లిం మత విశ్వాసాల పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని", ఆమె "ఒక ముస్లిం మహిళ కావడం సహోద్యోగులను అసౌకర్యానికి గురిచేస్తోందని" ఒక ప్రభుత్వ విప్ చెప్పినట్లు ఘనీ తెలిపారు.

ఈ అంశంపై "పట్టు విడవకుండా ఉంటే", తాను "బహిష్కరణకు గురవుతారని, తన కెరీర్, ప్రతిష్ట నాశనం అవుతాయని" హెచ్చరికలు అందడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నట్లు ఆమె వెల్లడించారు.

"అధికార పార్టీ ఛానెల్స్ ద్వారా ఈ అంశాన్ని అనేకమార్లు లేవనెత్తాను... ఈ అంశంలో చాలా జాగ్రత్తగా విధానాన్ని అనుసరించాను. కానీ, ఈ విధానం తోవ తప్పినప్పుడు, నా కెరీర్‌ను కొనసాగించడం తప్ప నాకు వేరే మార్గం లేకపోయింది" అని ఘనీ తెలిపారు.

ఘనీ చేసిన ఆరోపణలు "చాలా తీవ్రమైనవని", అయితే, ఆమె అధికారికంగా ఫిర్యాదు చేస్తే తప్ప దర్యాప్తు జరుపలేరని జస్టిస్ సెక్రటరీ డొమినిక్ రాబ్ బీబీసీ సండే మార్నింగ్‌తో అన్నారు.

నుస్రత్ ఘనీ

ఫొటో సోర్స్, UK PARLIAMENT

'ఆమె ఆరోపణలు అసంబద్ధం'

ఘనీ తననే ఉద్దేశించి ఆరోపణలు చేస్తున్నట్లు స్పెన్సర్ శనివారం రాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఆమె పూర్తిగా "తప్పుడు ఆరోపణలు" చేస్తున్నారని, అవి "పరువు నష్టాన్ని కలిగించే" వాదనలని, ఘనీ చెబుతున్నట్లు తాను అలాంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని స్పెన్సర్ కొట్టిపారేశారు.

ఆ సమయంలోనే ఆమె ఈ అంశాన్ని కన్జర్వేటివ్ పార్టీ అధికారిక దర్యాప్తు వరకు తీసుకెళ్లకపోవడం "నిరాశ కలిగించిందని" ఆయన అన్నారు.

వివక్ష ఫిర్యాదులపై కన్జర్వేటివ్ పార్టీ ఎలా వ్యవహరించిందో పరిశీలించిన 'సింగ్ విచారణ'కు తాను గతంలో సాక్ష్యాలను అందించినట్లు స్పెన్సర్ చెప్పారు.

ఆమె "ఆరోపణలకు విశ్వసనీయమైన ఆధారాలు లేవని" సింగ్ దర్యాప్తు తెలిపినట్లు స్పెన్సర్ చెప్పారు.

కాగా, "వ్యవస్థీకృతం కాకపోయినప్పటికీ", కన్జర్వేటివ్ పార్టీలో "వివక్ష చూపినట్లు రుజువులు ఉన్నాయని" ప్రొఫెసర్ సింగ్ 2021 నివేదికలో తేలింది. ఫిర్యాదుల ప్రక్రియను సరిదిద్దాలని ఈ నివేదిక పిలుపునిచ్చింది.

కన్జర్వేటివ్ పార్టీలో "ఇస్లామోఫోబియా లేదా ఏ విధమైన జాత్యహంకారానికి చోటు లేదని", ఆరోపణలపై "సరైన విచారణ జరిపి, జాత్యహంకారాన్ని తొలగించాలని" ఎడ్యుకేషన్ సెక్రటరీ నదీమ్ జహావి ఒక ట్వీట్‌లో తెలిపారు.

ఘనీ చెప్పిన విషయాలు తనను "చాలా కలత పెట్టాయని" కన్జర్వేటివ్ ముస్లిం ఫోరమ్ ప్రెసిడెంట్ లార్డ్ షేక్ అన్నారు.

"ఎవరో నిజాలను దాస్తున్నారు. ఈ అంశంలో లోతులకు వెళ్లి పరిశీలించాలి. ఒక స్వతంత్ర అభ్యర్థి ఈ అంశంలో విచారణ జరపాలని నేను కోరుకుంటున్నాను" అని ఆయన అన్నారు.

బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, Getty Images

బోరిస్ జాన్సన్‌‌పై ఇతర ఆరోపణలు

బోరిస్ జాన్సన్‌కు కీలకం కానున్న వారానికి ముందే, ఈ వివాదం బహిరంగం కావడం అనేది టోరీల మధ్య ఉన్న తీవ్రమైన ఉద్రిక్తతలకు సంకేతమని బీబీసీ పొలిటికల్ కరస్పాండెంట్ డామియన్ గ్రామాటికాస్ అన్నారు.

కరోనావైరస్ లాక్‌డౌన్‌ల సమయంలో నంబర్ 10 (బోరిస్ జాన్సన్ ప్రభుత్వ కార్యాలయం)లో జరిగిన పార్టీలపై సివిల్ సర్వెంట్ స్యూ గ్రే తన విచారణను పూర్తి చేయవలసి ఉంది.

ఇప్పుడు స్యూ గ్రే, బోరిస్ జాన్సన్ ప్రైవేట్ డౌనింగ్ స్ట్రీట్ ఫ్లాట్‌లో జరిగే సమావేశాలను కూడా పరిశీలిస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

ఈ దర్యాప్తులో తేలిన సారాంశాన్ని పబ్లిష్ చేస్తారు. కానీ, మొత్తం నివేదికను బహిరంగపరుస్తారా లేదా అనేది అస్పష్టం అని రాబ్ అన్నారు.

బోరిస్ జాన్సన్‌ను గద్దె దింపాలని కోరిన ఎంపీలను డౌనింగ్ స్ట్రీట్ "బ్లాక్‌మెయిల్" చేయడానికి ప్రయత్నించిందని సీనియర్ కన్జర్వేటివ్ బ్యాక్‌బెంచర్ విలియం వ్రాగ్ చేసిన వాదనల తరువాత ఘనీ చేసిన ఆరోపణలు వెలుగులోకొచ్చాయి.

వచ్చే వారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో మెట్ పోలీస్ డిటెక్టివ్‌తో మాట్లాడతానని మిస్టర్ వ్రాగ్ చెప్పారు.

వ్రాగ్ ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.

కామన్స్ కమిటీ ఆన్ స్టాండర్డ్స్ చైర్మన్ క్రిస్ బ్రయంట్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా దాదాపు డజను మంది టోరీ ఎంపీలతో తాను మాట్లాడానని, వారి నియోజకవర్గాలకు అందాల్సిన నిధులను నిలిపివేస్తామని విప్‌లు బెదిరించినట్లు వారంతా ఆరోపించారని చెప్పారు.

వ్రాగ్ ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు కనిపించలేదని ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు.

స్యూ గ్రే నివేదిక వచ్చే వారం విడుదల అయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంతో నంబర్ 10, టోరీ విప్స్ జాన్సన్‌కు మద్దతు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

మొదటి లాక్‌డౌన్ సమయంలో నంబర్ 10లో ఒక డ్రింక్స్ ఈవెంట్‌కు హాజరైనట్లు జాన్సన్ అంగీకరించిన అనంతరం, ఆయన రాజీనామా చేయాలని కొంతమంది కన్జర్వేటివ్ ఎంపీలు పిలుపునిచ్చారు.

ఇప్పటివరకు ఆరుగురు టోరీ ఎంపీలు ప్రధానిపై బహిరంగంగా అవిశ్వాసం ప్రకటించారు. అయితే, చాలా మంది ఎంపీలు టోరీ నాయకత్వ పోటీలను నిర్వహించే బ్యాక్‌బెంచ్ 1922 కమిటీ ఛైర్మన్ సర్ గ్రాహం బ్రాడీకి లేఖలు సమర్పించినట్లు సమాచారం.

పార్టీ నిబంధనల ప్రకారం, 54 మంది అవిశ్వాసం లేఖలు సమర్పిస్తే, అది నాయకత్వ ఎన్నికలకు దారి తీస్తుంది.

వీడియో క్యాప్షన్, భారత్ వ్యాపారాన్ని ఆపేయడంతో ఇబ్బందుల్లో పాకిస్తాన్ ఖర్జూరం రైతులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)