రిజర్వాయర్ పనులు చేస్తుంటే భారీ ‘సీ డ్రాగన్’ శిలాజం బయటపడింది

తవ్వకాల్లో బైటపడ్డ ఇథ్యోసార్ అవశేషం

ఫొటో సోర్స్, MATTHEW POWER PHOTOGRAPHY

ఫొటో క్యాప్షన్, తవ్వకాల్లో బైటపడ్డ ఇథ్యోసార్ అవశేషం
    • రచయిత, జోనా ఫిషర్
    • హోదా, బీబీసీ ఎన్విరాన్మెంట్

బ్రిటన్‌లో రట్‌ల్యాండ్ వాటర్ నేచర్ రిజర్వ్ దగ్గర అరుదైన జీవి అవశేషాలు బయటపడ్డాయి.

ఫిబ్రవరి 2021లో రిజర్వాయర్ దగ్గర ల్యాండ్ స్కేపింగ్ పనులు జరుగుతున్నప్పుడు అక్కడ పని చేస్తున్న జో డేవిస్‌కు మట్టిలో కూరుకుపోయి విచిత్రంగా ఉన్నదేదో కనిపించింది.

"వెంటనే కౌంటీ కౌన్సిల్‌కు ఫోన్ చేసి డైనోసార్‌లాగా ఉన్నదాన్ని నేను కనిపెట్టానని వాళ్లకు చెప్పాను" అని డెవిస్ అన్నారు.

అయితే అది డైనోసార్ కాదు. అది 10 మీటర్లుండే సముద్ర జీవి ఇథ్యోసార్ అవశేషం అని తేలింది. ఈ తరహా జీవుల్లో ఇప్పటి వరకు యూకేలో లభించిన అతి పెద్ద అవశేషం ఇదేనని భావిస్తున్నారు.

"దానిని చూడగానే మట్టిలోంచి వెలికి వచ్చిన కొండ శిఖరంలా, రాయిలాగా అనిపించినప్పటికీ, అది కాస్త భిన్నంగా కనిపించింది" అని డేవిస్ బీబీసీకి చెప్పారు.

వీడియో క్యాప్షన్, సురక్షితంగా భద్రపరిచిన డైనోసార్ పిండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

కొంతసేపటికి దవడ ఎముక లాంటి భాగం కనిపించింది.

"రట్‌ల్యాండ్ కౌంటీ కౌన్సిల్‌లో డైనోసార్ విభాగం లేదు. మేము దానికి సంబంధించిన వారితో మీకు కాల్ చేయిస్తాం" అని డేవిస్‌కు కౌన్సిల్ చెప్పింది. ఆ తర్వాత దాన్ని గమనించేందుకు శిలాజ శాస్త్రవేత్తలను తీసుకుని వచ్చారు.

ఆ జీవి ఇథ్యోసార్ అని శాస్త్రవేత్తలు తేల్చారు. దీని రక్తం వేడిగా ఉండి, గాలిని పీలుస్తూ, సముద్రంలో జీవులను వేటాడి తింటూ ఉండేది. ఇవి 25 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. ఇవి 250 మిలియన్ - 90 మిలియన్ సంవత్సరాల క్రితం బతికిన జీవులు.

ఇథ్యోసార్ అవశేషాలు బైటపడటం ఇంగ్లాండ్‌లో మహా అరుదు

ఫొటో సోర్స్, ANGLIAN WATER

ఫొటో క్యాప్షన్, ఇథ్యోసార్ అవశేషాలు బైటపడటం ఇంగ్లాండ్‌లో అరుదు

ఎలా వెలికి తీశారు?

ఈ జీవుల అవశేషాల తవ్వకం పనులు చూసేందుకు మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ డీన్ లొమాక్స్‌ను నియమించారు.

"దీని పరిమాణం, ఆకారం రీత్యా ఈ జీవి ఇలా బయటపడటం ఊహించని విషయం. ఇది బ్రిటిష్ శిలాజ చరిత్రలో అరుదైన ఘటన" అని ఆయన అన్నారు.

‘‘సాధారణంగా డోర్ సెట్‌లోని జురాసిక్ తీరంలో లేదా యార్క్‌షైర్ తీరంలో ఇథ్యోసార్, ఇతర సముద్ర సరీసృపాలు కనిపిస్తాయని అనుకుంటాం. అక్కడ కొండ శిఖరాలు కోతకు గురి కావడం వల్ల ఇవి బయటకు కనిపిస్తూ ఉంటాయని చెప్పారు. దీవి ప్రాంతంలో ఇలా కనపడటం చాలా అసాధారణం" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, డైనోసార్లు పూర్తిగా అంతమై, పాములు భారీగా వృద్ధి చెందడానికి కారణమేంటి?

తీరం నుంచి రట్‌ల్యాండ్ 30 మైళ్లకు పైగా దూరంలో ఉంటుంది. కానీ, 200 మిలియన్ సంవత్సరాల కిందట ఇది ఎత్తయిన ప్రాంతంగా ఉండేది. తర్వాత కాలంలో సముద్రం మట్టం పెరగడంతో నీటి అడుగుకు చేరింది.

2021 వేసవిలో రట్‌ల్యాండ్ రిజర్వాయిర్‌లో నీటి స్థాయిలు తగ్గగానే, శిలాజ శాస్త్రవేత్తలు ఇక్కడ అవశేషాల తవ్వకం మొదలు పెట్టారు. భారీ పుర్రెను తొలగించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

పెద్ద మట్టి దిబ్బలో కూరుకుపోయిన ఇథ్యోసార్ తల భాగాన్ని జాగ్రత్తగా వెలికి తీశారు.

ఇథ్యోసార్ లు సముద్ర జీవులను చంపి తింటాయి

ఫొటో సోర్స్, ANGLIAN WATER

ఎలా భద్రపరుస్తారు?

ఈ పుర్రెను మరింత నిశితంగా పరిశీలిస్తారు.

"ఇంత బరువున్న పెళుసైన అవశేషాన్ని వెలికితీసేందుకు మరీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు" అని శిలాజ సంరక్షకుడు, రీడింగ్ యూనివర్సిటీలో విజిటింగ్ రీసెర్చ్ ఫెలో నైజెల్ లార్ కిన్ చెప్పారు.

"కానీ, అదొక బాధ్యత. నేను ఆ సవాలును తీసుకున్నాను" అని ఆయన అన్నారు.

సందర్శకులు చూసేందుకు వీలుగా ఈ ఇథ్యోసార్‌ను ఇక్కడే ఉంచేందుకు అవసరమైన నిధుల సేకరణ కోసం రట్‌ల్యాండ్ రిజర్వాయర్‌ను బాధ్యతలు చూస్తున్న ఆంగ్లియా వాటర్ ప్రయత్నిస్తున్నారు.

"నేను పని చేస్తుండగా ఒక భారీ సరీసృపం శిలాజం కనిపించిందని చెబితే, నేను వాళ్లను ఆట పట్టించేందుకే అలా చెబుతున్నానని చాలామంది అనుకున్నారు. దీనికి సంబంధించిన టీవీ కార్యక్రమం ప్రసారమయ్యే వరకు దీనిని చాలా మంది నమ్మేలా లేరు" అని డేవిస్ అన్నారు.

వీడియో క్యాప్షన్, దీన్ని క్షేమంగా వెలికితీసేందుకు ఓ వారం సమయం పట్టొచ్చని పరిశోధకులు అంటున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)