Scotch Whisky: బ్రిటన్ – ఇండియా వాణిజ్య చర్చల్లో ఈ అంశం ఎందుకంత కీలకం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డగ్లస్ ఫ్రాసర్
- హోదా, బిజినెస్/ఎకానమీ ఎడిటర్, స్కాట్లండ్
విస్కీకి ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ భారత్. ఇక్కడ అమ్మే విస్కీని ప్రధానంగా ‘‘ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్’’ అని వ్యవహరిస్తారు. అంటే ‘భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం’ అని. ఇక్కడ బిగ్ బ్రాండ్స్ పేర్లు.. భారతీయ పేర్లలాగా ఉండవు. మెక్‌డోవెల్స్, రాయల్ స్టాగ్, బేగ్‌పైపర్, పీటర్ స్కాచ్.. ఇలా పశ్చిమ దేశాల బ్రాండ్ల పేర్లు లాగానే ఉంటాయి.
స్కాచ్ దిగుమతులను చాలా పరిమితంగా చేయటానికి దేశీయ డిస్టిలర్లు ప్రయత్నించి విజయం సాధించారు. దిగుమతి చేసుకున్న స్కాచ్ బాటిల్‌ను ముంబయిలో కానీ, మహారాష్ట్రలో మరెక్కడైనా కానీ అమ్మాలంటే.. దాని అసలు ధర కన్నా 300 శాతం అదనంగా చెల్లించాల్సి వచ్చేది. అయితే.. ఈ సుంకాన్ని ఇటీవల సగానికి – అంటే 150 శాతానికి తగ్గించారనేది వేరే కథ.
భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు అనుమతే లేదు. కానీ దొంగచాటుగా తెచ్చుకోవటం ఎలాగో తెలిసిన వారి సంగతి వేరే.
భారత మార్కెట్‌లో స్కాచ్ వాటా కేవలం 2 శాతం మాత్రమే. అయినాసరే.. 2011లో 6 కోట్ల పౌండ్ల (సుమారు రూ. 600 కోట్లు) కన్నా తక్కువగా ఉన్న స్కాచ్ వ్యాపారం.. 2019 నాటికి 15 కోట్ల పౌండ్లు (సుమారు రూ. 1500 కోట్లు) దాటిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధిబాటలో పయనించటం.. బలపడుతున్న మధ్య తరగతి పేరున్న అంతర్జాతీయ ఉత్పత్తులు, బ్రాండ్లను ఇష్టపడటం దీనికి కారణం.
ఇక పరిమాణంలో చూస్తే స్కాచ్ మార్కెట్లలో భారత్ గత ఏడాది మూడో అతి పెద్ద మార్కెట్‌గా అవతరించింది.
కానీ.. అందులో 60 శాతం స్కాచ్ బల్క్‌గానే ఇండియాకు వస్తోంది. అంటే.. స్థానికంగా బాటిలింగ్, స్థానిక మద్యంతో బ్లెండింగ్ చేయడానికి తెప్పించుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అనూహ్య నిబంధనలు...
అదే.. సుంకాలు తక్కువగా ఉంటే ఎంత స్కాచ్ అమ్మొచ్చో ఊహించండి. ఆ సుంకాలను తొలగించుకోగలిగినా, కనీసం తగ్గించుకోగలిగినా భారీ లాభం ఉంటుంది. ఈ కారణంతోనే బ్రిటన్ – భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలలో స్కాచ్ విస్కీ ఒక కీలక అంశంగా నిలిచింది.
స్కాచ్ విస్కీ అసోసియేషన్ తరఫున ఆక్స్‌పర్డ్ ఎకానమిక్స్ సంస్థ.. స్కాచ్ దిగుమతి సుంకాలను సుమారు 25 శాతానికి తగ్గించినట్లు భావిస్తూ ఒక మోడల్‌ను రూపొందించింది.
దాని ప్రకారం.. ఐదేళ్లలో 12,000 కోట్ల పౌండ్ల(సుమారు 12,00,000 కోట్ల రూపాయలు) ఎగుమతులు పెరుగుతాయని, తద్వారా బ్రిటన్‌లో 1,300 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేసింది.
ఇందులో భాగంగా భారత ప్రభుత్వానికి చేస్తున్న ప్రతిపాదనల్లో ఒకటేమిటంటే.. అలా దిగుమతి సుంకాన్ని తగ్గించటం వల్ల దేశంలో స్కాచ్ వినియోగం 2 శాతం నుంచి 6 శాతానికి మాత్రమే పెరుగుతుంది, దిల్లీ ప్రభుత్వ ఆదాయం 300 కోట్ల పౌండ్లకు(సుమారు రూ. 30,000 కోట్లు) పైగా పెరుగుతుంది. అలా అందరికీ లాభం వస్తుంది.
కానీ వాణిజ్య సరళీకరణ అంత సులభం కాదు. ముఖ్యంగా ఇండియాలో అంత ఈజీ కాదు. మొదట ఎదురయ్యే సమస్యల్లో ఒకటి.. ఒక దిగుమతి ప్యాకేజీ రేవు దగ్గర బయలుదేరటానికి ముందే దాని విలువ మీద ఒక ఒప్పందానికి రావటం. దానికి చాలా సుదీర్ఘ సమయం పట్టొచ్చు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ ప్రక్రియను చాలా సరళం చేయాలి.
అయితే నిబంధనల వర్తింపు ఒక్కోసారి అనూహ్యంగా ఉంటాయి. ఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోనైనా మధ్యవర్తిత్వ కోర్టు అనేది ఒక కీలక భాగం. కానీ.. ప్రస్తుతమున్న ఇటువంటి అంతర్జాతీయ నిబంధనలు.. భారత బ్యూరోక్రసీలో, చట్టపరమైన అవరోధాల్లో చిక్కుకుపోతాయని ఎడిన్‌బర్గ్‌లోని కెయిర్న్ ఎనర్జీ (అది ఇటీవలే కాప్రికార్న్‌గా పేరు మార్చుకుంది) తాజా అనుభవం చెప్తోంది.
భారతదేశంలోనే అతిపెద్ద చమురు క్షేత్రాన్ని అభివృద్ధి చేసి, అందులో తన వాటాను అమ్మిన కెయిర్న్ సంస్థ దిల్లీ పన్ను అధికార యంత్రాంగం బకాయి ఉన్న దాదాపు 100 కోట్ల డాలర్లను(రూ. 10,000) కోట్లు) తిరిగి పొందటానికి చేసిన ప్రయత్నాలు భారత ప్రభుత్వ విదేశీ ఆస్తులను తాను స్వాధీనం చేసుకోవటం మొదలు పెట్టిన తర్వాతే ముందుకు నడవటం మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
కోల్పోయిన సామ్రాజ్యం
భారత్‌లోకి దిగుమతైన విస్కీ.. రేవు దాటిన తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 30 విభిన్న మార్కెట్లను చేరుతుంది. ఎక్కడికక్కడ వేర్వేరు సుంకాలు, వేర్వేరు రిటైల్ నిబంధనలు ఉంటాయి. అందుకు అనుగుణంగా ఈ బాటిళ్లకు వేర్వేరు లేబిలింగ్ అవసరమవుతుంది.
కొన్ని రాష్ట్రాల్లో మద్యం రిటైల్ విక్రయాల మీద ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉంది. దీనివల్ల అక్కడ అధికారంలో ఉన్నవారు తమకు అనుకూలంగా మలచుకునే వీలుంటుంది.
బ్రిటన్ ప్రభుత్వానికి – భారత వాణిజ్య మంత్రిత్వశాఖకు మధ్య జరిగే ఒప్పందం ద్వారా.. భారత్‌లో వివిధ రాష్ట్రాల్లోని అంతర్గత వాణిజ్య అవరోధాలు తొలగిపోతాయని బ్రిటన్ డిస్టిలింగ్ వ్యాపారులు భావించటం లేదు.
జాతీయ ప్రభుత్వాల మధ్య ఒప్పందం భారీ విజయమే. అయితే మార్కెట్‌ను తెరవటానికి అది కేవలం ఓ కొత్త అధ్యాయం మాత్రమే అవుతుంది.
ఇండియాతో స్కాచ్ విస్కీ సహా అనేక రంగాల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటానికి యూరోపియన్ యూనియన్ పదేళ్ల పాటు ప్రయత్నించి విఫలమైన తర్వాత.. భారతదేశంలో పరిస్థితి మారిందనే కొంత ఆశాభావం కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశ డిస్టిలింగ్ పరిశ్రమ ఇప్పుడు మరింత ఎక్కువగా అంతర్జాతీయ యాజమాన్యం కలిగి ఉండటం ఇందులో ఒక కీలక అంశం.
ఇండియాలో అతిపెద్ద డిస్టిలింగ్ కంపెనీ అయిన యునైటెడ్ స్పిరిట్స్ యజమాని విజయ్ మాల్యా.. తన పరిశ్రమను విస్తరించటానికి స్కాచ్ డిస్టిలర్ వైట్ అండ్ మాకేను కొనుగోలు చేశారు. ఈ భారీ మద్యం సామ్రాజ్యంతో పాటు ఓ విమానయాన సంస్థ, ప్రీమియర్ లీగ్ క్రికెట్ టీం, ఫార్ములా 1 టీం, పార్లమెంటులో సీటు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడాయన కథకు తెరపడింది. ఆయన సామ్రాజ్యం అస్తమిస్తోంది.
ఆయన లండన్‌లో నివసిస్తున్నారు. ఆయన భారీ ఎత్తున మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలున్నందున ఆయనను భారత దేశానికి అప్పగించాలన్న కేసుతో పోరాడుతున్నారు.
యునైటెడ్ డిస్టిలర్స్‌లో అధిక భాగం ఇప్పుడు లండన్ కేంద్రంగా ఉన్న ప్రపంచ దిగ్గజ సంస్థ డియాగో చేతిలో ఉంది. మొత్తం స్కాచ్ ఉత్పత్తిలో కూడా ఆ సంస్థ వాటా దాదాపు 40 శాతంగా ఉంది.
అంటే.. భారత డిస్టిలింగ్ రంగంలో, స్కాచ్‌లో, జిన్, టెకీలా, రమ్‌లో ఇప్పుడు ఆ సంస్థ ఓ పెద్ద భాగస్వామి. భారత మార్కెట్‌లో ప్రవేవించటానికి అది ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు భారత డిస్టిలర్లు కూడా స్కాచ్ దిగుమతులను అడ్డుకోవటానికి పెద్దగా లాబీయింగ్ చేస్తున్నట్లు కనిపించటం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
నైపుణ్యాలు, సామర్థ్యాలు
మరైతే.. ప్రపంచంలో అతిపెద్ద విస్కీ మార్కెట్‌లోకి స్కాచ్ ప్రవహానికి ఇప్పుడు గేట్లు తెరుచుకుంటాయా?
కొత్త వాణిజ్య మంత్రి అన్నీ-మేరీ ట్రేవిలియన్ సారథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం.. బ్రెక్జిట్ అనంతరం యూరోపియన్ వాణిజ్యాన్ని మించి ‘గ్లోబల్ బ్రిటన్’ వాణిజ్యాన్ని చేరుకోవాలని తపనపడుతోంది. మరెక్కడా మంచి వాణిజ్య ఒప్పందం దొరికే అవకాశం కనిపించటం లేదు.
అయితే.. బ్రిటన్ వాణిజ్య ప్రతినిధులకు ఇటువంటి చర్చల్లో పెద్దగా అనుభవం లేదు. మరోవైపు భారత ప్రతినిధులకు ఈ వాణిజ్య చర్చల్లో అమితానుభవం ఉంది. ముఖ్యంగా దేశ అంతర్గత రాజకీయాల కారణంగా, తమ దేశం స్వయం సమృద్ధం కాగలదనే అంతర్గత విశ్వాసం వల్ల.. వాణిజ్య నిబంధనల్లో రాజీపడటానికి తిరస్కరించటంలో వారికి మరింత ఎక్కువ అనుభవముంది.
మరోవైపు.. బ్రిటన్ ఫైనాన్షియల్ రంగం భారత మార్కెట్‌లోకి ప్రవేశించాలన్న ఆకాంక్షలు కూడా ఈ వాణిజ్య చర్చల్లోకి రావచ్చు. ఈ రంగం ప్రస్తుతం జపాన్‌కు ఎగుమతి చేసే మొత్తంలో పదో వంతు మాత్రమే భారత్‌కు ఎగుమతులు చేస్తోంది.
అది పెరగాలంటే.. భారీ స్థాయిలో సంక్లిష్టమైన నియంత్రణ అవరోధాలను తొలగించాల్సి ఉంటుంది.
సమాచార సరఫరా మీద, ఇండియాలో తాత్కాలికంగానైనా పనిచేయటానికి బ్రిటన్ పౌరులకు వీసాల మీద ఆంక్షలు తగ్గించాలని.. ప్రధాన ఫైనాన్షియల్ సంస్థ సిటీయూకే కోరుతోంది. కెయిర్న్ ఎనర్జీ, ఇతర సంస్థల సమస్యలు చూసిన తర్వాత.. ఈ సంస్థ కూడా తన పెట్టుబడులకు రక్షణ కోరుతోంది.
ఇక.. భారతీయుల యాజమాన్యంలోని జాగ్వార్ లాండ్ రోవర్ సహా.. కార్ల తయారీ పరిశ్రమ కూడా ఉప ఖండంలోని సంపన్న వినియోగదారులను చేరుకోవాలని కోరుకుంటోంది.
మరోవైపు భారతదేశానికి తన సొంత ప్రాధాన్యతలున్నాయి. అందులో మొదటిది.. భారతీయులు బ్రిటన్‌లో పనిచేయటానికి ఉన్న అవరోధాలను మరింతగా తగ్గించటం.
ప్రపంచ వాణిజ్యం గురించి భారత దృక్పథం.. భారత సంతతి - సాంకేతిక నైపుణ్యాలు, వ్యాపార నాయకత్వ ప్రతిభ గల ఇంగ్లిష్ మాట్లాడే భారీ సముదాయం - శక్తిని చాటటం.
కానీ.. మరింత మంది భారతీయులను బ్రిటన్‌లోకి ఆహ్వానించటం అంటే.. అది, విదేశీ ఉద్యోగులను అడ్డుకోవటం లక్ష్యంగా జరిగిన బ్రెక్జిట్ స్ఫూర్తికి విరుద్ధమవుతుంది.
దీనిపై తన మద్దతుదారులను ఒప్పించటం బ్రిటన్ ప్రభుత్వానికి రాజకీయంగా కష్టమవుతుంది. స్వయంగా భారత సంతతికి చెందిన హోంమంత్రి ప్రీతి పటేల్.. దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మద్యం దుకాణాల ముందు భారీ క్యూల వెనుక చీకటి నిజం ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- మద్యం తాగితే మనిషి శరీరంలో ఏం జరుగుతుంది... హ్యాంగోవర్ దిగడానికి పారాసెటమాల్ మంచిదేనా?
- మద్యం తాగితే పోలీసులకు పట్టించే కాళ్ల పట్టీలు
- ఆంధ్రప్రదేశ్: 'గుడిసె' ఉన్నట్లుండి సినిమా షూటింగ్ స్పాట్ ఎలా అయింది... జనాలెందుకు అక్కడికి క్యూ కడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












