ఆంబర్‌గ్రిస్: స్పెర్మ్ వేల్ వాంతి చేసుకునే పదార్థం ధర బంగారం కన్నా చాలా ఎక్కువ

స్పెర్మ్ వేల్ వాంతి చేసుకున్నప్పుడు విడుదలయ్యే ఐదున్నర కేజీల ఆంబర్‌గ్రిస్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ సరకు విలువ రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ముగ్గురు వ్యక్తుల అరెస్టుతో గుజరాత్‌లో జలచరాలు, వాటి అవయవాలతో చేస్తున్న అక్రమ వ్యాపారాల గుట్టు బయటపడుతుందని పోలీసులు, ఫారెస్టు శాఖ అధికారులు భావిస్తున్నారు.
గతంలో ముంబయి, చెన్నైలో కూడా పెద్ద మొత్తంలో ఆంబర్‌గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో గుజరాత్‌కి చెందిన వ్యక్తుల హస్తం ఉందని వెల్లడయింది.
చైనాలో ఆంబర్‌గ్రిస్‌తో లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందించే టానిక్‌లు తయారు చేస్తారు. అరబ్ దేశాల్లో దీనిని అత్యంత నాణ్యమైన పెర్ఫ్యూమ్‌లను తయారు చేయడానికి వాడతారు.

ఫొటో సోర్స్, VW Pics/Getty
స్పెర్మ్‌వేల్ ఆంబర్‌గ్రిస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
కటిల్ చేపను గాని, ఆక్టోపస్‌ను గాని, లేదా మరే ఇతర సముద్ర జంతువును గాని స్పెర్మ్ వేల్ వేటాడినప్పుడు ప్రత్యేకమైన పదార్ధాలను విడుదల చేస్తుంది. ఈ పదార్థాలు స్పెర్మ్ వేల్ శరీరానికి హాని కలుగకుండా కాపాడతాయి.
ఆ తర్వాత అవి శరీరంలోని వ్యర్ధాలను వాంతి చేయడం ద్వారా బయటకు పంపిస్తాయి. మూత్రం ద్వారా కూడా ఆంబర్‌గ్రిస్‌ను విడుదల చేస్తాయని కొంత మంది పరిశోధకులు చెబుతున్నారు.
అందుకే ఒక్కొక్కసారి అది వేటాడిన చేపల పదునైన అవయవాలు ఆంబర్‌గ్రిస్‌లో కనిపిస్తూ ఉంటాయి.
స్పెర్మ్ వేల్ విడుదల చేసిన వ్యర్ధ పదార్ధం సముద్ర ఉపరితలం మీద తేలుతుంది. సూర్యరశ్మి, ఉప్పు నీరు కలిసి ఆమ్‌బెర్గ్రిస్ తయారవుతుంది. ఇది సువాసనతో కూడిన పదార్ధాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
ఆంబర్‌గ్రిస్ నలుపు, తెలుపు, బూడిద రంగు కలిసిన నూనె పదార్థంలా ఉండి, గుడ్డు ఆకారంలో గాని, గుండ్రంగా గానీ ఉంటుంది.
నీటిపై ప్రయాణం చేయడం వల్ల అది ఆ ఆకారం సంతరించుకుంటుంది. ఇది మండే స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది.
ఈ భూమి పై స్పెర్మ్ వేల్స్ అతి పెద్ద దంతాలున్న జంతువులు. ఇవి కాకుండా పిగ్మి స్పెర్మ్ వేల్స్, ఇంకా చిన్న డ్వార్ఫ్ స్పెర్మ్ వేల్స్ కూడా ఉంటాయి.
స్పెర్మ్ వేల్ తలలో నూనెతో నిండిన స్పెర్మాసెటి అనే అవయవం ఉంటుంది. దానినే వేల్ వీర్యం అని భావిస్తారు. అందుకే దానికి స్పెర్మ్ వేల్ అనే పేరు వచ్చినట్లు చెబుతారు.
‘‘ఈ ఆంబర్‌గ్రిస్ వాసన మొదట్లో బాగుండదు కానీ, కాలం గడుస్తున్నకొద్దీ గాలితో కలిసి తీపి సువాసనగా మారిపోతుంది’’అని నిపుణులు చెబుతున్నారు. పెర్ఫ్యూమ్‌లో వాడే సువాసన ద్రవ్యాలు త్వరగా గాలిలో కలిసిపోకుండా ఆంబర్‌గ్రిస్ కాపాడుతుంది.
ఆమ్‌బెర్గ్రిస్ అరుదుగా లభిస్తుంది. దాంతో, దీని ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ఖరీదు బంగారం కంటే ఎక్కువగా ఉండటంతో, దీనిని "సముద్రపు బంగారం" లేదా "తేలియాడే బంగారం" అని పిలుస్తారు.
అంతర్జాతీయ మార్కెట్ లో దీని ధర కిలోకు రూ.1.5 కోట్లు ఉంటుంది.

ఫొటో సోర్స్, Robert DEYRAIL/Getty
"వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని అనుసరించి స్పెర్మ్ వేల్స్‌ను సంరక్షించాల్సిన జంతువులుగా వర్గీకరించారు" అని జామ్‌నగర్ మెరైన్ నేషనల్ పార్క్ చీఫ్ కన్సర్వేషన్ ఆఫీసర్ డిటి వసవాడా చెప్పారు. వాటిని వేటాడటం గాని, వాటితో వ్యాపారం చేయడం గాని, నేరం కిందకు వస్తుంది. వీటితో చట్టబద్ధమైన వ్యాపారం చేయడానికి లైసెన్సు అవసరం" అని చెప్పారు.
"ఇటీవల పట్టుకున్న ఆంబర్‌గ్రిస్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం పై స్పష్టత లేదు.
సాధారణంగా అరబ్ దేశాల్లో దీనికి డిమాండు ఎక్కువగా ఉంటుంది. దీని కోసం ఎక్కువ ధరను చెల్లించడానికి అరబ్బులు ఆసక్తి చూపిస్తారు.
స్పెర్మ్ వేల్స్‌ను వాటి ఎముకలు, ఆయిల్, ఆంబర్‌గ్రిస్ కోసం విరివిగా వేటాడతారు. అందుకే ఆంబర్‌గ్రిస్ వ్యాపారాన్ని యూరోప్, అమెరికా, ఇతర పశ్చిమ దేశాల్లో 1970 నుంచి నిషేధించారు.
గుజరాత్‌లో దేశంలోనే అత్యంత పొడవైన 1600 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. అందువల్లే, సముద్ర జీవులు లేదా వాటి అవయవాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
గుజరాత్ కాకుండా ఆమ్‌బెర్గ్రిస్.. ఒడిశా, కేరళ తీరంలో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది.
భారతదేశంలో 1986 నుంచి అటవీ సంరక్షణ చట్టం లోని షెడ్యూల్ 2 ప్రకారం స్పెర్మ్ వేల్స్‌ను సంరక్షిస్తున్నారు. స్పెర్మ్ వేల్స్‌ను గాని, వాటి అవయవాలను గాని వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం.
ఆంబర్‌గ్రిస్‌ను కొన్ని శతాబ్దాలుగా పెర్ఫ్యూమ్, ఔషధాల తయారీలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు.
‘‘దీని గురించి ఇబ్న్ బాటూట, మార్కో పోలో లాంటి అంతర్జాతీయ యాత్రీకులు కూడా తమ ట్రావెలాగ్‌లలో ప్రస్తావించారు. ఆయుర్వేదంతో పాటు దీనిని యునాని మందుల తయారీలో కూడా వాడతారు" అని లఖ్‌నవూలోని ఫార్మసాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ బద్రుద్దీన్ బీబీసీకి చెప్పారు.
ఆంబర్‌గ్రిస్‌ను కొన్ని శతాబ్దాలుగా యునాని ఔషధాల తయారీలో వాడుతున్నారు. దీనిని అనేక మూలికలతో కలిపి మెదడు, శరీరం, నరాలు, లైంగిక సంబంధిత వ్యాధులకు చికిత్సగా వాడతారు.
"ఆంబర్‌గ్రిస్‌ను పంచదార పాకం, ఇతర మూలికలతో కలిపి "మజున్ ముంసిక్ ముక్కావి" అనే యునాని మందు తయారీలో వాడతారు.
లైంగిక బలహీనతలకు దీన్ని మందుగా సూచిస్తారు. దీని వల్ల లైంగిక సామర్ధ్యం పెరుగుతుందని చెబుతారు. 'హబ్బే నిషాత్' మందు తయారీలో కూడా దీనిని వాడతారు.
"ఈ మందు గుర్తింపు పొందిన ఫార్మసీలలో, మార్కెట్‌లో, ఆన్ లైన్‌లో కూడా లభిస్తుంది.
"ఆంబర్‌గ్రిస్ లైంగిక కోరికలను పెంచుతుందని అంటారు. కానీ, దీనిని సమర్ధించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు" అని డాక్టర్ వసవాడ అన్నారు. .
నాడీవ్యవస్థపై ఆమ్‌బెర్గ్రిస్ చూపే ప్రభావం గురించి డాక్టర్ బద్రుద్దీన్, అతని సహచరులు కలిసి ఒక అధ్యయన పత్రాన్ని రాశారు. అది త్వరలోనే ప్రచురితమవుతుంది.

ఫొటో సోర్స్, Gujarat Police
‘‘ఆంబర్‌గ్రిస్ సరకుతో కొంత మంది అహ్మదాబాద్ వస్తున్నారనే కథనాలు రావడంతో మేం వారిని పట్టుకోగలిగాం" అని అహ్మదాబాద్ జోన్ 7 డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ప్రేమ్‌సుఖ్ డేలు చెప్పారు.
"అయితే, దీనితో పట్టుబడిన వ్యక్తులు ఇందులో వ్యాపారం చేస్తున్నారా లేదా, ఆ పేరు చెప్పుకుని మోసం చేస్తున్నారా అనే విషయం ఇంకా తెలియదు".
"కస్టడీలోకి ముగ్గురు వ్యక్తులను తీసుకున్నాం. అయితే, వారి దగ్గర నుంచి సేకరించిన పదార్ధం ఆంబర్‌గ్రిస్ అని ఫోరెన్సిక్ సైన్సు లేబొరేటరీ ప్రాథమికంగా ధ్రువీకరించింది. దీని ఆధారంగా నిందితులను వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972ను అనుసరించి అరెస్టు చేశాం’’.
’’వీరిని విచారణ చేస్తుండగా దొరికిన ఆధారాలతో మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశాం. ఈ నిందితులకు సహకరించే వారు కూడా గుజరాత్‌లోనే ఉన్నట్లు మాకు సమాచారం అందింది" అని చెప్పారు.
ఈ కేసును ప్రస్తుతం అటవీ శాఖకు అప్పగించారు. ఈ నెట్‌వర్క్‌ను చేధించేందుకు పోలీసులు, అటవీ శాఖ కలిపి పని చేస్తారు.
పోలీసులు పట్టుకున్న ఆంబర్‌గ్రిస్ 5.350 కిలోల బరువు ఉందని చెప్పారు.
ఈ పదార్ధం ఆమ్‌బెర్గ్రిస్ అని ఫోరెన్సిక్ విభాగం పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత, దానిని ఈ కేసులో ఆధారంగా వాడతామని చెప్పారు.
ఈ ర్యాకెట్‌లో 10 మందికి పైగా వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అరెస్టు అయిన వారిలో ఇద్దరు జునాగఢ్‌కి చెందిన వారు కాగా, రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కి చెందిన మరొక వ్యక్తి ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పెర్మ్ వేల్ తన శరీరంలోంచి ఆంబర్‌గ్రిస్‌ను విడుదల చేసిన తర్వాత అది తీరం చేరడానికి కొన్ని నెలలు కానీ, సంవత్సరాలు కానీ పడుతుందని సౌరాష్ట్రలో పని చేస్తున్న ఒక సముద్ర జీవుల పరిరక్షకుడు చెప్పారు.
"ఆ మధ్యలో ఆంబర్‌గ్రిస్ కొన్ని వందల, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సముద్రంలో సంభవించే ఉప్పెనలు కూడా దానిని తీరం వైపుకు మళ్లిస్తాయి. ఇది ఎంత పాతది, పెద్దది అయితే, దాని ఖరీదు అంత ఎక్కువగా ఉంటుంది".
"దీని వాసనకు కుక్కలు ఆకర్షితమవుతాయి. ఇందులో వ్యాపారం చేసేవారు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న కుక్కలను వాడతారు" అని వివరించారు.
"ఇక్కడ నుంచి ఆంబర్‌గ్రిస్ అహ్మదాబాద్ గాని, ముంబయి గాని వెళుతుంది. అక్కడ నుంచి మధ్యవర్తుల ద్వారా ఆంబర్‌గ్రిస్‌ను గల్ఫ్ దేశాలకు పంపిస్తారు. అక్కడ నుంచి అది అంతర్జాతీయ మార్కెట్‌లోకి వెళుతుంది. కొన్ని సార్లు చేపలవాళ్ళు వేటకు వెళ్ళినపుడు కూడా ఆంబర్‌గ్రిస్ దొరుకుతుంది" అని చెప్పారు.
"ఆంబర్‌గ్రిస్‌ను పెర్ఫ్యూమ్‌లలోనూ, లైంగిక సామర్ధ్యాన్ని పెంచే ఔషధాల్లోనూ వాడటం వల్ల దీనికి గల్ఫ్ దేశాల్లో చాలా డిమాండు ఉంటుంది. దీనికి, ఫ్రాన్స్, యూరోపియన్ దేశాల్లో కూడా డిమాండు ఉంది" అని తెలిపారు. .
"అంబ్రోక్సాన్ , ఆంబ్రిన్ అనే సింథటిక్ ప్రత్యామ్నాయాలు దొరుకుతుండటంతో, పెర్ఫ్యూమ్ తయారీలో ఆంబర్‌గ్రిస్ వాడకం తగ్గుతూ వస్తోంది" అని అన్నారు.
అసలైన ఆంబర్‌గ్రిస్ గురించి ప్రజలకు తెలియదు. దాంతో, కొంత మంది మోసగాళ్లు, పారఫిన్ వాక్స్ లేదా కొవ్వు పదార్ధాలను ఆంబర్‌గ్రిస్ పేరుతో అమ్మేస్తారు. అది చట్టవిరుద్ధంగా కొన్నది కావడం వల్ల బాధితులు దీని గురించి ఫిర్యాదు కూడా చేయలేరు.
"గతంలో ఆంబర్‌గ్రిస్‌ను చెన్నై, ముంబయిలో కూడా పట్టుకున్నారు. అందులో గుజరాత్‌లో ఉన్న కొంత మంది వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. అయితే, గుజరాత్ పోలీసులు, అటవీ శాఖ ఆ నెట్‌వర్క్‌ని మాత్రం పట్టుకోలేకపోయింది. అయితే, ఈ సారి వారిని పట్టుకోవడంలో విజయం సాధిస్తారా అన్నదే ప్రశ్న. ఈ సారి పట్టుకోవాలని ఆశిస్తున్నాను" అని పరిరక్షకుడు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రిన్సెస్ డయానా - మార్టిన్ బషీర్ ఇంటర్వ్యూ విషయంలో బీబీసీ తన తప్పులను కప్పిపుచ్చుకుందన్న లార్డ్ డైసన్ నివేదిక
- కోవిడ్: డిసెంబరు నాటికి భారత జనాభాకు సరిపడేలా వ్యాక్సీన్ తయారవుతుందా?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








