రష్యా నుంచి గ్యాస్ రాకపోతే యూరప్ గడ్డకట్టుకుపోతుందా? పరిస్థితులు ఇంతలా ఎలా దిగజారాయి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అలెక్సీ కలీమ్‌కోవ్
- హోదా, బీబీసీ రష్యా
యూరప్ ఇంధన సంక్షోభం.. ఆర్థిక సమస్య నుంచి రాజకీయ చిక్కుముడిగా మారుతోంది. ‘‘గ్యాస్ వార్’’కు రష్యా కాలు దువ్వుతోందని పశ్చిమ దేశాలు అంటుంటే.. ఆ ఆరోపణలను రష్యా ఖండిస్తోంది.
ఐరోపా దేశాలు ఎవరు ఏవైపో కచ్చితంగా తేలాలని, గ్యాస్ మార్కెట్‌ను శాసిస్తున్న విధానాలు మారాలని పశ్చిమ దేశాలకు ఓ వైపు రష్యా స్పష్టం చేస్తోంది.
మరోవైపు తమ ప్రజలను, పరిశ్రమలను కాపాడుకునేందుకు ఐరోపా దేశాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. అదే సమయంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భారీ ధరకు తమ గ్యాస్‌ను విక్రయించాలని అమెరికా భావిస్తోంది.
వేసవి చివర్లోనే ఇక్కడ ఇంధన సంక్షోభం మొదలైంది. చలికాలం రాకతో పరిస్థితులు మరింత దిగజారాయి. మొదట గ్యాస్, ఇప్పుడు చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
సాధారణ ప్రజల నుంచి పరిశ్రమల వరకు యూరప్‌లో అందరి విద్యుత్, గ్యాస్ ధరలు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఐరోపాలో ఒక్కసారిగా ఇంత గ్యాస్ సంక్షోభం ఎందుకొచ్చింది? దీనికి కారణం ఎవరు? లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఫొటో సోర్స్, AFP
ఐరోపా ఇంధన సంక్షోభం
ఈ సంక్షోభానికి రెండు తాత్కాలిక కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో మొదటిది కరోనావైరస్. రెండోది చలికాలం.
అయితే, ఈ సంక్షోభం వెనుక దీర్ఘకాలం నుంచి వెంటాడుతున్న మరో మూడు కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో మొదటిది ఇంధన్ మార్కెట్‌పై రష్యా, ఐరోపాల ఆధిపత్య పోరు. రెండోది యుక్రెయిన్ ప్రజల స్వాతంత్ర్య హక్కు. మూడోది ఆర్థిక వ్యవస్థలో హైడ్రోకార్బన్‌ల పాత్ర.
ఈ సంక్షోభం ఎంత కాలం వరకు ఉంటుంది? దీని పరిణామాలు యూరప్ భరించాల్సిందేనా? గ్యాస్ మార్కెట్ విధివిధానాలు మారతాయా? హైడ్రోకార్బన్‌లకు ప్రత్యామ్నాయంగా చెబుతున్న గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ ఏమిటి?
వీటన్నింటికీ సమాధానాలు దొరకాలంటే ఐరోపా, రష్యాల మధ్య విభేదాలు ముందు తొలగాలి.
ఐరోపాకు అవసరమైన సహజ వాయువులో మూడో వంతు రష్యా నుంచే వస్తోంది. అయితే, గత వేసవి నుంచి ఈ సరఫరాకు అంతరాయం కలుగుతోంది.
మొదట్లో ఈ సంక్షోభానికి రష్యానే కారణమని ఆరోపించేందుకు ఐరోపా దేశాలు కాస్త వెనుకాడాయి. కానీ జనవరి 15న యుక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యలు చేయడంతో రెండు వైపులా ఆరోపణలు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters
చమురు సంక్షోభం ఇలానే..
కొన్ని రోజుల క్రితం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అధిపతి ఫతీహ్ బిరోల్.. రష్యాను ‘‘చీటర్’’అని సంబోధించారు. యుక్రెయిన్‌కు రష్యా హెచ్చరికలతో ఐరోపా ఇంధన సంక్షోభానికి సంబంధముందని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఐరోపా మార్కెట్‌లో గ్యాస్ సంక్షోభానికి రష్యానే కారణం అని మేం బలంగా నమ్ముతున్నాం’’అని ఆయన వ్యాఖ్యానించారు.
రష్యా ఇంధన సంస్థ గ్యాజ్‌ప్రోమ్ గత మూడు నెలల్లో ఐరోపాకు సరఫరా చేసే గ్యాస్‌ను 25 శాతం వరకు తగ్గించింది. ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ సరఫరాను సంస్థ తగ్గిస్తూ వచ్చింది. అంతేకాదు, ఐరోపాలో గ్యాస్ నిల్వచేసే సదుపాయాలకు కూడా గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. దీంతో ధరలు మరింత పెరిగాయి.
1973-74 తర్వాత ఐరోపాలో ఇదే అత్యంత పెద్ద ఇంధన సంక్షోభం అని ఐఈఏ అధిపతి వ్యాఖ్యానించారు.
ఆనాడు ‘‘యోమ్ కిప్పూర్’’ యుద్ధ సమయంలో పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు పలికాయి. దీంతో పశ్చిమ దేశాలకు చమురు విక్రయించేందుకు అరబ్ దేశాలు నిరాకరించాయి.

ఫొటో సోర్స్, AFP
ఐఈఏ పాత్ర..
పశ్చిమ దేశాల ఇంధన అవసరాలను ఐఈఏ పర్యవేక్షిస్తుంటుంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితులపై ముందుగా హెచ్చరికలు జారీ చేయడం, సంక్షోభాన్ని నివారించడం తదితర లక్ష్యాలతో ఈ సంస్థను ఏర్పాటుచేశారు.
గత 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు మూడుసార్లు వచ్చాయి. వీటిలో రెండింటికి యుద్ధాలే కారణం (1991 గల్ఫ్ యుద్ధం, 2011 లెబనాన్ యుద్ధం). మరోసారి 2005లో కత్రినా తుపాను వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తింది.
ప్రస్తుతం రష్యా కావాలనే సంక్షోభ పరిస్థితిని సృష్టిస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఐరోపానే ఈ పరిస్థితికి కారణమని రష్యా చెబుతోంది.
ఐరోపా ఇంధన సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని రష్యా వివరిస్తోంది. గ్యాస్ కంపెనీల మధ్య పోటీతోపాటు వాతావరణ మార్పులపై పోరాటమే ఈ సంక్షోభానికి కారణం అని వివరిస్తోంది.
ఈ విషయంపై రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నోవక్.. ‘‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ అధిపతి అలా మాట్లాడటం విని షాక్‌కు గురయ్యాను. ఐరోపాలో సమస్యలకు మేమే కారణమని వారు అంటున్నారు. దీనికి రష్యా కానీ, గ్యాజ్‌ప్రోమ్ కాని కారణం కాదు’’అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, EPA
ఓపెన్ మార్కెట్
రష్యా ప్రభుత్వ గ్యాస్ సంస్థ గ్యాజ్‌ప్రోమ్.. ఐరోపాకు అదనంగా గ్యాస్ సరఫరా చేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. మరోవైపు ఐరోపాలో ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. రష్యా కావాలనే ఇలా చేస్తోందనే వాదన నానాటికీ పశ్చిమ దేశాల్లో పెరుగుతోంది.
‘‘దీనికి మార్కెట్‌తో ఎలాంటి సంబంధమూ లేదు. ఇది రష్యా జిమ్మిక్కు’’అని శ్వేతసౌధ అధికార ప్రతినిధి బీసీతో చెప్పారు.
‘‘డిమాండ్ పెరిగినప్పుడు, కంపెనీ సరఫరాను తగ్గించిందంటే దీని వెనుక పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలు చాలా అరుదుగా ఇలా నడుచుకుంటాయి’’అని యూరోపియన్ యూనియన్‌కు చెందిన మార్గరెట్ వెస్టాజెర్ వ్యాఖ్యానించారు.
దీర్ఘకాల ఒప్పందాల ఆధారంగా గ్యాజ్‌ప్రోమ్ సరఫరా విధానం పనిచేస్తోంది. ఈ విధానంలో ధరలు, సరఫరా చేసే మొత్తన్ని ఏడాదికి ఒకసారి నిర్ణయిస్తారు.
అయితే, మార్కెట్ ఆధారంగా ధరలు నిర్ణయించేలా మార్పులు రావాలని ఐరోపా యూనియన్ డిమాండ్ చేస్తోంది. ఓపెన్ మార్కెట్ విధానానికి పట్టుబడుతోంది.

ఫొటో సోర్స్, AFP
ఐరోపా ఏం అంటోంది?
ఓపెన్ మార్కెట్ విధానంలో డిమాండ్, సరఫరా ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. చమురు మార్కెట్ ఇలానే పనిచేస్తుంది. గ్యాస్ విషయంలోనూ ఇలాంటి విధానాలే అమలు చేయాలని ఐరోపా భావిస్తోంది.
2050నాటికి అన్నింటినీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లకే అప్పగించాలని యూరోపియన్ యూనియన్ భావిస్తోంది. అయితే, రష్యా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ విషయాన్ని పుతిన్‌తోపాటు రష్యా ఉప ప్రధాని నోవక్ కూడా స్పష్టంచేశారు.
‘‘ఈయూది సంకుచిత ధోరణి. దీర్ఘ కాల కాంట్రాక్టుల నుంచి స్వల్పకాల కాంట్రాక్టులకు రావాలని వారు చెబుతున్నారు. మా దగ్గర నిల్వలు భారీగా ఉన్నాయి. అయితే, గ్యాస్ ఉత్పత్తికి పెట్టుబడులు అవసరం. వాటికి కాస్త సమయం పడుతుంది. మేం ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాం’’అని నోవక్ వివరించారు.
మరోవైపు రెండో నోర్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్ లైన్ అనుమతులకు జర్మనీ ఆలస్యం చేయడంపై రష్యా అసంతృప్తి వ్యక్తం చేసింది. యుక్రెయిన్ కాకుండా బాల్టిక్ సముద్రం మీదుగా ఈ పైప్‌లైన్ వెళ్తుంది. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపితే, ఐరోపాకు చేరుకునే గ్యాస్ పెరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.
ఈ చలికాలం గడిచేదెలా?
ఇంధన సంక్షోభం.. మార్కెట్ సమస్య నుంచి రాజకీయ చిక్కుముడిగా మారడంతో ఐరోపా దేశాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రజలతోపాటు పరిశ్రమలకు కూడా సబ్సిడీలు ఇస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇటలీ నాలుగు బిలియన్ల డాలర్లు (రూ.2,98,65 కోట్లు), స్వీడన్ 500 మిలియన్ల డాలర్లు (రూ.3,733 కోట్లు) సబ్సిడీలు ప్రకటించాయి. మరోవైపు జర్మనీ కూడా పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
రష్యా సరఫరాను పెంచకపోయినా, పరిస్థితులను చేజారకుండా చూసుకోవచ్చనే భావన ఐరోపా దేశాల్లో ఉంది. అయితే, దీనికి ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేదే అసలు ప్రశ్న. ఇక్కడి అధిక ధరల వల్ల అమెరికాకు మంచి మార్కెట్ దొరుకుతుంది.
ఈ చలికాలంలో ఐరోపాలో సంక్షోభాన్ని సృష్టించడమే లక్ష్యంగా రష్యా తన వ్యూహాలకు పదునుపెడుతోంది. అయితే, ఈ సంక్షోభం సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు. అంతేకాదు ఐరోపా కూడా అంత మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఇమ్రాన్ ఖాన్‌ను సూటి ప్రశ్న అడిగిన పాకిస్తానీ హౌజ్‌వైఫ్, ప్రధాన మంత్రి ఏం చెప్పారంటే..
- గాంధీని హత్య చేసే సమయానికి నాథూరామ్ గాడ్సే నిజంగానే ఆర్ఎస్ఎస్ను విడిచిపెట్టారా? ఆ రహస్యమేమిటి..
- ఆన్లైన్ గేమ్స్ ఆడి కోటీశ్వరులు కావొచ్చు
- బొబ్బిలి యుద్ధానికి 265 ఏళ్లు: ఆ రోజున ఏం జరిగింది?
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- అయోధ్యలో 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం: 'అయ్యా, మమ్మల్నందరినీ ఇక్కడే పాతిపెట్టి, మా భూమిని తీసుకోండి'
- గ్రీన్ గోల్డ్: ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- అర్చకత్వం చేస్తూనే 9 పీజీలు పూర్తి చేసిన పూజారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











