భారత్, రష్యాల మధ్య దూరం పెరుగుతోందా? రష్యా విదేశాంగ మంత్రి ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
భారత్, రష్యాల మధ్య దూరం పెరుగుతోందనే వార్తల నడుమ భారత్ తమకు చాలా ప్రత్యేకమైనదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోఫ్ చెప్పారు.
రెండు దేశాల మధ్య సంబంధాలపై సమీక్ష అనంతరం పత్రికా విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు.
మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నడుమ భారత్, రష్యా సంబంధాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? రష్యా-భారత్‌ల మధ్య రక్షణ సంబంధాల బలోపేతంతో ఇతర దేశాలు ఆంక్షల విధించే ముప్పును ఏ కోణంలో చూడాలి? ముఖ్యంగా రష్యా నుంచి భారత్ ఎస్-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఎలా చూడాలి? అని లావ్రోఫ్‌ను ఓ విలేకరి ప్రశ్నించారు.
''భారత్, రష్యాల మధ్య బంధాలు చాలా విస్తృతమైనవి. వీటిని వ్యూహాత్మక భాగస్వామ్య బంధాలుగా చెప్పుకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక.. ఈ వ్యూహాత్మక బంధాలు మరింత ప్రత్యేక వ్యూహాత్మక బంధాలుగా మారాయి. ఈ రెండు దేశాల మధ్య ప్రత్యేకమైన సంబంధాలున్నాయి. ఇవి చాలా వ్యూహాత్మకమైనవి. ఆర్థిక బంధాలు, ఆవిష్కరలు, సైనిక పరమైన సాంకేతికత ఇలా అన్నింటిలోనూ ఇవి కనిపిస్తాయి''అని లావ్రోఫ్ ప్రత్యుత్తరం ఇచ్చారు.
''రష్యా అత్యధిక ప్రాధాన్యమిచ్చే నాలుగు మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ రెండు దేశాల మధ్య రాజకీయపరమైన సహకారం కూడా ఉంది. ఐక్యరాజ్యసమితి లేదా బ్రిక్స్ ఇలా ఎక్కడ చూసినా ఇది కనిపిస్తుంది. ఈ రెండు దేశాలు కలిసి అంతర్జాతీయ వేదికలపై చాలా కృషిచేశాయి. షాంఘై కోఆపరేషన్ కార్పొరేషన్‌లోనూ కలిసి పనిచేస్తున్నాం. సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మంత్రుల స్థాయితో మొదలుపెట్టి.. దేశాధిపతి, ప్రధాన మంత్రి స్థాయిల్లోనూ రెండు దేశాలు విస్తృత చర్చలు జరుపుతున్నాయి''అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
''మేం చాలా అంశాలపై లోతుగా చర్చలు జరుపుతాం. ఇండో పసిఫిక్ వ్యూహాలపైనా కలిసి పనిచేస్తున్నాం. ఇండో అంటే హిందూ మహాసముద్రం పరిధిలోని ప్రాంతాలు వస్తాయి. తూర్పు ఆఫ్రికా, పర్షియన్ గల్ప్‌లోని ప్రాంతాలను వీటికి కలిపి ఇండో పసిఫిక్ వ్యూహాలను సిద్ధంచేస్తున్నాం''అని ఆయన అన్నారు.
అయితే, ఇండో పసిఫిక్‌కు అమెరికా వేరే అర్థం చెబుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌లను ప్రధాన ఇండో పసిఫిక్ దేశాలుగా అమెరికా చెబుతోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పేందుకు వీటి మధ్య సుహృద్భావ వాతావరణం తప్పనిసరని అమెరికా విదేశాంగ మంత్రిగా పనిచేసిన మైక్ పాంపియో చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలో సుస్థిర వాతావరణం నెలకొల్పేందుకు, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇది తప్పనిసరని ఆయన వివరించారు.
ఈ అంశంపై కూడా రష్యా విదేశాంగ మంత్రి స్పందించారు. ''అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహంపై నా స్నేహితుడు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌తో మాట్లాడాను. ఇతర మిత్రులతోనూ చర్చించాను. అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహం సరైనది కాదు. దీని వల్ల ఈ ప్రాంతంలో ఘర్షణలు మరింత పెరుగుతాయి. దీంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయి. ఆసియాన్ దేశాల పాత్రను అమెరికా అసలు గుర్తించడం లేదు''అని ఆయన అన్నారు.
''దీనిపై భారత్‌లో విస్తృతంగా చర్చ జరుగుతోందని నాకు తెలుసు. ఈ అంశంపై ఇదివరకు నేను చేసిన వ్యాఖ్యలు భారత్‌లో చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వంతో అంత సన్నిహిత సంబంధాలులేని మీడియాలో దీనిపై చర్చలు జరిగాయి''అని లావ్రోఫ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఈ విషయంలో భారత ప్రజల్లో ఎలాంటి గందరగోళం ఉండకూడదని నేను భావిస్తున్నా. మేం భారత్‌కు మంచి మిత్రులం. భారత్, చైనాల మధ్య సుహృద్భావ వాతావరణం కల్పించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మేం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌తోపాటు బ్రిక్స్, భారత్-చైనా-రష్యాల కూటమిని కూడా ప్రోత్సహిస్తున్నాం''అని ఆయన చెప్పారు.
చైనాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న మోసపూరిత, దూకుడు వ్యూహాల్లో భారత్ చిక్కుకుంటోందని గత ఏడాది డిసెంబరులో లావ్రోఫ్ వ్యాఖ్యానించారు. రష్యన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
''పశ్చిమ దేశాలు ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాయి. కానీ రష్యా, చైనా వారికి తల వంచేందుకు సిద్ధంగా లేవు. అయితే చైనాకు వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో పశ్చిమ దేశాలు సిద్ధంచేస్తున్న కుట్రపూరిత వ్యూహాల్లో భారత్ చిక్కుకుంది''అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు భారత్‌తో తమ సంబంధాలను పశ్చిమ దేశాలు దిగజార్చాలని చూస్తున్నాయని కూడా రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
దూరం పెరుగుతోందా?
రష్యా, భారత్‌ల మధ్య దూరం పెరుగుతోందని ఇటీవల కాలంలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో తొలిసారిగా భారత్-రష్యాల మధ్య వార్షిక చర్చలు గతేడాది వాయిదా పడటంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. అయితే కోవిడ్-19 వల్లే వార్షిక సమావేశాలను వాయిదా వేశామని రెండు దేశాలూ వివరణ ఇచ్చాయి.
మే, 2000లో రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ప్రమాణం చేశారు. అప్పటినుంచీ ఏటా రెండు దేశాల మధ్య వార్షిక సమావేశం జరుగుతూనే వస్తోంది. ఈ సమావేశం వాయిదా పడటం ఇదే తొలిసారి.
అదే సమయంలో పాకిస్తాన్, రష్యాల మధ్య బంధాలు బలపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. గతేడాది నవంబరు మొదటి వారంలో పాక్, రష్యా సైనిక బలగాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేశాయి.
మరోవైపు పాక్‌లో ఎల్‌ఎన్‌జీ పైప్‌లైన్‌ను రష్యా నిర్మిస్తోంది. పాక్‌తో కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదని రష్యా దౌత్యవేత్త రోమన్ బాబాష్కిన్ వ్యాఖ్యానించారు.
''ఈ విషయంలో భారత్ ఆందోళన చెందకూడదు. ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో రష్యా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్‌తో స్వతంత్ర ద్వైపాక్షిక విధానాలు, వాణిజ్య బంధాల బలోపేతానికి మేం కట్టుబడి ఉన్నాం. పాక్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో భాగమే. ఒక దేశంతో బలోపేతం చేసుకునే ద్వైపాక్షిక బంధాలను మరో దేశానికి వ్యతిరేక విధానాలుగా భావించకూడదు''అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- చైనాలో వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన బీబీసీ బృందాన్ని ఎలా వెంటాడారంటే..
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- వాట్సాప్: కొత్త ప్రైవసీ నిబంధనలతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా? అసలు ఆ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- భారత్‌లో తయారవుతున్న ఈ పెన్నులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ... ఎందుకంటే...
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








