కొండబడి: "9 గూడెంలలో ఒక్కడే పదోతరగతి వరకూ వెళ్లాడు.. దీంతో బడే గూడెంకు వెళ్లింది"

కొండల మీద ఏర్పాటు చేసిన బడి కొండబడి అయ్యింది
ఫొటో క్యాప్షన్, కొండల మీద ఏర్పాటు చేసిన బడి కొండబడి అయ్యింది
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త హంగులు అద్దుతున్నారు. పలు సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. నాడు-నేడు పేరుతో కొంత ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది.

కానీ, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న మారుమూల మన్యం వాసులకు చదువు కావాలంటే కొండలెక్కుతూ, దిగుతూ కనీసం ఐదారు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిందే. ఇక గిరిజనుల్లో వేగంగా అంతరించిపోతున్న తెగలుగా గుర్తించిన జాబితాలో ఉన్న కొండరెడ్డి తెగ ప్రత్యేక పరిస్థితుల కారణంగా పిల్లలు చదువులకు మొగ్గు చూపడం లేదు.

తల్లిదండ్రులను వదిలి, ఇతర పిల్లలతో కలిసి గిరిజన హాస్టళ్లలో ఉండేందుకు వారు ఇష్టపడడం లేదు. అందుకే వారికోసం కొండలపైనే ఓ బడి ఏర్పాటయ్యింది.

చింతూరు ఐటిడిఎ అధికారుల చొరవతో పీవీటీజీ ( పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్) తెగ కొండరెడ్డి పిల్లలకు చదువులు నేర్పే ప్రయత్నం మొదలయ్యింది.

ఈ వెదురు పాకలోనే కొండబడి సాగుతుంది
ఫొటో క్యాప్షన్, ఈ వెదురు పాకలోనే కొండబడి సాగుతుంది

గతంలోనూ ప్రయత్నం..

కొండరెడ్డి తెగలు గుంపులు గుంపులుగా నివసిస్తారు. కొండలపైనే ఆవాసాల్లో ఉంటారు. కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తారు. అలా చింతూరు సమీపంలోని 9 ఆవాసాల్లో 167 కుటుంబాలున్నాయి.

కానీ, వారిలో బడి మొఖం చూడని వాళ్లు 50మంది వరకూ ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. అక్షరాలు దిద్దిన వారు అతి తక్కువ. హైస్కూల్లో అడుగుపెట్టడం అరుదు. ఇప్పుడున్న వాళ్లలో ఓకే ఒక్కడు పదో తరగతికి చేరాడంటే వారి చదువుల స్థాయి ఏ పాటిదో ఊహించుకోవచ్చు.

కొల్ల రామిరెడ్డి అనే ఆ యువకుడు కూడా తొమ్మిది వరకూ చదివి బడి మానేశాడు. ఇటీవల ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చొరవ తీసుకుని అతనితో ఓపెన్ విధానంలో టెన్త్ పరీక్షలు రాయించడం విశేషం.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: కొండరెడ్ల జీవితాల్లో అక్షర దీపం వెలిగిస్తున్న కొండబడి

''పిల్లలు పనికిపోతారు. కిందకి వెళ్లి చదవాలంటే ఇష్టం ఉండదు. హాస్టల్లో అందరితో ఉండలేరు. నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకే నేను కూడా మధ్యలో మానేసాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాకోసం కొండపై బడి పెట్టారు. కానీ చెప్పేవాళ్లు రాక, ప్రభుత్వం పట్టించుకోక మూతపడింది'' అని రామిరెడ్డి బీబీసీతో అన్నారు.

ఇప్పుడు మళ్లీ బడి ప్రారంభించి, పిల్లల్ని తీసుకొచ్చి పాఠాలు చెబుతుంటే చాలా బాగుందని అన్నారు.

కొండబడిలో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్ధులు
ఫొటో క్యాప్షన్, కొండబడిలో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్ధులు

చదువు విలువ తెలుసు కాబట్టే

చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే దారిలో ఏడు గుర్రాలపల్లి అనే ఓ చిన్న గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి కాలి నడకన ఓ రెండు కొండలు ఎక్కితే కొండరెడ్డి అవాసాలు ఉంటాయి. మద్దిబండ అని పిలిచే ప్రాంతంలో ఇప్పుడు కొండబడి పేరుతో పిల్లలకు చదువులు చెప్పే ప్రయత్నం జరుగుతోంది.

దీనికి ఐటీడీఏ అధికారిగా పనిచేసిన ఆకుల వెంకట రమణ చొరవ తీసుకున్నారు. ఆయన గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో స్టేట్ టాపర్ గా నిలిచారు.

ప్రభుత్వ విధుల్లో భాగంగా ఆయన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా నియమించిన సమయంలో కొండరెడ్డి తెగ పిల్లల కష్టాలు తెలిసి ఈ ప్రయత్నం ప్రారంభించామని బీబీసీకి తెలిపారు.

"పత్రికల్లో వార్త చూశాను. పిల్లలు బడికి దూరంగా ఉండిపోవడం బాధేసింది. అందుకే మొదట సర్వే చేశాము. 170 కుటుంబాల వరకూ ఉన్నాయి. 60 మంది వరకూ బడి ఈడు పిల్లలున్నారు. వారందరినీ కొండ దింపి ఉంచాలంటే సాధ్యం కావడంలేదు. కాబట్టి కొండపైనే బడి పెట్టాలనే ఆలోచన వచ్చింది'' అని ఆయన వివరించారు.

కొండపైన నిర్మాణం చేయాలంటే మెటీరియల్ తరలించే అవకాశం లేదు. కాబట్టి అక్కడ లభించే వెదురు, కలప తోనే బడి పాకలు నిర్మించారు. మంచి నీటి కోసం వాగులకి వెళ్లకుండా ఓ ట్యాంక్ తీసుకెళ్లారు. దానిని కొండలు దాటించడం చాలా కష్టమైందని వెంకట రమణ తెలిపారు.

ప్రస్తుతం సోలార్ పవర్ ద్వారా నీటిని పంప్ చేసి ట్యాంకర్ ద్వారా పిల్లలకు అందిస్తున్నారు.

పిల్లలు రాత్రిళ్లు అక్కడే ఉండేందుకు ఆడ, మగ పిల్లలకు వేర్వేరుగా రెండు పాకలు అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యుత్ సదుపాయం అవకాశం లేని ఈ కొండబడికి సోలార్ లాంతర్లు రాత్రిపూట వెలుగును అందిస్తున్నాయి.

అన్ని వయసుల పిల్లలకు ఒకటే క్లాసు, సిలబస్ ఉండటం కొండబడి ప్రత్యేకత
ఫొటో క్యాప్షన్, అన్ని వయసుల పిల్లలకు ఒకటే క్లాసు, సిలబస్ ఉండటం కొండబడి ప్రత్యేకత

విద్యావిధానం కూడా వేరుగానే..

మామూలుగా బడుల్లో తరగతుల వారీగా పిల్లల్ని విభజిస్తారు. వారి స్థాయికి అనుగుణంగా పాఠాలు బోధిస్తారు. కానీ కొండబడి అందుకు భిన్నం. అందరికీ కలిపి బోధన ఉంటుంది.

పుస్తకాలు, సిలబస్ వంటి వాటితో సంబంధం లేకుండా ప్రస్తుతం పిల్లలు తరగతి గదులకు అలవాటు పడేలా చూడడమే సంకల్పంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఆట, పాటలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: 124 రూపాయలతో పెళ్లి

పిల్లల కోసం అక్కడే వంట సిద్ధం చేయిస్తున్నారు. వారి బాగోగులన్నీ చూసుకునేందుకు ఇద్దరు వలంటీర్లను నియమించారు. స్థానిక మహిళలు వంట, ఇతర పనుల్లో భాగస్వాములవుతున్నారు.

"రెగ్యులర్ పాఠాలు ఇక్కడ చెప్పలేం. పైగా టీచర్లు ఇక్కడికి వచ్చి ఉండరు కూడా. అందుకే వలంటీర్ల సాయంతో పిల్లలు తమ ఇళ్లు వదిలి బయటకు వచ్చి ఉండేలా చూస్తున్నాం. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం అలవాటైతే ఆ తర్వాత క్రమంగా కింద హాస్టల్ కి మార్చినా సర్దుకుంటారు. వాళ్లకి చదువులు చెప్పాలంటే ముందు వారి జీవనవిధానంలో మార్పులు అవసరం" వెంకట రమణ తెలిపారు.

ఇక్కడ కొండబడి ఏర్పాటు కోసం చేసిన నిర్మాణ పనుల్లో తమ వెంట ఉన్న పిల్లలు అంటూ ఆయన కొందరిని బీబీసీకి పరిచయం చేశారు.

కొండబడిలో మధ్యాహ్న భోజనం
ఫొటో క్యాప్షన్, కొండబడిలో మధ్యాహ్న భోజనం

ఇప్పుడంతా బాగుంది..

"మాకు నలుగురు పిల్లలు. ఇక్కడే కొండ బడిలో ఉన్నారు. ఇప్పుడంతా బాగుంది. వాళ్లు చదువుకుంటే సంతోషంగా ఉంది. మాకేమి తెలియదు. సంతకు పోతే వ్యాపారులు చెప్పింది వినాల్సిందే. ఇప్పుడీళ్లు చదువుకుంటే మంచిదనుకుంటున్నాం. అందుకే మాతో కొండకి రావాల్సిన వాళ్లను బడికి పంపుతున్నాం " అని స్థానిక గిరిజన మహిళ బొజ్జిమ్మ బీబీసీతో తెలిపారు.

పిల్లలు బడిలో ఉంటే రెండురోజులకు ఒకసారైనా తల్లిదండ్రులు వస్తుంటారని, కొందరు పిల్లలు వారితో వెళ్లిపోతూ ఉంటారని, మళ్లీ తీసుకొస్తుంటామని వలంటీర్లు చెబుతున్నారు.

ఏదైనా పిల్లలకు చదువుల మీద ఆసక్తి కలిగించడం, తల్లిదండ్రుల్లో అవసరాన్ని గుర్తించేందుకు అవగాహన పెంచడం ఏకకాలంలో లక్ష్యంగా సాగుతున్నారు.

సోలార్ పవర్‌తో రాత్రిపూట కొండబడి హాస్టల్స్ లో వెలుగులు పరుచుకుంటాయి
ఫొటో క్యాప్షన్, సోలార్ పవర్‌తో రాత్రిపూట కొండబడి హాస్టల్స్ లో వెలుగులు పరుచుకుంటాయి

ప్రభుత్వ విధానం, అధికారుల సహకారం

కొండబడి నడుపుతున్న ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉంటుంది. పోలీసుల ఆంక్షలు కూడా ఉంటాయి. ఈ తెగ వారిలో ఒకరిద్దరు నేటికీ మావోయిస్టుల వెంట ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

అలాంటి ప్రాంతంలో, అత్యంత వెనుకబడిన గిరిజన తెగకి చదువులు పరిచయం చేసే ప్రయత్నంలో చాలామంది సహకారం అందించారని పీఓ వెంకట రమణ తెలిపారు.

"తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కొండబడిని సందర్శించారు. ప్రభుత్వం కూడా విద్యకు ప్రాధాన్యతనిస్తోంది. ఈ సమయంలో స్వచ్ఛంద సంస్థకి చెందిన విజేత అనే కార్యకర్త తోడ్పడ్డారు. గిరిజనుల్లో అవగాహన పెంచే పని చేస్తున్నారు. కొండబడిని కేవలం చదువులకే కాకుండా పీవీటీజీ ల సమగ్ర వికాస కేంద్రంగా మార్చాలని ఆలోచిస్తున్నాం" అని ఆయన చెప్పారు.

కొండబడి

మధ్యలో ఆగకుండా చూడాలి..

''గతంలోనూ కొంత ప్రయత్నం జరిగింది. కానీ మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు కూడా అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నా అది మధ్యలో వదలకుండా చూడాలి. కొత్తగా వచ్చే అధికారులు దృష్టి పెట్టాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే మళ్లీ పిల్లలు పాత పద్ధతుల్లో జారుకుంటారు'' అన్నారు సీనియర్ జర్నలిస్ట్ చెన్నం ప్రవీణ్.

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో నేటికీ అనేక గిరిజన గ్రామాల్లో వివిధ కారణాలతో చదువులకు దూరమైన వారికి ఇలాంటి ప్రయత్నాలు మేలు చేస్తాయని, వీటికి దీర్ఘకాలిక ప్రణాళిక ముఖ్యమని ప్రవీణ్ అభిప్రాయపడ్డారు.

దాదాపు ఏడాదికి పైగా చేసిన ప్రయత్నాలు ఫలించి 50మంది వరకూ పిల్లలు బడిలో కనిపిస్తున్నారు. కొండబడి కి కొత్త కళను తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)