ముఖానికి నల్ల రంగు వేసుకుని ముస్లిం వరుడు, స్నేహితుల సంబరాలు - కర్ణాటకలో మరో వర్గం నుంచి అభ్యంతరం

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఓ ముస్లిం జంట వివాహం సందర్భంగా వరుడి తరఫు వారు ఆ కుటుంబ ఆచారం మేరకు నిర్వహించిన కార్యక్రమంపై కర్ణాటకలోని ఓ కోస్తా జిల్లాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారు మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించారంటూ పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు.
కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలో గల దక్షిణ కన్నడ జిల్లాలో.. ముఖానికి నల్ల రంగు వేసుకుని, వక్క చెట్టుతో చేసిన తలపాగా ధరించిన వరుడి వీడియో వైరల్‌గా మారింది. ఈ ఉదంతం ఇక్కడి హిందూ, ముస్లిం సమాజాల్లో తీవ్ర చర్చకు కారణమైంది.
షెడ్యూల్డ్ కులాల్లో ఒకటైన కొరగ కుల దేవత కొరగజ్జను ‘పోలినట్లుగా’.. సదరు ముస్లిం వరుడు ముఖానికి నల్ల రంగు వేసుకుని, వక్క చెట్టుతో చేసిన తల పాగా ధరించటం హిందువుల విశ్వాసాన్ని ‘‘అవమానించటమే’’నని రెండు మతాల వారూ భావిస్తున్నారు.
‘‘ముస్లింలలో లేని ఆచారాన్ని పాటించటం ద్వారా మరో మతం వారి మనోభావాలను గాయపరచటం సరికాదు కాబట్టి మేం కూడా దీనికి అభ్యంతరం చెప్పాం. నిజానికి ఈ ఆచారానికి వ్యతిరేకంగా ఒక ఫత్వా జారీ చేసే అంశాన్ని క్వాజీలు పరిశీలిస్తున్నారు’’ అని దక్షిణ కన్నడ ముస్లిం ఫెడరేషన్ అధ్యక్షుడు కె.అష్రాఫ్ బీబీసీతో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘ఇది హిందువుల మనోభావాలను అవమానించటమే. సమాజంలో అశాంతి, విద్వేషాలను కలిగిస్తుంది’’ అంటూ చేతన్ ప్రభు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ సెక్షన్లు 153, 295 కింద చర్యలు చేపట్టాలని కోరారు.
వరుడు ఉమరుల్లాల్ బాసిత్ స్వస్థలం కేరళలోని కసరగోడ్ జిల్లా మంజేశ్వర్ తాలూకాలో గల ఉప్పల గ్రామం. దక్షిణ కన్నడ జిల్లా బంత్వాల్ తాలూకా సాలెతూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో ఆయనకు వివాహమైంది. కర్ణాటక సరిహద్దులోని సాలెతూర్ గ్రామానికి దక్షిణంగా ఉంటుంది కేరళలోని మంజేశ్వర్ తాలూకా.
రెండు రోజుల కిందట బాసిత్, అతడి మిత్రుల బృందం రాత్రి 10 గంటల ప్రాంతంలో వధువు ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో విందుకు హాజరయ్యేముందు ఇంటి బయట మేళతాళాల మధ్య డాన్స్ చేశారు.
అయితే.. తమ కుల దేవతకు, వరుడు ధరించిన తలపాగాకు పోలికేమీ లేదని కొరగ సంఘటన సమాఖ్య మాజీ అధ్యక్షురాలు సుశీలా నాడ్ బీబీసీతో చెప్పారు.
‘‘ఇది హిందువులకు అవమానం అంటూ అనవసరంగా వివాదం రేకెత్తిస్తున్నారు. అసలక్కడ అవమానం ఏదీ లేదు. కొందరు దీనిని మత విద్వేషాలను కలిగించే సమస్యగా చిత్రీకరిస్తున్నారు’’ అని ఆమె తప్పుపట్టారు.
‘‘వరుడు ఒక టీ-షర్టు కూడా ధరించి ఉన్నాడు. అతడి ముఖానికి నల్లరంగు వేసుకున్నంత మాత్రాన.. అది మా కొరగజ్జను పోలివున్నట్టు కాదు. వాళ్లు పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన యువకులు’’ అని కొరగ ఫౌండేషన్‌కు చెందిన మాటాడి చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామం అది. ఉత్తర కేరళలోని ముస్లింలలో ఈ ఆచారం ఉంది. పెళ్లయిన తర్వాత వరుడు, తన మిత్రులతో కలిసి వధువు ఇంటికి విందు కోసం వస్తాడు. కాసర్గోడ్ జనం ఈ ఆచారాన్ని ‘తాళా’ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా కేరళలోని మోప్లాల ఆచారం’’ అని డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మునీర్ కటిపాలా బీబీసీకి వివరించారు.
‘‘సంఘ్ పరివార్ వాళ్లు తమ మతోన్మాద అజెండాను ముందుకు తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ముస్లింలు ఇస్లాంను స్వచ్ఛంగా నిలపాలని వాదించటానికి ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన విమర్శించారు.
అయితే.. ‘‘ఇది కేవలం ఒకరి మతపరమైన మనోభావాలను గాయపరచటం కాదు. ఇలాంటి పెళ్లిళ్లు జరిగినపుడు వరుడి బృందం రాత్రి పొద్దుపోయాక వధువు ఇంటికి వస్తుంది. అప్పుడు వాళ్లు మామూలుగానే గొడవ చేస్తారు. నిజానికి ఇది ముస్లింల సంస్కృతి కాదు’’ అంటున్నారు అష్రాఫ్.
వరుడు బాసిత్‌ను సంప్రదించటానికి బీబీసీ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే.. ఆయన ఒక వీడియోలో ఆయన... ‘‘ఏ మతస్తుల మనోభావాలనూ గాయపరిచే ఉద్దేశం మాకు లేదు. నా మిత్రులు కేవలం సంతోషంగా, హాస్యంగా చేశారిది. ఒకవేళ ఇది ఎవరి మనోభావాలనైనా గాయపరిచివుంటే నేను క్షమాపణలు కోరుతున్నా’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్‌లో పెరిగిన పెళ్లిళ్లు.. అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచే బిల్లు గురించి ఎందుకు భయపడుతున్నారు?
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- కృతి శెట్టి: ‘శృంగారం కూడా నటనే కదా.. అలా ఉంటే బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పా’
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- నటుడు విజయ్ సేతుపతిపై రూ.3 కోట్ల పరువు నష్టం దావా.. బెంగళూరు విమానాశ్రయం దాడిలో ఏం జరిగింది?
- మైక్ టైసన్: విజయ్ దేవరకొండ 'లైగర్'లో ఈ బాక్సింగ్ హీరో ఏం చేస్తున్నాడు?
- ప్రేమ, విరహం, భక్తి, రక్తి, విప్లవం, వినోదం అన్నీ తెలిసిన కలం
- కరుణ కుమార్: పలాస, శ్రీదేవి సోడా సెంటర్ల నుంచి మెట్రో కథల వరకు..
- తాజ్‌మహల్‌కు పొదిగిన 40 రకాల రత్నాలను ఆంగ్లేయులు దోచుకెళ్లారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










