పారాసిటమల్ ఎక్కువగా వాడితే రక్తపోటు పెరిగి గుండెపోటు రావొచ్చు: తాజా అధ్యయనంలో వెల్లడి

మందులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫిలిప్పా రాక్స్‌బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు దీర్ఘకాలం పాటు పారాసిటమల్ వాడితే గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది.

డాక్టర్లు పేషెంట్లకు పారాసిటమల్ రాసి ఇస్తున్నప్పుడు వాటి లాభాలను, నష్టాలను బేరీజు వేసుకోవాలని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.

అయితే, జ్వరానికి, తలనొప్పికి పెయిన్‌కిల్లర్ తీసుకోవడం సురక్షితమేనని వారు చెబుతున్నారు.

కాగా, ఈ పరిశోధనా ఫలితాలను నిర్థరించడానికి మరింత పెద్ద శాంపిల్ తీసుకుని, దీర్ఘకాలం పాటు పరిశోధన చేయాల్సి ఉంటుందని ఇతర నిపుణులు సూచిస్తున్నారు.

స్వల్ప కాలిక నొప్పులు, బాధల నుంచి ఉపశమనం పొందేందుకు పారాసిటమల్ వాడతారు.

దీర్ఘకాలిక నొప్పులకు (క్రానిక్ పెయిన్స్) కూడా వాడతారుగానీ ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయన్నదానికి తగినన్ని ఆధారాలు లేవు.

2018లో స్కాట్లండ్‌లో అయిదు లక్షలమందిలో.. ప్రతి 10 మందిలో ఒకరికి పెయిన్‌కిల్లర్ రాసిచ్చారు.

బ్రిటన్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరికి అధిక రక్తపోటు సమస్య ఉంది.

బీపీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ అధ్యయనంలో 110 మంది వలంటీర్లపై పరిశోధన జరిపారు. వీరిలో మూడింట రెండు వంతుల మంది అధిక రక్తపోటుకు మందులు వాడుతున్నవారే.

ట్రయిల్స్‌లో, రెండు వారాల పాటు 1 గ్రా. పారాసిటమాల్‌ను రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలని వలంటీర్లను కోరారు. సాధారణంగా, క్రానిక్ పెయిన్స్ ఉన్నవారికి ఈ డోసు ఇస్తారు. మరో రెండు వారాలకు డమ్మీ మందులు ఇచ్చారు.

పారాసిటమల్ వల్ల రక్తపోటు పెరుగుతుందని ట్రయిల్స్‌లో తేలింది.

"గుండెపోటు, స్ట్రోక్‌లకు పారాసిటమల్ ఒక ముఖ్య కారకమని తేలిందని" ఎడిన్‌బర్గ్ క్లినికల్ ఫార్మకాలజిస్ట్ ప్రొఫెసర్ జేమ్స్ డియర్ చెప్పారు.

దీర్ఘకాలిక నొప్పులు ఉన్నవారికి వీలైనంత తక్కువ మోతాదులో పారాసిటమల్ ఇవ్వాలని పరిశోధకులు డాక్టర్లను కోరారు.

అంతే కాకుండా, అధిక రక్తపోటు ఉన్నవారిని, గుండెపోటు వచ్చే రిస్క్ ఉన్నవారిని జాగ్రత్తగా గమనించాలని సూచించారు.

బ్రిటన్‌లో ఆర్థరైటిస్ ఉన్నవారు అధికంగా ఉంటారు. నొప్పికి సురక్షితమైన మందులు అవసరమని, దానితో పాటూ శరీరం చురుకుగా ఉండేందుకు కావలసిన ప్రోత్సాహం, మానసికారోగ్యానికి సంబంధించిన చికిత్స కూడా అవసరమని బ్రిటన్‌లోని స్వచ్ఛంద సంస్థ వర్సెస్ ఆర్థరైటిస్ తెలిపింది.

అయితే, "ఈ పరిశోధన స్వల్పకాలికంగా నొప్పులు, జ్వరం తగ్గించడానికి పారాసిటమల్ లేదా పెయిన్‌కిల్లర్ వాడడం గురించి కాదని" ప్రధాన పరిశోధకుడు డాక్టర్ ఇయాన్ మాక్‌ఇంటైర్ స్పష్టం చేశారు.

స్వల్పకాలంలో వాటిని వాడడం సురక్షితమేనని ఆయన తెలిపారు.

పారాసిటమల్

ఫొటో సోర్స్, Getty Images

'తెలియని విషయాలు చాలా ఉన్నాయి'

"పారాసిటమల్ వాడడం వలన చిన్నదేగానీ విస్మరించలేని స్థాయిలో రక్తపోటులో పెరుగుదల కనిపించినట్లు సర్క్యులేషన్ జర్నల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనంలో తేలింది. కానీ తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి" అని డాక్టర్ దీపేందర్ గిల్ అన్నారు. లండన్ యూనివర్సిటీకి చెందిన సెయింట్ జార్జ్‌లో క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ లెక్చరర్‌గా వ్యవహరిస్తున్నారు గిల్ల్.

"మొదటగా, దీర్ఘకాలంగా పారాసిటమల్ వాడుతుంటే రక్తపోటులో పెరుగుదల అలాగే కొనసాగుతుందా లేదా అనే స్పష్టంగా తెలీదు.

రెండు, పారాసిటమల్ వాడకం వలన రక్తపోటు పెరిగినా, అది గుండె జబ్బులకు దారి తీస్తుందని కచ్చితంగా చెప్పలేం" అని ఆయన వివరించారు.

దీర్ఘకాలంగా పారాసిటమల్ వాడకానికి, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరగడానికి సంబంధం ఉందని గతంలో అమెరికాలో చేసిన ఒక అధ్యయనం తెలిపింది. కానీ, దానివల్లే ఇది జరుగుతుందని నిరూపించలేదు.

అయితే, పారాసిటమల్ వాడడం వలన రక్తపోటు ఎలా పెరుగుతుందో తమ అధ్యయనంలో వివరించలేకపోయాంగానీ దీర్ఘకాలం పాటు పారాసిటమల్ వాడకం పట్ల జాగ్రత్త వహించాలని ఫలితాలు సూచిస్తున్నట్లు ఎడిన్‌బర్గ్ బృందం తెలిపింది.

కాగా, కొంతమందిలో రక్తపోటు పెరగడానికి దోహదపడే ఐబుప్రోఫెన్ వంటి నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్ కంటే ఇవి సురక్షితమైనవని గత పరిశోధనలు తెలిపాయి.

"పెద్దగా హాని కలిగించని పారాసిటమల్" ఒక్కటే కాకుండా, ఏ మందులైనా పేషెంట్లకు ఎంతవరకూ అవసరమో ఒకటికి రెండుసార్లు డాక్టర్లు ఆలోచించాలని తాజా అధ్యయనానికి నిధులు సమకూర్చిన బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ సూచించింది.

"పారాసిటమల్‌ను విస్తృతంగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు, ప్రయోజనాలను నిర్ధరించడానికి" దీర్ఘకాల వ్యవధిలో సాధారణ రక్తపోటు ఉన్న వ్యక్తులపై తదుపరి పరిశోధన చేయవలసి ఉంటుందని స్ట్రోక్ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)