బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) 2021: నామినీలు వీరే

ISWOTY

'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY)' 2021 అవార్డు నామినీల జాబితాను బీబీసీ విడుదల చేసింది.

అదితి అశోక్ (గోల్ఫర్), లవ్లీనా బోర్గోహైన్ (బాక్సర్), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టర్), అవని లేఖర (పారాషూటర్), పీవీ సింధు (షట్లర్)లు ఈఏడాది బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినీలుగా ఎంపికయ్యారు.

ఓటింగ్ లైన్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయని, అవి ఫిబ్రవరి 28 వరకు అందుబాటులో ఉంటాయని బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా చెప్పారు.

"మీరు మీ ఫేవరెట్ మహిళా క్రీడాకారిణి ఈ అవార్డు గెలవాలనుకుంటే ఏమాత్రం ఆగకుండా వెంటనే ఓటు వేయాలని" ఆమె కోరారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ నామినీల ప్రకటన కార్యక్రమానికి గత ఏడాది బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత అంజూ బాబీ జార్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

"ఈసారి నామినీల్లో బెస్ట్ అథ్లెట్‌ను ఎంచుకోవడం ప్రతి ఒక్కరికీ సవాలు కాబోతోంది. ఈ ఐదుగురు భారత మహిళా క్రీడాకారిణులు చరిత్ర సృష్టించినవారే, అందుకే ఈసారీ వీరిలో ఒకరిని ఎంచుకోవడం అందరికీ కచ్చితంగా సవాలుగా నిలవబోతోంది" అని ఆమె అన్నారు.

"ఈ జాబితాలో ఉండాల్సిన ఎవరైనా అథ్లెట్ మిస్ అయ్యారని మీరు భావిస్తున్నారా?" అన్న బీబీసీ వరల్డ్ సర్వీస్ హెడ్ ఆఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఇందు శేఖర్ సిన్హా ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.

"ఇది బీబీసీ మహిళా క్రీడాకారులకు ఇచ్చే అవార్డు. లేదంటే నీరజ్ చోప్రా గురించి మాట్లాడేదాన్ని. ఎందుకంటే ఆయన గోల్డ్ మెడలిస్ట్ కదా" అని చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్ ఓటింగ్‌‌

భారత మహిళా క్రీడాకారుల సేవలను గుర్తించేందుకు, వారి విజయాలను వేడుకగా జరుపుకునేందుకు ఏటా ఈ అవార్డును అందిస్తోంది బీబీసీ న్యూస్.

బీబీసీ భారతీయ భాషలకు చెందిన ఏ వెబ్‌సైట్‌లోకైనా వెళ్లి అభిమానులు తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేయవచ్చు. బీబీసీ తెలుగు లేదా బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌లోకెళ్లి ఓటు వేయవచ్చు.

ఆన్‌లైన్ ఓటింగ్ లింక్ 2022 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11.30 (1800 GST) వరకు అందుబాటులో ఉంటుంది.

విజేతను 2022 మార్చి 28న దిల్లీలో జరిగే ఒక వేడుకలో ప్రకటిస్తారు.

దీనికి సంబంధించిన నిబంధనలు, షరతులు, గోప్యతకు సంబంధించిన నోటీసులు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

ISWOTY ఫలితాలను బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లు, బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌లో కూడా ప్రకటిస్తారు.

ఆన్‌లైన్ ఓటింగ్‌లో అత్యధిక ఓట్లు పొందిన క్రీడాకారిణి 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ 2021' విజేతగా నిలుస్తారు.

అదితి అశోక్
ఫొటో క్యాప్షన్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీ అదితి అశోక్

అదితి అశోక్

గోల్ఫర్

ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి భారత మహిళల గోల్ఫ్ క్రీడకు మారుపేరుగా నిలిచారు అదితి అశోక్.

కేవలం 18 ఏళ్ల వయసులోనే 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఆ ఏడాది ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత క్రీడాకారుల బృందంలో అతిపిన్న వయస్కురాలామె.

తరువాత, 2020 టోక్యో ఒలింపిక్స్‌ మహిళల గోల్ఫ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు.

గోల్ఫ్‌లో అదితి సాధించిన విజయం భారతదేశంలో మహిళల గోల్ఫ్‌పై ఆసక్తిని పెంచింది.

2016లో లేడీస్ యూరోపియన్ టూర్ ఈవెంట్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణి ఆమె.

అవని
ఫొటో క్యాప్షన్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీ అవని లేఖర

అవని లేఖర

పారాషూటర్

పారాలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా 20 ఏళ్ల అవని లేఖర చరిత్ర సృష్టించారు.

టోక్యో పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 విభాగంలో ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పారు.

అదే ఒలింపిక్స్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్స్ SH1లో కూడా అవని కాంస్యం గెలుచుకున్నారు.

చిన్నతనంలో జరిగిన ఒక పెద్ద కారు ప్రమాదంలో ఆమె నడుము నుంచి కింది భాగానికి పక్షవాతం వచ్చింది.

ఆ ప్రమాదం తరువాత, అవని తండ్రి ఆమెకు షూటింగ్ క్రీడను పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు.

క్రీడలపై ఉన్న మక్కువను కొనసాగిస్తూనే ఆమె లా చదువుతున్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2022 నామినీ
ఫొటో క్యాప్షన్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీ లవ్లీనా బోర్గోహైన్

లవ్లీనా బోర్గోహైన్

బాక్సర్

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించారు లవ్లీనా బోర్గోహైన్. దాంతో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మూడవ భారతీయ బాక్సర్‌గా రికార్డు నెలకొల్పారు.

వివిధ ఛాంపియన్‌షిప్‌లలో అనేక పతకాలను గెలుచుకున్నారామె.

2018లో ప్రారంభమైన ఇండియా ఓపెన్‌లో స్వర్ణం గెలుచుకుని తొలిసారిగా ఆమె వెలుగులోకి వచ్చారు.

ఆ తరువాత, ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

ఈశాన్య రాష్ట్రం అసోంలో జన్మించిన 24 ఏళ్ల లవ్లీనా తన ఇద్దరు అక్కలను స్ఫూర్తిగా తీసుకుని కిక్ బాక్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. భారత మహిళల బాక్సింగ్‌లో తనదైన ముద్ర వేశారు.

మీరాబాయి చాను
ఫొటో క్యాప్షన్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీ మీరాబాయి చాను

మీరాబాయి చాను

వెయిట్ లిఫ్టర్

వెయిట్‌ లిఫ్టింగ్ ఛాంపియన్ సాయిఖోమ్ మీరాబాయి చాను 2021 టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిన ఘనత ఆమెదే.

2016 రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో గెలుపు వరకు మీరాబాయి ప్రయాణం మరచిపోలేనిది.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2017లో ఆమె బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు.

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జన్మించారు మీరాబాయి చాను. ఆమె తండ్రి ఒక టీ స్టాల్ నడిపేవారు. కెరీర్ తొలి దశలో ఆమె అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఒలింపిక్ ఛాంపియన్‌గా ఎదిగారు.

పీవీ సింధు
ఫొటో క్యాప్షన్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీ పీవీ సింధు

పీవీ సింధు

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ.

2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రజతం సాధించి 2021 సంవత్సరాన్ని దిగ్విజయంగా ముగించారు సింధు.

2022 జనవరిలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలుచుకుని ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించారు.

2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారామె.

సింధు 17 సంవత్సరాల వయస్సులోనే 2012 సెప్టెంబర్‌లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లోకి అడుగుపెట్టారు.

2019 సంవత్సరానికి 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకున్నారు.

వీడియో క్యాప్షన్, మను భాకర్: BBC ISWOTY లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత

'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్' వేడుకలో భాగంగా, భారత క్రీడా రంగానికి విశేష సేవలు అందించిన ఓ ప్రముఖ క్రీడాకారిణికి 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్' అవార్డును అందించి సత్కరించనుంది బీబీసీ.

దీంతోపాటు, వర్థమాన మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు 'ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్'ను కూడా బీబీసీ అందించనుంది.

భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారులను సత్కరించే లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో బీబీసీ ఈ అవార్డును ప్రారంభించింది.

అనంతరం, కరోనా మహమ్మారి సృష్టించిన గందరగోళాన్ని ఎదుర్కొని, విజయవంతంగా మూడవ ఎడిషన్‌ను ఈ ఏడాది కొనసాగిస్తోంది.

బీబీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక జ్యూరీ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు నామినీలను ఎంపిక చేసింది. ఈ జ్యూరీలో ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలు ఉన్నారు. వారి వివరాలు ఇక్కడ చూడొచ్చు.

జ్యూరీ ఎంపిక చేసిన ఐదుగురు క్రీడాకారిణుల్లో తమకు నచ్చిన వారికి అభిమానులు ఓటువేయొచ్చు. అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించిన వారు విజేతగా నిలుస్తారు.

గత ఏడాది, ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ విజేతగా నిలిచారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)