అపూర్వి చందేలా: ‘నాన్న రైఫిల్ ఇచ్చారు.. నేను గోల్డ్ మెడల్ కొట్టాను’ - BBC ISWOTY

అపూర్వ చందేలా
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో పది మీటర్ల రైఫిల్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచిన అపూర్వి చందేలా తొలి ఒలింపిక్స్ అనుభవాల నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నారు.

2016లో రియో డీ జెనీరోలో జరిగిన ఒలింపిక్స్‌లో తొలిసారిగా అపూర్వి పాల్గొన్నారు. అయితే, అంచనాలకు తగిన విధంగా ఆమె ప్రదర్శన ఇవ్వలేకపోయారు.

ఆ అవకాశం నుంచి చాలా నేర్చుకున్నానని ఆమె అంటారు.

ఒలింపిక్స్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆస్ట్రేలియాలో కామన్‌వెల్త్ క్రీడల్లో ఆమె కాంస్య పతకాన్ని సాధించారు.

ఆ తర్వాతి సంవత్సరం ఆమె మరిన్ని విజయాలు సాధించారు. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఆమె వరల్డ్ రికార్డు సాధించారు. ఆ ఘనతే ఆమెకు 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్థానం కల్పించింది.

2016లో ప్రఖ్యాత అర్జున అవార్డు అపూర్వికి దక్కింది. త్వరలో జరగబోతున్న ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకొస్తానని ఆమె విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.

తన అనుభవాలతో టోక్యో ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ఆమె అంటున్నారు.

అపూర్వ చందేలా

కుటుంబ ప్రోత్సాహంతో

షూటింగ్ శిక్షణ అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అయితే, అపూర్వికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా జైపుర్‌లోని ఆమె కుటుంబం జాగ్రత్తగా చర్యలు తీసుకుంది.

అపూర్వి తల్లి బిందు బాస్కెట్ బాల్ ప్లేయర్. తన బంధువుల్లో చాలా మంది పిల్లలు కూడా షూటింగ్‌లో శిక్షణ పొందుతున్నారు.

దీంతో చిన్నప్పటి నుంచీ ఇంట్లో స్పోర్ట్స్ గురించి చర్చించుకునేవారు. మొదట్లో తను స్పోర్ట్స్ జర్నలిస్టు కావాలని అపూర్వి భావించారు.

అయితే, 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్ర స్వర్ణ పతకాన్ని సాధించిన అనంతరం, ఆయన్ను చూసి అపూర్వి స్పూర్తి పొందారు.

మొదట్నుంచీ అపూర్వికి కుటుంబం వెన్నంటే నిలబడింది. షూటింగ్‌పై ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి కుల్‌దీప్ సింగ్ చందేలా ఆమెకు ఒక రైఫిల్ బహుమతిగా కొనిచ్చారు. అలా ఆమె అభ్యాసం మొదలైంది.

తొలినాటి శిక్షణలో దగ్గర్లోని షూటింగ్ రేంజ్‌కు వెళ్లేందుకు ఆమె కనీసం 45 నిమిషాలు ప్రయాణించాల్సి వచ్చేది.

ప్రయాణానికి చాలా ఎక్కువ సమయం అవుతోందని తన కుటుంబం గమనించి, ఇంట్లోనే తనకు ఒక షూటింగ్ రేంజ్‌ను ఏర్పాటుచేయించింది.

ఆర్థిక అవసరాలను తండ్రి దగ్గరుండి చూసుకుంటుంటే.. తల్లి ఎక్కడికి వెళ్లినా వెన్నంటే ఉండేది.

ట్రైనింగ్ నుంచి టోర్నమెంట్ వరకు ఆమె పక్కనే ఉండేది. తల్లి పక్కనుంటే తనకు కొండంత బలం వచ్చినట్లు ఉంటుందని అపూర్వి చెబుతుంటారు.

2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అర్జున అవార్డు స్వీకరిస్తున్న అపూర్వి చందేలా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అర్జున అవార్డు స్వీకరిస్తున్న అపూర్వి చందేలా

లక్ష్యం తప్పకుండా..

2009లో ఆల్ ఇండియా స్కూల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించడంతో అందరి దృష్టి అపూర్వపై పడింది.

ఆ తర్వాత మూడేళ్లకు సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నారు.

2012 నుంచి 2019 మధ్య దాదాపు ఆరుసార్లు నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో తొలి మూడు స్థానాల్లో చోటు సంపాదించారు.

అదే సమయంలో అంతర్జాతీయ స్పోర్ట్స్‌లోనూ ఆమె తనదైన ముద్ర వేశారు.

గ్లాస్గోలో జరిగిన 2014 కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడంతో ఆమె అంతర్జాతీయ స్పోర్ట్స్‌లో మెరిశారు.

తను అమితంగా ఆస్వాదించిన విజయాల్లో ఇది ఒకటని ఆమె చెబుతారు. తన 14 మంది కుటుంబ సభ్యుల ముందు ఆ పతకాన్ని తీసుకున్నానని ఆమె వివరించారు.

(బీబీసీ ఈమెయిల్ ప్రశ్నావళికి అపూర్వి చందేలా సమాధానాల ఆధారంగా రాసిన కథనం)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)