డార్క్‌ వెబ్ డ్రగ్ ట్రేడ్: ‘శత్రు దేశంలో సీక్రెట్ ఏజెంట్లం మేం’

పిల్స్

డార్క్‌నెట్ డ్రగ్ వ్యాపారాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి బీబీసీ ప్రతినిధులు జో టైడీ, అలిసన్ బెంజమిన్‌లు – ఎక్సటసీ, కొకైన్ కొన్నారు.

ఈ మాదకద్రవ్యాల వ్యాపారులు - అంటే డ్రగ్ ట్రేడర్లు నిర్వహించే ఒక ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌ను పోలీసులు కనిపెట్టి మూసేసినా కూడా.. డ్రగ్ విక్రేతల వ్యాపారం ఎంత సులభంగా సాగిపోతోందో కూడా వాళ్లు తెలుసుకున్నారు.

టోరెజ్ ఒక మామూలు షాపింగ్ వెబ్‌సైట్‌ లాగానే కనిపిస్తుంది. వేలాది ప్రొడక్టులు లిస్టయి ఉంటాయి. ప్రతి విక్రేతకూ కస్టమర్ రివ్యూలు, స్టార్ రేటింగులు ఉంటాయి. డెలివరీకి ఎన్ని రోజులు పడుతుంది, చెల్లింపు పద్ధతులేమిటి అనే సమాచారమూ ఉంటుంది.

ఉన్న తేడా ఏమిటంటే.. అందులో లిస్టయిన ఉత్పత్తులే.

పెరూవియన్ ఫిష్‌స్కేల్ కొకైన్, షాంపేన్ ఎండీఎంఏ, బ్లూ పనిషర్ ఎక్సటసీ పిల్స్... ఇవి అమెజాన్‌లోనో, ఈబేలోనో దొరికే వస్తువులు కాదు.

కొన్ని వారాల కిందటి వరకూ టోరెజ్ ఒక డార్క్‌వెబ్ మార్కెట్‌ప్లేస్. మాదకద్రవ్యాలు మొదలుకుని, నకిలీ కరెన్సీల వరకూ బహిరంగ మార్కెట్‌లో నిషిద్ధ ఉత్పత్తులన్నీ అమ్మేవారిని, కొనేవారిని కలిపే ఒక ఇంటర్నెట్ చీకటి అంగడి.

ప్రపంచంలో అత్యంత పాపులర్ డార్క్ వెబ్ మార్కెట్లలో ఇది ఒకటిగా ఉండేది. దాని చివరి కస్టమర్లలో ఒకటిగా మారింది బీబీసీ.

డార్క్ వెబ్ డ్రగ్స్ వ్యాపారం మీద పరిశోధనలో భాగంగా.. టోరెజ్‌ ద్వారా యూకే డీలర్ ఒకరి నుంచి కొన్ని ఎక్సటసీ టాబ్లెట్లు కొన్నాం. ఆ అనుభవం చాలా చీకటి కోణాలను కళ్లకు కట్టింది.

వీడియో క్యాప్షన్, తాలిబాన్లు నల్లమందు సాగుతో వేల కోట్లు సంపాదిస్తున్నారా?

డార్క్ వెబ్‌లో డ్రగ్స్ కొనటం.. పిజ్జా ఆర్డరిచ్చినంత ఈజీ అనే భ్రమ ఉంది. కానీ క్రిప్టోకరెన్సీతో డ్రగ్స్ కొనటానికి, అమ్మేవాళ్లతో ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లో సంప్రదింపులు జరపటానికి కొన్ని గంటల సమయం పట్టింది.

ఆ ‘సూపర్ స్ట్రాంగ్’ మాత్రలు.. వ్యాపారి హామీ ఇచ్చినట్లుగానే రెండు రోజుల్లోనే పోస్టులో వచ్చేశాయి.

మూడు చిన్న మాత్రలను.. ఓ పెద్ద పెట్టెలో పెట్టి పంపించారు. లోపలున్న వస్తువులు ఏమిటో తెలియకుండా మోసం చేయడానికి ఈ ఎత్తుగడను అనుసరిస్తారు.

మరో వెబ్‌సైట్ నుంచి కొన్న కొకైన్ ప్యాకెట్.. ఓ హెర్బల్ హెల్త్ కంపెనీ నుంచి నకిలీ రశీదుతో వచ్చింది.

బీబీసీ ఈ డ్రగ్స్‌ను పరీక్షలకు పంపించింది. మాకు చెప్పిన దానికన్నా వాటి ఘాటు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఒక లేబరేటరీలో వాటిని ధ్వంసం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మొత్తం వ్యాపారంలో డార్క్‌నెట్ మార్కెట్ల వాటా అతి స్వల్పమని.. ఒక శాతం కన్నా తక్కువగానే ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా. అయితే ఈ చిన్న మార్కెట్ పెరుగుతోంది.

డ్రగ్స్

ఐరాస ప్రపంచంలో వేలాది మంది డ్రగ్ వినియోగదారులను సంప్రదించి నిర్వహించే వార్షిక సర్వే గ్లోబల్ డ్రగ్స్ సర్వే చెప్తున్న కథ మరోలా ఉంది.

2021లో ఉత్తర అమెరికా ఖండంలో సర్వే చేసిన ప్రతి నలుగురిలో ఒకరు డార్క్ వెబ్‌లో డ్రగ్స్ కొన్నట్లు చెప్పారు. యూరప్, ఓషియానాల్లో ప్రతి ఆరుగురిలో ఒకరి కన్నా ఎక్కువ మంది ఈ మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేశామని చెప్పారు.

ఈ సంఖ్య రష్యాలో 86 శాతంగా ఉంది. ఫిన్లండ్, స్విడన్‌లలో 40 శాతానికి పైగా, ఇంగ్లండ్‌, స్కాట్లండ్, పోలండ్‌లలో 30 శాతానికి పైగా ఉంది.

ఇంగ్లిష్ భాషలో ఉండే డార్క్‌నెట్ డ్రగ్ మార్కెట్‌ప్లేస్‌ల సంఖ్య గత ఏడాది తగ్గిపోయింది. కానీ అదే సమయంలో వాటి ఆదాయం 14 శాతం పెరిగిందని బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ చెప్తోంది.

ఈ డార్క్ వెబ్ డ్రగ్స్ ప్రపంచం గందరగోళంగా ఉంది. ఎప్పటికప్పుడు మారిపోతోంది.

అప్పుడప్పుడూ కొన్ని సైట్లు మూతపడతాయి. వాటి ఆపరేటర్లు కస్టమర్లు, వ్యాపారుల డబ్బు తీసుకుని మాయమవుతారు. దీనిని ఎగ్జిట్ స్కామ్ అని పిలుస్తారు. ఆ వెబ్‌సైట్లను ఎవరైనా హ్యాక్ చేయటమో, పోలీసులు కనిపెట్టి మూసివేయటమో కూడా జరగొచ్చు.

వీడియో క్యాప్షన్, మెక్సికోలో రోజుకి 71 హత్యలు, డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలతో మర్డర్ల మెక్సికోగా మారిన వైనం

అయితే ఈ మార్కెట్‌ప్లేస్‌లు ఓ కొత్త ఒరవడిని కూడా అనుసరిస్తున్నాయి. ‘సన్‌సెటింగ్’ లేదా ‘వాలంటరీ రిటైర్‌మెంట్’ అని వ్యవహరించే ఈ విధానంలో వీటిని ఓ క్రమపద్ధతిలో మూసివేస్తారు.

వైట్ హౌస్ మార్కెట్ అనే ఓ భారీ డార్క్‌వెబ్ గత శరదృతువులో ఈ పని చేసింది. ఆ తర్వాత కనాజాన్ అనే మరో డార్క్ వెబ్‌మార్కెట్ కూడా అదే దారిలో నడిచింది.

ఆ తర్వాత టోరెజ్ వంతు వచ్చింది. తన మార్కెట్‌ను మూసేస్తున్నట్లు గత నెలలో హోంపేజీలో ఒక లేఖను పోస్ట్ చేసింది. ‘‘వెండర్లు, యూజర్లతో పనిచేయటం చాలా సంతోషాన్నిచ్చింది’’ అని కూడా ఆ లేఖలో చెప్పింది.

సైట్ అడ్మినిస్ట్రేటర్ మిస్టర్ బ్లాండ్.. కస్టమర్లకు కృతజ్ఞతలు చెప్పారు. ‘‘ఆర్డర్లన్నీ పూర్తయ్యేవరకూ రెండు మూడు వారాల పాటు మార్కెట్ ఆన్‌లైన్‌లో ఉంటుంది’’ అని వారికి హామీ ఇచ్చారు.

‘‘ఇంత హుందాగా వెళ్లిపోతున్నందుకు కృతజ్ఞతలు. చాలా అభినందిస్తున్నాం’’ అని ఒక కస్టమర్ పోస్ట్ చేశారు. ‘‘ఈ పని ప్రొఫెషనల్‌గా, నిజాయితీగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు’’ అని మరొకరు స్పందించారు.

‘‘ఇప్పుడు ఈ విధంగా మరింత ఎక్కువగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మార్కెట్లు ‘మేం చాలినంత సంపాదించుకున్నాం. మమ్మల్ని పట్టుకునే ముందే ఈ పని విరమిస్తున్నాం’ అంటూ హుందాగా మూసేస్తున్నారు’’ అని ప్రొఫెసర్ డేవిడ్ డికారీ హీటు వ్యాఖ్యానించారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్‌లో క్రిమినాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

డ్రగ్స్

ఫొటో సోర్స్, FBI

టోరెజ్ వంటి భారీ మార్కెట్‌ప్లేస్‌లను నడిపే అడ్మినిస్ట్రేటర్లు.. కమీషన్ల రూపంలో రోజుకు లక్ష డాలర్లకు పైనే సంపాదిస్తారని ఆయన చెప్తున్నారు.

నేరస్తులను బోనులో నిలబెట్టాలని కోరుకునే పోలీసులకు.. ఇలాంటి మూసివేతలను చూసి సంతోషించాలో, విచారించాలో తెలియదు.

‘‘ఎవరైనా తను చేస్తున్న పని నేరం కిందకు వస్తుందని తెలుసుకుని, దానిని ఆపేయాలనుకుంటే నేను సంబరపడతాను’’ అంటారు ఎన్‌సీఏలో డార్క్‌నెట్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి అలెక్స్ హడ్సన్.

‘‘కానీ.. వారు చేసిన పనికి వారిని బాధ్యులను చేయాలి. తాము ఆ పని మానేసినా చేసినదానికి బాధ్యత వహించితీరాల్సి ఉంటుందని వారికి తెలియాలి. అలా జరగకపోవటం విచారకరం’’ అని చెప్పారాయన.

వాలంటరీ రిటైర్‌మెంట్ లేదా సన్‌సెటింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్. అయితే మూతపడే మార్కెట్లు ఎక్సిట్ స్కామ్‌కు పాల్పడుతున్నాయని బీబీసీ చేసిన డాటా అనాలసిస్ చెప్తోంది.

పోలీసులు ఈ వెబ్‌సైట్లను మూసివేయటంలో అనేక విజయాలు సాధించినప్పటికీ.. అలా జరగటం చాలా తక్కువ.

కొకైన్

మొట్టమొదటి భారీ డార్క్ వెబ్‌ మార్కెట్ ‘సిల్క్ రోడ్‌’ నడిపిన అమెరికా పౌరుడు రాస్ అల్‌బ్రిచిట్.. పెరోల్‌కు అవకాశం లేని 40 ఏళ్ల జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఆ డార్క్‌వెబ్ మార్కెట్ 2011 నుంచి 2013 వరకూ నడిచింది.

2021 జనవరిలో డార్క్ మార్కెట్ అనే వెబ్‌ గుట్టురట్టు చేసిన ఎన్‌ఎస్ఏ.. గత అక్టోబరులో 150 మంది అనుమానితులను అరెస్ట్ చేసింది. ఈ రంగంలో ఇప్పటివరకూ ఇదే అతి పెద్ద ఆపరేషన్ అని చెప్తున్నారు.

పలు దేశాల పోలీసులు కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో.. అమెరికా, జర్మనీ, బ్రిటన్ తదితర దేశాల్లో అరెస్టులు చేశారు.

కానీ.. చట్టవిరుద్ధమైన మార్కెట్‌ప్లేస్ ఒక దానిని మూసేసినా.. వ్యాపారుల మీద దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. వాళ్లు మరో మార్కెట్‌ప్లేస్‌లో తమ దందా కొనసాగించొచ్చు.

బీబీసీ విశ్లేషించిన సమాచారాన్ని బట్టి ఎంత తక్కువగా అంచనా వేసినా.. ప్రస్తుతం 450 మంది డీలర్లు పనిచేస్తున్నారు. వారు గతంలో పోలీసుల దాడుల నుంచి బయటపడి ఈ దందా కొనసాగిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, సినిమా, డ్రగ్స్, సెక్స్, మీడియా - వీక్లీ షో విత్ జీఎస్

నెక్ట్స్ జనరేషన్ అనే డీలర్ వాటిలో ఒకటి. ఆరేళ్లలో 21 వేర్వేరు మార్కెట్‌ప్లేస్‌లలో ఇది కనిపించింది.

ఈ క్రిమినల్ లేదా నేరస్తుల ముఠా.. గంజాయి, కొకెయిన్, కీటమైన్ వంటి ఉత్పత్తులను అమ్ముతూ ఆ ఆరేళ్లలో 1,40,000 విక్రయాలు జరిపినట్లు అంచనా.

పోలీసులు ఎదుర్కొంటున్నది ‘అసాధ్యమైన పని’ అని నెక్ట్స్ జనరేషన్ ఒక ఎన్‌క్రిప్టెడ్ ఈమెయిల్‌లో అభివర్ణించింది.

‘‘సాధారణంగా పట్టుబడటమంటే.. యూజర్ చేసే చిన్నపొరపాటే కారణమవుతుంది. పోలీసులు ఒక రోజు హఠాత్తుగా మేల్కొని కోడ్‌ను క్రాక్ చేసి దొంగలను పట్టుకోవటం ఉండదు’’ అని వ్యాఖ్యానించింది.

బ్రిటన్, జర్మనీలకు చెందిన డీలర్ల ‘హిప్పీ సముదాయం’ అని చెప్పుకుంటున్న ద పిగ్మాలియన్ సిండికేట్.. పోలీసులు పట్టుకుంటారనే భయం తమకు లేదని, ఎందుకంటే ‘శత్రు దేశంలో సీక్రెట్ ఏజెంట్ల లాగా’ తాము చాలా జాగ్రత్తలు తీసుకుంటామని బీబీసీకి చెప్పింది.

‘‘పోలీసుల దాడులు మా వ్యాపారాన్ని అంతగా తాకలేదు. చాలామంది మిగతా వ్యాపారులు కూడా పోలీసులను పెద్దగా పట్టించుకోరనే అనుకుంటున్నాం’’ అని పేర్కొంది.

నేరస్తుల కన్నా పోలీసులు తరచుగా ఒక అడుగు వెనుకబడే ఉన్నారని ఎన్‌సీఏ అధికారి అలెక్స్ హడ్సన్ అంగీకరిస్తున్నారు. అయితే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరిస్థితి మారనుందని చెప్పారు.

‘‘కొన్నేళ్ల కిందటి పరిస్థితితో పోల్చినా.. ఇప్పుడు మాకు లభించిన సమాచారం నుంచి మరింత వేగంగా ఆధారాలు సంపాదించి, నేరస్తులను గుర్తించగలుగుతున్నాం’’ అని ఆయన బీబీసీకి తెలిపారు.

‘‘ఇప్పుడు గాలి దిశ మారుతోంది’’ అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)