పాకిస్తాన్: దైవదూషణ ఆరోపణలతో హిందూ ప్రొఫెసర్‌కు జీవిత ఖైదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాజ్ సుహైల్
- హోదా, బీబీసీ ఉర్దూ కరెస్పాండెంట్
పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన ఒక కోర్టు.. దైవదూషణ చేశారనే నేరారోపణతో హిందూ ప్రొఫెసర్‌కు జీవిత ఖైదుతో పాటు జరిమానాను విధించింది.
అయితే ఈ శిక్షను హైకోర్టులో సవాలు చేయాలని ఆ ప్రొఫెసర్ బంధువులు నిర్ణయించారు.
దైవదూషణ అభియోగాలతో సింధ్ ప్రావిన్సులో ఒక హిందూ పౌరుడికి శిక్ష విధించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.
''ప్రాసిక్యూషన్ ప్రకారం, 2019 సెప్టెంబర్ 14న అబ్దుల్ అజీజ్ ఖాన్ అనే వ్యక్తి ఘోట్కీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదులో తన కుమారుడు పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నట్లు అజీజ్ ఖాన్ తెలిపారు. తరగతి గదిలోకి వచ్చిన పాఠశాల యజమాని నూతన్ లాల్, మొహమ్మద్ ప్రవక్త గురించి అవమానకరంగా మాట్లాడి వెళ్లిపోయారని తన కుమారుడు చెప్పినట్లు అజీజ్ ఖాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు'' అని కోర్టు పేర్కొంది.
మొహమ్మద్ నవేద్, వకాస్ అహ్మద్ అనే ఇద్దరు సాక్షుల ముందు తన కుమారుడు ఈ సంగతి తనతో చెప్పారని అజీజ్ ఖాన్ వెల్లడించారు.
అడిషనల్ సెషన్స్ జడ్జి ముంతాజ్ సోలంకీ ఈ కేసు తీర్పును వెలువరించారు. ఆయన తన జడ్జిమెంట్ సందర్భంగా.... ''ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్షులిద్దరూ స్వతంత్రులు, నమ్మదగినవారు. వారి వాంగ్మూలాలు ద్వేషపూరితమైనవి కావు. వారిద్దరిలో ఎవరికి కూడా నిందితునిపై ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు. కాబట్టి వారి సాక్ష్యాన్ని నమ్మకపోవడానికి ఎలాంటి కారణాలు లేవు'' వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
నిందితుడు నూతన్ లాల్‌కు వ్యతిరేకంగా నమోదైన ఆరోపణలు నిజమేనని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విజయవంతమైందని కోర్టు పేర్కొంది. నేరం నిరూపితం కావడంతో నిందితునికి జీవిత ఖైదుతో పాటు రూ. 50 వేల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో నాలుగు నెలలు నిందితుడు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తీర్పు ప్రకారం, అరెస్ట్ చేసిన నాటి నుంచే శిక్ష అమల్లోకి వస్తుంది.
''ఈ కేసులో న్యాయం జరగలేదు. ఒత్తిడిలో తీర్పును వెలువరించారు'' అని బీబీసీతో నూతన్ బంధువు మహేశ్ కుమార్ చెప్పారు.
''ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు. కేవలం విన్న మాటల ద్వారానే కోర్టు తీర్పు వెలువరించిందని'' ఆయన ఆరోపించారు. కోర్టులో సాక్షులుగా ప్రవేశపెట్టినవారు కూడా తమ పొరుగింటివారేనని ఆయన వెల్లడించారు.
ఘోట్కీలోని హిందూ సమాజం భయాందోళనల్లో, ఒత్తిడిలో ఉందని మహేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కేసు వాదనల నేపథ్యంలో తమ కుటుంబం మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు.
సీనియర్ పోలీసు అధికారికి బదులుగా జూనియర్ ఆఫీసర్ ఈ కేసును దర్యాప్తు చేశారని, ఇది చట్టవిరుద్ధమని ఆయన ఆరోపించారు. అందుకే ఈ తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్తామని చెప్పారు.
ఆరోజు ఏం జరిగింది?
పోలీసులు చెప్పినదాని ప్రకారం... ప్రొఫెసర్ నూతన్ లాల్, తరగతిలో ఉర్దూ పాఠం బోధిస్తున్న సమయంలో ఈ వివాదం ప్రారంభమైంది. తరగతి ముగిసిన అనంతరం ఒక విద్యార్థి, ఇస్లామిక్ స్టడీస్ ఉపాధ్యాయుని వద్దకు వెళ్లి... మొహమ్మద్ ప్రవక్త గురించి నూతన్ లాల్ దుర్భాషలాడినట్లు ఆరోపించారు.
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మిగతా ఉపాధ్యాయులు ప్రయత్నించారు. ఎవరి మత మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని పేర్కొంటూ నూతన్ లాల్ కూడా క్షమాపణలు చెప్పారు.
అయితే ఆ విద్యార్థి, ఈ ఘటన గురించి తన తండ్రితో చెప్పడంతో పాటు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఇది తీవ్రరూపం దాల్చింది. ప్రజలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీని తర్వాత, స్థానిక మార్కెట్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక సమూహం, నూతన్ లాల్ పాఠశాల భవనంపై దాడికి పాల్పడి ఆస్తులను ధ్వంసం చేసింది.
అంతేకాకుండా మరో వర్గం నూతన్ లాల్ ఇంటిపై దాడికి తెగబడింది. స్థానిక సాయిసద్ రామ్ మందిర్‌పై కూడా మూకలు దాడి చేశాయి.
అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో జిల్లా యంత్రాంగం భద్రతా బలగాలను మోహరించింది.

ఇవి కూడా చదవండి:
- ములాయం సింగ్, కాన్షీరాం ఏకమై కల్యాణ్ సింగ్‌ను చిత్తు చేశాక ఏం జరిగింది
- కుష్: యువతను సర్వ నాశనం చేస్తున్న కొత్త మాదక ద్రవ్యం, గొంతు కోసుకుంటున్న బాధితులు
- కొండ చీలికలో ఇరుక్కుపోయిన యువకుడిని కాపాడిన భారత సైన్యం
- ‘గంటకు 417 కిలోమీటర్ల స్పీడుతో కారు నడిపాడు..’ ఆ తర్వాత ఏమైందంటే..
- ఆటలు ఆడట్లేదా? అయితే, మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











