Muskan Khan ఇంటర్వ్యూ: ‘నేను 'అల్లా-హు-అక్బర్' అని ఎందుకు అన్నానంటే..’

- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
''నేను 'అల్లా-హు-అక్బర్' అని అన్నాను. ఎందుకంటే నేను చాలా భయపడ్డాను. నాకు భయం వేసినప్పుడు అల్లా పేరు తలుచుకుంటాను''
కర్నాటకలో మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న ముస్కాన్ ఖాన్ చెప్పిన మాటలివి.
హిజాబ్ ధరించి తన క్లాస్ వైపు వెళ్తున్న ముస్కాన్ ఖాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాషాయ కండువాలు ధరించిన కొందరు యువకులు 'జై శ్రీరాం' నినాదాలు చేస్తూ ఆమె వైపు రావడం, ఆ తర్వాత ఆమె రెండు చేతులు పైకెత్తి 'అల్లా-హు-అక్బర్' అనడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ముస్కాన్ ఖాన్‌తో బీబీసీ మాట్లాడింది.
ఆ రోజు అక్కడేం జరిగింది?
ముస్కాన్ ఖాన్: నాకేం తెలియదు. నేను రోజూ కాలేజీకి వెళ్తాను. ఆ రోజు కూడా వెళ్లాను. నేను బురఖాలో కాలేజీ లోపలికి వెళ్లకూడదని బయటి నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు నాతో చెప్పారు. కాలేజీ లోపలికి వెళ్లాలంటే బురఖా, హిజాబ్ తీసేయాలని అన్నారు. బురఖా ఉంచుకోవాలనుకుంటే ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారు.
కానీ నేను లోపలికి వెళ్లాను. నేను మౌనంగా క్లాసుకు వెళ్లిపోదామని అనుకున్నాను. కానీ అక్కడ చాలా మంది 'జైశ్రీరాం' నినాదాలు చేస్తున్నారు.
నేను క్లాసుకు వెళ్దామనే అనుకున్నాను. కానీ ఆ అబ్బాయిలు నాపై దాడి చేసే మాదిరిగా నా వెనకే వచ్చారు. వాళ్లు 40 మంది ఉన్నారు. నేను ఒక్కదాన్నే. వాళ్లలో మానవత్వం కనిపించలేదు. అకస్మాత్తుగా ఒకరు నా ముందుకొచ్చి నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కొందరు కాషాయ కండువాలు వేసుకుని ఉన్నారు.
వాళ్లు నా ముందుకొచ్చి 'జై శ్రీరాం', 'వెనక్కి వెళ్లు', 'బురఖా తీసేయ్' వంటి నినాదాలు చేశారు.

ఫొటో సోర్స్, Video Grab
ఎప్పటి నుంచి బురఖా ధరిస్తున్నారు?
ముస్కాన్ ఖాన్: నేను ఇంటర్‌లో జాయిన్ అయినప్పటి నుంచి బురఖా వేసుకుంటున్నా. కాలేజీలో ఎలాంటి సమస్య లేదు. ఇదివరకు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. హిజాబ్ వేసుకుని క్లాసుకు వెళ్తాం. క్లాసులో మేం బురఖా వేసుకోం. మేం హిజాబ్ మాత్రమే వేసుకుంటాం.
కానీ వాళ్లు నన్ను కాలేజీ ఆవరణలో కూడా అడుగుపెట్టనివ్వలేదు. వారిలో చాలా మంది బయటి వాళ్లు ఉన్నారు. వారిలో కొందరు కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది బయటి నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు.
వాళ్లేం చెప్పారు?
ముస్కాన్ ఖాన్: బురఖా తీయమని చెప్పారు. లేదంటే కాలేజీ లోపలికి వెళ్లలేవని అన్నారు. వాళ్లు నన్ను చాలా భయపెట్టారు. నా కంటే ముందు నలుగురు అమ్మాయిలు వచ్చారు.
నా విషయంలో గేటుకు కూడా తాళం వేశారు. అప్పుడు ప్రిన్సిపల్ వచ్చారు. ప్రిన్సిపల్, టీచర్లు నన్ను కాపాడారు. ఆ అబ్బాయిలు వాళ్లతో మాట్లాడి వెళ్లిపోయారు. నేను లోపలికి వెళ్లాను. కానీ ఆ తర్వాత నా విషయంలో మళ్లీ అలాగే చేశారు. నేను ఏడవను. వాళ్లకు వ్యతిరేకంగా నేను నా స్వరం వినిపించాను.
మీరేం చెప్పారు?
ముస్కాన్ ఖాన్: నేను 'అల్లా-హు-అక్బర్' అన్నాను. ఎందుకంటే నాకు చాలా భయమేసింది. నాకు భయమైనప్పుడు.. నేను అల్లా పేరు తలుచుకుంటాను. అల్లాను తలుచుకున్నప్పుడు నాకు ధైర్యంగా ఉంటుంది. అంతే.
హిజాబ్ ధరించడంపై మీ అభిప్రాయం ఏంటి?
ముస్కాన్ ఖాన్: హిజాబ్ ధరించొచ్చని స్వయంగా మా కాలేజీ ప్రిన్సిపాలే చెప్పారు. బయటి వ్యక్తులు వచ్చి దీన్నొక వివాదంగా మారుస్తున్నారు. ఇదివరకు మీరు ఎలా వచ్చారో ఇప్పుడు కూడా అలాగే రండని స్వయంగా ప్రిన్సిపాలే మాతో చెప్పారు. కాలేజీలో ఎలాంటి సమస్య లేదు. వాళ్లే ఇక్కడికొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు.
హిజాబ్ ధరించాలా వద్దా?
ముస్కాన్ ఖాన్: ధరించాలి. నేను కచ్చితంగా వేసుకుంటా.
హిజాబ్ మీద అభ్యంతరాలపై మీ అభిప్రాయం ఏంటి?
ముస్కాన్ ఖాన్: రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. అది మాకు వ్యతిరేకంగా వెళ్తుందని అనుకోవడం లేదు. మేము హైకోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం.
హిజాబ్ వర్సెస్ కాషాయం వివాదం ఇతర స్నేహితులతో మీ సంబంధాలపై ప్రభావం చూపిస్తుందా?
ముస్కాన్ ఖాన్: నా విజ్ఞప్తి ఒక్కటే. నేను ఇక్కడ ఎలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టడం లేదు. నా చదువు, నా హక్కుల కోసం నేను నినదించాను. విద్యలో మేము ఎదగకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. హిజాబ్ వేసుకున్నందుకు కాలేజీలో అడుగు పెట్టనివ్వడం లేదని చెబుతున్నారు.
మేము కొన్ని సంవత్సరాలుగా హిజాబ్ ధరిస్తున్నాం. ఇప్పుడే కొత్తగా ధరించడం లేదు. కానీ మేము హిజాబ్ ధరించి వస్తే కాలేజీ లోపల అడుగుపెట్టనివ్వబోమని వాళ్లు చెబుతున్నారు.
అమ్మాయిలు హిజాబ్ వేసుకుని వస్తే.. మేము కూడా కషాయ కండువాలు తీసేయబోమని కాలేజీలోని అబ్బాయిలు ప్రిన్సిపాల్‌కు చెబుతున్నారు. వాళ్లు అలా వస్తే మేము కూడా ఇలాగే వస్తామంటున్నారు.
ఆ విషయంలో మాకెలాంటి సమస్య లేదు. వాళ్లు ఎలా వచ్చినా మాకు ఇబ్బంది లేదు. మాకు కావాల్సిందల్లా హిజాబ్ ధరించేందుకు అనుమతి మాత్రమే. వాళ్లు ఎలా వచ్చినా మేం పట్టించుకోం. మాకు చదువు కావాలి. మా ప్రిన్సిపాల్, టీచర్లు మాకు అండగా ఉన్నారు. బయటి నుంచి వచ్చిన వాళ్లు ఇక్కడ వివాదం సృష్టిస్తున్నారు.
మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. హైకోర్టు తీర్పు మాకు అనుకూలంగానే ఉంటుందని అనుకుంటున్నాం.

ఇవి కూడా చదవండి:
- బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై కాజల్ అగర్వాల్ రియాక్షన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్
- మగ పిల్లాడు పుట్టేలా చేస్తానని తలలో మేకు కొట్టిన భూత వైద్యుడు
- అమరావతి: 407 ఎకరాల రాజధాని భూములను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందుకు తనఖా పెట్టింది?
- సౌర తుపానులో చిక్కుకున్న స్పేస్ ఎక్స్ రాకెట్.. గాలిలోనే మండిపోయిన 40 ఉపగ్రహాలు
- పాకిస్తాన్లో హిందూ ప్రొఫెసర్‌కు జీవిత ఖైదు, దైవదూషణ కేసులో కోర్టు తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















