ఆంధ్రప్రదేశ్: శ్రీకాళహస్తి కలంకారీ సంప్రదాయ కళ ఏనాటిది... ఈ వస్త్రాల ప్రత్యేకత ఏంటి?

శ్రీకాళహస్తి కలంకారీ
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

కలంకారీ అనగానే అందరికీ శ్రీకాళహస్తి గుర్తుకొస్తుంది. ఆధ్యాత్మికత పంచడంతోపాటూ కలంకారీ కళకు ఈ పట్టణం జీవం పోసింది.

అటవీ ప్రాంతాల్లో సహజసిద్దంగా దొరికే వివిధ చెట్ల బెరళ్లు, వేర్లు, కాయలతో తయారు చేసే రంగులను సంప్రదాయ కళాకృతులకు అద్దడం కలంకారీ ప్రత్యేకత.

శ్రీకాళహస్తిలో ఎన్నో కుటుంబాలు కలంకారీ కళపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ కళను తమ తర్వాత తరాలకు అందిస్తున్నాయి. కొందరు శిక్షణ ఇస్తుంటే, మరికొందరు దీని ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ కలంకారీ వస్త్రాలను దేశవ్యాప్తంగా విక్రయించడమే కాకుండా విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.

శ్రీకాళహస్తి కలంకారీ

ఇక్కడి కళాకారులు కొందరు అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ప్రముఖ కలంకారీ కళాకారుడు నిరంజన్‌ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.

కలంకారీ కళకు తొలి జాతీయ అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న జొన్నలగడ్డ గుర్రప్ప కుమారుడే ఈ నిరంజన్.

తన తాత జొన్నలగడ్డ లక్ష్మయ్య, ముత్తాత వేసిన కలంకారీ చిత్రాలు లండన్ మ్యూజియంలో కూడా ఉన్నాయని నిరంజన్ బీబీసీకి చెప్పారు.

కాళహస్తిలో వస్త్రాలపై ప్రధానంగా ఈ శైలి చిత్రాలు వేసేవారని, మచిలీపట్నంలో రంగుల అద్దకం జరిగేదని.. తర్వాత ఆ రెండింటినీ కలిపి 'కలంకారీ' అని పేరు పెట్టారని ఆయన తెలిపారు.

కలంకారీ కోసం అన్నీ ప్రకృతిసిద్ధంగా దొరికే వస్తువులే ఉపయోగిస్తామని చెబుతూ, ఆ మొత్తం ప్రక్రియ ఎలా ఉంటుందో వివరించారు.

"మొదట వెదురుపుల్లని సన్నగా పెన్నులా చెక్కుతాం. దానికి కంబళి ముక్క, నూలు చుట్టుకుంటాం. దాన్ని కుంచె అంటారు. అలా చేయడం వల్ల అది రంగు పీల్చుకుంటుంది. దానిని ఎంత మృదువుగా అదిమితే, అంత బాగా రంగు పడుతుంది. దానిని బొమ్మకు కావల్సిన రంగుకు తగినట్లు ఎలా అదుముతాం అనేదే మా నైపుణ్యం. గాడా గుడ్డ, సిల్క్, చందేరి, టస్సరు లాంటి వస్త్రాలపై ఈ రంగులు బాగా అంటుకుంటాయి. సింథటిక్ లాంటి వాటిపైన సహజ రంగులు అంటుకోవు. అసలు సిసలు పట్టు, నూలు వస్త్రాల మీదే ఇవి బాగా అద్దుకుంటాయి. అదే పెన్ను కలంకారీ” అని చెప్పారు నిరంజన్.

శ్రీకాళహస్తి కలంకారీ

కలంకారీ చిత్రాలు ఎలా వేస్తారు?

కలంకారీ ఆకృతులను గుడ్డ మీద వేసే ముందు ఒక సుదీర్ఘ ప్రక్రియ ఉంటుందని కాళహస్తికి చెందిన మరొక కలంకారీ ఆర్టిస్ట్ గంగాదేవి బీబీసీకి వివరించారు.

"మొదట కాటన్ బట్టను ఉతుకుతాం. తర్వాత కరక్కాయను పొడి చేసి దాన్ని పాలల్లో వేసి ఆ బట్టకు పట్టిస్తాం. దానిని బాగా ఎండబెడతాం. ఆరిన తర్వాత దానిపైన చిత్రిస్తాం. వాటిపై ఎలాంటి డిజైన్ వేయాలి, ఎలా వేయాలి అనేది ముందే నిర్ణయించుకుంటాం. బొగ్గుతో ఏ ఆర్ట్ ఎలా ఉండాలో మార్కింగ్ వేసుకుంటాం. తర్వాత బెల్లపునీళ్లు, ఇనుప ముక్కలతో తయారైన 'కసిమి'ని తీసుకొని బ్లాక్ రైటింగ్ చేస్తాం. పటిక వేస్తాం. తర్వాత మళ్లీ ఉతుకుతాం. మంజిస్టా వేసి మళ్లీ ఉడకబెడతాం. దానిని పాలలో ముంచి ఆరబెట్టిన తర్వాత సహజ రంగులను వాటికి పట్టిస్తాం'' అని ఆమె చెప్పారు.

రంగులు ఎలా తయారు చేస్తారు?

పరిసర ప్రాంతాల్లో, అడవుల్లో సహజసిద్దంగా దొరికే ముడి సరుకులతో కలంకారీ కళాకారులే తమ రంగులను తయారు చేసుకుంటారు.

మొదట నాలుగు రంగులు తయారు చేసిన తర్వాత, వాటి నుంచే వారికి కావల్సిన మిగతా రంగులను సృష్టించుకుంటారు.

కలంకారీ చిత్రాలకు ఉపయోగించే రంగులను ఎలా తయారు చేస్తారో కూడా నిరంజన్ చెప్పారు. ఏ రంగు కావాలంటే ఎలాంటి ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందో ఆయన వివరించారు.

“సహజంగా కలంకారీలో మొదట కరక్కాయ ఉపయోగిస్తాం. అది లేకపోతే నలుపు రంగు రాదు. చక్కెరబెల్లం, తాటిబెల్లం సమ పాళ్లలో తీసుకుని పానకం లాగ తయారుచేశాక, అందులో తుప్పు పట్టిన ఇనుప ముక్కలు వేసి 10 రోజుల పాటు ఊర బెడతాం. తర్వాత దాన్ని వడగట్టి, అందులోంచి వచ్చిన రసాన్ని బట్ట మీద వేస్తే నలుపు రంగు వస్తుంది. కరక్కాయలో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇనుము, టానిక్ యాసిడ్ మిక్స్ అయినప్పుడు నల్ల రంగు వస్తుంది. ఇది ఒంటికి కూడా మంచిది'' అని చెప్పారు.

శ్రీకాళహస్తి కలంకారీ

ఎరుపు రంగు ఎలా?

కలంకారీ చిత్రకళలో ఎరుపు రంగు చాలా కీలకం అని నిరంజన్ చెప్పారు. బట్టపై వేసినపుడు మొదట కనిపించని ఎర్ర రంగు, సుదీర్ఘ ప్రక్రియ తర్వాత కనిపిస్తుందన్నారు.

“ఎరుపు రంగులో 'పటిక' కీలకం. నీటిలో 'పటిక' పొడి కలిపి లిక్విడ్‌లా తయారు చేసుకుంటాం. ఎర్ర రంగు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆ ద్రావణం వేస్తాం. అది ఆరాక ఉతికి, మళ్లీ ఆరబెడతాం. ఆ తర్వాత సురుడుపట్ట, మంజిస్టా వేరు పొడి నీటిలో వేసి బాగా మరగ బెట్టి, ఈ బట్టను అందులో వేయగానే పటిక ద్రావకం వేసిన చోటంతా ఎరుపు రంగు వస్తుంది” అని చెప్పారు.

పసుపు, నీలం రంగుల తయారీ

కలంకారీలో నలుపు, ఎరుపు తర్వాత ముఖ్యమైన రంగులు నీలం, పసుపు ఎలా తయారు చేస్తారో కూడా నిరంజన్ వివరంగా చెప్పారు.

"కరక్కాయ పువ్వు పొడిలో పటిక వేసి బాగా వేడి చేస్తే పసుపు రంగు వస్తుంది. నీలి ఆకు పైరు పెట్టి దానిలోంచి నీలిమందు తయారు చేస్తాం. దాన్నితీసుకొచ్చి తగరస గింజలు, గవ్వసున్నం, లైమ్ సాల్ట్ కలిపి సహజ సిద్ధంగా ఇండిగో బ్లూ రంగు తయారు చేస్తాం'' అన్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీకాళహస్తి కలంకారీ: మహిళలకు ఉపాధి అవకాశంగా మారిన సంప్రదాయ కళ

సహజంగా తయారయ్యేవి నాలుగు రంగులే అయినా వాటి నుంచి ఇంకా ఎన్నో రంగులు తయారు చేసుకోవచ్చని కూడా ఆయన చెప్పారు.

"గ్రే కలర్ కావాలంటే నలుపు రంగులో కొంచెం నీళ్లు కలుపుకుంటే గ్రే కలర్ వస్తుంది. అలాగే ఆకుపచ్చ రంగు కోసం.. పసుపు రంగువేశాక 'నీలం' రంగు రెండుసార్లు దానిపై వేస్తే అది పచ్చగా అవుతుంది. ఊదా (పర్పుల్) రంగు కావల్సిన చోట మొదట ఎర్ర రంగు వేసి, ఆ బట్టను ఉడకబెట్టి, ఉతికాక దానిపై నీలం రంగు వేస్తే వంగపూత రంగు వచ్చేస్తుంది. అలా నాలుగు రంగులను తగిన పాళ్లలో మిక్స్ చేసుకుంటూ వెళ్తే రకరకాల రంగులు వేసుకోవచ్చు. రెండు రంగులు విడిగా కలపితే రంగు మారదు. అది మారాలంటే బట్టపై ఒక రంగు వేశాక, దానిపై ఇంకో రంగు వేయాల్సిందే” అన్నారు.

కలంకారీ చిత్రకళ కోసం ఒక బట్టను సిద్ధం చేయాలంటే 40 రోజులు పడుతుందని కళాకారులు చెబుతున్నారు. బట్టపై రంగులు కూడా వెంటవెంటనే వేయకూడదని, ఒక్కో రంగు వేయడానికి రెండు మూడు రోజులు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుందని నిరంజన్ చెప్పారు.

“కలంకారీ చిత్రాలు వేసి, రంగులన్నీ అద్దిన తర్వాత ఆ బట్టను గొర్రె పేడలో వేసి నానబెడతాం. మరుసటి రోజు, దానిని పారే నీళ్ల పక్కన ఇసుకలో ఎండకు వేసి, పైన నీళ్లు చల్లుతాం. దాంతో ఆ గుడ్డపై సహజ రంగులు అలాగే నిలిచిపోతాయి. కలంకారీ పూర్తవుతుంది” అన్నారాయన.

కలంకారీ

వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా..

గతంలో కలంకారీ ఆర్టిస్టులు వేసిందే డిజైన్‌గా ఉండేది. ఇటీవల ఈ కళ ఇప్పటి కాలానికి, ట్రెండ్‌కు అనుగుణంగా మారుతోంది.

కస్టమర్ల డిమాండ్‌కు తగ్గట్టు వారికి కావల్సిన డిజైన్లలో వాటిని అందిస్తున్నామని కలంకారీ కళాకారిణి గంగాదేవి చెప్పారు.

"మహిళలు ఎక్కువగా పూలు, పక్షులు, జింకలు, నెమళ్లు వంటి చిత్రాలు కావాలని అడుగుతుంటారు. ఏ బొమ్మలు కావాలంటే అవి వేసిస్తుంటాం. ఏనుగులు లాంటి జంతువుల బొమ్మలు కూడా వేసిస్తుంటాం” అన్నారు.

కలంకారీ వస్త్రాలకు విదేశాల్లోనూ చాలా డిమాండ్ ఉందని, వారు ఏం కోరుకుంటే అవి చేసి ఇస్తుంటామని నిరంజన్ తెలిపారు.

"బయటి దేశస్థులు కూడా పూలు, తీగలు, జంతువులు, పక్షులు లాంటివి అడుగుతుంటారు. అవి కాకుండా నేను ప్రత్యేకంగా 'ట్రీ ఆప్ లైఫ్' అనే చిత్రం వేస్తుంటాను. దానికి చాలా డిమాండ్ ఉంది. వాల్ హాంగింగ్స్, కుషన్ కవర్స్ లాంటివి ఎన్నో చేస్తుంటాం. మా సంప్రదాయ పద్ధతుల్లో ఏమాత్రం మార్పు లేకుండా, కస్టమర్ల ఇష్టాలకు తగినట్లు డిజైన్ చేస్తున్నాం'' అన్నారు.

శ్రీకాళహస్తి కలంకారీ కళాకారులు ఈ కళను సజీవంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.

ఇక్కడ మహిళలే ఎక్కువ

శ్రీకాళహస్తి కలంకారీ కళాకారులు ఈ కళను సజీవంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.

యువతకు కలంకారీలో శిక్షణ ఇవ్వడంతోపాటూ, కాళహస్తి చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతోమంది మహిళలకు ఉపాధి కూడా అందిస్తున్నారు.

"15 సంవత్సరాల నుంచి ఈ పనిచేస్తున్నాను. మేం ఇక్కడ బట్టను మొదట ఉడికించడం, తర్వాత ఉతకడం, దాన్నిపిండి బాగా ఆరిన తర్వాత పాలల్లో వేయడం చేస్తాం. ఆ బట్టను మళ్లీ ఆరబెట్టి పెయింటింగ్ చేస్తాం. తిరిగి ఉతికి ఐరన్ చేసి కస్టమర్లకు అందిస్తాం'' అని ఒక కలంకారీ కేంద్రంలో పనిచేసే అనిత చెప్పారు.

కలంకారీ నేర్చుకోవడం వలన ఒకరిపై ఆధారపడకుండా జీవించగలుగుతున్నానని కాళహస్తికి చెందిన గీత చెప్పారు. ఇప్పుడు తనకు ఎక్కడైనా బతకగలననే ధైర్యం వచ్చిందన్నారు.

"ఇక్కడ మేం కలంకారీ రంగులు కలపడం, దుప్పట్లు, చీరలపై రంగులు వేయడం చేస్తుంటాం. మాకు ఇచ్చిన రంగులను డిజైన్ ప్రకారం వేసుకుంటాం. నేను ఇది రెండేళ్ల నుంచి చేస్తున్నాను. పట్టు చీరలపై తీగలు, చెట్లు లాంటి డిజైన్లు వేస్తుంటాను. ఏ రంగుకు ఏం కలిపితే ఎలా వస్తుందో నాకు తెలుసు. కలంకారీ చిత్రాలు వేయడం కూడా నేర్చుకున్నా. ఇప్పుడు నా కాళ్ల మీద నేను నిలబడగలననే నమ్మకం వచ్చింది. ఇలాంటి కళ చేతిలో ఉంటే మహిళలు ఎక్కడైనా బతకొచ్చు” అంటారు గీత.

ఒక పని నేర్చుకుంటే ఉపయోగపడుతుందని కలంకారీ శిక్షణ తీసుకుంటున్నట్లు తొట్టంబేడుకు చెందిన పద్మ చెప్పారు.

"ఈ హస్తకళ నేర్చుకోవడానికి వచ్చాను. ఆర్నెల్ల నుంచీ వస్తున్నాను. ఇది నేర్చుకుంటే ఎక్కడైనా పని చేసుకుంటూ బతకడానికి ఉపయోగపడుతుంది. కుంచెలు కట్టడం, డిజైన్ వేయడం, రంగులు అద్దడం లాంటివి నేర్చుకుంటున్నాను. కొన్నివేయగలను కూడా. నా ట్రైనింగ్ ఇంకా ఉంది” అన్నారామె.

శ్రీకాళహస్తి కలంకారీ

కలంకారీ కళ ఎప్పుడు మెదలైంది?

ఈ కళ ఎప్పుడు మెదలైందో చెప్పడానికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు. కలంకారీ చిత్రకళ రామాయణ, మహాభారత కాలం నుంచీ ఉందని నిరంజన్ చెప్పారు.

"మొదట హిందూ ఆలయాల కోసం కలంకారీని ఎక్కువగా ఉపయోగించేవారని చెప్పారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో గుళ్లలో ఈ కళను ఎక్కువగా వాడేవారు. కృష్ణుడి గుడి ఉంటే కృష్ణలీలతో చేసిన వస్త్రం, రాముడి గుడి ఉంటే రామాయణం, శివాలయం అయితే శివపురాణం ఇచ్చేవారట. ఆ గుడికి వచ్చే భక్తులు ఈ కలంకారీ చిత్రాలు చూసి మన సంస్కృతి, మన చరిత్రను తెలుసుకునేవారు'' అని వివరించారు.

శ్రీకాళహస్తి కలంకారీ

ఈ కళకు తిరిగి జీవం పోసుకున్నది ఎప్పుడు?

20వ శతాబ్దం మధ్యకు వచ్చేసరికి చాలామంది కళాకారులు వ్యవసాయం, ఇతర పనుల వైపు మళ్లడంతో శ్రీకాళహస్తిలో ఈ కళ అదృశ్యమయ్యే పరిస్థితి వచ్చింది.

1957లో కమలాదేవి ఛటోపాధ్యాయ అనే కళా ఉద్యమకారిణి కృషితో ప్రభుత్వం దీని ప్రాముఖ్యతను గుర్తించి పునరుజ్జీవం పోసింది.

"స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇక్కడ మా తాతగారు కలంకారీ శిక్షణ ప్రారంభించి, ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. వారిలో మా కుటుంబం నుంచి ముగ్గురు. వేరే కుటుంబాల నుంచి ముగ్గురు ఉన్నారు. 1957, 58, 59 సంవత్సరాల్లో ఆరుగురే శిక్షణ తీసుకున్నారు. ఆ ఆరుగురి నుంచి శిక్షణ పొందిన వారు ఇప్పుడు కాళహస్తిలో మూడువేల మంది వరకూ ఉంటారు'' అని నిరంజన్ చెప్పారు.

కలంకారీ కళకు ఇప్పుడు ఆదరణ చాలా పెరిగిందని సీనియర్ కళాకారుడు కేసీ మనోహర్ బీబీసీకి చెప్పారు. ఒకప్పుడు గంటకు పది మంది దీనిని కొనేవారు ఉంటే, ఇప్పుడు గంటకు 10 వేల మంది కలంకారీ వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

"1996, 97లో 'క్రాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్' ట్రైనింగ్ పెట్టింది. రెండు సంవత్సరాలు అక్కడ నేర్చుకున్నాను. ఇప్పుడు ఎక్కడైనా కలంకారీ రాస్తున్నారంటే వాళ్లంతా ఇక్కడ నేర్చుకుని వెళ్ళినవాళ్లే. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి చీరల మీద, దుప్పట్ల మీద రకరకాల డిజైన్లు వేయించుకుంటున్నారు. అప్పటికంటే ఇప్పుడు వ్యాపారం బాగుంది. డిజైన్లు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని కస్టమర్లే చెప్పే స్థాయికి ఈ కళ వృద్ధి చెందింది'' అన్నారాయన.

శ్రీకాళహస్తి కలంకారీ

కలంకారీ ఎగుమతులు ఎలా జరిగాయి

బ్రిటిష్ పాలనలో కలంకారీ వస్త్రాల రూపం మార్చి, వాటిని దుస్తులుగా తయారు చేయించి ఎగుమతులు చేసేవారు. దానికి వారు కోస్టల్ ఏరియాను ఎంచుకున్నారు.

"బ్రిటిష్ కాలంలో కలంకారీ వస్త్రాలను బట్టల్లా కుట్టించుకుని వేసుకోవడానికి ఇష్టపడేవారు. కొన్ని డిజైన్స్ ఇచ్చి మన దగ్గర వేయించేవారు. అప్పుడు విదేశాలకు బాగా ఎగుమతులు జరిగాయి. కోస్టల్ ఏరియాలో 1880 నుంచీ కలంకారీ వస్త్రాల ఎగుమతులు బాగా జరిగాయి. ఆ తర్వాత రాను రాను ఈ కళ మరుగున పడిపోయింది. ఇప్పుడు ఈ కళకు పూర్వవైభవం వచ్చింది'' అని నిరంజన్ చెప్పారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)