నెల్లూరు: మహిళా పోలీసుల దుస్తుల కొలతలు మగ టైలర్‌ తీయడంపై వివాదం: ప్రెస్ రివ్యూ

కొలతలు తీసుకుంటున్న పురుష టైలర్

ఫొటో సోర్స్, UGC

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా పోలీసులకు యూనిఫాం కుట్టించేందుకు పురుష టైలర్లను పెట్టి కొలతలు తీయించడం తీవ్ర విమర్శలకు దారితీసిందని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

నెల్లూరులో సోమవారం జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోశాయి.

నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానంలో ఉన్న ఉమేశ్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం సచివాలయ మహిళా పోలీసులకు యూనిఫాం కొలతలు తీసుకునే కార్యక్రమం చేపట్టారు.

ఆత్మకూరు, కావలి డివిజన్ల నుంచి హాజరైన మహిళా పోలీసులకు కొలతలు తీసేందుకు పురుష టైలర్లను పెట్టడం వివాదాస్పదమైంది.

అక్కడే కొందరు మహిళా పోలీసులున్నా పురుషుడు కొలతలు తీసుకోవడంతో వారంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో అక్కడ ఓ హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ముగ్గురు పురుష కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు.

ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకువచ్చి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

విషయం తెలుసుకున్న ఎస్పీ సీహెచ్‌ విజయారావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ.. 'మహిళా పోలీసుల యూనిఫాం బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పజెప్పాం. మహిళా పోలీసుల దుస్తులు కొలతలు తీసేందుకు మహిళలనే నియమించాం. ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే స్పందించి దానిని సరిదిద్దాం. అనుమతి లేని ప్రదేశంలోకి ప్రవేశించి, ఫొటోలు తీసిన గుర్తుతెలియని వ్యక్తిపైనా చట్టపరమైన చర్యలకు ఆదేశించాం' అని ఎస్పీ చెప్పారని ఈనాడు వివరించింది.

కేటీఆర్

ఫొటో సోర్స్, KTR/FB

సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ ప్రభుత్వం కుట్ర

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

గతంలో నల్ల చట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా నల్ల బంగారంపై కన్నేసి సింగరేణిని దెబ్బతీసే కుతంత్రం చేస్తోందన్నారు.

''సింగరేణి నల్లబంగారం యావత్‌ తెలంగాణకే కొంగుబంగారం. దీన్ని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయం. సింగరేణిపై ప్రైవేటు వేటు వేస్తే.. బీజేపీపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. సిరులు కురిపించే సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకడం ఖాయం'' అంటూ హెచ్చరించారని పత్రిక చెప్పింది.

లాభాల బాటలో నడుస్తున్న సింగరేణికి అవసరమైన బొగ్గు గనులు కేటాయించి బలోపేతం చేయాల్సింది పోయి.. గనుల వేలంలో పాల్గొనాలని కేంద్రం నిర్ణయించడం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని కేటీఆర్ పేర్కొన్నారు.

సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలంటూ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి సోమవారం మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు.

సింగరేణి కాపాడుకునేందుకు.. సింగరేణి బిడ్డలు.. కార్మికులకు తాము అండగా ఉంటామని, వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు.

సింగరేణి పరిధిలోని జేబీఆర్‌ఓసీ-3, కేకే-6, శ్రవనపల్లి ఓపెన్‌ కాస్ట్‌, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా.. వేలంలో పాల్గొనాలంటూ నిర్దేశించడమేంటని ప్రశ్నించారుని పత్రిక వివరించింది.

టిడ్కో గృహాలు

ఏపీలో టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్లకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు సాక్షి దిన పత్రిక వార్త ప్రచురించింది.

పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహాలను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయనుంది.

ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లకు టిడ్కో ఎండీ ఆదేశాలు జారీచేశారు. సాధారణంగా మంగళ, శుక్రవారాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి, ఆ రోజుల్లో టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లయితే సర్వర్లపై భారం ఉండదని భావిస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ చార్జీలను మినహాయిస్తూ గత నెల 25న ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓలు 27, 28, 29) జారీచేసింది.

ఈ ఫీజుల మొత్తం సుమారు రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదట నెల్లూరు, గుంటూరు, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టనున్నారు.

అందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని స్థానిక మున్సిపల్‌ కమిషనర్లు, సబ్‌ రిజిస్ట్రార్లను ఆదేశించడంతో పాటు, అవసరమైన మార్గదర్శకాలను టిడ్కో ఎండీ ఇచ్చారని పత్రిక వివరించింది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

మణికొండ జాగీర్ ప్రభుత్వానిదే-సుప్రీంకోర్టు

హైదరాబాద్‌ మణికొండజాగీర్‌లోని 1654.32 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందిన భూములేనని సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చిందని నమస్తే తెలంగాణ పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

సంబంధిత భూముల్లో 1,191 ఎకరాలు ప్రభుత్వ భూములుండగా, మిగతావి పట్టా భూములున్నాయి.

సుప్రీం తీర్పుతో దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వపరమయ్యాయి. 2007 నుంచి ప్రభుత్వానికి-వక్ఫ్‌బోర్డుకు మధ్య కోర్టులో వివాదం కొనసాగుతున్నది.

ఈ భూములు వక్ఫ్‌బోర్డుకు చెందినవంటూ 2012లో హైకోర్టు తీర్పును వెలువరించగా, అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పుచెప్పింది. ఈ భూముల్లో వక్ఫ్‌బోర్డుకు కేవలం 4,800 చదరపు గజాలు మాత్రమే ఉన్నదని స్పష్టంచేసింది.

మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అభినందించిందని పత్రిక చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)