దుబయ్: ఎడారి కాకుండా ఎలా తట్టుకుంటోంది? సారవంతమైన భూములను ఎలా కాపాడుకుంటోంది?

ఎడారి

ఫొటో సోర్స్, Travel Wild/ Alamy

దుబయ్‌కి ఎడారి ఎప్పుడూ దూరంగా లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)‌లో అత్యధిక జనాభా కలిగిన నగరమైన దుబయ్ ఆధునిక ఆర్థిక కేంద్రంగా విలసిల్లుతోంది. ఈ నగరానికి ఒక వైపు సముద్రం ఉండగా, మరోవైపు ఇసుక తివాచీ పరిచినట్లుగా ఉంటుంది.

గత 50 ఏళ్ల కాలంలో ఫిషింగ్ పోర్ట్ నుంచి అర్బన్ మెట్రోపోలీస్‌ నగరంగా రూపాంతరం చెందుతూ దుబయ్ నమ్మలేని విజయగాథగా మారింది. సంపద ఉన్నప్పటికీ, దుబయ్ ఒక తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. అక్కడ ఎడారీకరణ పెరిగిపోతోంది. ఇది యూఏఈలోని సారవంతమైన భూములను ప్రమాదంలో పడేస్తోంది.

యూఏఈ విస్తీర్ణం దాదాపు పోర్చుగల్‌కు సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడి 80 శాతం భూభాగం ఎడారితో కప్పి ఉంది. పర్యావరణం ప్రమాదంలో పడింది. ఎడారీకరణ వల్ల అత్యంత విలువైన భూముల్లో ఎక్కువ భాగం నిస్సారంగా మారిపోతున్నాయి. ''జనాభా, ఆహార వినియోగ వ్యవస్థల పెరుగుదలతో భూమి క్షీణత, ఎడారీకరణ ప్రబలంగా మారుతున్నాయని'' 2019లో ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. వీటికి తగు పరిష్కార మార్గాలను కనిపెట్టడం ప్రస్తుతం యూఏఈకి తొలి ప్రాధాన్యంగా మారింది. ఇప్పుడున్న లక్ష్యం ఎడారిని జయించడం కాదు. ఇకపై ఉత్పాదకత లేని భూభాగాలను పునరుద్ధరించడం.

ఎడారీకరణ వల్ల ప్రభావితమైన అనేక ఇతర దేశాలతో పోలిస్తే యూఏఈ ప్రత్యేకమైన స్థానంలో ఉంది. ఈ విపత్తు నుంచి తప్పించుకోవడానికి కావాల్సిన వ్యూహాలు, ఆలోచనలు, ఆవిష్కరణలను అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక బలం యూఏఈకి ఉంది. ముఖ్యంగా దీని గురించి దుబయ్ గొంతెత్తింది. పచ్చదనం, పర్యావరణాన్ని పెంపొందించడం కోసం గ్రీన్ స్టార్టప్‌లు, పర్యావరణ హితమైన టెక్-లీడ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్లలో భారీగా పెట్టుబడులు పెడుతోంది.

మన ఆశయాలకు, లక్ష్యాలకు ఆర్థిక ఊతం లభిస్తే ఏం సాధించవచ్చో చెప్పేందుకు దుబయ్ ఉనికినే సాక్ష్యంగా చూడవచ్చు. ఒకప్పుడు ఇసుకపై నగరాన్ని నిర్మించడంలో చూపిన తెగువను ఇప్పుడు ఎడారీకరణను నియంత్రించడానికి ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఈ విషయంలో దుబయ్ విజయవంతమైతే, అది అభివృద్ధి చేసిన వ్యూహాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి.

బంకమట్టి ద్రవ మిశ్రమాన్ని ఉపయోగించి సారవంతం చేసిన ప్రదేశంలో పండించిన తోట

ఫొటో సోర్స్, Desert Control

ఫొటో క్యాప్షన్, బంకమట్టి ద్రవ మిశ్రమాన్ని ఉపయోగించి సారవంతం చేసిన ప్రదేశంలో పండించిన తోట

ఎడారీకరణ అనేది ఒక రకమైన భూమి క్షీణత. దీనిద్వారా శుష్క, అర్ధశుష్క ప్రాంతాల్లోని సారవంతమైన, వ్యవసాయయోగ్యమైన భూమి ఉత్పాదకతలేనిదిగా మారిపోతుంది. దీనివల్ల భూమి సాగుచేయడానికి, వృక్షాలు పెరగడానికి అనువుగా లేకుండా పోతుంది. గడ్డిభూములకు నష్టం కలిగించేలా అధికంగా పశువులను మేపడం, సాంద్రవ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన వంటి మానవ కార్యకలాపాల కారణంగా యూఏఈతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ అనేది ప్రబలంగా పెరిగిపోతోంది.

''సాధారణంగా ఎడారుల సరిహద్దుల్లో ఉండే భూమి, వృక్ష సంపద అధిక ఒత్తిడికి గురైనప్పుడు ఎడారీకరణ సంభవిస్తుంది'' అని న్యూయార్క్‌లోని క్యారీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకోసిస్టమ్ స్టడీస్ అధ్యక్షుడు, బయోకెమిస్ట్ విలియం హెచ్ షెసింగర్ చెప్పారు.

ఆయన 30 ఏళ్లకు పైగా ఎడారులపై అధ్యయనం చేశారు. ''ఎడారీకరణ ఫలితంగా వృక్షసంపద ఉత్పాదకత తగ్గిపోతుంది'' అని ఆయన అన్నారు.

కరువు, ఎడారీకరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది 12 మిలియన్ హెక్టార్ల (46,000 చదరపు మైళ్ల) విస్తీర్ణంలోని సారవంతమైన భూమిని కోల్పోతున్నాం. అంటే ఇది, ప్రతీ గంటకు 2000 అమెరికా ఫుట్‌బాల్ మైదానాలు కోల్పోవడానికి సమానం. దీన్ని ఇంకా చక్కగా అర్థం చేసుకోవాలంటే, ఎడారీకరణకు గురైన ప్రాంతాలన్నీ ఒక వరుసలో ఉన్నట్లు భావిద్దాం. దీని ఒక చివరి నుంచి మరొక చివరకు మీరు గంటకు 210 కి.మీ వేగంతో ప్రయాణించాలి. అప్పుడు మీ వేగం, ఎడారీకరణ వేగానికి సమానం అవుతుంది.

వీడియో క్యాప్షన్, సహారా: ఎడారిలో హిమపాతం

గత 20 ఏళ్లుగా, విలువైన భూమిని యూఏఈ కోల్పోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంక్ ప్రకారం, 2002లో యూఏఈ, 75000 హెక్టార్ల సాగుయోగ్యమైన భూమిని కలిగి ఉంది. 2018 నాటికి ఈ భూమి విస్తీర్ణం 42,300 హెక్టార్లకు తగ్గిపోయింది. అదే సమయంలో యూఏఈలో వ్యవసాయభూమి శాతం 7.97 నుంచి 5.38 శాతానికి తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

1970, 1980 దశకాల్లో విస్తారమైన చమురు నిల్వలను వినియోగించడం వల్ల యూఏఈలో నమ్మలేని విధంగా ఆర్థికాభివృద్ధి జరిగింది. కానీ దీనివల్ల పర్యావరణానికి ఇది ఎంత నష్టం కలిగిస్తుందో పరిగణలోకి తీసుకోలేదు.

2008లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ప్రకటించిన ర్యాంకుల్లో యూఏఈకి చెత్త ర్యాంకు లభించింది. ఒక్కో వ్యక్తి పరంగా కూడా, పర్యావరణంపై తీవ్ర చెడు ప్రభావాన్ని చూపుతోన్న దేశంగా యూఏఈని అభివర్ణించింది.

''గత 40 ఏళ్లలో యూఏఈ సాధించిన ప్రగతి, పర్యావరణానికి చేటు చేసే విధానాల ద్వారా లభించింది. ఈ విధానాలను తిరిగి మంచి దారిలో పెట్టడానికి సామాజిక పరివర్తనతో పాటు ఆర్థిక తోడ్పాటు కూడా అవసరం'' అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ డాన్ చాటీ చెప్పారు.

పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తామంటూ యూఏఈ, దుబయ్ ప్రతిజ్ఞ చేశాయి. దుబయ్ పాలకుడు, యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, 2012లో 'యూఏఈ గ్రీన్ గ్రోత్ స్ట్రాటజీ'ని ప్రకటించారు. దీర్ఘకాల ఆర్థికవృద్ధికి తోడ్పడేలా స్థిరమైన పర్యావరణాన్ని నిర్వహించడం దీని ఉద్దేశం. అలాగే దేశంలో హరిత ఆర్థిక వ్యవస్థను కూడా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

''యూఏఈలోని దుబయ్ వంటి నగరాలను ఆధునిక నగరాలుగా ప్రపంచం ముందు ప్రదర్శించడానికి పర్యావరణ హితమైన విధానాలను పాటించడం ఇప్పడు అత్యంత ఆవశ్యకమని రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలు అర్థం చేసుకున్నారు'' అని న్యూయార్క్‌లోని సిరక్యూస్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ జియోగ్రఫీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ నటాలీ కోచ్ అన్నారు.

సాగు

ఫొటో సోర్స్, Art Directors & TRIP / Alamy

''ఒకవేళ చమురు వనరుల కొరత ఏర్పడినప్పుడు లేదా వాటి విలువ క్షీణించినప్పుడు తమ ప్రస్తుత సంపదను ఎలా కాపాడుకోవాలని యూఏఈ పాలకులు ఆందోళన చెందుతున్నారు'' అని టెక్సాస్‌లోని రైస్ యూనివర్సిటీ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ గోక్సె గునెల్ వ్యాఖ్యానించారు. అబుదాబిలో ఎనర్జీ, వాతావరణ మార్పులు, పట్టణ రూపకల్పనల గురించి వివరించే 'స్పేస్‌షిప్ ఇన్ ద డెజర్ట్' అనే పుస్తకాన్ని ఆమె రాశారు.

''దుబయ్‌, నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా పరివర్తనం చెందేలా... 2000 దశకం ప్రారంభం నుంచి టెక్ స్టార్టప్‌లను ఆకర్షించడానికి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి'' అని ఆమె అన్నారు.

ఇప్పటికే దుబయ్ చుట్టూ అనేక కార్యక్రమాలను రూపొందించారు. పర్యావరణ అనుకూల, ఇంధన సమర్థవంతమైన తయారీని ప్రోత్సహించడాన్ని 'దుబయ్ 2030 పారిశ్రామిక వ్యూహం'గా పిలుస్తున్నారు. ప్రపంచలోని అతిపెద్ద సోలార్ పార్క్‌లలో ఒకటైన '1 గిగావాట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోలార్ పార్క్' దుబయ్‌కి దక్షిణంగా 50కి.మీ దూరంలో ఉంది.

కానీ అక్కడి పర్యావరణ సమస్యలు, పరిష్కార మార్గాలకు చాలా దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎడారీకరణ సమస్య మరింత జఠిలంగా ఉంది. కరవు, సహజ వనరుల అతి వినియోగం, పట్టణీకరణ, నేల లవణీయతలో పెరుగుదల వంటి అంశాలన్నీ నగరానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొనకపోవడంతో వ్యవసాయయోగ్యమైన భూములను కోల్పోవడం నుంచి ఈ ప్రాంతానికి చెందిన జీవజాలం అంతం కావడం వరకు ఇలా సమస్యలను ఈ ప్రాంతం ఎదుర్కోవాల్సి వస్తోంది.

పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా యూఏఈ, ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోంది. కాబట్టి ఈ ప్రాంతం స్వయం సమృద్ధి సాధించడానికి అంతర్గత ఆహార ఉత్పత్తి స్థాయిలను పెంచాల్సిన అవసరం ఉంది.

2021 మే నెలలో షేక్ మొహమ్మద్, 'ఫుడ్ టెక్ వ్యాలీ'ని ప్రారంభించారు. ఇది యూఏఈలోని ఆహార ఉత్పత్తిని మూడు రెట్లు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి యూఏఈ, సమర్థవంతమైన ఎడారీకరణ నివారణ కార్యక్రమాలను చేపట్టాల్సిన అవరసం ఉంది. 'ఫుడ్ టెక్ వ్యాలీ' అనేది పరిశోధన-ఆవిష్కరణల ఇంక్యుబేటర్.

బుర్జ్ ఖలీఫా వద్ద ఖర్జూరం చెట్టు

ఫొటో సోర్స్, Snapper Nick/Alamy

ఈ లక్ష్యాలను సాధించడానికి దీర్ఘకాలంగా ప్రచారంలో ఉన్న ఒకే ఒక పర్యావరణ పరిష్కార విధానం... 'ఎక్కువ చెట్లను పెంచడం'.

''చెట్లు మట్టిని సారవంతం చేస్తాయి. కార్బన్‌ను బంధిస్తాయి. నేల సారాన్ని ఇనుమడిస్తాయి. భూగర్భజలాలను కాపాడతాయి'' అని స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సస్టెనబిలిటీ స్టడీస్ ప్రొఫెసర్ అన్నా టెంగ్‌బర్గ్ అన్నారు.

ఎడారీకరణకు వ్యతిరేక పోరాటంలో వృక్షాలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో దుబయ్‌ పాలకులకు బాగా తెలుసు. 2010లో షేక్ మొమ్మద్, 'వన్ మిలియన్ ట్రీస్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎడారీకరణకు కళ్లెం వేయడానికి, నగరంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో 10 లక్షల మొక్కలను పెంచాలనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

''కానీ ఈ కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. ఇందులో భాగంగా నాటిన 100 శాతం మొక్కలు చచ్చిపోయాయి'' అని గ్రీన్‌ల్యాండ్ కంపెనీ ప్రతినిధి హంజా నజల్ వెల్లడించారు. ప్రభుత్వ మద్దతు ఉన్న 'జాయేద్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ద ఇన్విరాన్‌మెంట్' అనే సంస్థతో కలిసి గ్రీన్‌ల్యాండ్ ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసింది.

పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వానికి చెందిన పెట్టుబడి సంస్థ ప్రకటించడంతో దుబయ్ ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలివేసిందని నాజల్ చెప్పారు.

''పర్యావరణాన్ని కాపాడటం కోసం రూపొందించిన కార్యక్రమాలను మీడియా ముందు ప్రదర్శించడానికి మాత్రమే ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారని స్పష్టంగా తెలుస్తోంది. వారికి నిజంగా పర్యావరణం పట్ల శ్రద్ధ ఉంటే, తమ కళ్ల ముందే చచ్చిపోతోన్న లక్షల చెట్లను రక్షించడానికి ప్రయత్నించేవారు'' అని నాజల్ వ్యాఖ్యానించారు.

నెదర్లాండ్స్‌లోని లీడెన్ యూనివర్సిటీ, మిడిల్ ఈస్ట్ స్టడీస్ ప్రొఫెసర్ క్రిస్టియాన్ హెండర్సన్ దీని గురించి మాట్లాడుతూ... ''ఈ ప్రాజెక్టు నిజమైన లక్ష్యం పర్యావరణ సుస్థిరాభివృద్ధిని సాధించడం. అంతేకానీ రాజకీయ ప్రతిష్ట కోసం పాకులాడటం కాదు. ఈ వైఫల్యం గురించి ప్రశ్నించాల్సిందే'' అని అన్నారు. యూఏఈ వాతావరణ పరిస్థితుల్లో మనుగడ సాగించలేని చెట్లను పెంచడం కూడా ఈ ప్రాజెక్టు విఫలం కావడానికి ఒక కారణమని ఆయన చెప్పారు.

దీని గురించి స్పందించాల్సిందిగా దుబయ్ మున్సిపాలిటీని బీబీసీ ఫ్యూచర్ ప్లానెట్ బృందం సంప్రదించింది. కానీ ఇప్పటివరకు దీనిపై ఎటువంటి స్పందన లేదు.

పామ్ చెట్లు

ఫొటో సోర్స్, Hamza Nazzal

ఫొటో క్యాప్షన్, ‘వన్ మిలియన్ ట్రీస్’ కార్యక్రమంలో భాగంగా 2016లో దుబయ్ సమీపంలో వాషింగ్టోనియా పామ్ మొక్కలను నాటినప్పటి చిత్రం (ఎడమ వైపు), 2019లో ఆ మొక్కల దుస్థితి (కుడివైపు)

చెట్ల పెంపకం ప్రాజెక్టులకు సరైన, స్థానికంగా ప్రాధాన్యం ఉండే జాతులను ఎంచుకోవడం చాలా కీలకం. పొడి ప్రాంతాల్లో మొక్కలు నాటేటప్పుడు, వాటి మధ్య అంతరాన్ని పరిగణలోకి తీసుకోవాలని టెంగ్‌బెర్గ్ అన్నారు. వీటితో పాటు స్థానిక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి.

ఈ ప్రాజెక్టు విఫలమైనప్పటికీ, దుబయ్‌లో ఎడారీకరణను నియంత్రించే వ్యూహంలో మొక్కల పెంపకాన్నే ప్రధానంగా పరిగణిస్తున్నారు.

సౌదీ హరిత కార్యక్రమంలో భాగంగా రాబోయే దశాబ్ధాల్లో 10 బిలియన్ మొక్కలను నాటాలనే ఆశయాన్ని ఇటీవలే సౌదీ అరేబియా ప్రకటించింది.

పొడి లేదా శుష్క ప్రాంతాల్లో మొక్కలకు సంబంధించిన ఏ ప్రాజెక్టైనా విజయవంతం కావాలంటే, మొక్కలను ఆరోగ్యంగా, సజీవంగా ఉంచడానికి అందుబాటులో ఉన్న నీటి వనరులను తెలివిగా ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

దుబయ్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలు 'క్లౌడ్ సీడింగ్' ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాయి. కృత్తిమంగా వర్షాలు కురిపించాలనే ఈ లక్ష్యతో ఈ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నాయి.

అయితే వీటిలో చాలా ప్రాజెక్టులు వివాదాస్పదమయ్యాయి. ఇది వరదలకు దారి తీస్తుందని కొంతమంది వాదిస్తుండగా... ప్రాజెక్టుల్లో ఉపయోగించే సిల్వర్ అయొడిన్ వంటి పదార్థాలు హానికరమని మరికొంతమంది సూచిస్తున్నారు.

గ్రీన్ స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన 'నార్వేజియన్ ఆధారిత ఎడారి నియంత్రణ పద్ధతులు' వంటి కొత్త సాంకేతికలు ఈ సమస్యకు భిన్నమైన మార్గాన్ని అందిస్తాయి.

ద్రవరూపంలోని సహజ బంకమట్టి నానోపార్టికల్స్‌ను మోహరించడం ద్వారా ఎడారి ఇసుకను వేగంగా సారవంతమైన నేలగా మార్చి దుబయ్ ఎడారీకరణ సమస్యను నియంత్రించడమే ఈ కొత్త సాంకేతికత లక్ష్యం.

నీరు, బంకమట్టితో తయారు చేసిన ద్రవాన్ని పొడి లేదా దెబ్బతిన్న నేలపై 50 సెం.మీ లోతుమేర వెదజల్లడం ద్వారా ఈ సాంకేతికత పనిచేస్తుంది.

''గురుత్వాకర్షణ ప్రభావం వల్ల చిన్న చిన్న మట్టి కణాలు భూమిలోపలికి ఇంకిపోతాయి. ఈ క్రమంలో భూమిపై ఉన్న ప్రతీ ఇసుక రేణువుకు అవి అంటుకుంటాయి'' అని డెజర్ట్ కంట్రోల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓలే క్రిస్టియాన్ సివర్ట్‌సెన్ వివరించారు.

''ఆ తర్వాత అవి స్పాంజి వంటి నీటిని నిలుపుకునే మట్టి నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియలో కాలక్రమేణా ఇసుక, సారవంతమైన మట్టిగా మారుతుంది'' అని ఆయన పేర్కొన్నారు.

సాగు

ఫొటో సోర్స్, Desert Control

ఈ నానోపార్టికల్ ద్రవం, భూమికి సారవంతం చేయడమే కాకుండా దీర్ఘకాలం పాటు నేల, నీటిని నిలుపుకునేలా చేస్తుంది. అధిక పోషకాలను నేల సంగ్రహించేలా తోడ్పడుతుంది. దీని ఫలితంగా ఖనిజలోపం ఉన్న భూమి కొత్త జీవాన్ని పొందుతుంది.

కష్టతరమైన ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉన్న నేలను సారవంతం చేసుకునే అవకాశాలను ఈ సాంకేతికత ప్రదర్శిస్తుందని యూకేలోని క్రాన్‌ఫీల్డ్ సాయిల్ అండ్ అగ్రఫుడ్ ఇన్‌స్టిట్యూట్‌లో స్థిరమైన భూవ్యవస్థల గురించి పరిశోధన చేస్తోన్న డేనియల్ ఎవాన్స్ చెప్పారు.

సివర్ట్‌సెన్ ప్రకారం, డెజర్ట్ కంట్రోల్ సాంకేతికతను ఉపయోగించి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బయోసలైన్ అగ్రికల్చర్ (ఐసీబీఏ) సంస్థ 47 శాతం నీటిని ఆదా చేసింది. అంతేకాకుండా పుచ్చకాయ (17 శాతం), పెర్ల్ మిల్లెట్ (28 శాతం), దోసకాయ (62 శాతం) సాగులో మంచి దిగుబడిని నమోదు చేసింది. ఈ సాంకేతికను ఉపయోగించి దుబయ్‌లో చేపట్టే ఒక ప్రాజెక్టు వల్ల పామ్, ఇతర జాతుల మొక్కల పెంపకంలో 50 శాతం నీరు ఆదా అవుతుందని సివర్ట్‌సెన్ చెప్పారు.

మట్టి ద్రవాన్ని ఉపయోగించి దుబయ్ వ్యాప్తంగా భారీ సంఖ్యలో చెట్లను పెంచడం ఆహ్వానించదగిన పరిణామం. ''ఒక ఖర్జూరం చెట్టు రోజుకు 250 లీటర్ల నీటిని స్వీకరించగలదు'' అని సివర్ట్‌సెన్ చెప్పారు.

''లిక్విడ్ నాచురల్ క్లే అనేది సూత్రప్రాయంగా చూసుకుంటే చాలా మంచి అవకాశం. అయినప్పటికీ దాని పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి'' అని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త ఆనీ వెర్హోఫ్ అన్నారు.

యూఏఈలో మంచినీటి లభ్యత లేకపోవడం వల్ల సముద్రపునీటిని ప్రాసెస్ చేసి వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఈ నీటిలో సాధారణ స్థాయి కన్నా ఉప్పు శాతం అధికంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో సహజ బంకమట్టి ద్రవం వినియోగాన్ని నెమ్మదినెమ్మదిగా పెంచడం చాలా కీలకమని వెర్హోఫ్ అన్నారు. దీనివల్ల నేలలపై, పర్యావరణంపై, స్థానిక జీవజాతులపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేవని నిర్ధారించడానికి అనేక సంవత్సరాలుగా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి.

''ఒకవేళ ఈ సాంకేతికత అనుకున్న ఫలితాలను ఇచ్చినప్పటికీ, ఎడారి వాతావరణంలో వ్యవసాయం అభివృద్ధికి దోహదపడే శ్రామిక శక్తికి మద్దతు ఇవ్వడం, పండించిన ఆహారాన్ని నిల్వ చేయడం వంటి దుబయ్ ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ సాంకేతికతో పరిష్కారం లభించదు'' అని ఎవాన్స్ చెప్పారు.

''ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి రోబోటిక్స్, కృత్తిమ మేథ, సెన్సార్లు వంటి అంశాల్లో సాంకేతిక ఆవిష్కరణలు చేయాలని'' ఆయన చెప్పారు.

ఒంటెలు

ఫొటో సోర్స్, philipus / Alamy

మన గ్రహానికి చెందిన 75 శాతం భూభాగం ఇప్పటికే క్షీణించినట్లు అంచనావేస్తున్నారు. కానీ దీన్ని నివారించేందుకు తగిన చర్యలు చేపట్టకపోవడమే ఇక్కడ పెద్ద సమస్య.

''ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లోని కొన్ని ప్రాంతాలను ఈ సమస్య పట్టిపీడిస్తోంది'' అని టెంగ్‌బర్గ్ చెప్పారు. వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం, రసాయనాల కాలుష్యం గురించి ధనిక దేశాలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి ఆమె అని అన్నారు.

అంతర్జాతీయ పర్యావరణ పాలన నిర్మాణం, నిధుల సమీకరణలో ఈ తేడా ప్రతిబింబిస్తుంది. జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితికి అందుతోన్న నిధుల కంటే, ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్‌కు లభిస్తోన్న నిధులు చాలా తక్కువ మొత్తంలో ఉండటమే దీనికి నిదర్శనం.

విస్తారమైన సంపదతో పాటు పురోగతిలో ముందుండాలనే తపన, ఇసుక ఆక్రమించిన భూమిని తిరిగి సారవంతమైన భూమిగా మార్చుకోవాల్సిన అవసరం తదితరాల దృష్ట్యా యూఏఈ, ఎడారీకరణ వ్యతిరేక ప్రయత్నాలు ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని అందించగలవు. ఇదే జరిగితే ప్రపంచానికే యూఏఈ మార్గదర్శిగా నిలుస్తుంది. ఎడారీకరణ వల్ల అనిశ్చిత భవిష్యత్‌ను చూస్తోన్న చుట్టుపక్కల దేశాలకు ఇది సాధించిన విజయం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)